కనీసం రూ.10 లక్షల పెట్టుబడి
ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయం
ప్యాసివ్ ఫండ్స్‌కు ‘ఎంఎఫ్ లైట్’
ఇకపై వేగంగా రైట్స్ ఇష్యూలు
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.
అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.
న్యూ అస్సెట్ క్లాస్
మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు.
టీప్లస్0
ప్రస్తుతం టీప్లస్1 సెటిల్‌మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్‌మెంట్) అమల్లో ఉంది.
ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్‌మెంట్‌ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు.
ఎంఎఫ్ లైట్
ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది.
రైట్స్ ఇష్యూ వేగవంతం
రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది.
ఇతర నిర్ణయాలు..
» సెకండరీ మార్కెట్‌లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్‌బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్‌బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
» ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది.
Comments
Please login to add a commentAdd a comment