న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూల హవా నెలకొంది. అయితే ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ రోజునే అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఏప్రిల్–జులై మధ్య కాలంలో 52 శాతం మంది ఇన్వెస్టర్లు తొలి రోజునే అలాట్ అయిన షేర్లను విక్రయించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ పేర్కొంది. మరో 20 శాతం మంది లిస్టయిన వారం రోజుల్లోపే షేర్లను వొదిలించుకున్నట్లు తెలియజేసింది. మోతీలాల్‌కు చెందిన బ్రోకింగ్, పంపిణీ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ఐపీవో క్లయింట్లలో 64 శాతం మంది సగటున కనీసం రెండు ఇష్యూలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 5.7 లక్షల మంది ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల బాట పట్టగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో 5.1 లక్షల మంది మాత్రమే వీటికి సబ్‌స్క్రయిబ్ చేశారు.
రాష్ట్రాల వారీగా
మొత్తం ఐపీవో క్లయింట్లలో దాదాపు 70 శాతం మంది గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంపెనీలు సైతం క్యూ కట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్–జులైలో 36 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 17 ఇష్యూలు మాత్రమే నమోదయ్యాయి. 61 శాతం మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్సెస్‌కు అత్యధికంగా 68 శాతం మంది క్లయింట్లు అప్లై చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించడం ద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఏడాది చివరికల్లా 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేసింది.
లిస్టింగ్ రోజే అమ్మకాలు
Published Tue, Aug 24 2021 5:42 AM | Last Updated on Tue, Aug 24 2021 5:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment