
బంగారానికి పోటీగా దూకుడు
ఏడాదిలో రూ.1.25 లక్షలకు!
పరిశ్రమ వర్గాల అంచనాలు
ఈ ఏడాది ఇప్పటికే 13% అప్
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.
బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
నిష్పత్తి చెబుతోందిదే..
బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్‌టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్‌టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది.
ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి.
3,200 డాలర్ల దిశగా పసిడి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్‌ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.
ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను..
ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి.
ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్‌ల్లో రాబడులు (%)
ఏబీఎస్‌ఎల్ సిల్వర్ 36.36
కోటక్ సిల్వర్ 36.34
డీఎస్‌పీ సిల్వర్ 36.21
హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్ 36.13
యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01
ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం
–సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment