
ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? – దీప్తి
ఈ రెండు సాధనాల మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. ఈ రెండూ కూడా ప్యాసివ్ పెట్టుబడుల కోసం రూపొందించినవే. ఇండెక్స్‌ను (నిఫ్టీ50, సెన్సెక్స్ తదితర) ప్రతిఫలిస్తూ పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో వ్యయాలు చాలా తక్కువ. చూడ్డానికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వాటిల్లో పెట్టుబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. ధరల అస్థిరతల భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇండెక్స్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా సులభంగా, పెట్టుబడులను ఆటోమేట్ చేసే సాధనమే ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లు అలా కాదు. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిని మీరే స్వయంగా కొనుగోలు చేసుకోవాలి. అందుకోసం ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలుండాలి. కొనుగోళ్లపై బ్రోకర్, ఇతర చార్జీలు చెల్లించాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇండెక్స్ పండ్స్ సులభమైన ఎంపిక. వీటిని తరచుగా పర్యవేక్షించుకోనక్కర్లేదు. సిప్ రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలుండి, మార్కెట్ కదలికలను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వారికి ఈటీఎఫ్‌లు అనుకూలం.
ఇదీ చదవండి: బిజినెస్‌లో గుజరాతీల సక్సెస్ సీక్రెట్స్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్
నేను ఒకే అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పరిధిలో (ఏఎంసీ) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్ నుంచి, మరో ఈక్విటీ పథకంలోకి సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) ద్వారా పెట్టుబడులను మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందా? – శ్రీకాంత్ ఎన్‌వీ
ఈఎల్‌ఎస్‌ఎస్ పథకం నుంచి మరో ఈక్విటీ పథకంలోకి ఎస్‌టీపీ చేసుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఆ రెండు ఒకటే ఏఎంసీ పరిధిలో ఉన్నా సరే ఈ నిబంధనే వర్తిస్తుంది. ఇన్వెస్టర్ ఎస్‌టీపీ ద్వారా ఒక ఈక్విటీ పథకంలోని పెట్టుబడులను క్రమంగా మరో ఈక్విటీ పథకంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. మధ్యలో బ్యాంక్ ఖాతా అవసరం ఉండదు. కానీ, పన్ను పరంగా చూస్తే ప్రతీ ఎస్‌టీపీ బదిలీని ఉపసంహరణగానే చట్టం కింద పరిగణిస్తారు. తిరిగి తాజా పెట్టుబడి కింద చూస్తారు. ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మూడేళ్ల కాలం ముగిసిన యూనిట్లనే ఎస్‌టీపీ ద్వారా బదిలీ చేసుకోగలరు. ఉపసంహరణపై వచ్చిన లాభం ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.25 లక్షలు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను పడుతుంది. పన్ను పడకుండా ఎస్‌టీపీ చేసుకోవాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపసంహరణ, బదిలీ అన్నది రూ.1.25 లక్షలు మించకుండా చూసుకోవాలి.
- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment