న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) వరుసగా మూడు నెలల పాటు అమ్మకాలు చూసిన తర్వాత తేరుకున్నాయి. ఫిబ్రవరిలో రూ.165 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.199 కోట్లు, 2022 డిసెంబర్‌లో రూ.273 కోట్లు, అదే ఏడాది నవంబర్‌లో రూ.195 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఉపసంహరించుకోవడం గమనార్హం. 2022 అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
దేశీయంగా బంగారం ధరలు కొంత తగ్గడం పెట్టుబడుల రాకకు అనుకూలించిందని.. బంగారం ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు సహజంగానే వస్తుంటాయని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. భౌతిక బంగారానికి సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఇచ్చే గుర్తింపు) ఫిబ్రవరిలో 20వేలు పెరిగి మొత్తం 46.94 లక్షలకు చేరాయి. బంగారంలో రాబడులు ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటాయని, అందుకే అది నేడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా మారినట్టు కవితా కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరి చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అన్నింటి పరిధిలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.21,400 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment