ముంబై: ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన లిక్విడిటీ, ఇటీవల కొద్ది రోజులుగా వేగమందుకున్న ఆర్థిక రికవరీ వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. ప్రస్తుతం 18 పీఈలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలిక సగటుకు చేరువలో నిఫ్టీ కదులుతున్నదని, ఈ స్థాయిలో మార్కెట్లు మరీ ఖరీదైనవిగా పోల్చకూడదని అభిప్రాయపడింది. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక పురోగతి, ప్రపంచ మార్కెట్ల లిక్విడిటీ తదితరాలతో కంపెనీలు మెరుగైన పనితీరు ప్రదర్శించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఇవన్నీ మార్కెట్లకు అనుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 రెండో దశ.. రిస్కులు పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో మార్కెట్ కరెక్షన్లకూ అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. ప్రధానంగా జీడీపీ రికవరీ ప్రభావం చూసే అంశమని తెలియజేసింది. ఈ పరిస్థతుల నేపథ్యంలో రానున్న 12 నెలల కాలానికి ఐటీ, హెల్త్ కేర్, గ్రామీణం- వ్యవసాయం, టెలికం, కన్జూమర్, ఫైనాన్షియల్ రంగాలపట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి సంవత్ 2077కు ఐదు లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు అనువైనవిగా భావిస్తున్నట్లు పేర్కొంది. బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు చూద్దాం..
భారతీ ఎయిర్టెల్
గత కొద్ది త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ భారీగా మెరుగుపడింది. గత రెండు క్వార్టర్లలో మొబైల్ బిజినెస్ ఇబిటా 16 శాతం పురోగమించడం ద్వారా ఈ అంశం వెల్లడవుతోంది. ఈ కాలంలో 10 మిలియన్ కొత్త వినియోగదారులను జత చేసుకుంది. ఫలితంగా మొత్తం ఏఆర్ పీయూ 5 శాతం బలపడింది.
ప్రస్తుత ధర: రూ. 450- టార్గెట్: రూ. 650
స్టేట్ బ్యాంక్
లాభార్జన సాధారణ స్థాయికి చేరుకునే పరిస్థితులు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఉత్తమ సంస్థకాగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, 71 శాతం పీసీఆర్, పటిష్ట నెట్వర్క్, పెట్టుబడుల సామర్థ్యం సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. నిర్వహణ లాభాలు మెరుగుపడుతున్నాయి.
ప్రస్తుత ధర: రూ. 218- టార్గెట్: రూ. 300
హీరో మోటోకార్ప్
ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ద్విచక్ర వాహన విభాగంలో కనిపిస్తున్న వేగవంత రికవరీని హీరో మోటోకార్ప్ అందిపుచ్చుకునే వీలుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎంట్రీలెవల్, ఎగ్జిక్యూటివ్ విభాగాలలో పట్టు కంపెనీకి సానుకూల అంశాలు. బీఎస్-6 ప్రమాణాల తదుపరి పోటీలో ముందుంటోంది.
ప్రస్తుత ధర: రూ. 2,943- టార్గెట్: రూ. 3,700
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్
వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ పుంజుకోనున్న ఐటీ వ్యయాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు అవకాశాలను పెంచే వీలుంది. భవిష్యత్లో సాఫ్ట్ వేర్ సర్వీసుల రంగానికి డిమాండ్ కొనసాగనుంది. తద్వారా కంపెనీ లబ్ది పొందనుంది. ప్రాధాన్యతగల డీల్స్ కుదుర్చుకోవడం, మార్జిన్లను మెరుగుపరచుకోవడం వంటి సానుకూలతలకు చాన్స్ ఉంది. ప్రస్తుత ధర: రూ. 1,119- టార్గెట్: రూ. 1,355
అల్ట్రాటెక్ సిమెంట్
దేశవ్యాప్తంగా పంపిణీ విభాగంలో పటిష్ట నెట్వర్క్ కలిగి ఉంది. మౌలిక సదుపాయాల కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యమున్న సరఫరా సంస్థగా నిలుస్తోంది. దీంతో అటు సంస్థాగత, ఇటు రిటైల్ విభాగంలో సిమెంటుకు ఏర్పడే డిమాండ్ ను అందుకునే అవకాశముంది.
ప్రస్తుత ధర: రూ. 4,565- టార్గెట్: రూ. 5,600
(గమనిక: ఇవి బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేముందు మార్కెట్ నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి. )
Comments
Please login to add a commentAdd a comment