న్యూఢిల్లీ: పెన్సిళ్ల తయారీ దిగ్గజం డోమ్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి తొలి రోజే(బుధవారం) ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కంపెనీ 88 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 5 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 5.7 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్ లభించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఈ బాటలో సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 8 రెట్లు బిడ్ చేయగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి కేవలం 6% మాత్రమే స్పందన నమోదైంది.
ఇష్యూ లో భాగంగా కంపెనీ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 850 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకి రూ. 750–790 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించిన కంపెనీ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 538 కోట్లు సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment