తెరపైకి సరళతర నిబంధనలు
రిస్క్ తక్కువగా ఉండడమే కారణం
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది.
ప్యాసివ్ పథకాలు అంటే?
మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి.
కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి.
నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్‌తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది.
సభ్యులందరికీ ఒకే చార్జీలు
స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment