Exchange Traded Funds
-
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్‌లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.165 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) వరుసగా మూడు నెలల పాటు అమ్మకాలు చూసిన తర్వాత తేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.199 కోట్లు, 2022 డిసెంబర్లో రూ.273 కోట్లు, అదే ఏడాది నవంబర్‌లో రూ.195 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం. 2022 అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు కొంత తగ్గడం పెట్టుబడుల రాకకు అనుకూలించిందని.. బంగారం ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు సహజంగానే వస్తుంటాయని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. భౌతిక బంగారానికి సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఇచ్చే గుర్తింపు) ఫిబ్రవరిలో 20వేలు పెరిగి మొత్తం 46.94 లక్షలకు చేరాయి. బంగారంలో రాబడులు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటాయని, అందుకే అది నేడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా మారినట్టు కవితా కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నింటి పరిధిలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.21,400 కోట్లుగా ఉంది. -
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.457 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జూలైలో నికరంగా రూ.457 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. పోర్టుఫోలియో రీబ్యాలెన్సింగ్ ప్రణాళికలో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి రక్షణాత్మక విభాగాల్లోకి మళ్లించడం కలిసొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు. ఈ జూన్‌లో రూ.135 కోట్లు మాత్రమే వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి)గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2022) జూలై నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.982 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘యాంఫీ గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.., బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగింది. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం అంశాలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. -
రిటైర్మెంట్ ఫండ్ సంస్థకు ‘ఈటీఎఫ్’ బొనాంజా
న్యూఢిల్లీ: ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భారీ బొనాంజా పొందుతోంది. కార్మిక, ఉపాధి వ్యవహారాల శాఖ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మార్చి 2022 వరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఈపీఎఫ్ఓ రూ. 1,59,299.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడుల ప్రస్తుత (నోషనల్) మార్కెట్ విలువ రూ. 2,26,919.18 కోట్లు. 2019–20లో రూ.31,501 కోట్లు, 2020–21లో రూ.32,071 కోట్లు, 2021–22లో రూ.43,568 కోట్లు ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ పెట్టుబడులు వెళ్లాయి. ► ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడి విలువ రూ.12,199.26 కోట్లు. ఇదే కాలంలో డెట్ ఇన్స్ట్రమెంట్లలోకి వెళ్లిన మొత్తం పెట్టుబడి విలువ రూ.84,477.67 కోట్లు ► నిఫ్టీ 50, సెన్సెక్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), భారత్ 22 సూచీల ఆధారంగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 15 శాతం వరకే పెట్టుబడులు పరిమితి... ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో దాదాపు రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ప్రారంభంలో ఈపీఎఫ్ఓ తన పెట్టుబడి పరిమితుల్లో 5 శాతం స్టాక్ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించుకుంది. తరువాత ఈ నిష్పత్తిని 2016–17లో 10 శాతానికి పెంచడం జరిగింది. 2017–18లో 15 శాతానికి పెంచారు. డెట్ ఇన్‌స్ట్రమెంట్లలో 85 శాతం నిధులను పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. (క్లిక్: ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?) -
గోల్డ్ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఈక్విటీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు ఫిబ్రవరిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రూ.248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం అంతకుముందు నెలలోనూ నమోదైంది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మరింత మొత్తంలో రూ.452 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంతకుముందు కాలం లో ప్రతి నెలా నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే ఈ విష యం తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటుచేసుకున్నా కానీ.. ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.17,839 కోట్లుగా ఉంటే.. ఫిబ్రవరి ఆఖరికి రూ.18,727 కోట్లకు పెరిగింది. ఫోలియోల సంఖ్య కూడా ఫిబ్రవరిలో 3.09 లక్షలు పెరిగి 37.74 లక్షలకు చేరింది. 2021 మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.4,814 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అంతకుముందు 2020లో వచ్చినమొత్తం రూ.6,657 కోట్లుగా ఉంది. ఇతర అవకాశాల కోసం.. బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగినట్టు, మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీకి (పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్సింగ్) మళ్లించడం, ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్ను అవకాశంగా మలుచుకోవడం కారణమై ఉంటుందని గుప్తా పేర్కొన్నారు. అలాగే, బంగారం ధరలు పెరగడంతో ట్రేడర్లు తమ లాభాలను బుక్ చేసుకుని ఉంటారని ఆమె చెప్పారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) సుదీర్ఘకాలం తర్వాత అమ్మకాల ఒత్తిడిని చూశాయి. 2021 జూలై నెలలో నికరంగా రూ.61 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. ఈక్విటీ, డెట్ సాధనాలవైపు పెట్టుబడులను మళ్లించడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ ఫోలియోల సంఖ్య (పెట్టుబడుల గుర్తింపు సంఖ్య) 19.13 లక్షలకు పెరిగింది. జూన్ చివరికి ఫోలియోలు 18.32 లక్షలుగానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక సానుకూలంగానే నమోదవుతోంది. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో మాత్రమే పెట్టుబడులు వరుసగా రూ.195 కోట్లు, రూ.141 కోట్ల చొప్పున వెనక్కి వెళ్లాయి. ఇక ఈ ఏడాది జూన్‌లో రూ.360 కోట్లు, మే నెలలో రూ.288 కోట్ల చొప్పున బంగారం ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు రూ.3,107 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,328 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి జూన్ త్రైమాసికంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. నికరంగా రూ.1,328 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. కానీ, క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.2,040 కోట్లతో పోలిస్తే తగ్గినట్టు.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది భారీగా పెట్టుబడులు రావడం అన్నది అప్పటి అనిశ్చిత పరిస్థితుల వల్లేనని మార్కెట్ పల్స్ సీఈవో అర్షద్ ఫాహోమ్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి కొంత పెట్టుబడులను మళ్లించడమే భారీ పెట్టుబడులకు కారణమని గ్రీన్‌పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ. 1,779 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 5 -
భారీగా వెనక్కి మళ్లిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 1.5 బిలియన్ డాలర్లు (రూ.11,250 కోట్లు) వెనక్కి తీసుకున్నారు. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం చూస్తే.. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. అయితే, ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో వెనక్కి వెళ్లిపోయిన నిధులతో చూస్తే చాలా తక్కువే. మార్చి క్వార్టర్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా ఫోకస్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ ల నుంచి ఏకంగా 5 బిలియన్ డాలర్లు (రూ.37,500 కోట్లు) ఉపసంహరించుకున్నారు. దీంతో 2020లో జూన్ నాటికి మొత్తం 6.5 బిలియన్ డాలర్లు (రూ.48,750 కోట్లు) భారత్ నుంచి వెళ్లిపోయినట్టు అయింది. 2019 పూర్తి సంవత్సరంలో ఇన్వెస్టర్లు 5.9 బిలియన్ డాలర్లనే వెనక్కి తీసుకోగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఇంతకంటే అధికంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ప్రధానంగా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఫోకస్డ్ ఈటీఎఫ్ ల ద్వారానే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► జూన్ త్రైమాసికంలో వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడులు.. ఇండియాఫోకస్డ్ ఫండ్స్ నుంచి 698 మిలియన్ డాలర్లు, ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల నుంచి 776 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాల విధానంతో ఉంటాయి. అదే ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల పెట్టుబడులు స్వల్పకాల విధానంతో కూడినవి. ► ఈ రెండు విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ 2018 ఫిబ్రవరి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ నుంచి 14.5 బిలియన్ డాలర్లు (రూ.1,08,750 కోట్లు) బయటకు వెళితే, ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్ ల నుంచి ఇదే కాలంలో 4.2బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) వెనక్కి తీసుకోవడం గమనార్హం. అంటే దీర్ఘకాల పెట్టుబడులే ఎక్కువగా బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అప్రమత్త ధోరణిని ఇది తెలియజేస్తోందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. ► ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లడం ఊహించనిదేనని, భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కరోనా వైరస్ చూపే ప్రభావంపై అనిశ్చిత పరిస్థితులను ఇందుకు కారణంగా పేర్కొంది. ► కరోనాపై భారత్ ఏ విధంగా పైచేయి సాధిస్తుందన్న దాని ఆధారంగానే భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని తెలిపింది. ► ఈ రెండు రకాల ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో 13 శాతం పెరిగి 33.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు భారీగా కోలుకోవడం ఆస్తుల విలువ పెరిగేందుకు దోహదపడింది. -
భారత్ బాండ్.. ఇన్వెస్ట్ చేస్తున్నారా?
భారత్ బాండ్ ఈటీఎఫ్.. నూతన మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్’ కథనమే ఇది. ∙ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్ ఈటీఎఫ్‌ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లు ప్యాసివ్ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్ బాండ్ ఇండెక్స్– ఏప్రిల్ 2023, భారత్ బాండ్ ఇండెక్స్ – ఏప్రిల్ 2030 సూచీలను ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్‌లకు భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు మధ్య వ్యత్యాసం.. భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్‌ల్లో మాదిరే ఉంటుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడేళ్లు (ఏప్రిల్ 2023), పదేళ్లు (ఏప్రిల్ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్ ఆప్షన్ లేదు. ఎడెల్వీజ్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయనున్నారు. లిస్ట్ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్బాండ్ డాట్ ఇన్’ పోర్టల్‌కు వెళ్లి ఎన్ఎఫ్వో ఆఫర్ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్వీజ్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇష్యూ సైజు మూడేళ్ల ఈటీఎఫ్ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భద్రత ఎక్కువే... భారత్ బాండ్ ఈటీఎఫ్ కచ్చితంగా ఏఏఏ రేటింగ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్ రిస్క్ చాలా చాలా తక్కువ. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండదు. పన్ను ఎంతో తక్కువ మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్ (రిస్క్ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్ రాబడులు, రిస్క్ లేని సాధనం. – పవన్ అగర్వాల్, ప్రైవేటు వెల్త్ (ఇండియా నివేష్) ఎండీ అన్ని విధాలా అనుకూలం అత్యంత చౌక బాండ్ ఫండ్ ఇది. çఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్ విషయంలో ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్‌లు పడతాయి. – నితిన్ జైన్, ఎడెల్వీజ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో రాబడులు/చార్జీలు ఈటీఎఫ్‌లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఎన్ఎఫ్వో డాక్యుమెంట్ ప్రకారం.. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్‌లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్‌లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్వీజ్ ఏఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్ ఫండ్ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్ ఫండ్ కూడా అవుతుంది. డెట్ ఫండ్స్‌లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్‌లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్‌లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడిటీ... ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్ ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్‌ల్లో ట్రేడింగ్ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్ బాండ్ ఈటీఎఫ్ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్‌లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్వీజ్ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా. వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్వీజ్ ఏఎంసీ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్ ఫండ్ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేని వారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అనుకూలమేనా..? డెట్ ఫండ్ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్‌ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్ బాండ్ ఈటీఎఫ్ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్‌లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్ డెట్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్ కూడా ఉండదు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కోణంలో సూచనీయం కాదు. డెట్‌లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబడి ఎఫ్‌డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్ ఈటీఎఫ్ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్‌పై నాలుగేళ్ల ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్ ఈటీఎఫ్‌లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్‌లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా. పారదర్శకత రోజువారీగా పోర్ట్‌ఫోలియో, ఇండికేటివ్ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్వీజ్ ఏఎంసీ తన వెబ్సైట్లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్ ఫండ్స్ నెలకోసారి మాత్రమే పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో పారదర్శకత ఎక్కువే. -
ఈటీఎఫ్ అంటే..
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఈటీఎఫ్ అంటే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ప్రతి విషయంలోనూ మ్యూచువల్ ఫండ్లానే ఉంటుంది. అయితే మ్యూచ్‌వల్ ఫండ్ల మాదిరి కాకుండా ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో షేర్లను ఎలాగైతే కొనుగోలు చేస్తారో అలాగే బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్‌గా ఈటీఎఫ్‌లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజ్‌లలో ట్రేడ్ అవుతాయి. ఉదయం కొని సాయంత్రం విక్రయించొచ్చు కూడా. తక్కువ వ్యయాలు, పన్ను రాయితీలు, డైవర్సిఫికేషన్, స్టాక్స్‌కు ఉండే సౌకర్యాలను కలిగి ఉండటం వంటి పలు ప్రయోజనాల నేపథ్యంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్మెంట్లకు అనువుగా ఉంటాయి. ఇవి 1993 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈటీఎఫ్‌లు స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ, ఆప్షన్స్ వంటి పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు చేస్తాయి. ప్రధానంగా మాత్రం స్టాక్ సూచీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. -
ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్ఓ పెట్టుబడులు !
హైదరాబాద్: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. వచ్చే నెల 7న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కొంత మంది నిపుణుల నివేదికలను అధ్యయనం చేశామని, ఈ సమావేశంలో ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల పనితీరును చర్చిస్తామని సీబీటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన పేర్కొన్నారు. -
ఈపీఎఫ్‌వో ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.2,322 కోట్లు
న్యూఢిల్లీ: ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్‌వో) ఈఏడాది అక్టోబర్ నాటికి రూ.2,322 కోట్లను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసింది. ఈపీఎఫ్‌వో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్లను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈపీఎఫ్‌వో ఆగస్ట్-అక్టోబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ.2,322 కోట్లను క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టింది. సెన్సెక్స్ షేర్లలో రూ.588 కోట్లను, నిఫ్టీ షేర్లలో రూ.1,734 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. -
ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్ఓ నిధులు!
- ఈటీఎఫ్‌ల్లో 5 శాతం వరకూ నిధులు - 2015-16లోనే రూ.17,000 కోట్లు పంప్... - త్వరలో నిబంధనల నోటిఫై! న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి నియమనిబంధనలను త్వరలో కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతం వరకూ తొలుత ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే ఫండ్‌లోని దాదాపు రూ.17,000 కోట్లు ఈటీఎఫ్‌ల్లోకి మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ల్లో కూడా.... ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల శకం ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది.