న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు.
రూ.4,000 కోట్ల వరకూ సమీకణ..
ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది.
మరిన్ని విశేషాలు ఇవీ..
► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది.
► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది.
► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్.
భారీ స్పందన..
భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది
– తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి
లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక
ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది.
– రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
Published Fri, Dec 2 2022 6:08 AM | Last Updated on Fri, Dec 2 2022 6:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment