Blue chips stocks
-
రానున్న రెండు మూడేళ్లలో మార్కెట్ జోరు, లార్జ్ క్యాప్ కంపెనీలపై ఫోకస్
గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లు కనిపించాయి. కరోనా రాకతో కుదేలైన స్టాక్ మార్కెట్ ఆ తర్వాత ఊహించని రీతిలో కోలుకుని భారీ ర్యాలీతో జీవిత కాల గరిష్టాలకు చేరుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని.. దీంతో వచ్చే రెండు మూడేళ్ల కాలంలోనూ ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. దీంతో లార్జ్ క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ పథకం నమ్మకమైన పనితీరును దీర్ఘకాలంగా నమోదు చేస్తూ వస్తోంది. లార్జ్‌క్యాప్ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్ ఉన్నా ఫర్వాలేదు.. దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఈ పథకాన్ని తమ పోర్ట్‌ఫోలియోలోకి పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి. రాబడులు దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 19.38 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్ బ్లూచిప్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. వార్షికంగా 18 శాతం రాబడులను అందించింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 16.64 శాతం చొప్పున ఈ పథకం పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తీసుకొచ్చి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ.లక్షను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ.1.70 లక్షలు అయి ఉండేది. నిర్వహణ విధానం ఈ పథకం నిర్వహణలో రూ.32,213 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో ప్రస్తుతానికి 96.3% ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. డెట్ సాధనాల్లో 2.6%, నగదు నిల్వలను 1.1% చొప్పున కలిగి ఉంది. మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడుల వ్యూహాలతో రాబడులను కాపాడే విధానాలను ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థా యిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ నగదు నిల్వలను పెంచుకోవడం, దిద్దుబాటుల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవడం వంటివి ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 34 స్టాక్స్ ఉన్నాయి. 99% పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడాన్ని చూస్తే.. గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద సమీప కాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్ బలం గాను, స్థిరంగాను ఉంటాయని ఫండ్ బందం అంచనా వేస్తోందని అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కేవలం ఒక్క శాతమే కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్‌కే ఈ పథ కం ప్రాధాన్యం ఇచ్చింది. 38% పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. టెక్నాలజీ రంగ స్టాక్స్‌కు 19%, సేవల రంగ కంపెనీలకు 7.77% చొప్పున కేటాయింపులు చేసింది. -
సంవత్ 2077కు 5 బ్లూచిప్ స్టాక్స్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన లిక్విడిటీ, ఇటీవల కొద్ది రోజులుగా వేగమందుకున్న ఆర్థిక రికవరీ వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. ప్రస్తుతం 18 పీఈలో ట్రేడవుతున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలిక సగటుకు చేరువలో నిఫ్టీ కదులుతున్నదని, ఈ స్థాయిలో మార్కెట్లు మరీ ఖరీదైనవిగా పోల్చకూడదని అభిప్రాయపడింది. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక పురోగతి, ప్రపంచ మార్కెట్ల లిక్విడిటీ తదితరాలతో కంపెనీలు మెరుగైన పనితీరు ప్రదర్శించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఇవన్నీ మార్కెట్లకు అనుకూలంగా కనిపిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 రెండో దశ.. రిస్కులు పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో మార్కెట్ కరెక్షన్లకూ అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. ప్రధానంగా జీడీపీ రికవరీ ప్రభావం చూసే అంశమని తెలియజేసింది. ఈ పరిస్థతుల నేపథ్యంలో రానున్న 12 నెలల కాలానికి ఐటీ, హెల్త్ కేర్, గ్రామీణం- వ్యవసాయం, టెలికం, కన్జూమర్, ఫైనాన్షియల్ రంగాలపట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలియజేసింది. వెరసి సంవత్ 2077కు ఐదు లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు అనువైనవిగా భావిస్తున్నట్లు పేర్కొంది. బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు చూద్దాం.. భారతీ ఎయిర్టెల్ గత కొద్ది త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ భారీగా మెరుగుపడింది. గత రెండు క్వార్టర్లలో మొబైల్ బిజినెస్ ఇబిటా 16 శాతం పురోగమించడం ద్వారా ఈ అంశం వెల్లడవుతోంది. ఈ కాలంలో 10 మిలియన్ కొత్త వినియోగదారులను జత చేసుకుంది. ఫలితంగా మొత్తం ఏఆర్ పీయూ 5 శాతం బలపడింది. ప్రస్తుత ధర: రూ. 450- టార్గెట్: రూ. 650 స్టేట్ బ్యాంక్ లాభార్జన సాధారణ స్థాయికి చేరుకునే పరిస్థితులు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఉత్తమ సంస్థకాగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, 71 శాతం పీసీఆర్, పటిష్ట నెట్వర్క్, పెట్టుబడుల సామర్థ్యం సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. నిర్వహణ లాభాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుత ధర: రూ. 218- టార్గెట్: రూ. 300 హీరో మోటోకార్ప్ ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ద్విచక్ర వాహన విభాగంలో కనిపిస్తున్న వేగవంత రికవరీని హీరో మోటోకార్ప్ అందిపుచ్చుకునే వీలుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎంట్రీలెవల్, ఎగ్జిక్యూటివ్ విభాగాలలో పట్టు కంపెనీకి సానుకూల అంశాలు. బీఎస్-6 ప్రమాణాల తదుపరి పోటీలో ముందుంటోంది. ప్రస్తుత ధర: రూ. 2,943- టార్గెట్: రూ. 3,700 ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ పుంజుకోనున్న ఐటీ వ్యయాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు అవకాశాలను పెంచే వీలుంది. భవిష్యత్‌లో సాఫ్ట్ వేర్ సర్వీసుల రంగానికి డిమాండ్ కొనసాగనుంది. తద్వారా కంపెనీ లబ్ది పొందనుంది. ప్రాధాన్యతగల డీల్స్ కుదుర్చుకోవడం, మార్జిన్లను మెరుగుపరచుకోవడం వంటి సానుకూలతలకు చాన్స్ ఉంది. ప్రస్తుత ధర: రూ. 1,119- టార్గెట్: రూ. 1,355 అల్ట్రాటెక్ సిమెంట్ దేశవ్యాప్తంగా పంపిణీ విభాగంలో పటిష్ట నెట్వర్క్ కలిగి ఉంది. మౌలిక సదుపాయాల కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యమున్న సరఫరా సంస్థగా నిలుస్తోంది. దీంతో అటు సంస్థాగత, ఇటు రిటైల్ విభాగంలో సిమెంటుకు ఏర్పడే డిమాండ్ ను అందుకునే అవకాశముంది. ప్రస్తుత ధర: రూ. 4,565- టార్గెట్: రూ. 5,600 (గమనిక: ఇవి బ్రోకింగ్ సంస్థ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేముందు మార్కెట్ నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి. ) -
బ్లూచిప్స్ హవా.. లాభాల్లో మార్కెట్
ముంబై: బ్లూచిప్స్ స్టాక్స్‌లో ఆఖర్లో కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం సెన్సెక్స్ 53 పాయింట్లు పెరిగి 28,439 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 8,494 వద్ద ముగిశాయి. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజు ట్రేడింగ్ ఆసాంతం అటూ, ఇటూగా సాగింది. శుక్రవారం జీడీపీ గణాంకాల విడుదల, తర్వాతి వారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మొదలైన పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్ఈఎల్, డాక్టర్ రెడ్డీస్ మొదలైన స్టాక్స్ ఊతంతో సెన్సెక్స్ లాభపడింది. అటు యూరప్‌లో సానుకూల సంకేతాల నడుమ విదేశీ నిధులు నిలకడగా వస్తుండటం సైతం మార్కెట్లకు తోడ్పడిందని ట్రేడర్లు వివరించారు. మరోవైపు ఆసియా సూచీలు మిశ్రమంగా ముగియగా...యూరోప్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. థాంక్స్‌గివింగ్ డే సందర్భంగా గురువారం అమెరికా మార్కెట్లకు సెలవు. స్టాక్ బ్రోకర్లకూ రేటింగ్ న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లను మరింత సమర్ధవంతంగా నిర్వహించే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్యవేక్షణ నిబంధనల్లో మార్పులు చేసింది. స్టాక్‌బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, కస్టోడియన్స్, మర్చంట్ బ్యాంకర్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్, రిజిస్ట్రార్స్, ట్రాన్స్ఫర్ ఏజంట్స్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వంటి వివిధ మార్కెట్ ఇంటర్మీడియరీలకు రిస్కు స్థాయిని బట్టి రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్లే వాటిపై నిఘా, పర్యవేక్షణ ఉండనుంది. రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం ఇంటర్మీడియరీలను అత్యంత తక్కువ రిస్కు, తక్కువ రిస్కు, మధ్యస్థ రిస్కు, అధిక రిస్కు పేరిట నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఈ రిస్కును మదింపు చేయడంలో కూడా రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. సదరు సంస్థ వ్యాపార కార్యకలాపాలపరమైన రిస్కు ఒకటి కాగా, దివాలా వంటి పరిణామాలు తలెత్తితే ప్రభావాలపరమైన రిస్కు రెండోది.