జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్ | verbal clash Between Donald Trump and Volodymyr Zelensky | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్

Published Sat, Mar 1 2025 7:24 AM | Last Updated on Sat, Mar 1 2025 9:14 AM

verbal clash Between Donald Trump and Volodymyr Zelensky

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌ వేదికగా ఇద్దరు నేతల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఉక్రెయిన్‌పై ట్రంప్‌ సంచలన విమర్శలు చేశారు.

ట్రంప్‌తో చర్చల కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌కు వచ్చారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ.. ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై ఒత్తిడి చేశారు. ఈ సందర్బంగా ఇద్దరు నేతల మధ్య చర్చలు ప్రారంభమైన వెంటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మీడియా ఎదుటే వాదులాడుకున్నారు.

ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌ ప్రజల జీవితాలో మీరు చెలగాటం ఆడుతున్నారు. మీ ఆలోచనల కారణంగా మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది. మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోంది. ఉక్రెయిన్‌ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది. దీని నుంచి గట్టెక్కడం అసాధ్యం. చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా జెలెన్‌ స్కీ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోంది. మా దేశ భూభాగంలో మేము ఉంటున్నాం. మేము అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలా?. మేము దృఢసంకల్పంతో  ఉన్నాం. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని చెప్పారు.

ఈ క్రమంలో ట్రంప్‌ పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాట్లాడుతూ.. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్‌స్కీకి హితవుపలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. వెంటనే జెలెన్‌స్కీ.. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్‌ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.

మరోసారి ట్రంప్‌ కలగజేసుకుని.. రష్యాతో యుద్ధంలో అమెరికా మీకు ఎంతో సాయం చేసింది. మీకు మద్దతుగా నిలిచాం. ఆయుధాలు సమకూర్చాం. 350 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేశాం. మా సైనిక పరికరాలే లేకపోతే.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేది. ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయింది. అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు. యుద్ధమే చేస్తామంటున్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి అంగీకరించండి. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది. మరణాలు ఆగుతాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

దీంతో, మరోసారి జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. అవును.. మీరు చెప్పింది నిజమే. రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్‌ కూడా అన్నారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వనేతలను అడగండి. ఏం చెబుతారో వినండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇక, వీరి భేటీ అనంతరం ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అర్థమైంది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నాను. శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సిద్ధంగా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పోరు ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement