special rights
-
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
సుప్రీమ్ తేల్చిన ప్రత్యేక హక్కు
ఇది చరిత్రాత్మక తీర్పు. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగల తీర్పు. ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుంచి విముక్తి’’ని సైతం ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా గుర్తించింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల విస్తృత పరిధిలోకే అదీ వస్తుందంటూ గత వారం సుప్రీమ్ పేర్కొనడం విశేషం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పిట్ట), లెస్సర్ ఫ్లోరికాన్ (గడ్డి నెమలి) లాంటి అంతరిస్తున్న పక్షుల పరిరక్షణకు సంబంధించిన ఓ కేసు విచారణలో కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ... రెండూ కీలకమైన లక్ష్యాలంటూనే, ఒకదాని కోసం మరొకదాన్ని బలి చేయకుండా సమగ్ర వైఖరిని అవలంబించడం అవసరమని స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులపై ఉదాసీనంగా ఉన్న పాలకులకు బాధ్యతను గుర్తు చేసింది. గతంలోకి వెళితే, పక్షుల రక్షణ కోసం 2021లో గుజరాత్, రాజస్థాన్లలోని 99 వేల చదరపు కి.మీ.ల పైగా ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ లైన్లపై సుప్రీమ్ ధర్మాసనం పూర్తి నిషేధం విధించింది. సౌరఫలకాల ప్రాజెక్టుల వద్ద వేసిన ఎత్తైన వైర్లకు తగిలి పక్షులు మరణిస్తుండడంతో ఈ వివాదం రేగి, నిషేధం దాకా వచ్చింది. అయితే సౌర, పవన విద్యుచ్ఛక్తికి అవకాశం ఉన్న ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ళనే అనుమతిస్తే, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో భారత్ వెనుకబడుతుందని కోర్ట్ తాజాగా భావించింది. పర్యావరణంపై ప్రపంచ ప్రయత్నాలకు అది అవరోధమనీ, పైపెచ్చు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇంధనం అందుబాటు లాంటి ప్రాథమిక హక్కులకు ముప్పు అనీ అభిప్రాయ పడింది. పక్షులను రక్షిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించేలా సమతూకం పాటించడంపై దృష్టి పెట్టా లంటూ, విద్యుత్‌లైన్లపై ఏకపక్ష నిషేధాన్ని తొలగించింది. మార్చి 21న ఈ ఉత్తర్విచ్చినా శనివారం మొత్తం తీర్పును అప్లోడ్ చేయడంతో పర్యావరణంపై జడ్జీల విస్తృత చర్చ బయటకొచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. పర్యావరణ మార్పులపై భారత్‌లో చట్టం లేనంత మాత్రాన వాటి దుష్ప్ర భావాల నుంచి భద్రతకు భారతీయులకు హక్కు లేదని కాదు అని కోర్ట్ కుండబద్దలు కొట్టింది. పర్యావరణ మార్పుతో సమానత్వపు హక్కుపై ఎంత ప్రభావం ఉంటుందో సోదాహరణంగా చర్చించింది. పర్యావరణ మార్పు వల్ల ఒకచోట తిండికీ, నీటికీ కొరత ఏర్పడితే ధనికుల కన్నా బీదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, సమానత్వపు హక్కనే భావనే దెబ్బతింటుందనీ విశదీకరించడం విశేషం. క్లైమేట్ ఛేంజ్‌కూ, మానవ హక్కులకూ ఉన్న సంబంధాన్ని ప్యారిస్ ఒప్పందం గతంలోనే గుర్తించింది. అంతర్జాతీయ చట్టాల కింద గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గిస్తూనే, ఆరోగ్య వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలని సుప్రీమ్ పేర్కొనడం కీలకాంశం. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆ మాటకొస్తే పర్యావరణ పరిరక్షణను హక్కుల కోణంలో నుంచి వ్యాఖ్యానించడం సుప్రీమ్ చాలాకాలంగా చేస్తున్నదే. కాలుష్యరహిత వాతావరణంలో బతకడమ నేది జీవించే హక్కులో భాగమని దశాబ్దాల క్రితమే పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, గాలి అనేవి ప్రజల హక్కు అని గత నెలలోనూ వ్యాఖ్యానించింది. తాజా తీర్పు వాటికి కొనసాగింపు. అయితే, దేశంలోని కోట్లాది ప్రజానీకాన్ని పర్యావరణ దుష్ప్రభావాల నుంచి విముక్తం చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త తీర్పు అయినా పూనిక నిస్తుందా అన్నది ప్రశ్న. అసలు స్వచ్ఛమైన, ఆరోగ్య కరమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, వనరుల దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినిమయవాదం ప్రాణాల మీదకు తెస్తోంది. తెలిసైనా, తెలియకైనా అలా పర్యావరణ హాని చేయడమంటే మనిషి జీవించే హక్కును నిరాకరించడమే! జీవితాలనూ, జీవనోపాధినీ దెబ్బ తీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు, ధనికులతో పోలిస్తే దారితెన్నూ లేని బీదసాదలపై ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నదే. ఆ పరిస్థితులు కొనసాగరాదన్నదే సుప్రీమ్ ఆదేశం అందిస్తున్న సందేశం. వర్షపాతాల్లో మార్పులు, వేళ కాని వేళ వడగాడ్పులు రాగల కాలంలో మరింత పెరగనున్నాయని ప్రపంచ సంస్థలు భారత్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. హిమానీనదాలు కరుగుతున్నా, సముద్రమట్టాలు పెరుగుతున్నా, రాజధానిలోనే స్వచ్ఛమైన గాలి కరవైనా అవేవీ పాలకులకు ప్రాధాన్యాలుగా కనపడక పోవడం దౌర్భాగ్యం. ఆ తలనొప్పి విద్యావేత్తలు, ఉద్యమ కారులు, పౌరసమాజ బృందాలదేనని పొరబడుతున్న వేళ సుప్రీమ్ తీర్పు చెంపపెట్టు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయనేది నిష్ఠురసత్యం. దానికి తోడు కనీస స్పృహ లేకుండా నేల, నింగి, గాలి, నీరును కలుషితం చేయడంలో అందరం పోటీలు పడుతున్నాం. పర్యవసానాలే ఇప్పుడు చూస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇంకా అనేకానేక పర్యావరణ దుష్ప్రభావాలు. ఈ పరిస్థితుల్లో సుప్రీమ్ గుర్తించిన ఈ ప్రత్యేక హక్కు పార్లమెంట్‌కు మేలుకొలుపు కావాలి. పర్యావరణంపై కుంభకర్ణ నిద్ర నుంచి ఇకనైనా పాలకులు మేల్కోవాలి. ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. వనరుల సమర్థ వినియోగంపై చర్యలు చేపట్టి, అందరిలో అవగాహన పెంచాల్సి ఉంది. లేదంటే, ఈ తాజా తీర్పు ఆసరాగా పౌరులు తమ హక్కును కాపాడుకొనేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించే వీలు ఉండనే ఉంటుంది. -
కార్పొరేట్ గవర్నెన్స్ బలోపేతానికి చర్యలు
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ గవర్నెన్స్ (కంపెనీల నిర్వహణ/పాలన వ్యవహారాలు) బలోపేతానికి సెబీ చర్యలను ప్రతిపాదించింది. కొందరు వాటాదారులు ప్రత్యేక హక్కులను శాశ్వతంగా అనుభవించే అంశాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. లిస్టెడ్ కంపెనీలు చేసుకునే ఒప్పందాలు, బోర్డులో డైరెక్టర్ స్థానాలకు సంబంధించి కూడా పలు కొత్త ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల అమ్మకం లేదా లీజు అంశాలనూ పరిష్కరించనుంది. ఈ ప్రతిపాదిత చర్యలపై సలహాలు, సూచనలను మార్చి 7లోపు తెలియజేయాలని సెబీ కోరింది. సెబీ ప్రతిపాదనలు ► ఒక కంపెనీ ఏదైనా వాటాదారునకు శాశ్వత హక్కులు కల్పిస్తే.. దీనిపై ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ► ఇప్పటికే కల్పించిన ప్రత్యేక హక్కులను సైతం ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణపైనా వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది. ► ప్రమోటర్లు, వ్యవస్థాపకుడు, కొన్ని కార్పొరేట్ బాడీలకు ప్రత్యేక హక్కులు కల్పించడంపై వాటాదారుల నుంచి ఆందోళన వస్తుండడంతో సెబీ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హక్కులు పొందిన వాటాదారులు, తర్వాతి కాలంలో వారి వాటాలను తగ్గించుకున్నప్పటికీ, అవే హక్కులను అనుభవిస్తుండడాన్ని సెబీ గుర్తించింది. ఇది వాటాదారుల హక్కులకు విరుద్ధమని సెబీ అభిప్రాయపడింది. ► కంపెనీ బోర్డులో నియమితులయ్యే డైరెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుందని సెబీ తన తాజా ప్రతిపాదనలలో పేర్కొంది. దీంతో కొందరు వ్యక్తులకు కంపెనీ బోర్డుల్లో శాశ్వత స్థానం కల్పిస్తున్నారనే ఆందోళనను పరిష్కరించనుంది. ముఖ్యంగా, ప్రమోటర్లు, డైరెక్టర్లకు సంబంధించిన వారిని ఇలా నియమిస్తుండడం గమనార్హం. ► 2024 ఏప్రిల్ 1 నుంచి బోర్డు డైరెక్టర్ల నియామానికి ప్రతీ ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది. 2024 మార్చి నాటికి బోర్డుల్లో డైరెక్టర్లుగా అధికారం అనుభవిస్తున్న వారికి సంబంధించి కూడా తదుపరి జరిగే ప్రథమ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతి తీసుకోవాలని సెబీ పేర్కొంది. ► యాజమాన్యం లేదా కంపెనీ నిర్వహణపై ప్రభావం చూపించే ఒప్పందాలు, కంపెనీపై ఏవైనా బాధ్యతలు మోపే వాటి గురించి స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాలి. ► కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా, కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ఈఎస్జీ కింద మరిన్ని పథకాలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఈఎస్జీ కింద ఐదు కొత్త విభాగాల్లో ఫండ్స్‌ను తీసుకొచ్చేందుకు సెబీ ప్రతిపాదన చేసింది. ఈఎస్జీ అనేది పర్యావరణానికి హాని చేయని, సామాజిక, పరిపాలన ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విధానం. ప్రస్తుతం ఒక ఏఎంసీ ఒక ఈఎస్జీ పథకాన్ని ప్రారంభించేందుకు అనుమతి ఉంది. కానీ ఒకటికి మించి భిన్నమైన పథకాలను ఈఎస్జీ కేటగిరీలో ఆఫర్ చేయాలనుకుంటే అందుకు ప్రస్తుతం అనుమతి లేదు. సెబీ నూతన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏంఎసీలు ఐదు ఈఎస్జీ కేటగిరీల్లో కలిపి మొత్తం మీద ఐదు పథకాలను ఆఫర్ చేయవచ్చు. ఈ పథకాల కింద మొత్తం ఆస్తుల్లో 80 శాతం వరకు ఈక్విటీ లేదా డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎస్జీ థీమ్‌లో అధికంగా పెట్టుబడులు కలిగి ఉండేట్టు అయితే దాన్ని విధిగా తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాలకు అదనంగా, ఈఎస్జీ రేటింగ్లను సైతం ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై సలహా, సూచనల తర్వాత సెబీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
వేధిస్తే.. ‘లా’గి కొట్టడమే..!
► ఈ ఏడాది జూన్ 24వ తేదీ ఒడిశాలోని జోడా ప్రాంతం. పదో తరగతి చదువుతున్న బాలిక తమ బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం వరకూ అక్కడే గడిపి తిరుగు ప్రయాణమైంది. ఒంటరిగా వెళ్తున్న, ఆమెను ఐదుగురు యువకులు గమనించి వెంటాడారు. నిర్జన ప్రదేశంలోకి చేరుకోగానే అపహరించుకెళ్లి అత్యాచారం చేశారు. ► ఈ ఏడాది జూన్ 6వ తేదీ ఒంగోలులోని బస్టాండులో ఒంటరిగా బస్సు దిగిన పదో తరగతి విద్యార్థినిపై ఓ దివ్యాంగుడు కన్నేశాడు. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్న ఆమెను మాటలతో లోబర్చుకున్నాడు. ఆ స్నేహితుడు తనకు తెలుసునని నమ్మించి బస్టాండు సమీపంలోని గదికి పిలుచుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ తన మిత్రుడితో కలిసి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను మరో గదికి తరలించి, అక్కడ ఉంటున్న నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి పైశాచికంగా అత్యాచారం చేశారు. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు బాలికను గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళల్లో ఉన్న నిరక్షరాస్యత కారణంగా వారిలో ప్రశ్నించే తత్త్వం లేకపోవడంతో వారిపై ఆకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పదునైన చట్టాలు ఎన్ని ఉన్నా.. అవేవీ బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో అవి కాస్త దుర్వినియోగమవుతున్నాయి. ‘ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో... అక్కడ దేవతలు నాట్యం చేస్తారు’ ఇది ఓ మహానుభావుని మాట. ‘స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ ఇది మహాత్మగాంధీ నినాదం. అదే కోవలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం రాజ్యాంగానికి పదును పెట్టారు. హిందూకోడ్ బిల్.. చట్టసభల్లో రిజర్వేషన్ మహిళలకు గౌరవం కల్పించారు. అంతేకాక రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ స్త్రీ స్వేచ్ఛకు పచ్చజెండా ఊపాయి. అయినా స్త్రీలపై హింస ఆగడం లేదు. భర్త రూపంలో... ప్రియుడి రూపంలో... అన్న... నాన్న... పక్కింటివాడు.. పొరుగింటివాడు... బస్సులో ఆకతాయిలు...రోడ్లపై రోమియోలు... స్కూళ్లలో కొందరు... ఇలా చెప్పుకుంటూపోతే మహిళా స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించడం లేదు. బలహీనులైన అబలలపై బలవంతులైన మృగాళ్ల పెత్తనం నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలోనే మహిళా హక్కుల పరిరక్షణకు నిర్భయ లాంటి పదునైన చట్టాలు వచ్చాయి. మహిళల రక్షణకు రూపొందించిన చట్టాల గురించి తెలుసుకుందాం రండి.. – కళ్యాణదుర్గం రూరల్ రాజ్యాంగం ఏమంటోంది.. ► సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరాదు. ఈ విషయంపై రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్ ఉంది. ► ఆర్టికల్ 14 ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ సమానులే. ఇదే ఆర్టికల్ ప్రకారం సమాన రక్షణ పొందడానికి ఇద్దరూ అర్హులు. ► ఆర్టికల్ 15/1 ప్రకారం స్త్రీగా ఆమెపై ఎవరూ వివక్ష చూపకూడదు. దుకాణాల్లో, ప్రదర్శనశాలల్లో, ఫలహారశాలల్లో, వినోదం కలిగించే ప్రదేశాలలో వారిని వెళ్లకుండా అడ్డుకోవడానికి వీలులేదు. ► స్త్రీలతో గనుల్లో పని చేయించకూడదు. జీవించేందుకు సంపూర్ణ హక్కు ► స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే.. దానిని హక్కుగా గౌరవించాలి. ► ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 సంత్సరాలు నిండిన స్త్రీ తన ఇష్టం వచ్చిన పురుషున్ని పెళ్లాడవచ్చు. అయితే నిషేధింపబడిన దగ్గర బంధువైనప్పుడు, భార్య ఉన్న పురుషుడిని పెళ్లాడడానికి వీలులేదు. ► హిందూ స్త్రీ తనకు 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 సంవత్సరాలు నిండేలోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. ► స్త్రీని బలవంతంగా కాపురానికి తీసుకెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. ►18 సంవత్సరాలు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటే, సెక్షన్ 366 ప్రకారం యువకునికి పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ► ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని పెళ్లాడడానికి వీలు లేదు. అలా పెళ్లాడితే నేరమే. ముస్లిం స్త్రీల విషయంలో ఈ నిబంధన చెల్లదు. ► వివాహమైన (ఏ మతానికి చెందిన మహిళైనా) స్త్రీ భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోకూడదు. ► హేతుబద్ధ సమయాల్లో... ఆర్యోగానికి, సభ్యతకు భంగం కలుగని రీతిలో, ఇబ్బంది కలుగని సమయాల్లో, భార్య, భర్త లైంగిక పరమైన కోర్కెలు తీర్చుకోనివ్వాలి. ‘నిర్భయ’ంగా యావత్ దేశాన్ని నిర్భయ ఉదంతం కలిచివేసింది. రోడ్డుపై వెళుతున్న నిర్భయను బస్సులో తిప్పుతూ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, మృతికి కారణమైన ఘటన యావత్ ప్రపంచాన్నే కదిలించింది. ఆమె ఆత్మకు శాంతి కలిగేలా... మహిళలకు మరింత రక్షణ కల్పించేలా 2013 మార్చి 19న నిర్భయ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్ట ప్రకారం స్త్రీ పట్ల ఏ పురుషుడైనా అసభ్యంగా ప్రవర్థించినా, అవమాన పరిచినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సెక్షన్ 354 కింద కేసు నమోదు చేయవచ్చు. ముస్లిం స్త్రీలకు ప్రత్యేక హక్కులు ► భర్త మరణించిన తర్వాత (ఇద్దతు కాలంలో) మళ్లీ వివాహం కుదరదు. ► భర్త ఉన్న చోటే కాపురం చేయాలి. సహేతుకమైన కారణముంటే తప్ప వేరుగా జీవించేందుకు అవకాశం లేదు. ► ముస్లిం స్త్రీలకు మెహరు హక్కు. భర్త చేత నిరాదరణకు గురైనా, విడాకులు ఇచ్చినా... భరణం పొందే హక్కు, పోషణ హక్కు, భర్తను తనతో కాపురం చేయమనే హక్కు తనకు తన భర్తకు వేరే గది (వీలైనంతవరకూ) కావాలనే హక్కు, బంధువులను చూసి వచ్చే హక్కు, వారు ఆమెను చూసిపోయే హక్కు ఉంటుంది. నిరక్షరాస్యతే ఓ కారణం దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మహిళల్లో అక్షరాస్యత తక్కువ. ఈ కారణంతోనే తమ రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన లేకుండా పోయింది. వేధింపులకు సంపూర్ణ అక్షరాస్యతతో అడ్డుకట్ట వేయవచ్చు. – నిర్మల, కేజీబీవీ ఎస్ఓ, శెట్టూరు చట్టాలు వినియోగించుకోగలగాలి అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళలు నలిగిపోతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించలేకపోతున్నారు. కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. అప్పుడే గృహ హింసను నిర్మూలించేందుకు వీలవుతుంది. – సంధ్యారాణి, ఆర్ఎంపీ వైద్యురాలు, ములకలేడు, కళ్యాణదుర్గం మం. -
కశ్మీర్లో ‘35ఏ’ సెగ
న్యూఢిల్లీ: కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ అంశం ఆ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపింది. సుప్రీం విచారణకు నిరసనగా వేర్పాటువాదుల పిలుపు మేరకు బంద్‌తో కశ్మీర్, చీనాబ్ లోయలో జనజీవనం స్తంభించింది. 35ఏపై సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభం కావాల్సిన విచారణ జస్టిస్ వైవీ చంద్రచూడ్ లేకపోవడంతో 28వ తేదీకి వాయిదాపడింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించే అంశాన్ని పరిశీలించనున్నట్లు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కశ్మీర్లో రెండు రోజుల బంద్ ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ చేపట్టరాదంటూ గత కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్ పిలుపు మేరకు ఆది, సోమవారాల్లో బంద్ పాటించారు. వివిధ వర్గాలు మద్దతు తెలపడంతో రెండు రోజులుగా కశ్మీర్, చీనాబ్‌లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు నిలిచిపోయాయి. కీలక ప్రాంతాల్లో సైన్యం, పోలీసులను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అమర్నాథ్ యాత్రను రెండు రోజులుగా నిలిపివేశారు. కశ్మీరీల ప్రత్యేక హక్కులేమిటి? రాష్ట్రంలో శాశ్వత నివాసితులను కశ్మీర్ శాసనసభ నిర్ధారిస్తుంది. స్థానికేతరులు లేదా ప్రవాసులు స్థిరాస్తులు కొనుగోలు చేసి స్థిరపడేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు పొందడానికి అనర్హులు. వీరు అసెంబ్లీ మొదలుకుని మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అనర్హులే. 1911కు ముందు ఆ రాష్ట్రంలో పుట్టిన, స్థిరపడిన లేదా అంతకు పదేళ్ల ముందు న్యాయబద్ధంగా స్థిరాస్తి పొందిన, పాక్‌కు వలస వెళ్లిన వారితో పాటు జమ్మూకశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారు స్థానికులు. వలసవెళ్లిన వారి తర్వాతి 2 తరాల వరకూ ఇదే వర్తిస్తుంది. పాక్ పౌరుడై ఉండి కశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయగలిగిన విచిత్ర పరిస్థితికి ఇది అవకాశం కల్పిస్తుండగా, ఇతర రాష్ట్రాల్లోని భారత పౌరులకు ఆ హక్కులేదు. స్థిరనివాస సర్టిఫికెట్ లేని వారిని కశ్మీరీ మహిళలు భర్తలుగా ఎంచుకుంటే ఆమె ఆస్తిపై హక్కు కోల్పోతుంది. వారి పిల్లలకు తదుపరి హక్కులు లభించవు. ఈ హక్కులు ఎలా వచ్చాయి ? 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్–35ఏను చేర్చారు. పార్లమెంట్లో చర్చించకుండా, రాజ్యాంగ సవరణ రూపంలో కాకుండా రాజ్యాంగానికి అనుబంధంగా దీనిని చూపడంపై అభ్యంతరాలున్నాయి. 35ఏపై చర్చ అంటే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370పై చర్చగా భావించాలి. ఇది తేనెతుట్టెను కదిపినట్లేనని నిపుణుల భావన. రాజ్యాంగం కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హక్కులు, వాటి చెల్లుబాటును ప్రశ్నించకుండా ఆర్టికల్ 35ఏ చెల్లుబాటును, 1954లోని రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని వారంటున్నారు. సుప్రీంలో పిటిషన్లు ఎవరివి? అక్కడివారికి 35ఏ ద్వారా సంక్రమించే హక్కులు, అధికారాలను రద్దు చేయాలంటూ ఢిల్లీకి చెందిన ‘ వీ ది సిటిజన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ, 35ఏ కారణంగా తమ పిల్లలు ఓటు హక్కును కోల్పోయారంటూ ఇద్దరు కశ్మీరీ మహిళల పిటిషన్లతోపాటు ఇతర పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. -
కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదస్పద ఆర్టికల్ 35-ఏ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను తొలగిస్తారన్న ఊహాగానాలతో కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల పాటు కశ్మీర్ నిరవధిక బంద్‌కు వేర్పాటు వాదులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 35ఏ ఆర్టికల్‌ను తొలగించాలంటూ సంఘ్‌పరివార్‌కు చెందిన ‘వి ద సిటిజన్స్’ అనే స్వచ్చంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను తొలగించాలని చూస్తోందంటూ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, వేర్పాటువాద సంస్థలు గత రెండు రోజులుగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. కశ్మీర్లో త్వరలో పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని పలు సంఘాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ మేరకు కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేఖ కూడా రాసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేకంగా కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే అధికరణలను తొలగిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయిని ఇటీవల హెచ్చరించాయి. ఆర్టికల్ 370, 35-ఏ లేకుంటే కశ్మీర్‌కు, భారత ప్రభుత్వానికి సంబంధం లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్సిస్తూ ఆర్టికల్ 35-ఏ ను1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు. -
మాకు 371- డి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డీ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు ఉన్నందున తమను నీట్ నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టుకు ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ ప్రభుత్వం విన్నవించాయి. ఈ హక్కులను కొనసాగించేలా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం పదేళ్ల పాటు ప్రస్తుతం ఉన్న అడ్మిషన్లను యథాతథంగా కొనసాగించుకునే హక్కును కల్పించినందున తమకు నీట్ వర్తించబోదని వాదించాయి. ఇప్పటికే ఎంసెట్ నిర్వహించుకున్నామని, వాటి ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నాయి. ‘నీట్’ నుంచి తమను మినహాయించాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పలు రాష్ట్రాల వాదనలు విన్నది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ సాగింది. ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి: ఏపీ ఉన్నత విద్యామండలి తరపున సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టిక్ 371-డి ద్వారా ఏపీ, తెలంగాణల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్థానికతపై రిజర్వేషన్లు ఉన్నాయని వివరించారు. ‘ఈ నిబంధనలు కొనసాగేలా విభజన చట్టం-2014 సెక్షన్ 95లో ఏపీ, తెలంగాణలో మరో పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అప్పటికే ఉన్న ప్రక్రియను కొనసాగించాలన్నారు. అప్పటికి అమలులో ఉన్న ఎంసెట్ ద్వారా ఏపీలో వైద్య విద్యకు ప్రవేశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది: అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున బసవ ప్రభు పాటిల్ వాదిస్తూ ‘తెలుగు మీడియం విద్యార్థులు నీట్ ద్వారా ఇబ్బంది పడతారు. విద్యార్థులు నష్టపోవడమే కాక ఇప్పటికిప్పుడు సిలబస్‌లోని అంతరాలను పూడ్చడం, పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తేవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులు కూడా మాకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాయి.. అందువల్ల ఏపీకి నీట్ వర్తించదు..’ అని వాదించారు. చివరగా తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు విచారిస్తామని, అందరూ ఒక్కో పేజీలో తమ వాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరేన్రావల్ రెండు నిమిషాల సమయం కోరినా కోర్టు సమ్మతించలేదు. రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదు..: కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదని, కేవలం స్థానిక చట్టాల ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. చివరగా ఎంసీఐ తరపున వికాస్ సింగ్ వాదిస్తూ ప్రైవేటుమెడికల్ కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే విధానానికి స్వస్తి పలికేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండాలని కోరగా.. జస్టిస్ అనిల్ దవే స్పందిస్తూ ప్రైవేటు కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు.