Passive funds
-
ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీ
ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) నిబంధనల కార్యాచరణను ప్రకటించింది. ప్యాసివ్ ఫండ్స్ విభాగంలో కొత్త సంస్థల ప్రవేశాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల వైవిధ్యాన్ని విస్తృతం చేయడమనే లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) సహా ప్యాసివ్ పథకాలకు ఈ కార్యాచరణ అమలవుతుందని సెబీ తెలిపింది.ప్యాసివ్ ఫండ్స్‌ను మాత్రమే నిర్వహించే సంస్థలకు అవరోధాలను తొలగించడం, మార్కెట్లో లిక్విడిటీని పెంచడం, కొత్త సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం ఇందులో లక్ష్యాలని పేర్కొంది. ఎంఎఫ్ లైట్ నిబంధనలు 2025 మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ సైతం ఎంఎఫ్ లైట్ సంస్థలకు మద్దతుగా (స్పాన్సర్) నిలవొచ్చని ప్రకటించింది. కాకపోతే కీలక స్థానాల్లోని ఉద్యోగులకు 20 ఏళ్ల అనుభవాన్ని అర్హతగా ఖరారు చేసింది. స్పానర్లకు సంబంధించి భిన్నమైన అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. ఎంఎఫ్ లైట్ కార్యాచరణ తొలుత దేశీ ఈక్విటీ సూచీల ఆధారిత ప్యాసివ్ ఫండ్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అందించే ప్రస్తుత సంస్థలు సైతం నూతన కార్యాచరణ కింద తమ ప్యాసివ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను వేరొక సంస్థ కింద నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?ఏమిటీ ఫ్యాసివ్ ఫండ్స్?నిఫ్టీ 50 లేదా ఎస్ అండ్ పీ 500 వంటి ఒక నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిబింబించడానికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలే ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్ల(ప్రత్యేకంగా ఫండ్ మేనేజర్ ఉండే మ్యుచువల్ ఫండ్స్) మాదిరిగా కాకుండా, ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ ఇండెక్స్‌ను అనుసరిస్తాయి. వీటికి ఎక్కువగా నిర్వహణ ఖర్చులు అవసరం లేదు. కాబట్టి కొంత యాక్టివ్ ఫండ్లతో పోలిస్తే రాబడులు మారవచ్చు. ఇది ఇండెక్స్‌ను అనుసరిస్తూ ఆయా విభాగాల్లోని మెరుగైన స్టాక్లను కలిగి ఉంటాయి. దాంతో డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. నష్టభయం తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. -
ప్యాసివ్ ఫండ్స్ బూమ్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) పథకాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. పనిలో పనిగా ఈ డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) కొత్త పథకాలతో (ఎన్ఎఫ్వో) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ పథకాలు రాబడుల విషయంలో సూచీలతో వెనుకబడుతున్న తరుణంలో ప్యాసివ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం.. గడిచిన ఏడు నెలల్లో (జనవరి–జూలై) 63 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రావడమే. గతేడాది మొత్తం మీద 51 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల రికార్డును ఈ ఏడాది ఇప్పటికే అధిగమించడం గమనార్హం. ముఖ్యంగా ఈ నెలలో మార్కెట్లోకి 12 ఎన్‌ఎఫ్‌వోలు రాగా, అందులో సగం మేర ప్యాసివ్ ఫండ్స్ నుంచే ఉన్నాయి. జూలై చివరి నాటికి అత్యధికంగా టాటా మ్యూచువల్ ఫండ్ 10 ప్యాసివ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టింది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 5, మిరే అస్సెట్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చెరో నాలుగు చొప్పున ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకొచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ పరిధిలోని ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 22 శాతం పెరిగి జూలై చివరికి 3.22 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో యాక్టివ్ ఫండ్స్ విభాగంలో ఫోలియోలు 19 శాతం పెరిగి 13.84 కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 24 శాతం వృద్ధితో రూ.10.95 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ ఈ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది జనవరిలో రూ.3,983 కోట్లుగా ఉండగా.. జూలైలో రూ.14,778 కోట్లకు వృద్ధి చెందడం, వీటి పట్ల ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.ప్రత్యామ్నాయాలపై దృష్టికొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు మ్యూచువల్ ఫండ్స్ వినూత్న మార్గాలపై దృష్టి సారించాయి. సంప్రదాయ పథకాల పరంగా ఇప్పటికే తగినంత మార్కెట్ ఏర్పడడంతో.. కొత్త పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్వెస్టర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాక్టివ్ పథకాలు ఇప్పటికే తగినంతగా మార్కెట్లో ఉండడంతో, ప్రముఖ ఏఎంసీలు ప్యాసివ్, థీమ్యాటిక్ ఎన్‌ఎఫ్‌వోల బాట పట్టినట్టు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేల్‌పుర్కార్ తెలిపారు. ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా స్మార్ట్ బీటా తదితర వినూత్నమైన విధానాలను కొత్త ప్యాసివ్ ఫండ్స్ విషయంలో ఏఎంసీలు అమలు చేస్తున్నాయి. స్మార్ట్ బీటా అంటే.. ఆయా ప్యాసివ్ ఫండ్ ఒక సూచీని అనుసరించి పెట్టుబడులు పెట్టినప్పటికీ.. రాబడుల్లో మార్కెట్‌ను అధిగమించేలా ఉంటుంది. ఈ తరహా ప్యాసివ్ ఫండ్ వ్యూహాల్లో ‘ఈక్వల్ వెయిట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్’ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిఫ్టీ సూచీలో టాప్–10లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడులు ఆఫర్ చేసే విధానానికీ ప్రాచుర్యం పెరుగుతోంది. మొత్తానికి ప్యాసివ్ ఫండ్స్ రూపంలో మెరుగైన రాబడులు ఆఫర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల ఆదరణ సొంతం చేసుకునే దిశగా ఏఎంసీలు ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
ప్యాసివ్ ఫండ్స్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది. ప్యాసివ్ పథకాలు అంటే?మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది. సభ్యులందరికీ ఒకే చార్జీలుస్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
ప్యాసివ్ ఫండ్స్‌కే హెచ్ఎన్ఐల మొగ్గు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ప్యాసివ్ ఫండ్స్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపించారు. దీనికి కారణం లేకపోలేదు. హెచ్ఎన్ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు (ప్యాసివ్‌లు) గతేడాది మంచి పనితీరు చూపించాయి. వారి ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఇది 2022 మార్చి నాటికి ఉన్న రూ.20,400 కోట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 67 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 2021 మార్చి నాటికి వీటి విలువ రూ.13,700 కోట్లుగా, 2020 మార్చి నాటికి రూ.7,500 కోట్లుగా ఉండడం గమనార్హం. హెచ్ఎన్ఐల ఈటీఎఫ్ పెట్టుబడులు 2018-19 నుంచి 2022–23 మధ్య ఏటా 70 శాతం కాంపౌండెడ్ వృద్ధిని చూశాయి. ఈటీఎఫ్, ఇండెక్స్ పండ్స్‌ను ప్యాసివ్ ఫండ్స్‌గా చెబుతారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో ప్యాసివ్ పెట్టుబడుల విలువ 2019 నాటికి ఉన్న 6 శాతం నుంచి 2023 మార్చి నాటికి 16.5 శాతానికి పెరిగింది. ఫండ్స్ ఈటీఎఫ్ ఆస్తులు పెరగడానికి ప్రధానంగా ఈపీఎఫ్‌వో చేస్తున్న పెట్టుబడులేనని చెప్పుకోవాలి. ఇక హెచ్ఎన్ఐల ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడులనూ (ఏయూఎం) కలిపి చూస్తే గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఏటా 145 శాతం వృద్ధిని చూశాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఈటీఎఫ్ ఆస్తులు కూడా ఇదే కాలంలో ఏటా 56 శాతం చొప్పున పెరుగుతూ 2023 మార్చి నాటికి రూ.9,700 కోట్లకు చేరాయి. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఇండెక్స్ ఫండ్స్.. ఆప్షన్లు ఎన్నో..!
మ్యూచువల్ ఫండ్స్‌లో ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్)కు ఆదరణ పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో రూ.8,000 కోట్ల ఆస్తులు ఉంటే.. అవి ఇప్పుడు రూ.50,000 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, లార్జ్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్ పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవడం, తక్కువ వ్యయాలు.. వెరసి ప్యాసివ్ ఫండ్స్‌కు ఆదరణ విస్తరిస్తోంది. ఆయా సూచీల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవే ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ పనితీరు స్థాయిలో రాబడులను అందించడం వీటి ప్రత్యేకత. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మరి రాబడులు సంగతి ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్‌లో అసలు ఎన్ని రకాలున్నాయి? తమ లక్ష్యానికి అనుకూలమేనా? వీటికి సమాధానమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. నేడు వివిధ సూచీలను అనుసరించి పెట్టుబడులు పెట్టే ఇండెక్స్ ఫండ్స్ 50 వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మూమెంటమ్, క్వాలిటీ ఇలా ఎన్నో విభాగాల్లో ప్యాసివ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకుంటే.. ఈ పథకం నిఫ్టీ–50లోని కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగినట్టు పెట్టుబడులు పెడుతుంది. ఇందులో ఫండ్ మేనేజర్ ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ, యాక్టివ్ ఫండ్స్ అలా కాదు. ఆయా పథకం పెట్టుబడుల విధానాన్ని అనుసరించి ఇండెక్స్‌లో కాకుండా.. మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటారు. వీటిల్లో రాబడులు ఫండ్స్ మేనేజర్ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న స్వేచ్ఛ వారికి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, కంపెనీల్లో జరిగే పరిణామాలు, ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా వీరు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అధిక రాబడులను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. కనుక వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనో గానీ, గతంతో పోలిస్తే మన మార్కెట్ కొంత పరిపక్వత సాధించిన నేపథ్యంలో ఏవో కొన్ని మినహాయిస్తే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ రాబడులు సూచీలతో పోలిస్తే ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. అందు కనే ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ గణనీయంగా ఉంటుంది. మన దగ్గరే ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది. యూఎస్ మార్కెట్లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో 35% ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్నాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నింటిలోకి లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఎక్కువ యాక్టివ్ ఫండ్స్ సూచీలకు మించి రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. 2018లో సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఫలితంగా ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్స్‌ను ఆశ్రయించే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేడు లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో (ప్యాసివ్ ఫండ్స్) ఎన్నో భిన్నమైన పథకాలు అందుబాటులో ఉండడాన్ని గమనించాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, నిఫ్టీ నెక్ట్స్ 50 టీఆర్ఐ, నిఫ్టీ 100 టీఆర్ఐ, ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ, లో వోలటాలిటీ ఇండెక్స్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. టీఆర్ఐ అంటే మొత్తం సూచీ రాబడులుగా చూడాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, సెన్సెక్స్ టీఆర్ఐ ఫండ్స్ అన్నవి ఈ రెండు సూచీల్లోని అగ్రగామి లార్జ్‌క్యాప్ కంపెనీలను ప్రతిఫలిస్తాయి. గడిచిన పదేళ్లలో సగటున సూచీల స్థాయిలోనే ఇవి రాబడులు ఇచ్చాయి. అదే విధంగా సూచీలు ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాల్లోనూ ఈ పథకాల్లో నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ రెండు సూచీలకు సంబంధించి ఏదేనీ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి ట్రాకింగ్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. సూచీతో పోలిస్తే పథకం ఇచ్చిన రాబడులకు మధ్య ఉన్న అంతరమే ట్రాకింగ్ ఎర్రర్. చాలా వరకు లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ట్రాకింగ్ ఎర్రర్ 0.10–0.27 శాతం మధ్య ఉంటుంది. అంటే ఒక సూచీ ఏడాది కాలంలో 16 శాతం రాబడులను ఇస్తే, అదే సూచీని అనుసరించే ఇండెక్స్ ఫండ్ రాబడి 15.90 శాతం మేర ఉండొచ్చు. అప్పుడు 0.10 శాతాన్ని ట్రాకింగ్ ఎర్రర్‌గా పేర్కొంటారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలంలో సూచీలతో పోలిస్తే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండి, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో పథకం అయితే ఇంకా మంచిది. ఐడీఎఫ్సీ నిఫ్టీ ఫండ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.08 శాతం మేర ఉంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో 0.17 శాతం ఉంది. వీటి డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ 0.16 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తోంటే, నిప్పన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.15 శాతంగా ఉంది. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.16 శాతంలోపే ఉంది. ఇవన్నీ మూడేళ్లకు పైగా పనిచేస్తున్న పథకాలు. నిఫ్టీ 100 నిఫ్టీ 100 టీఆర్ఐ అన్నది మార్కెట్ విలువలో టాప్–100 కంపెనీలను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ లార్జ్‌క్యాప్ కిందకే వస్తాయి. ఈ లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ను ప్రతిఫలించే ప్యాసివ్ ఫండ్స్‌ను ఇటీవలే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించాయి. కనుక ఈ పథకాలకు దీర్ఘకాల చరిత్ర లేదు. అయినప్పటికీ సూచీల స్థాయిలో రాబడిని వీటి నుంచి ఆశించొచ్చు. ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో నిఫ్టీ 100 కంపెనీల వాటా 70 శాతంగా ఉంది. నిఫ్టీ 50, సెన్సెక్స్ స్థాయిలోనే రాబడులు వీటిలో ఉండొచ్చు. నిఫ్టీ నెక్ట్స్ 50 మార్కెట్ విలువ పరంగా 51వ స్థానం నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీ కిందకు వస్తాయి. టాప్ 50 కంపెనీలు నిఫ్టీ 50 కింద ఉంటాయి. కానీ, నిఫ్టీ–50తో పోలిస్తే నెక్ట్స్ 50లో ఎక్కువ అస్థిరత కనిపిస్తుంది. కనుక రిస్క్‌ను సర్దుబాటు చేసుకునే, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.14 శాతం మేర ఉంది. ఈ రెండూ కూడా 0.30 శాతం, 0.33 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇన్వెస్టర్లు ఎవరైనా నిఫ్టీ–50, నిఫ్టీ నెక్ట్స్50 పథకాల్లో విడిగా ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే.. దీనికి బదులు నేరుగా నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సూచీల్లో ఉండే కంపెనీలే నిఫ్టీ 100 సూచీలోనూ ఉంటాయి. కాకపోతే వెయిటేజీ పరంగా అంతరం చూడొచ్చు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అధిక రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ కోసం చూస్తుంటే.. నిఫ్టీ 150 టీఆర్ఐను అనుసరించే నాలుగు పథకాలు ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్ విభాగంలో ఒక్క యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మినహా మిగిలిన అన్ని యాక్టివ్ పథకాలు సూచీలకు సమానంగా, అంతకంటే అధిక రాబడులను ఇచ్చాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో సూచీలతో పోలిస్తే అధిక నష్టాలను కూడా పంచాయి. అందుకనే ఈ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక మెరుగైనది అవుతుంది. ఉన్న నాలుగు ఇండెక్స్ ఫండ్స్‌లో మూడు 2021లో మొదలైనవి. మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన పథకం 2019లో ప్రారంభమైంది. కనుక వీటి రాబడులను విశ్లేషించడానికి కొంత సమయం ఇవ్వాల్సిందే. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే. వీటికి సంబంధించి దీర్ఘకాల ట్రాక్ రికార్డు లేదు. ఈ విభాగంలో మూడు పథకాలు ఉండగా, అన్నీ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250టీఆర్ఐను అనుసరించేవే. స్ట్రాటజీ ఇండెక్స్ ఫండ్స్ (వ్యూహాత్మకమైనవి) ఇండెక్స్‌లోని కాంపోనెంట్స్లోనే కొన్ని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన షేర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ అన్నది.. నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని మూమెంటమ్ పరంగా టాప్ 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందుకు ఆయా స్టాక్స్ ధరల కదలికలు ప్రామాణికం అవుతాయి. అలాగే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్ కూడా ఒకటి. అంటే నిఫ్టీ 100 సూచీలోని 100 కంపెనీల్లో తక్కువ అస్థిరతలతో ఉన్న 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌లకు సంబంధించి ఈక్వల్ వెయిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవేమి చేస్తాయంటే ఆయా సూచీల్లోని కంపెనీల్లో వాటికున్న వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్ చేయవు. అన్ని కంపెనీలకు సమాన కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ 50లో ఒక్క రిలయన్స్ వెయిటేజీ 10.86 శాతంగా ఉంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్ అయితే తనవద్దనున్న నిర్వహణ ఆస్తుల్లో 10.86 శాతాన్ని రిలయన్స్‌కు కేటాయిస్తుంది. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అలా కాదు. నిఫ్టీ 50 కంపెనీలకు ఒక్కో దానికి 2 శాతం చొప్పున కేటాయింపులు చేస్తుంది. దీనివల్ల ఒకటే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పోగు పడవు. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్‌కు వెయిటేజీ ఎక్కువ. ఈక్వల్ వెయిటేజీ ఇండెక్స్ ఫండ్‌కు వస్తే సమాన కేటాయింపులు చేస్తుంది కనుక దీన్ని నిరోధించొచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లోనే భిన్నమైన ఎక్స్పోజర్ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ క్వాలిటీ స్కోరు ఆధారంగా నిఫ్టీ 100 కంపెనీల్లో మెరుగైన 30 కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. క్వాలిటీ అంటే.. అధిక లాభదాయకత ను చూపిస్తున్న కంపెనీలు. అంటే కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) అధికంగా ఉంటుంది. ఈక్విటీతో పోలిస్తే తక్కువ రుణ భారం ఉన్నవి. అలాగే, ఆదాయం, లాభాల్లో పెద్దగా అస్థిరతలు లేనివి ఈ ఇండెక్స్ కిందకు వస్తాయి. క్వాలిటీ స్కోరు, ఫ్రీ ఫ్లోట్ మా ర్కెట్ క్యాప్ ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. అయితే, నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ రాబడులు.. నిఫ్టీ 100 కంటే గడిచిన 3–5 ఏళ్లలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాణ్యతకు, తక్కువ అస్థిరతలకు ప్రాధాన్యం ఉం టుంది. అందుకని రాబడి తక్కువ ఉన్నప్పటికీ, మార్కెట్ పతనాల్లో నషా ్టలు కూడా పరి మితంగా ఉంటాయని గమనించాలి. ఈ విభాగంలో ఎడెల్వీజ్ మ్యూచు వల్ ఫండ్ ఒక్కటే నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రారంభించి ఆరు నెలలే అయింది. ఎక్స్పెన్స్ రేషియో 0.27 శాతమే ఉంది. నిఫ్టీ 200 మోమెంటమ్ 30 ఇండెక్స్ ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపిం చిన కంపెనీలు ఈ ఇండెక్స్ పరిధిలోకి వస్తాయి. గడిచిన 6, 12 నెలల్లో నిఫ్టీ టాప్ 200 కంపెనీల్లో (లార్జ్ అండ్ మిడ్‌క్యాప్) అధిక రాబడులను ఇచ్చిన టాప్ 30 కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసేవే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్స్. సూచీల కంటే ఈ పథకాల్లో రాబడి 6% అధికంగా ఉంది. యూటీఐ మ్యూచువల్ పండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూ చువల్ ఫండ్ సంస్థలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఈ రెండూ గడచిన ఏడాది కాలంలో ఆరంభమైనవి. పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. గమనిక యాక్టివ్ ఫండ్స్‌కు సంబంధించి స్మాల్‌క్యాప్ విభాగం ఒక్కటీ భిన్నంగా ఉంది. అన్ని పేరున్న స్మాల్‌క్యాప్ యాక్టివ్ పథకాలు సూచీలకంటే అధిక రాబడులిస్తున్నాయి. అంతేకాదు, అస్థిరతలూ తక్కువగా ఉంటున్నాయి. అధిక రిస్క్ భరించగలిగేవారు స్మాల్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్‌కు బదులు యాక్టివ్ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. వీటిలో ఎస్బీఐ, యాక్సిస్, నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తున్నాయి. -
ఈటీఎఫ్... దీర్ఘకాలానికి బెటర్!
♦ పాసివ్ ఫండ్స్‌కు ఇంకా పెరగని ఆదరణ ♦ ప్రస్తుతం యాక్టివ్ ఫండ్స్‌కే ఎక్కువ నిధులు ♦ సూచీ ఆధారిత ఈటీఎఫ్‌లకూ ఆదరణ అంతంతే ♦ చాలా ఈటీఎఫ్ పథకాల్లో లిక్విడిటీ సమస్య ♦ ఎంచుకునే ముందు చూడాల్సిన అంశాలు చాలా... ఈటీఎఫ్ అని ముద్దుగా పిలిచే ఇన్వెస్ట్మెంట్ సాధనాల పూర్తిపేరు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వస్తున్నాయివి. అంటే... ఏదో ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టకుండా... కొన్ని రకాల స్టాక్స్ కలసి ఎక్సే్ఛంజీ తయారు చేసే ఒకరకమైన ఇండెక్స్ లాంటి సాధనంలో ఇవి పెట్టుబడి పెడతాయన్న మాట. కేంద్ర ప్రభుత్వం ‘‘భారత్ 22’’ పేరుతో ఇటీవలే ఓ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించటంతో ఈటీఎఫ్‌లు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంతో పోలిస్తే వీటిని ఎంచుకునే వారి సంఖ్యలో ఇటీవల పెరుగుదల కనిపిస్తున్నా... ఇప్పటికీ చాలామందికి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో... ఈటీఎఫ్‌లంటే ఏంటో... ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటో పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అంతేకాక.... ఈటీఎఫ్‌లలో ఎన్ని రకాలుంటాయి? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వేటిలో పెట్టుబడి పెడితే బెటర్? ఇలాంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? ఒకరకంగా చెప్పాలంటే ఈటీఎఫ్‌లు కూడా ఇండెక్స్ ఫండ్ల లాంటివే. రెండింటి పెట్టుబడి విధానం దాదాపు ఒకటే అయినా... ట్రేడింగ్, లిక్విడిటీ పరంగా ఉన్న తేడాలు ఈ రెండింటినీ వేరు చేస్తుంటాయి. ఈటీఎఫ్‌లు కూడా ఇండెక్స్లలోనే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్‌నే తీసుకుందాం!!. దీన్లో 30 షేర్లుంటాయి. ఈ ఈటీఎఫ్ ఏం చేస్తుందంటే... తన దగ్గరున్న నిధులను ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా పెట్టుబడి పెడుతుంది. ఉదాహరణకు సెన్సెక్స్‌లో రిలయన్స్ వెయిటేజీ గనుక 10 శాతం ఉంటే... తన నిధుల్లో 10 శాతాన్ని ఇది రిలయన్స్‌కు కేటాయిస్తుంది. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లకూ ఇలా చేయటం వల్ల కొన్ని షేర్లు తగ్గినా... కొన్ని షేర్లు పెరుగుతాయి కనుక... మొత్తమ్మీద ఇండెక్స్ పెరిగితే ఈ ఫండ్ల విలువ కూడా పెరుగుతుంది. ఇండెక్స్ తగ్గితే వీటి విలువ కూడా తగ్గుతుంది. కాకపోతే ఈటీఎఫ్‌లు చాలావరకు దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి చక్కని పెరుగుదల సాధ్యమని చెప్పవచ్చు. ఇండెక్స్ ఫండ్ – ఈటీఎఫ్ ఈటీఎఫ్‌లు ఇండెక్స్ ఫండ్స్ కంటే కొన్ని అంశాల్లో ఆశాజనకంగా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టయి ఉంటాయి. స్టాక్స్ మాదిరిగా వీటిలో కూడా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. పైగా ఇండెక్స్ ఫండ్స్‌తో పోలిస్తే ఈటీఎఫ్‌ల ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. చాలా వరకు ఇండెక్స్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో 1–1.5 శాతంగా ఉంది. ఈటీఎఫ్‌లలో మాత్రం ఎక్స్పెన్స్ రేషియో ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), ఈపీఎఫ్‌ల నుంచి పోటీ పెరగటం దీనికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈటీఎఫ్‌లలో కొన్ని ఎక్స్పెన్స్ రేషియో కింద 0.1 శాతాన్ని మించి వసూలు చేయడం లేదు. అయితే, ప్రత్యేక థీమ్ ఆధారిత ఈటీఎఫ్‌లు మాత్రం ఇప్పటికీ అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్లను మాత్రం మార్కెట్ సమయాల్లో ఈటీఎఫ్‌ల మాదిరిగా ట్రేడ్ చేయలేం. వీటి విలువ మార్కెట్ ముగిశాక వెల్లడవుతుంది. ఆ ధరకు ఫండ్ సంస్థకు సరెండర్ చేసి వైదొలగవచ్చు. యాక్టివ్ – పాసివ్ ఫండ్స్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సుదీర్ఘకాలంపాటు తమ పెట్టుబడుల్ని కొనసాగించే ఈటీఎఫ్‌లను పాసివ్ ఫండ్స్‌గా పిలుస్తారు. ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్ నిర్ణయాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను మార్చేవి యాక్టివ్ ఫండ్స్. కాకపోతే ఈ తరహా పాసివ్ ఫండ్స్‌కు మన దేశంలో ఇంకా చెప్పుకోతగ్గంత ఆదరణ మొదలు కాలేదు. యాక్టివ్ ఫండ్స్ బెంచ్ మార్క్ సూచీలకు మించి రాబడులను అందిస్తుండటమే దీనికి కారణమని చెప్పాలి. ‘‘గత చరిత్ర చూస్తే యాక్టివ్ ఫండ్స్‌లో భాగమైన లార్జ్‌క్యాప్ ఫండ్స్ బెంచ్‌మార్క్ సూచీలకు మించి రాబడులను అందించాయి. భవిష్యత్తులోనూ ఇవి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లను మించి రాబడులను ఇవ్వగలవు’’ అని సానా సెక్యూరిటీ సీఈవో రజత్ శర్మ చెప్పారు. అయితే, దీర్ఘకాలంలో ఇది ఇలానే కొనసాగదని, పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘సామర్థ్యం విషయంలో మన మార్కెట్ పరిస్థితి మెరుగుపడింది. ఈ సమర్థత అన్నది వచ్చే 5–10 ఏళ్లలో మరింత పెరుగుతుంది. దీంతో యాక్టివ్ ఫండ్స్ ప్రభావం తగ్గుతుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈటీఎఫ్‌లలో ఎన్నో రకాలు... ఈటీఎఫ్‌ల్లోనూ భిన్న రకాలున్నాయి. పాసివ్ ఇన్వెస్టర్ అయి ఉండి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించేవారు బెంచ్‌మార్స్ సూచీల ఆధారిత ఈటీఎఫ్‌లను పరిశీలించొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై అవగాహన ఉంటే లార్జ్‌క్యాప్ ఆధారిత సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. లేదందే మిడ్‌క్యాప్ సూచీలైన బీఎస్ఈ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 లను కూడా పరిశీలించొచ్చు. సూచీల ఆధారిత ఈటీఎఫ్‌లలో ఉన్న సౌలభ్యమేంటంటే ఫండ్స్ పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. కేవలం బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే చాలు. అంటే సూచీల్లోని స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు గనుక వాటి పనితీరు, రాబడులు సూచీలకు సమాన స్థాయిలో ఉంటాయి. రంగాల వారీ ఈటీఎఫ్‌లు మరో రకం. ప్రత్యేకంగా ఓ రంగం పనితీరుపై ఆశాజనకంగా ఉన్నప్పటికీ... ఆ రంగంలోని మంచి స్టాక్స్‌ను ఎంచుకోవడం, వాటి పనితీరును పర్యవేక్షించే తీరిక, సమయం లేని వారికి ఇవి అనువైనవని చెప్పాలి. థీమ్ ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. అంటే వినియోగం, డివిడెండ్ విరివిగా ఇచ్చే స్టాక్స్... ఇలా ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకునే విధానంతో పనిచేస్తుంటాయి. స్టాక్ ఎక్సేంజ్‌లు ఈ మధ్య తక్కువ వోలటాలిటీ (ఆటుపోట్లు) ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్ పేరుతో కొత్త సూచీలను మొదలు పెట్టాయి. వీటికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్‌లను ప్రారంభించాయి. అయితే, ఇవి కొత్తవి, వీటి నిర్వహణలో ఆస్తులు తక్కువగా ఉన్నందున కొంత కాలం పాటు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచన. ఈక్విటీ కాకుండా డెట్ ఆధారిత ఈటీఎఫ్‌లు సైతం ఉన్నాయి. వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా పనిచేసేవి. మన దేశంలో బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. అయితే, గోల్డ్ బాండ్ల రాకతో వీటి ఆకర్షణ తగ్గింది. ఇక్కడ పేర్కొన్న ఈటీఎఫ్‌లు అన్నింటిలోనూ సూచీల ఆధారితంగా పనిచేసే ఈటీఎఫ్‌లు మినహా మిగిలినవి కొంచెం క్లిష్టమైనవి. కనుక ఆయా ఈటీఎఫ్‌లు వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయన్న వ్యూహాలు తెలిసి, ఆయా రంగాల పనితీరుపై అవగాహన ఉంటేనే ఎంచుకోవడం సరైనది. లిక్విడిటీ... ఒక సమస్యే ఈటీఎఫ్‌లో వ్యయాలు తక్కువగా ఉండడం ఆకర్షణీయమైన అంశం. అదే సమయంలో లిక్విడిటీ తక్కువగా ఉండడం ప్రతికూలం. తరచుగా ట్రేడ్ కాని ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. దీంతో అమ్మడం, కొనడం చేయాలనుకుంటే అనుకున్న ధర రాకపోవచ్చు. దీంతో ధరల ప్రభావం పడుతుంది. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో ఈ సమస్య లేదు. ఇవి యాక్టివ్‌గా పనిచేసే ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న యూనిట్లను ఫండ్ హౌస్‌కు సరెండ్ చేసేస్తే సరిపోతుంది. కనుక ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసేవారు లిక్విడిటీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ దీపేష్ రాఘవ్ సూచన. ఈటీఎఫ్‌లలో అస్సెట్ బేస్ (పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ) అధికంగా ఉన్న వాటిని ఎంచుకుంటే ఈ సమస్య ఉండదని ఆయన చెప్పారు. ఇక ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల విషయంలో అధిక ఎక్స్పోజర్ తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమైనదే. విభిన్న ఈటీఎఫ్... భారత్ 22కు దూరమే బెటర్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొత్త ఈటీఎఫ్ పథకం భారత్ 22!!. దీనికి దూరంగా ఉండడమే సరైనదని కొందరు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈటీఎఫ్ అంటే సూచీల ఆధారంగా పనిచేసేవి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన పథకం సూచీలకు భిన్నంగా 22 స్టాక్స్‌తో ఉండడం మొదటి అంశం. ఈ 22 స్టాక్స్ ఏవన్నది ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. సూచీల ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్‌లలో మార్పులు జరుగుతుంటాయి. అంటే సూచీలోని స్టాక్స్‌లో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈటీఎఫ్‌లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో అందుకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. కానీ, భారత్ 22 పథకం మాత్రం ఆ విధమైన మార్పులు లేకుండా అవే 22 స్టాక్స్‌తో ఉంటుంది. ఈ స్టాక్స్ కూడా ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నవి. అంటే ప్రభుత్వం అమ్మితే ఆ మేరకు వాటాలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. సీపీఎస్ఈ ఈటీఎఫ్ అన్నది ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన ఈటీఎఫ్ కాగా, భారత్ 22 కేవలం 22 కంపెనీలకే పరిమితం.పైగా పనితీరు సరిగా లేని బ్లూచిప్ కంపెనీలను, ఇతర బ్లూచిప్ కంపెనీలతో కలిపి ఈ సూచీని రూపొందించినట్టు కనిపిస్తోందని రజత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ రంగానికి చెందినది కాకపోవడం, అదే సమయంలో ఓ థీమ్ ఆధారంగా పనిచేసేది కూడా కాకుండా భిన్నంగా ఉండడంతో భారత్ 22లో పెట్టుబడులకు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచనగా ఉంది. దీనికి బదులు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం నయమన్నది వారి అభిప్రాయం.