బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో హైదరాబాద్
మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీ
రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ముంబై, కోల్‌కతా, చెన్నై
వాయు నాణ్యత సూచీలో అథమస్థాయికి మహానగరాలు
నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రామ్‌లో దిగజారుతున్న ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సర్వేలో తేలింది.
మొదటి స్థానం ఢిల్లీదే
దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్ కాకర్స్ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.
దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ ‘లైవ్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీస్ ఆన్ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది.
ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం
» పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు.
» మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి.
» పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది.
» పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది.
» కోల్‌కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది.
» హైదరాబాద్‌లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది.
» ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్‌కతాలో 94, అహ్మదాబాద్‌లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్‌లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment