న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ గవర్నెన్స్ (కంపెనీల నిర్వహణ/పాలన వ్యవహారాలు) బలోపేతానికి సెబీ చర్యలను ప్రతిపాదించింది. కొందరు వాటాదారులు ప్రత్యేక హక్కులను శాశ్వతంగా అనుభవించే అంశాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. లిస్టెడ్ కంపెనీలు చేసుకునే ఒప్పందాలు, బోర్డులో డైరెక్టర్ స్థానాలకు సంబంధించి కూడా పలు కొత్త ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల అమ్మకం లేదా లీజు అంశాలనూ పరిష్కరించనుంది. ఈ ప్రతిపాదిత చర్యలపై సలహాలు, సూచనలను మార్చి 7లోపు తెలియజేయాలని సెబీ కోరింది.
సెబీ ప్రతిపాదనలు
► ఒక కంపెనీ ఏదైనా వాటాదారునకు శాశ్వత హక్కులు కల్పిస్తే.. దీనిపై ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
► ఇప్పటికే కల్పించిన ప్రత్యేక హక్కులను సైతం ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణపైనా వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది.
► ప్రమోటర్లు, వ్యవస్థాపకుడు, కొన్ని కార్పొరేట్ బాడీలకు ప్రత్యేక హక్కులు కల్పించడంపై వాటాదారుల నుంచి ఆందోళన వస్తుండడంతో సెబీ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హక్కులు పొందిన వాటాదారులు, తర్వాతి కాలంలో వారి వాటాలను తగ్గించుకున్నప్పటికీ, అవే హక్కులను అనుభవిస్తుండడాన్ని సెబీ గుర్తించింది. ఇది వాటాదారుల హక్కులకు విరుద్ధమని సెబీ
అభిప్రాయపడింది.
► కంపెనీ బోర్డులో నియమితులయ్యే డైరెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుందని సెబీ తన తాజా ప్రతిపాదనలలో పేర్కొంది. దీంతో కొందరు వ్యక్తులకు కంపెనీ బోర్డుల్లో శాశ్వత స్థానం కల్పిస్తున్నారనే ఆందోళనను పరిష్కరించనుంది. ముఖ్యంగా, ప్రమోటర్లు, డైరెక్టర్లకు సంబంధించిన వారిని ఇలా నియమిస్తుండడం గమనార్హం.
► 2024 ఏప్రిల్ 1 నుంచి బోర్డు డైరెక్టర్ల నియామానికి ప్రతీ ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది. 2024 మార్చి నాటికి బోర్డుల్లో డైరెక్టర్లుగా అధికారం అనుభవిస్తున్న వారికి సంబంధించి కూడా తదుపరి జరిగే ప్రథమ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతి తీసుకోవాలని సెబీ పేర్కొంది.
► యాజమాన్యం లేదా కంపెనీ నిర్వహణపై ప్రభావం చూపించే ఒప్పందాలు, కంపెనీపై ఏవైనా బాధ్యతలు మోపే వాటి గురించి స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాలి.
► కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా, కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి తెలియజేయాల్సిన అవసరం ఉండదు.
ఈఎస్‌జీ కింద మరిన్ని పథకాలు
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఈఎస్‌జీ కింద ఐదు కొత్త విభాగాల్లో ఫండ్స్‌ను తీసుకొచ్చేందుకు సెబీ ప్రతిపాదన చేసింది. ఈఎస్‌జీ అనేది పర్యావరణానికి హాని చేయని, సామాజిక, పరిపాలన ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విధానం. ప్రస్తుతం ఒక ఏఎంసీ ఒక ఈఎస్‌జీ పథకాన్ని ప్రారంభించేందుకు అనుమతి ఉంది. కానీ ఒకటికి మించి భిన్నమైన పథకాలను ఈఎస్‌జీ కేటగిరీలో ఆఫర్ చేయాలనుకుంటే అందుకు ప్రస్తుతం అనుమతి లేదు.
సెబీ నూతన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏంఎసీలు ఐదు ఈఎస్‌జీ కేటగిరీల్లో కలిపి మొత్తం మీద ఐదు పథకాలను ఆఫర్ చేయవచ్చు. ఈ పథకాల కింద మొత్తం ఆస్తుల్లో 80 శాతం వరకు ఈక్విటీ లేదా డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎస్‌జీ థీమ్‌లో అధికంగా పెట్టుబడులు కలిగి ఉండేట్టు అయితే దాన్ని విధిగా తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాలకు అదనంగా, ఈఎస్‌జీ రేటింగ్‌లను సైతం ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై సలహా, సూచనల తర్వాత సెబీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment