బ్లూచిప్స్ హవా.. లాభాల్లో మార్కెట్
ముంబై: బ్లూచిప్స్ స్టాక్స్‌లో ఆఖర్లో కొనుగోళ్లతో స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం సెన్సెక్స్ 53 పాయింట్లు పెరిగి 28,439 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 8,494 వద్ద ముగిశాయి. నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజు ట్రేడింగ్ ఆసాంతం అటూ, ఇటూగా సాగింది. శుక్రవారం జీడీపీ గణాంకాల విడుదల, తర్వాతి వారంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష మొదలైన పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషించాయి.
ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, డాక్టర్ రెడ్డీస్ మొదలైన స్టాక్స్ ఊతంతో సెన్సెక్స్ లాభపడింది. అటు యూరప్‌లో సానుకూల సంకేతాల నడుమ విదేశీ నిధులు నిలకడగా వస్తుండటం సైతం మార్కెట్లకు తోడ్పడిందని ట్రేడర్లు వివరించారు. మరోవైపు ఆసియా సూచీలు మిశ్రమంగా ముగియగా...యూరోప్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. థాంక్స్‌గివింగ్ డే సందర్భంగా గురువారం అమెరికా మార్కెట్లకు సెలవు.
స్టాక్ బ్రోకర్లకూ రేటింగ్
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లను మరింత సమర్ధవంతంగా నిర్వహించే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్యవేక్షణ నిబంధనల్లో మార్పులు చేసింది. స్టాక్‌బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, కస్టోడియన్స్, మర్చంట్ బ్యాంకర్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్, రిజిస్ట్రార్స్, ట్రాన్స్‌ఫర్ ఏజంట్స్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు వంటి వివిధ మార్కెట్ ఇంటర్మీడియరీలకు రిస్కు స్థాయిని బట్టి రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్లే వాటిపై నిఘా, పర్యవేక్షణ ఉండనుంది.
రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని ప్రకారం ఇంటర్మీడియరీలను అత్యంత తక్కువ రిస్కు, తక్కువ రిస్కు, మధ్యస్థ రిస్కు, అధిక రిస్కు పేరిట నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఈ రిస్కును మదింపు చేయడంలో కూడా రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. సదరు సంస్థ వ్యాపార కార్యకలాపాలపరమైన రిస్కు ఒకటి కాగా, దివాలా వంటి పరిణామాలు తలెత్తితే ప్రభావాలపరమైన రిస్కు రెండోది.