Motilal Oswal Financial Services
-
ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్ కీలక నిర్ణయం
అధిక పని గంటలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇతర కంపెనీల్లో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. జీతాల పెరుగుదల అంతంతమాత్రమే. దానికితోడు వారానికి డెబ్బై గంటల పనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తూ.. ఉన్నవారితో ఎలా ఎక్కువసేపు పనిచేయించుకోవాలో ఆలోచిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా మోతీలాల్‌ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. పని గంటలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం 8-8.5 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అనుమతించరు. ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు. పని సమయం ముగిసిన వెంటనే కంపెనీ ఈమెయిల్ సర్వర్లను ఆపేస్తామన్నారు. 45 నిమిషాల గ్రేస్ పిరియడ్ తర్వాత కంపెనీ తరఫున ఎలాంటి ఈమెయిల్‌లు పంపడం, స్వీకరించడం జరగదని చెప్పారు. ఎవరైనా షిఫ్ట్ సమయానికి మించి కార్యాలయంలో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. కొత్త పాలసీని ఉద్దేశించి సంస్థ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. తమకు పని గంటల సంఖ్య ముఖ్యం కాదని ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న సంస్థలోని కొందరు ఉన్నత అధికారులకు వారి సొంత పని షెడ్యూల్ కారణంగా ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధానాన్ని సంస్థ అన్ని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. కొత్త పాలసీ సంస్థలో పనిచేస్తున్న 11,000 మందిలో దాదాపు 9,500 మందికి వర్తిస్తుందని చెప్పారు. -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లకే బడా ఇన్వెస్టర్ల మొగ్గు
సామాన్యులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో (ఎఫ్డీలు) ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవడం సాధారణ విషయమే. కానీ, అధిక సంపద కలిగిన వారు (హెచ్ఎన్ఐలు) కూడా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2 శాతం వరకు పెరగడాన్ని సానుకూల అంశంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రస్తావించింది. ఈ పరిణామాలతో హెచ్ఎన్ఐలు మ్యూచువల్ ఫండ్స్ కంటే బ్యాంక్ ఎఫ్డీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించింది. ఇతర ఆర్థిక సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే సానుకూలతలను హెచ్ఎన్ఐలు అర్థం చేసుకున్నప్పటికీ, ఈ రంగంలో గతంలోని ఎదుర్కొన్న సమస్యలు వారిని ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల తరఫున పెద్ద పంపిణీదారులు (రూ.1,000 కోట్లకు పైన ఏయూఎం ఉన్నవారు), ఇనిస్టిట్యూషనల్ సేల్స్ ప్రతినిధులు తదితరుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ నివేదికను మోతీలాల్ ఓస్వాల్ రూపొందించింది. హెచ్ఎన్ఐలు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్‌లు (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ల్లో పెట్టుబడులకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పన్ను ప్రయోజనాలు ఎత్తివేయడంతో, వీటితో పోలిస్తే బ్యాంక్ ఎఫ్డీలకే హెచ్ఎన్ఐలు సానుకూలంగా ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. డెట్ ఫండ్స్‌లో మూడేళ్లకు మించి పెట్టుబడులు ఉంచినప్పుడు వచ్చే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సర్దుబాటు చేసే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఎత్తివేయడం గమనార్హం. దీంతో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎంత కాలం ఉంచినా, వచ్చే రాబడి సంబంధిత ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. -
లిస్టింగ్ రోజే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూల హవా నెలకొంది. అయితే ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ రోజునే అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఏప్రిల్–జులై మధ్య కాలంలో 52 శాతం మంది ఇన్వెస్టర్లు తొలి రోజునే అలాట్ అయిన షేర్లను విక్రయించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ పేర్కొంది. మరో 20 శాతం మంది లిస్టయిన వారం రోజుల్లోపే షేర్లను వొదిలించుకున్నట్లు తెలియజేసింది. మోతీలాల్‌కు చెందిన బ్రోకింగ్, పంపిణీ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ఐపీవో క్లయింట్లలో 64 శాతం మంది సగటున కనీసం రెండు ఇష్యూలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 5.7 లక్షల మంది ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల బాట పట్టగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో 5.1 లక్షల మంది మాత్రమే వీటికి సబ్స్క్రయిబ్ చేశారు. రాష్ట్రాల వారీగా మొత్తం ఐపీవో క్లయింట్లలో దాదాపు 70 శాతం మంది గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంపెనీలు సైతం క్యూ కట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్–జులైలో 36 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 17 ఇష్యూలు మాత్రమే నమోదయ్యాయి. 61 శాతం మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. గ్లెన్‌మార్క్ లైఫ్సైన్సెస్కు అత్యధికంగా 68 శాతం మంది క్లయింట్లు అప్లై చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించడం ద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఏడాది చివరికల్లా 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
సంవత్ 2077కు 5 బ్లూచిప్ స్టాక్స్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన లిక్విడిటీ, ఇటీవల కొద్ది రోజులుగా వేగమందుకున్న ఆర్థిక రికవరీ వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. ప్రస్తుతం 18 పీఈలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలిక సగటుకు చేరువలో నిఫ్టీ కదులుతున్నదని, ఈ స్థాయిలో మార్కెట్లు మరీ ఖరీదైనవిగా పోల్చకూడదని అభిప్రాయపడింది. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక పురోగతి, ప్రపంచ మార్కెట్ల లిక్విడిటీ తదితరాలతో కంపెనీలు మెరుగైన పనితీరు ప్రదర్శించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఇవన్నీ మార్కెట్లకు అనుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 రెండో దశ.. రిస్కులు పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో మార్కెట్ కరెక్షన్లకూ అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. ప్రధానంగా జీడీపీ రికవరీ ప్రభావం చూసే అంశమని తెలియజేసింది. ఈ పరిస్థతుల నేపథ్యంలో రానున్న 12 నెలల కాలానికి ఐటీ, హెల్త్ కేర్, గ్రామీణం- వ్యవసాయం, టెలికం, కన్జూమర్, ఫైనాన్షియల్ రంగాలపట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి సంవత్ 2077కు ఐదు లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు అనువైనవిగా భావిస్తున్నట్లు పేర్కొంది. బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు చూద్దాం.. భారతీ ఎయిర్టెల్ గత కొద్ది త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ భారీగా మెరుగుపడింది. గత రెండు క్వార్టర్లలో మొబైల్ బిజినెస్ ఇబిటా 16 శాతం పురోగమించడం ద్వారా ఈ అంశం వెల్లడవుతోంది. ఈ కాలంలో 10 మిలియన్ కొత్త వినియోగదారులను జత చేసుకుంది. ఫలితంగా మొత్తం ఏఆర్ పీయూ 5 శాతం బలపడింది. ప్రస్తుత ధర: రూ. 450- టార్గెట్: రూ. 650 స్టేట్ బ్యాంక్ లాభార్జన సాధారణ స్థాయికి చేరుకునే పరిస్థితులు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఉత్తమ సంస్థకాగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, 71 శాతం పీసీఆర్, పటిష్ట నెట్వర్క్, పెట్టుబడుల సామర్థ్యం సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. నిర్వహణ లాభాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుత ధర: రూ. 218- టార్గెట్: రూ. 300 హీరో మోటోకార్ప్ ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ద్విచక్ర వాహన విభాగంలో కనిపిస్తున్న వేగవంత రికవరీని హీరో మోటోకార్ప్ అందిపుచ్చుకునే వీలుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎంట్రీలెవల్, ఎగ్జిక్యూటివ్ విభాగాలలో పట్టు కంపెనీకి సానుకూల అంశాలు. బీఎస్-6 ప్రమాణాల తదుపరి పోటీలో ముందుంటోంది. ప్రస్తుత ధర: రూ. 2,943- టార్గెట్: రూ. 3,700 ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ పుంజుకోనున్న ఐటీ వ్యయాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు అవకాశాలను పెంచే వీలుంది. భవిష్యత్‌లో సాఫ్ట్ వేర్ సర్వీసుల రంగానికి డిమాండ్ కొనసాగనుంది. తద్వారా కంపెనీ లబ్ది పొందనుంది. ప్రాధాన్యతగల డీల్స్ కుదుర్చుకోవడం, మార్జిన్లను మెరుగుపరచుకోవడం వంటి సానుకూలతలకు చాన్స్ ఉంది. ప్రస్తుత ధర: రూ. 1,119- టార్గెట్: రూ. 1,355 అల్ట్రాటెక్ సిమెంట్ దేశవ్యాప్తంగా పంపిణీ విభాగంలో పటిష్ట నెట్వర్క్ కలిగి ఉంది. మౌలిక సదుపాయాల కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యమున్న సరఫరా సంస్థగా నిలుస్తోంది. దీంతో అటు సంస్థాగత, ఇటు రిటైల్ విభాగంలో సిమెంటుకు ఏర్పడే డిమాండ్ ను అందుకునే అవకాశముంది. ప్రస్తుత ధర: రూ. 4,565- టార్గెట్: రూ. 5,600 (గమనిక: ఇవి బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేముందు మార్కెట్ నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి. ) -
అనిశ్చితి.. ఆటుపోట్లు ఉంటాయ్
కరోనా వైరస్‌పరమైన ప్రభావాలు మరికొన్నాళ్ల పాటు ఉంటాయని.. మధ్యలో మార్కెట్లు పెరిగినా.. బుల్ ర్యాలీ ప్రారంభంగా భావించడానికి లేదంటున్నారు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఎంవోఎస్‌ఎల్) ఎండీ, సీఈవో (బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్) అజయ్ మీనన్. అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా దేశీ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పకపోవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఆ వివరాలివీ.. స్టాక్ మార్కెట్లపై మీ అంచనాలేంటి? దేశీయంగా ఇప్పటికే వృద్ధి మందగించిన తరుణంలో లాక్డౌన్ కారణంగా మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వాలు ఇటు ద్రవ్య, అటు ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీనితో మందగమన ప్రతికూల ప్రభావాల తీవ్రత మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. సమీప భవిష్యత్‌లో సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయొచ్చు. మార్కెట్లకు స్వల్పకాలిక స్థిరత్వం లభించినా.. మొత్తం మీద ఆర్థిక మందగమనం, అంతర్జాతీయ పరిణామాలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్లు ఉండొచ్చు. విధానపరమైన నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, వైరస్ వ్యాప్తి, స్వల్ప..మధ్యకాలికంగా కంపెనీల పనితీరు వంటి అంశాలు సమీప భవిష్యత్‌లో మార్కెట్లకు దిశా నిర్దేశం చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్ స్వల్పకాలికంగా 7,500 స్థాయి దగ్గర బాటమ్ అవుట్ అయినట్లుగా అనిపిస్తోంది. మార్చిలో పదకొండేళ్ల గరిష్ట స్థాయి 87కి ఎగిసిన వొలటాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 40 స్థాయికి దిగి రావడం దీనికి నిదర్శనం. భయాందోళనలు తగ్గుముఖం పడుతున్నాయనడానికి నిదర్శనంగా మార్కెట్లు 50 శాతం పైగా కరెక్టయ్యాయి. అయితే, స్వల్పకాలిక పెరుగుదలను బుల్ ర్యాలీ ప్రారంభానికి సంకేతంగా భావించడానికి లేదు. అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఇంకా అనిశ్చితి, బలహీనతే కనిపిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లోనూ తీవ్ర ఆటుపోట్లు తప్పకపోవచ్చు. క్యూ4లో కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు? ప్రస్తుతం నెలకొన్న పరిíస్థితుల్లో ఆర్థిక ఫలితాల అంచనాలను పలు మార్లు సవరించాల్సి రావొచ్చు. చమురు ధరల తగ్గుదల, వ్యయ నియంత్రణ చర్యలు.. కంపెనీల ఆదాయాలకు కాస్త తోడ్పాటుగా ఉండొచ్చు. మొత్తం మీద నాలుగో త్రైమాసికంలో హెల్త్‌కేర్, కన్జూమర్ స్టేపుల్స్ వంటి రంగాల సంస్థలు, ఐసీఐఐసీ బ్యాంక్, ఎస్బీఐ వంటి కొన్ని దిగ్గజ బ్యాంకులు తక్కువ బేస్ కారణంగా మెరుగైన ఫలితాలు ప్రకటించవచ్చని భావిస్తున్నాం. ఆటో, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలు వెనుకబడవచ్చు. లాక్డౌన్ సంబంధ పరిణామాల వల్ల.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయాల రికవరీ గొప్పగా ఉండకపోవచ్చు. ఏయే స్టాక్స్ పరిశీలించవచ్చు? ప్రస్తుత పరిస్థితుల్లో కన్జూమర్, ఐటీ, ఫార్మా, ఎంపిక చేసిన కొన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకుల స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియోను కాస్త రక్షణాత్మక ధోరణిలో రూపొందించుకోవడం శ్రేయస్కరం. అంతర్జాతీయ, దేశీయ ఎకానమీ మెరుగుపడేదాకా ఇన్ఫ్రా, కమోడిటీ రంగాలు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆ రంగ సంస్థలు మెరుగ్గా ఉండొచ్చు. హెచ్‌యూఎల్, నెస్లే, డాబర్, టాటా, కన్జూమర్ తదితర సంస్థలను పరిగణించవచ్చు. అలాగే హెల్త్‌కేర్ గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనైనప్పటికీ.. కరోనా వైరస్ కారణంగా ఈ రంగానికి కొత్త అవకాశాలు వచ్చాయి. డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, ఇప్కా ల్యాబ్స్, అల్కెమ్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటివి పరిశీలించవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ లాంటి పరిణామాల వల్ల టెలికం సేవలకు డిమాండ్ పెరిగింది. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ (జియో కారణంగా) ఎంచుకోవచ్చు. ఇక క్రూడ్ రేట్లు దశాబ్దాల కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో ముడివస్తువుల రేట్లు తగ్గి ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ వంటి క్రూడ్ డెరివేటివ్ వినియోగ సంస్థలకు ప్రయోజనాలు లభిస్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులను.. ఎన్బీఎఫ్సీల్లో హెచ్డీఎఫ్సీ వంటివి ఎంచుకోవచ్చు. టెక్నాలజీ రంగానికి సంబంధించి వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. ఎకానమీ మెరుగుపడే కొద్దీ ఐటీపై వ్యయాలూ మళ్లీ పెరగవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటివి పరిశీలించవచ్చు. సాధారణ పరిస్థితులు తిరిగొచ్చే దాకా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి. సమీప భవిష్యత్‌లో మార్కెట్లు తగ్గొచ్చు. అయితే, ఎంతదాకా పడతాయన్నది చెప్పడం కష్టం. ఇలాంటప్పుడు చిన్న ఇన్వెస్టర్లు.. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న నాణ్యమైన షేర్లను కొద్ది కొద్దిగా జోడించుకుంటూ వెళ్లొచ్చు. ఇటీవలి క్రూడాయిల్ రేట్ల భారీ పతన ప్రభావాలను మీ సంస్థ ఎలా ఎదుర్కొంది? క్రూడాయిల్లో ట్రేడింగ్ చేసే క్లయింట్లు మాకు చాలా మందే ఉన్నారు. ధర సున్నా స్థాయికి పడిపోయే దాకా కూడా లావాదేవీల నిర్వహణకు మాకు పూర్తి కవరేజీ ఉంది. ఇంట్రాడే రిస్కులను భరించగలిగేలా మా రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అయితే, ముగింపు ధర, సెటిల్మెంట్ ధరకు మధ్య ఏకంగా 400% వ్యత్యాసం ఏర్పడటం ఎవరూ ఊహిం^è లేనిది. రాత్రికి రాత్రి ఎక్సే్చంజీలు మాపైనా, క్లయింట్లపైనా ఈ భారం మోపాయి. ఇంత భారీ రిస్కులు ఎదుర్కొనేందుకు ఏ బ్రోకరేజీ సంస్థకు కవరేజీ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అనవసరంగా రిస్కుల్లో పడకుండా చూసేందుకు ఈ నెల క్రూడాయిల్ కాంట్రాక్టులు నిలిపివేశాం. లాక్డౌన్ వేళ క్లయింట్లకు సర్వీసులు ఎలా అందిస్తున్నారు? మా అడ్వైజర్లు, రిలేషన్షిప్ మేనేజర్లంతా డిజిటల్ మాధ్యమం ద్వారా సదా అందుబాటులో ఉంటున్నారు. సర్వీసుల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా మా సిబ్బంది అంతా పూర్తిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లలోని 24 కార్యాలయాలను తిరిగి ప్రారంభించాం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
అరుదైన ఆఫర్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉద్యోగులతో పాటు ఆఫీస్ బోయ్‌లకు కూడా బంపర్ఆఫర్ ప్రకటించింది. ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ పథకాన్ని (ఈఎస్ఓపి) ఆఫీస్ బోయ్‌లకు కూడా వర్తింపచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో ఇది చాలా అరుదైన చర్యగా నిలిచింది. సాధారణంగా తక్కువ మంది ఉద్యోగులతో స్టార్ట్ ఆప్ కంపెనీలే ఇలాంటి ఆఫర్లు అందిస్తాయి. కానీ మోతీలాల్ లాంటి అతిపెద్ద ఫైనాన్షియల్ సేవల సంస్థ ఇలా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. స్టాక్ కేటాయింపు ఆప్షన్ సంస్థలోని ఉద్యోగి పదవీకాలం, డిజిగ్నేషన్ ఆధారంగా నిర్ణయిస్తామని మోతీలాల్ హెచ్ ఆర్ డైరెక్టర్ సుధీర్ ధార్ వెల్లడించారు. సంస్థలోని దాదాపు 85 శాతం మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. మోతీలాల్ ఓస్వాల్ అద్భుతమైన విజయంలో భాగంగా ఉన్నందుకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ ఆఫీస్ బోయ్ నుంచి డైరెక్టర్ స్థాయి ఉద్యోగి వరకు ఈ అదనపు ప్రయోజనాన్ని అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా ఇది విభిన్న వ్యాపారాల అంతటా ఉన్న ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్? మూలధన మార్కెట్ వ్యాపారాలు (రిటైల్ బ్రోకింగ్, సంస్థాగత బ్రోకింగ్ మరియు పెట్టుబడి బ్యాంకింగ్), ఆస్తి మరియు సంపద నిర్వహణ (ఆస్తి నిర్వహణ, ప్రైవేట్ ఈక్విటీ మరియు సంపద నిర్వహణ), హౌసింగ్ ఫైనాన్స్ మరియు ఈక్విటీ ఆధారిత ట్రెజరీ పెట్టుబడులు ఉన్నాయి. 2017 సంస్థ భారీ వృద్ధిని నమోదుచేసింది. 66శాతం జంప్ చేసి రూ. 1,818 కోట్ల ఆదాయిన్ని సాధించింది. లాభం రూ. 360 కోట్లుగా నమోదు చేసింది. ఈ లాభాల్లో సగానికి పైగా హౌసింగ్ ఫైనాన్స్, అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ద్వారా సాధించినట్టు కంపెనీ పేర్కొంది. సంస్థ మార్చి 2017 నాటికి హౌసింగ్ ఫైనాన్స్ లోన్‌బుక్ రూ.4,100కోట్లుగాఉంది.