ఈటీఎఫ్‌... దీర్ఘకాలానికి బెటర్‌! | Using Passive Funds to Invest in Bonds | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌... దీర్ఘకాలానికి బెటర్‌!

Published Mon, Sep 4 2017 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఈటీఎఫ్‌... దీర్ఘకాలానికి బెటర్‌! - Sakshi

ఈటీఎఫ్‌... దీర్ఘకాలానికి బెటర్‌!

పాసివ్‌ ఫండ్స్‌కు ఇంకా పెరగని ఆదరణ
ప్రస్తుతం యాక్టివ్‌ ఫండ్స్‌కే ఎక్కువ నిధులు  
సూచీ ఆధారిత ఈటీఎఫ్‌లకూ ఆదరణ అంతంతే
చాలా ఈటీఎఫ్‌ పథకాల్లో లిక్విడిటీ సమస్య  
ఎంచుకునే ముందు చూడాల్సిన అంశాలు చాలా...


ఈటీఎఫ్‌ అని ముద్దుగా పిలిచే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల పూర్తిపేరు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌. ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వస్తున్నాయివి. అంటే... ఏదో ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టకుండా... కొన్ని రకాల స్టాక్స్‌ కలసి ఎక్సే్ఛంజీ తయారు చేసే ఒకరకమైన ఇండెక్స్‌ లాంటి సాధనంలో ఇవి పెట్టుబడి పెడతాయన్న మాట. కేంద్ర ప్రభుత్వం ‘‘భారత్‌ 22’’ పేరుతో ఇటీవలే ఓ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించటంతో ఈటీఎఫ్‌లు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంతో పోలిస్తే వీటిని ఎంచుకునే వారి సంఖ్యలో ఇటీవల పెరుగుదల కనిపిస్తున్నా... ఇప్పటికీ చాలామందికి ఇండెక్స్‌ ఫండ్స్‌ అంటే ఏంటో... ఈటీఎఫ్‌లంటే ఏంటో... ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటో పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అంతేకాక.... ఈటీఎఫ్‌లలో ఎన్ని రకాలుంటాయి? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వేటిలో పెట్టుబడి పెడితే బెటర్‌? ఇలాంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్‌ ప్లస్‌ ప్రధాన కథనం.

అసలు ఈటీఎఫ్‌ అంటే ఏంటి? ఒకరకంగా చెప్పాలంటే ఈటీఎఫ్‌లు కూడా ఇండెక్స్‌ ఫండ్ల లాంటివే. రెండింటి పెట్టుబడి విధానం దాదాపు ఒకటే అయినా... ట్రేడింగ్, లిక్విడిటీ పరంగా ఉన్న తేడాలు ఈ రెండింటినీ వేరు చేస్తుంటాయి. ఈటీఎఫ్‌లు కూడా ఇండెక్స్‌లలోనే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌నే తీసుకుందాం!!. దీన్లో 30 షేర్లుంటాయి. ఈ ఈటీఎఫ్‌ ఏం చేస్తుందంటే... తన దగ్గరున్న నిధులను ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా పెట్టుబడి పెడుతుంది. ఉదాహరణకు సెన్సెక్స్‌లో రిలయన్స్‌ వెయిటేజీ గనుక 10 శాతం ఉంటే... తన నిధుల్లో 10 శాతాన్ని ఇది రిలయన్స్‌కు కేటాయిస్తుంది. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లకూ ఇలా చేయటం వల్ల కొన్ని షేర్లు తగ్గినా... కొన్ని షేర్లు పెరుగుతాయి కనుక... మొత్తమ్మీద ఇండెక్స్‌ పెరిగితే ఈ ఫండ్ల విలువ కూడా పెరుగుతుంది. ఇండెక్స్‌ తగ్గితే వీటి విలువ కూడా తగ్గుతుంది. కాకపోతే ఈటీఎఫ్‌లు చాలావరకు దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేస్తాయి. కాబట్టి చక్కని పెరుగుదల సాధ్యమని చెప్పవచ్చు.

ఇండెక్స్‌ ఫండ్‌ – ఈటీఎఫ్‌
ఈటీఎఫ్‌లు ఇండెక్స్‌ ఫండ్స్‌ కంటే కొన్ని అంశాల్లో ఆశాజనకంగా ఉన్నాయి. ఈటీఎఫ్‌లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టయి ఉంటాయి. స్టాక్స్‌ మాదిరిగా వీటిలో కూడా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. పైగా ఇండెక్స్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఈటీఎఫ్‌ల ఎక్స్‌పెన్స్‌ రేషియో చాలా తక్కువ. చాలా వరకు ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 1–1.5 శాతంగా ఉంది. ఈటీఎఫ్‌లలో మాత్రం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌), ఈపీఎఫ్‌ల నుంచి పోటీ పెరగటం దీనికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈటీఎఫ్‌లలో కొన్ని ఎక్స్‌పెన్స్‌ రేషియో కింద 0.1 శాతాన్ని మించి వసూలు చేయడం లేదు. అయితే, ప్రత్యేక థీమ్‌ ఆధారిత ఈటీఎఫ్‌లు మాత్రం ఇప్పటికీ అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండెక్స్‌ ఫండ్లను మాత్రం మార్కెట్‌ సమయాల్లో ఈటీఎఫ్‌ల మాదిరిగా ట్రేడ్‌ చేయలేం. వీటి విలువ మార్కెట్‌ ముగిశాక వెల్లడవుతుంది. ఆ ధరకు ఫండ్‌ సంస్థకు సరెండర్‌ చేసి వైదొలగవచ్చు.

యాక్టివ్‌ – పాసివ్‌ ఫండ్స్‌
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సుదీర్ఘకాలంపాటు తమ పెట్టుబడుల్ని కొనసాగించే ఈటీఎఫ్‌లను పాసివ్‌ ఫండ్స్‌గా పిలుస్తారు. ఎప్పటికప్పుడు ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను మార్చేవి యాక్టివ్‌ ఫండ్స్‌. కాకపోతే ఈ తరహా పాసివ్‌ ఫండ్స్‌కు మన దేశంలో ఇంకా చెప్పుకోతగ్గంత ఆదరణ మొదలు కాలేదు. యాక్టివ్‌ ఫండ్స్‌ బెంచ్‌ మార్క్‌ సూచీలకు మించి రాబడులను అందిస్తుండటమే దీనికి కారణమని చెప్పాలి. ‘‘గత చరిత్ర చూస్తే యాక్టివ్‌ ఫండ్స్‌లో భాగమైన లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ బెంచ్‌మార్క్‌ సూచీలకు మించి రాబడులను అందించాయి. భవిష్యత్తులోనూ ఇవి ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లను మించి రాబడులను ఇవ్వగలవు’’ అని సానా సెక్యూరిటీ సీఈవో రజత్‌ శర్మ చెప్పారు. అయితే, దీర్ఘకాలంలో ఇది ఇలానే కొనసాగదని, పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘సామర్థ్యం విషయంలో మన మార్కెట్‌ పరిస్థితి మెరుగుపడింది. ఈ సమర్థత అన్నది వచ్చే 5–10 ఏళ్లలో మరింత పెరుగుతుంది. దీంతో యాక్టివ్‌ ఫండ్స్‌ ప్రభావం తగ్గుతుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈటీఎఫ్‌లలో ఎన్నో రకాలు...
ఈటీఎఫ్‌ల్లోనూ భిన్న రకాలున్నాయి. పాసివ్‌ ఇన్వెస్టర్‌ అయి ఉండి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించేవారు బెంచ్‌మార్స్‌ సూచీల ఆధారిత ఈటీఎఫ్‌లను పరిశీలించొచ్చు. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పై అవగాహన ఉంటే లార్జ్‌క్యాప్‌ ఆధారిత సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. లేదందే మిడ్‌క్యాప్‌ సూచీలైన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 100, నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 100 లను కూడా పరిశీలించొచ్చు. సూచీల ఆధారిత ఈటీఎఫ్‌లలో ఉన్న సౌలభ్యమేంటంటే ఫండ్స్‌ పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. కేవలం బెంచ్‌ మార్క్‌ సూచీలను పరిశీలిస్తే చాలు. అంటే సూచీల్లోని స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తారు గనుక వాటి పనితీరు, రాబడులు సూచీలకు సమాన స్థాయిలో ఉంటాయి.

రంగాల వారీ ఈటీఎఫ్‌లు మరో రకం. ప్రత్యేకంగా ఓ రంగం పనితీరుపై ఆశాజనకంగా ఉన్నప్పటికీ... ఆ రంగంలోని మంచి స్టాక్స్‌ను ఎంచుకోవడం, వాటి పనితీరును పర్యవేక్షించే తీరిక, సమయం లేని వారికి ఇవి అనువైనవని చెప్పాలి. థీమ్‌ ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. అంటే వినియోగం, డివిడెండ్‌ విరివిగా ఇచ్చే స్టాక్స్‌... ఇలా ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకునే విధానంతో పనిచేస్తుంటాయి. స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఈ మధ్య తక్కువ వోలటాలిటీ (ఆటుపోట్లు) ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్‌ పేరుతో కొత్త సూచీలను మొదలు పెట్టాయి. వీటికి సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా ఈటీఎఫ్‌లను ప్రారంభించాయి. అయితే, ఇవి కొత్తవి, వీటి నిర్వహణలో ఆస్తులు తక్కువగా ఉన్నందున కొంత కాలం పాటు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచన. ఈక్విటీ కాకుండా డెట్‌ ఆధారిత ఈటీఎఫ్‌లు సైతం ఉన్నాయి. వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా పనిచేసేవి. మన దేశంలో బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. అయితే, గోల్డ్‌ బాండ్ల రాకతో వీటి ఆకర్షణ తగ్గింది.

ఇక్కడ పేర్కొన్న ఈటీఎఫ్‌లు అన్నింటిలోనూ సూచీల ఆధారితంగా పనిచేసే ఈటీఎఫ్‌లు మినహా మిగిలినవి కొంచెం క్లిష్టమైనవి. కనుక ఆయా ఈటీఎఫ్‌లు వేటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయన్న వ్యూహాలు తెలిసి, ఆయా రంగాల పనితీరుపై అవగాహన ఉంటేనే ఎంచుకోవడం సరైనది.

లిక్విడిటీ... ఒక సమస్యే
ఈటీఎఫ్‌లో వ్యయాలు తక్కువగా ఉండడం ఆకర్షణీయమైన అంశం. అదే సమయంలో లిక్విడిటీ తక్కువగా ఉండడం ప్రతికూలం. తరచుగా ట్రేడ్‌ కాని ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. దీంతో అమ్మడం, కొనడం చేయాలనుకుంటే అనుకున్న ధర రాకపోవచ్చు. దీంతో ధరల ప్రభావం పడుతుంది. అదే ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఈ సమస్య లేదు. ఇవి యాక్టివ్‌గా పనిచేసే ఫండ్స్‌. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న యూనిట్లను ఫండ్‌ హౌస్‌కు సరెండ్‌ చేసేస్తే సరిపోతుంది. కనుక ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేసేవారు లిక్విడిటీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది సెబీ రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌ దీపేష్‌ రాఘవ్‌ సూచన. ఈటీఎఫ్‌లలో అస్సెట్‌ బేస్‌ (పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ) అధికంగా ఉన్న వాటిని ఎంచుకుంటే ఈ సమస్య ఉండదని ఆయన చెప్పారు. ఇక ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల విషయంలో అధిక ఎక్స్‌పోజర్‌ తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమైనదే.

విభిన్న ఈటీఎఫ్‌... భారత్‌ 22కు దూరమే బెటర్‌
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొత్త ఈటీఎఫ్‌ పథకం భారత్‌ 22!!. దీనికి దూరంగా ఉండడమే సరైనదని కొందరు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈటీఎఫ్‌ అంటే సూచీల ఆధారంగా పనిచేసేవి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన పథకం సూచీలకు భిన్నంగా 22 స్టాక్స్‌తో  ఉండడం మొదటి అంశం. ఈ 22 స్టాక్స్‌ ఏవన్నది ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. సూచీల ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్‌లలో మార్పులు జరుగుతుంటాయి. అంటే సూచీలోని స్టాక్స్‌లో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈటీఎఫ్‌లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో అందుకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. కానీ, భారత్‌ 22 పథకం మాత్రం ఆ విధమైన మార్పులు లేకుండా అవే 22 స్టాక్స్‌తో ఉంటుంది. ఈ స్టాక్స్‌ కూడా ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నవి.

 అంటే ప్రభుత్వం అమ్మితే ఆ మేరకు వాటాలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ అన్నది ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన ఈటీఎఫ్‌ కాగా, భారత్‌ 22 కేవలం 22 కంపెనీలకే పరిమితం.పైగా పనితీరు సరిగా లేని బ్లూచిప్‌ కంపెనీలను, ఇతర బ్లూచిప్‌ కంపెనీలతో కలిపి ఈ సూచీని రూపొందించినట్టు కనిపిస్తోందని రజత్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ రంగానికి చెందినది కాకపోవడం, అదే సమయంలో ఓ థీమ్‌ ఆధారంగా పనిచేసేది కూడా కాకుండా భిన్నంగా ఉండడంతో భారత్‌ 22లో పెట్టుబడులకు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచనగా ఉంది. దీనికి బదులు నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం నయమన్నది వారి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement