
ఇరుకిరుకు రోడ్లు... లక్షలాదిమంది యువత ఆరాధించే తెరవేల్పు ఆగమనం... అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చిన జనం–ఒక హృదయవిదారక ఘటన చోటు చేసు కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? చరిత్ర ప్రసిద్ధిచెందిన నగరం మాత్రమే కాదు... వర్తమానంలో వేలాది కుటుంబాలకు జీవికనిస్తున్న పరిశ్రమలకు నిలయంగా కూడా ఉన్న తమిళనాడులోని కరూర్ నగరం శనివారం జరిగిన తొక్కిసలాట ఉదంతం తర్వాత పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. ఇంతవరకూ 41 మంది చనిపోగా, దాదాపు 80 మంది వరకూ గాయాలపాలయ్యారు.
మృతుల్లో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. తల్లులు, బిడ్డలు, త్వరలో వివాహం కావలసిన రెండు జంటలు కూడా ఈ మృతుల్లో ఉండటం కలచివేసే విషయం. కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పదివేలమంది వస్తారంటే అనుమతినిచ్చామని, కానీ అది మూడురెట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.
జనాకర్షణ గల విజయ్ వంటి నటుడి ర్యాలీకి వచ్చే జనంపై తగిన అంచనాలు లేకపోవటం సరికాదు. మతపరమైన ఉత్సవాలు, క్రీడా సంరంభాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు వగైరాల్లో అసంఖ్యాకంగా జనం పాల్గొనటం ఇటీవలికాలంలో తరచు కనబడుతోంది. ఈ ఏడాదిలో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో మొదలై దేశవ్యాప్తంగా ఇంతవరకూ కనీసం అయిదారు విషాద ఉదంతాలు చోటు చేసు కున్నాయి. కానీ నిర్వాహకులు, ప్రభుత్వాలు, పోలీసులు వీటి నుంచి గుణపాఠం తీసుకుంటున్న దాఖలాలు లేవు.
ఉత్పాదక నగరమైన కరూర్‌లో ప్రతి శనివారం వందల సంఖ్యలో వచ్చే ట్రక్కుల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకు బట్వాడా అవుతుంటుంది. ఇవన్నీ ఆ ఇరుకు సందుల్లో ఆగకతప్పదు. వారాంతం గనుక కార్మికులకు వేతనాలిచ్చే రోజు కూడా అదే. అందుకోసం చేనేత, దోమతెరల పరిశ్రమల్లో, బస్సు నిర్మాణాల సంస్థల్లో పని చేసేవారు దాదాపు 50,000 మంది వస్తారు. ఇంతకుమించి జనం ఏమాత్రం పెరిగినా ఆ నగరం కిక్కిరిసిపోతుంది.
టీవీకే పార్టీ స్థానిక నేతలకు దీనిపై అవగాహన ఉండకపోదు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు సరేసరి. వారికి ఇది పూర్తిగా తెలిసి ఉండాలి. విజయ్ ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు గనుక కరూర్‌కు ఆదివారం వస్తే మంచిదని సలహా ఇచ్చి ఉండాల్సింది. పైగా తమ అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడటం కోసం చుట్టుపక్కల నుంచి కూడా భారీయెత్తున ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు.
తొక్కిసలాటల ఉదంతాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హ్యాలోవీన్ ఫెస్టివల్‌లో జరిగిన తొక్కిసలాటలో 159 మంది కన్నుమూశారు. జర్మనీలోని డోజ్‌బర్గ్‌లో 2010నాటి లవ్ పెరేడ్ ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా 21మంది చనిపోయారు. అయితే ఆ ఉదంతాలను లోతుగా అధ్యయనం చేసి, ఏ లోటుపాట్ల వల్ల ఆ ఘటనలు జరిగాయో నిర్ధారించుకుని వాటిని నివారించే, నియంత్రించే వ్యవస్థల్ని రూపొందించుకుంటారు.
అందువల్లే అవి పునరావృతం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కానీ మన దేశంలో ఇందుకు విరుద్ధం. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట ఉదంతాలు ఎందుకు చోటుచేసుకుంటాయన్న అంశంపై జర్మనీకి చెందిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అనా సీబెన్ చేసిన పరిశోధన అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఒక స్థాయి వరకూ గుంపులోని వారు వ్యక్తులుగా
సంభాషణల అవసరం లేకుండానే ఇతరుల్ని అనుసరిస్తూ పోతారు. జనసమ్మర్దం పెరి గితే, అనుకోని ఘటన సంభవించేసరికల్లా భావోద్వేగాలపాలు అధికమై విచక్షణాజ్ఞానం నశిస్తుందని, తొక్కి సలాటల్లో జరిగేది ఇదేనని ప్రొఫెసర్ అనా సీబెన్ అంటారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నటుడు విజయ్ కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఆప్తుల్ని కోల్పోయి విషాదంలో మునిగిన కుటుంబాలను ఇవేవీ ఊరడించలేకపోవచ్చు. ప్రభుత్వం పూనుకొని మృతుల కుటుంబాల్లో ఇంటికొకరికైనా శాశ్వత ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలతో ఈ మాదిరి విషాద ఘటనలను నివారించవచ్చు. ప్రభుత్వాలు ఆలోచించాలి.