fourth
-
నాలుగో రోజూ గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
ఇజ్రాయెల్ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోగల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ దాడులలో 27 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.నాలుగు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్‌కు సమీపంలోని అబాసన్‌లోని అల్-అవ్దా పాఠశాల గేట్ వద్ద ఈ దాడి జరిగింది. గతంలో జరిగిన మూడు దాడులకు తామే బాధ్యులమంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మూడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు ఇతర పౌర సౌకర్యాలను ఉపయోగిస్తున్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. -
కొడంగల్‌లో ‘బంటు’ సిద్దిపేటలో శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు పూర్తి చేసిన తర్వాత 12 మంది అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన జారీ చేశారు. బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వి.సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి స్థానాన్ని, చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు, తుల ఉమకు వేములవాడ, బొమ్మ శ్రీరామ్చక్రవర్తికి హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించింది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
జార్ఖండ్‌లోని రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! -
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
నాలుగో భార్యకూ మర్డోక్ విడాకులు
లండన్: మీడియా దిగ్గజం, బిలియనీర్ రూపర్ట్ మర్డోక్(91) నాలుగో భార్య జెర్రీ హాల్(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్ లండన్‌లో 2016లో వివాహమాడారు. మర్డోక్ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్ ఆస్తులు ఫోర్బ్స్ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్ నిర్వహిస్తున్నారు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్‌ల్లో మర్డోక్‌కు వాటా 40% వాటా ఉంది. మర్డోక్ తన మొదటి భార్య, ఫ్లైట్ అటెండెంట్ అయిన పాట్రిసియా 1966లో విడిపోయారు. రెండో భార్య అన్నా నుంచి 1999లో, మూడో భార్య వెండీ డెంగ్‌తో 2014లో విడిపోయారు. -
‘నాలుగో వేవ్ చాన్స్ తక్కువే’
‘‘రాష్ట్రంలో 92.9% మందిలో యాంటీబాడీలు ఇప్పటికే వృద్ధిచెంది ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. నాలుగో వేవ్ ఉండే అవకాశాలు లేవనేది నా విశ్లేషణ. అయితే ఇది నిర్ధారణ అవడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఒకవేళ 6– 8 వారాల్లో కేసులు పెరిగినా.. అవి అతి స్వల్పంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది..’’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం తక్కువేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్‌లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలింది. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కులు, వ్యాక్సిన్ తప్పనిసరి కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఆంక్షలు అవసరం లేదని.. యధావిధిగా శుభకార్యాలు, ఇతర వేడుకలు జరుపుకోవచ్చని, కానీ గుంపుగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు. మే నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూరప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. -
‘ఎన్ని కోవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదు.. అయితే, అవి మాత్రం మరవొద్దు’
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్‌లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్‌లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్‌ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది. -
Coronavirus: జూన్‌లో నాలుగో వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్‌ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులు 8,013 దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది. -
Covid Fourth Wave: ఫ్రాన్స్‌లో కఠిన ఆంక్షలు..
పారిస్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ సెకండ్‌వేవ్, థర్డ్వేవ్ల బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. వైరస్ ఉధృతిమాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా, ఫ్రాన్స్‌లో వైరస్ నాలుగవ దశ ప్రారంభమైందని ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించాలనుకునే వారు తప్పకుండా కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అదే విధంగా, కరోనా నెగెటివ్ రిపోర్టు కూడా నివేదించాలని అట్టల్ పేర్కొన్నారు. టీకాలను ప్రజలందరు వేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆగస్టు ఆరంభం నుంచి, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించడానికి, రైళ్లలో ప్రయాణించడానికి హెల్త్‌పాస్ ను తప్పినిసరిచేస్తున్నట్లు తెలిపారు. టీకా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే హెల్త్‌పాస్‌ను జారీచేస్తారని ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు. ఈ సందర్భంగా, టీకావేగాన్ని పెంచాలని.. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నామని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా, హెల్త్‌పాస్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానతోపాటు జైలు శిక్షను కూడా విధిస్తామని జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మంగళవారానికి గాను 18,000 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
100 బిలియన్ డాలర్ల క్లబ్లో రిలయన్స్ రీటైల్
సాక్షి, ముంబై: అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కు చెందిన రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన 4వ భారతీయ కంపెనీగా అవతరించింది. కిరాణా నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ దేశవ్యాప్తంగా రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న కంపెనీ ఈ సరికొత్త మార్కును అందుకుంది. అయితే రిలయన్స్ రిటైల్ లిస్టెడ్ కాకపోయినా కూడా షేర్లు ఒక్కొక్కటి రూ .1,500, రూ .1,550 పరిధిలో ఉన్నాయి. ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. డిసెంబర్ 2019 లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ.900 వద్ద ఉన్నాయి. దీనికితోడు రిలయన్స్ రిటైల్ వాటాదారులకు రిలయన్స్ రిటైల్ నాలుగు షేర్లకు బదులుగా ఆర్ఐఎల్లో ఒక వాటాను ఇచ్చేలా స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆఫ్షనల్ గా చేసింది. అప్పటి నుండి మంచి పనితీరును కనబరిచిన రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 88.1 శాతం వృద్ధితో నమోదు చేసింది తద్వారా 1,830 కోట్ల రూపాయలను ఆర్జించింది. మరోవైపు త్వరలోనే ఐపిఓతో రానుందని భావిస్తున్న రిలయన్స్ రిటైల్ కొత్తగా 6500-7000 అవుట్లెట్లను తెరవాలని యోచిస్తోందట. -
మలాన్ మెరుపులు
నేపియర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు రికార్డుల మోత మోగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టి20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యధిక స్కోరు. డేవిడ్ మలాన్ (51 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (41 బంతుల్లో 91; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 74 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ (15 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మాట్ పార్కిన్సన్కు 4 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. చివరి టి20 ఆదివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
కాంగ్రెస్‌కు ఇదొక్కటే చాన్స్
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో ఇంకో అంకానికి రంగం సిద్ధమైంది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకుగాను తొలి మూడు దశల్లో 302 స్థానాల ఎన్నికలు పూర్తికాగా.. నాలుగోదశలో భాగంగా మరో 71 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటే.. రెండు, మూడోదశలు ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ పోలింగ్ జరగనున్న కేంద్రాలను విశ్లేషిస్తే.. రాజకీయంగా కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఉపయోగపడేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎక్కువ స్థానాలు సంపాదించుకునే ఈ దశను విశ్లేషిస్తే.... మహారాష్ట్ర.... రాజధాని ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలతోపాటు మొత్తం 17 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ– శివసేన ఈ పదిహేడు స్థానాల్లో 14 గెలుచుకుంది. కాంగ్రెస్–ఎన్సీపీలకు ఒక్కటీ దక్కలేదు. గత ఐదేళ్లలో బీజేపీ – శివసేనల సంబంధాలు తరచూ మారిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన అసెంబ్లీలో ఒంటరిగా పోటీ చేసిన శివసేన ఆ తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వైదొలగింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా పోటీకి దిగారు. కాంగ్రెస్ –ఎన్సీపీలు కూడా సీట్ల సర్దుబాటులో విలువైన సమయాన్ని వృథా చేయడంతో ఎన్నికల సన్నాహాలకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు సమయం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరాను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం ఆ పార్టీలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, మిలింద్ కూటమికి పరీక్ష... మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమికి రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రూపంలో ఓ పరీక్ష ఎదురవుతోంది. శివసేన వ్యవస్థా పకుడైన బాలాసాహెబ్ ఠాక్రే తమ్ముడి కుమారుడైన రాజ్‌ఠాక్రే బీజేపీ – శివసేనలను బహిరంగంగానే విమర్శిస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఎంఎన్ఎస్ స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగని కాంగ్రెస్ – ఎన్సీపీలతో పొత్తు కూడా పెట్టుకోలేదు. కానీ.. పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాత్రం ప్రచార సభలు నిర్వహిస్తూ హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రసంగాలు గుప్పిస్తున్నారు. ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తూండటం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లోముంబై సౌత్ ఒకటని చెప్పుకోవాలి. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవరా పోటీ చేస్తున్నారిక్కడ. 2004, 2009లలో ఈ స్థానం నుంచే గెలుపొందిన మిలింద్ 2014 ఎన్నికల్లో మాత్రం అరవింద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరొందిన ముఖేష్ అంబానీ మద్దతుతో పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఎంత మేరకు విజయవంతమవుతారో వేచి చూడాల్సిందే. ఇక ముంబై నార్త్ నుంచి సినీనటి ఊర్మిళా మటోండ్కర్ బీజేపీ ఎంపీ గోపాల్ షెట్టిల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొని ఉంది. ముంబై నార్త్–వెస్ట్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్, శివసేన ఎంపీ గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, ముంబై నార్త్ –సెంట్రల్లో ప్రియాదత్ (కాంగ్రెస్), సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ (బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ స్థానం నుంచి ప్రియాదత్ 2009లో గెలుపొందగా.. పూనమ్ 2014లో గెలుపొందారు. రాజస్థాన్... ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2014 తరువాత అక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. బీజేపీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో వంద గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది.2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్ అంతమేరకు లాభపడింది. పద్మావత్ సినిమా వివాదం రాజ్çపుత్లలో బీజేపీపై వ్యతిరేకతకు కారణం కాగా.. జైపూర్‌లోని రాజ్ మహల్ ప్రధాన ద్వారాన్ని మూసివేయడం, భరత్పూర్ –ధోపూర్ ప్రాంతంలోని జాట్ సామాజిక వర్గం రిజర్వేషన్లు వంటి అంశాలన్నీ వసుంధర రాజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయని అంచనా. ఏప్రిల్ 29న పోలింగ్ జరుపుకునే స్థానాల్లో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని పాలి, జోధ్‌పూర్, బర్మార్, జాలోర్లతోపాటు దక్షిణ ప్రాంతంలోని ఉదయ్‌పూర్, బాన్స్వారా, చిత్తోర్ఘర్, రాజ్‌సమంద్, భిల్వారాలు, హరోతీ ప్రాంతంలోని కోట, జల్వార్ –బరోన్లు, మధ్య రాజస్థాన్‌లోని అజ్మీర్, మత్సయ్ ప్రాంతంలోని టోంక్–సవాయి మాధోపూర్లు ఉన్నాయి. నిరుద్యోగం.. వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు. బీజేపీ జాతీయ వాదం, భద్రత, బాలాకోట్ దాడులు వంటి అంశాలతో ప్రచారం నిర్వహిస్తోంది. అధికార కాంగ్రెస్ రైతులకు తాము అందించిన పాక్షిక రుణమాఫీ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను తమ విజయాలుగా ఓటర్లకు వివరిస్తోంది. న్యాయ్ పథకం ద్వారా కనీస ఆదాయ పథకం లబ్ధిని నేరుగా జన్‌ధన్ యోజన అకౌంట్లలోకి వేస్తామన్న రాహుల్ గాంధీ హామీ కూడా కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. వీటికి తోడు రాష్ట్రంలోని పన్నెండు మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే మద్దతివ్వడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉంది ఆ పార్టీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్‌కు, బీజేపీకి చెందిన జి.ఎస్.షెఖావత్ల మధ్య జోధ్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్శిçస్తుం డగా బర్మార్‌లో కాంగ్రెస్ టిక్కెట్‌పై బీజేపీ దిగ్గజ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. చిత్తోర్‌ఘర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సీపీ జోషీ కాంగ్రెస్‌కు చెందిన గోపాల్ సింగ్ ఐద్వాపై పోటీ చేస్తున్నారు. మొత్తమ్మీద రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వంటి అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మానవేంద్ర సింగ్, వైభవ్, సి.పి.జోషి మహాఘట్‌బంధన్‌తో బీజేపీకి నష్టం? మొత్తం పదమూడు స్థానాలకుగాను సోమవారం పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో కూడిన మహాఘట్బంధన్ కారణంగా బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే ఇందుకు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉంది. అవధ్ ప్రాంతంలోని ఖేరీ, హర్దోయి (ఎస్సీ), మిస్రిక్ (ఎస్సీ), దోయాబ్ ప్రాంతంలోని ఉన్నావ్, ఫరుక్కాబాద్, ఇటావా (ఎస్సీ), కనౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జలౌన్ (ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్, రుహేల్‌ఖండ్ ప్రాంతంలోని షాజహాన్‌పూర్‌లలో గత ఎన్నికలల్లో బీజేపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకోగా, అతిస్వల్ప మార్జిన్‌తో కనౌజ్ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగలిగింది. తాజా ఎన్నికల్లోనూ కనౌజ్లో ఆసక్తికరమైన పోటీ నెలకొని ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున డింపుల్‌యాదవ్ బరిలో ఉండగా బీజేపీ సుభ్రత్పాఠక్ను నిలబెట్టింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఇక కాన్పూర్ విషయానికొస్తే.. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ దిగ్గజ నేత మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి శ్రీ ప్రకాశ్ జైస్వాల్, శ్రీ రామ్‌కుమార్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పోటీ చేస్తున్న ఉన్నావ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అరుణ్ కుమార్ శుక్లా, కాంగ్రెస్ నుంచి అను టాండన్‌లు బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట ఇటావాలో బీజేపీ రమాశంకర్ కథారియాతో గెలుపుకోసం ప్రయత్నిస్తూండగా సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దొహారే పార్టీని వీడి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కమలేశ్ కథారియా బరిలో ఉన్నారు. ఝాన్సీలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో బీజేపీ అనురాగ్ శర్మను బరిలోకి దింపగా శివ శరణ్ కుష్వహా (కాంగ్రెస్), శ్యామ్ సుందర్ సింగ్ యాదవ్ (ఎస్పీ)ల రూపంలో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగనుంది. డింపుల్, సాక్షి మహరాజ్, సత్యదేవ్ బెంగాల్లో హోరాహోరీ... తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో కమల వికాసానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయా? అన్నది కౌంటింగ్ తరువాతే తెలుస్తుందిగానీ ఈ సారి పోరు మాత్రం హోరాహోరీగానే సాగుతోంది. గత ఎన్నికల్లో టీఎంసీ ఆరు స్థానాలు గెలుచుకున్న లోక్‌సభ స్థానాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానం గెలుచుకున్న వాటికి సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిల్లో బర్హమ్‌పూర్, కృష్ణనగర్, రానాఘాట్లతోపాటు బర్దమాన్ పుర్బా, దుర్గాపూర్, అసన్సోల్, బీర్బమ్, బర్దమాన్లు ఉన్నాయి. బహరంపూర్‌లో పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ (కాంగ్రెస్), అపూర్వా సర్కార్ (టీఎంసీ), కృష్ణ జౌర్దార్ ఆర్య (బీజేపీ)ల మధ్యనే ఉంది. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున ఈద్ మహమ్మద్ కూడా బరిలో ఉన్నారు. టీఎంసీ కృష్ణ నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ తపస్ పాల్ ను కాదని మహువా మొయిత్రాను బరిలోకి నిలపగా కల్యాణ్ చౌబే (బీజేపీ), శంతనూ ఝా (సీపీఎం)లు ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. అసన్సోల్ విషయానికొస్తే.. ఇక్కడ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో (బీజేపీ)కి పోటీగా సినీనటి మూన్‌మూన్ సేన్(టీఎంసీ), గౌరాంగ్ ఛటర్జీ (సీపీఎం)లు ఉన్నారు. బీర్బమ్లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల మధ్య బహుముఖ పోటీ ఉంది. అధిర్ రంజన్, మూన్‌మూన్ సేన్, బాబుల్ సుప్రియో మధ్యప్రదేశ్‌లో మళ్లీ మోదీ హవా వచ్చేనా? మోడీ హవా కారణంగా బీజేపీ బాగా లాభపడ్డ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒక్కటి. ఈ సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో మధ్యప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వింధ్యప్రదేశ్ ప్రాంతంలోని సిధి, షాదోల్లతోపాటు మహాకోశల్ ప్రాంతంలోని జబల్పూర్, మండ్ల, బాలాఘాట్, ఛింద్వారాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై, కాంగ్రెస్ అధికారం చేపట్టిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాండసోర్‌లో రైతులపై కాల్పులు, వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టడంలో విఫలమవడం వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారితే.. రుణమాఫీ, గో సంరక్షణకు సమగ్ర పథకం వంటి అంశాలు ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎస్పీ, బీఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్ తరఫున నకుల్ నాథ్ పోటీ చేస్తూండగా.. బీజేపీ నుంచి నాథన్ షా, జ్ఞానేశ్వర్ గజ్భియే (బీఎస్పీ)లు పోటీలో ఉన్నారు. నఖుల్ నాథ్, నాథన్ షా, జ్ఞానేశ్వర్ ఒడిశాలో పోలింగ్ పూర్తి.. ఏప్రిల్ 29 వతేదీతో ఒడిశాలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. మిగిలిన మయూర్భంజ్ (ఎస్టీ), బాలాసోర్ (ఎస్సీ), భద్రక్ (ఎస్సీ), జజ్పూర్ (ఎస్సీ), కేంద్రపారా, జగత్సింగ్పూర్ (ఎస్సీ) స్థానాలు గత ఎన్నికల్లో బీజేడీ గెలుచుకున్నవే. అయితే ఈ సారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 1998 నుంచి బీజేడీని గెలిపిస్తూ వచ్చిన కేంద్రపారాలో ఈసారి ఇటీవలే బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వైజయంత్ జై పాండా పోటీ చేస్తూండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేడీ తరఫున సినీనటుడు అనుభవ్ మహంతి ఉన్నారు. బీజేడీని గెలిపించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అనుభవ్, వైజయంత్ కన్హయ్య కుమార్‌కు కఠిన పరీక్ష... బిహార్‌లో నాలుగోదశలో భాగంగా ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బేగూసరాయితోపాటు దర్భంగ, ఉజిర్‌పూర్, సమస్ఠిపూర్, ముంగేర్‌లలో ఈ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో మూడింటిని బీజేపీ, రెండింటిని ఎల్జేఎన్ఎస్పీ గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం బేగూసరాయి అనడంలో సందేహం ఏమీ లేదు. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు మద్దతిచ్చిన బేగూసరాయిలో ఈ సారి సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఆర్జేడీకి చెందిన తన్వీర్ హసన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్‌కు వామపక్ష నేతలతోపాటు ప్రకాశ్‌రాజ్, షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్, స్వరా భాస్కర్ వంటి సినీ ప్రముఖుల మద్దతు లభిస్తుండగా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు బలమైన కేడర్ ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇవే కాకుండా జార్ఖండ్‌లో ఛత్రా, లోహార్డాగా (ఎస్టీ), పలమావు (ఎస్సీ) లోకసభ స్థానాల్లో రెండింటిని గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఈ సారి అక్కడ గట్టిపోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జేవీఎం(పీ), జేఎంఎం, ఆర్జేడీల కూటమి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఏతావాతా.. తొలి మూడు దశల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించుకునే అవకాశం లేకపోయిన కాంగ్రెస్ ఈ దశలో మాత్రం కొంచెం లాభపడనుందని చెప్పాలి. 2014లో ఈ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా.. ఈ సారి మాత్రం సీట్ల సంఖ్య రెండు అంకెల్లో ఉండవచ్చునని అంచనా. కన్హయ్య, గిరిరాజ్ సింగ్, తన్వీర్ హసన్ ప్రవీణ్ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ. ద్వైపాయన్ సన్యాల్, ఫ్రీలాన్స్ పొలిటికల్ ఎకనమిస్ట్, నోయిడా, ఉత్తర ప్రదేశ్. -
వ్యవసాయంలో కార్పొరేట్ పెట్టుబడులు పెరగాలి
సాక్షి, ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలి నాల్గవ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలలో పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని ఆదేశించారు. నీతిఆయోగ్ అభివృధ్ది చేయాల్సిన 115 జిల్లాలను గుర్తించినట్లు, రాష్ట్రాలు కూడా ఇరవై బ్లాకులను గుర్తించేందుకు ప్రమాణాలు నిర్ధేశించుకోవచ్చునని ప్రధాని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాల్లో వీధి దీపాలకు, ఎల్ఈడీ బల్బులను వినియోగించాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. నీటి పొదుపు, వ్యవసాయం, ఉపాధిహామీ పథకం అమలుపై సీఎంలు చేసిన ప్రతిపాదనలను మోదీ అభినందించారు. పంట విత్తడానికి ముందు కోత తరువాత వరకు వ్యవసాయ, ఉపాధి హామీ అనుసంధానంపై సమన్వయ విధానాన్ని అనుసరించేందుకు సిఫారస్సులు చేయాలని ఆంధ్రప్రదేశ్, బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్ సీఎంలను మోదీ కోరారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, సామాజిక న్యాయం అనేది అత్యంత ప్రధానమైన పరిపాలన లక్ష్యమని అన్నారు. పరస్పరం సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమన్నారు. 115 జిల్లాలలో 45వేల గ్రామాలకు ఏడు కీలక పథకాలను 2018 ఆగస్టు 15 నాటికి చేరేలా ప్రభుత్వం ప్రణాళిలు రూపొందించిందని మోదీ పునరుద్ఘాటించారు. ఎటువంటి వివక్ష లేకుండా సమతుల్యతతో ప్రభుత్వ పథకాలను అందించడమే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్, జన్‌ధన్ యోజన, ఉజ్వల యోజన, మిషన్ ఇంద్రధనుష్ వంటి పథకాల ద్వారా అందరికి మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పేదవారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు 100 శాతం అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రులను కోరారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 7.70 కోట్ల టాయిలెట్లు నిర్మాణం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతోందని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ 150 జయంతిలోపు పరిశుభ్రత సాధించాలని పిలుపునిచ్చారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరబోతోందని ప్రకటించారు. రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించుకోవడం సంతోకరమని, సులభతర వ్యాపారం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని కోరారు. వ్యవసాయరంగంలో కార్పొరేట్ల పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని, గోదాములు, రవాణా, పుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా రాష్ట్రాలు నూతన విధానం రూపొందించుకోవాలని సూచించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై చర్చ జరగాలని, తద్వారా ఆర్థిక వనరులు పొదుపు చేసుకుంటూ ఖర్చు తగ్గించుకుని వనరులను సమర్ధంగా వినియోగించుకోవాడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చి విలువైన సలహాలు, సూచనలు చేసిన ముఖ్యమంత్రులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
అరాచక కూటమిపై పోరు: జైట్లీ
న్యూఢిల్లీ: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధాని మోదీకి, ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న ‘అరాచక కూటమి’కి మధ్య ఉంటుందని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న జైట్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్డీయే సర్కారుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆసుపత్రి నుంచే ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీకి కాల్పనిక ప్రత్యామ్నాయమే తప్ప అసలైన ప్రత్యామ్నాయం కాబోదని జైట్లీ చెప్పారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, ఎన్నో తేడాలు ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైనా.. ఆ కూటమి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ‘టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ తదితర పార్టీలతో కలసి బీజేపీ గతంలో పనిచేసింది. వారు ఓ రోజు ఒక పార్టీకి మద్దతిస్తే మరుసటి రోజు మరో పార్టీకిస్తారు. 1996–98 మధ్య భారత్ ఫెడరల్ ఫ్రంట్లను చూసింది. అదొక విఫల విధానం’ అని జైట్లీ అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమనీ, మరికొన్నింటికి రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రాబల్యం ఉందన్నారు. కుంభకోణాల్లేని పాలనను అందించాం.. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను జైట్లీ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు లేని పాలనను అందించిందన్నారు. యూపీఏ కాలంలో ప్రపంచంలోనే అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ పరిస్థితి నేడు ఎంతో మెరుగుపడిందన్నారు. శాసన, వ్యవస్థాగత మార్పుల ద్వారా మోదీ పారదర్శక విధానాలను తీసుకొచ్చారనీ, యూపీఏ కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం పార్టీకి, దేశానికి ఒకరే నాయకుడు ఉన్నారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశం నిరాశ, నిస్పృహల నుంచి ఆశలు, ఆకాంక్షలవైపు వెళ్తోందన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ తదితర చర్యలతో అవినీతిని నిర్మూలించేందుకు, పన్నులు సక్రమంగా వసూలు చేసేందుకు తాము కృషి చేశామని జైట్లీ వివరించారు. -
మళ్లీ మాదే అధికారం
న్యూఢిల్లీ: వచ్చే 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోదీకి, మోదీని అధికారం నుంచి తొలగించాలనే బృందానికి మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందజేసిందని, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని ప్రశంసించారు. ప్రతిపక్షాలు మాత్రం మోదీ హఠావో అన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్నందుకు మోదీ ప్రభుత్వానికి షా అభినందనలు తెలిపారు. మోదీ కఠోరంగా శ్రమిస్తూ, గొప్ప ప్రజాదరణను పొందుతున్నార న్నారు. ‘అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని బీజేపీ దేశానికి ఇచ్చింది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. రోజుకు 15–18 గంటలు పనిచేస్తన్నారు. ఇటువంటి ప్రధాని బీజేపీకి చెందిన వ్యక్తి అయినందుకు ఎంతో గర్విస్తున్నాం’అని ఆయన అన్నారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి ఈ సందర్భంగా మోదీ తీసుకున్న పలు సంస్కరణల గురించి అమిత్ షా ప్రస్తావించారు. కుటుంబ, కుల రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికి.. అభివృద్ధి రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. అవినీతిని అడ్డుకునేందుకు ఆయన తీసుకున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. తద్వారా దేశ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. పేదలకు ఎల్పీజీ సిలిండర్లు, గృహాలు, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్లు అందజేసేందుకు ఎన్నో పథకాలు రూపొందించారని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు వాటిని గుర్తుంచుకుంటారని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తానే ప్రధానిని అవుతానని వ్యాఖ్యానించారని.. అయితే ఈ వ్యాఖ్యలకు సొంత పార్టీవారితో పాటు, శరద్ పవార్, మమతా బెనర్జీ, అఖిలేశ్ వంటి ప్రతిపక్ష నాయకులూ మద్దతివ్వలేదన్నారు. ఇంధన ధరల తగ్గింపుపై యోచన ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపైనా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగితేనే వాళ్లు విసిగిపోతున్నారా? ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది’అని షా వెల్లడించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ.. ‘యుద్ధాన్ని బీజేపీ చివరి అవకాశంగా భావిస్తుంది. ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత నాలుగేళ్లలో అత్యధిక శాతం ఉగ్రవాదులు హతమయ్యారు’అని పేర్కొన్నారు. మరోవైపు, కేంద్రంలో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న మోదీకి బిహార్ సీఎం నితీశ్ అభినందనలు తెలిపారు. బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఓ ట్వీట్ చేస్తూ నాలుగేళ్లలో మోదీ చేసిన అభివృద్ధి తక్కువ, ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో స్త్రీలు, దళితులపై దాడులు, నిరుద్యోగం, సామాజిక ఉద్రిక్తతలు పెరిగిపోయాయని ఎండగట్టారు. పాలనపై సర్వేలో పాల్గొనండి: మోదీ నాలుగేళ్లుగా తమ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో తెలియజేసేందుకు ఓ సర్వేలో పాల్గొనాలని మోదీ దేశ ప్రజలను కోరారు. ‘నమో’ యాప్‌లో సర్వేలో పాల్గొని ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలన్నారు. పరిశుభ్రత, పేదలకు అందుబాటు ధరల్లో వైద్యం, ఉద్యోగావకాశాలు, గ్రామాల విద్యుద్దీకరణ, రైతుల శ్రేయస్సు, అవినీతిపై పోరు, ధరల పెరుగుదల, చట్టాల అమలు, విద్య తదితర అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు నమో యాప్‌లో రేటింగ్ ఇవ్వొచ్చు. కేంద్ర ప్రభుత్వ పాలనతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకూ రేటింగ్ ఇవ్వాలన్నారు. -
మా పాలనకు ప్రజామోదం
కటక్, భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని, ప్రజలు తమకు ఆమోద ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడమే అందుకు నిదర్శమని ఆయన చెప్పారు. దేశం దుష్పరిపాలన నుంచి సుపరిపాలనకు, నల్లధనం నుంచి ప్రజాధనం వైపుగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలన అనంతరం.. దేశం మారగలదన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒడిశాలోని కటక్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటం అనేకమంది వెన్నులో వణుకు పుట్టించిందని, దాంతో విపక్షాలు ఒకే వేదికపైకి చేరాయని విమర్శించారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడాన్ని అందరూ గమనించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే ప్రభుత్వం మాది కాదు. సర్జికల్ దాడులు నిర్వహించగల సత్తా ఎన్డీఏ సర్కారుకు ఉంది అలాగే అక్రమ ఆదాయం, ఆస్తులపై వివిధ దర్యాప్తు సంస్థలు మూడు వేల దాడులు నిర్వహించాయి. రూ. 53 వేల కోట్ల అక్రమాదాయం బయటపడింది. బినామీ చట్టం కింద రూ. 3500 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం. అవినీతి కేసుల్లో నలుగురు మాజీ సీఎంలు జైళ్లలో ఉన్నారు. 2.26 లక్షల డొల్ల కంపెనీల్ని రద్దు చేశాం. నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వెన్నులో వణుకు పుట్టిన అనేకమంది.. ఒకే వేదికపైకి చేరారు’ అని ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా విపక్షాల ఐక్యతను పరోక్షంగా విమర్శించారు. ప్రజానుకూల పథకాలు చేపట్టాం.. కాలం చెల్లిన చట్టాల్ని పక్కనపెట్టామని, గత నాలుగేళ్లుగా ప్రపంచం ఒక కొత్త భారతదేశాన్ని చూస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే.. ఈ నాలుగేళ్ల కాలంలో 7.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాం. ఎన్డీఏ హయాంలో ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులు అందాయి. 25 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్ని ఇచ్చాం. 10 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు అందచేశాం. మా హయాంలో పారిశుద్ధ్య సౌకర్యాల్ని రెండింతలు మెరుగుపర్చాం. గత నాలుగేళ్లలో భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే మా విధానాలు కూడా ప్రజానుకూలంగా ఉన్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాల్ని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధికార యావ అని మోదీ విమర్శించారు. శనివారం కటక్‌లో జరిగిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ ప్రజా ఉద్యమంగా ఎన్డీఏ అభివృద్ధి పనులు గత నాలుగేళ్లలో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి ఉత్సాహపూరిత ప్రజా ఉద్యమంగా మారిందని ట్విట్టర్లో మోదీ పేర్కొన్నారు. ‘2014లో ఇదే రోజున దేశ పరివర్తన కోసం మన ప్రయాణాన్ని ప్రారంభించాము. దేశం వృద్ధి పథంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యాడు. 125 కోట్ల మంది భారతీయులు దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. ‘సాఫ్ నియత్, సహీ వికాస్’(మంచి ఉద్దేశం, సరైన అభివృద్ధి) హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రభుత్వ విజయాల్ని ప్రస్తావిస్తూ పలు చార్ట్‌లు, గ్రాఫిక్స్, వీడియోల్ని పోస్టు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల దృఢమైన నమ్మకానికి నేను నమస్కరిస్తున్నా. మీ మద్దతు, వాత్సల్యం ప్రభుత్వానికి ప్రేరణ, బలం’ అని ట్వీట్ చేశారు. ఉత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవచేయడాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. ముందుచూపుతో ప్రజలకు సాయం చేసే నిర్ణయాలు తీసుకున్నామని సరికొత్త భారతావనికి అవి పునాదులు వేశాయని చెప్పారు. -
ఇదేం రోగం..?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పైస్థాయి అధికారుల పెత్తనం పెరిగిపోయింది. సరైన సిబ్బంది లేక రోగులను బంధువులే మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడుంటే, పదుల సంఖ్యలో ఉద్యోగులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్న ఆస్పత్రి అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఒకరు, ఇంటి అవసరాల కోసం ఇంకొకరు.. ఇలా నాలుగో తరగతి ఉద్యోగులను తమ ఇష్టానుసారం వాడుకుంటున్న తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది. లబ్బీపేట (విజయవాడతూరు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఓ అధికారి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండతో తన ఇంటి వద్ద పనులు చేసేందుకు నలుగురు ఉద్యోగులను కేటాయించాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది.. అడిగిందే ఆలస్యం సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఇద్దరిని, వార్డులో విధులు నిర్వహించాల్సిన నాల్గో తరగతి ఉద్యోగులు ఇద్దరినీ కేటాయించారు. ఒకరు నిత్యం ఆ అధికారి కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు కేటాయించగా, మరొకరు ఇంటి వ్యవహారాలు చూసేందుకు నియమితులయ్యారు. నిత్యం ఇద్దరు ఉద్యోగులు ఆమె ఇంట్లో పనులు చేస్తుంటారు. ఇటీవల కుక్క వ్యవహారాలు చూసే ఉద్యోగి బంధువు మృతిచెందడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించారు. ఇలా.. శోభ, యేసయ్య అనే ఉద్యోగులతో పాటు మరో ఇద్దరు ఆ అధికారి సేవలోనే ఉంటున్నట్లు తెలిసింది. మరో అధికారి ఇంట్లో ఇద్దరు, సూపర్వైజర్ వద్ద మరో ఇద్దరు ఉద్యోగులు ఇంటి పనులు చక్కబెడుతూ ఆస్పత్రి విధులకు డుమ్మా కొడుతున్నారు. రోగులకు తప్పని కష్టాలు ఉద్యోగులు అధికారుల ఇళ్లలో పనులు చక్కబెడుతుండగా, రోగులకు సేవలు అందించేవారు లేక బంధువులే వీల్చైర్లు, స్ట్రెచ్చర్‌పై ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఒక్కో సమయంలో రోగులను బంధువులే చేతులపై ఎత్తుకెళ్లడం జరుగుతోంది. అత్యవసర విభాగంలో సిబ్బందిని సైతం తమ సొంత పనులకు కేటాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారూ దృష్టిపెట్టండి ఆస్పత్రిలో ఉద్యోగులు లేరంటూ ప్రతిసారీ ఆరోగ్యశ్రీలో ఉద్యోగులను నియమించాలని కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. రోగుల కోసం అలా నియమించిన వారిని సొంత అవసరాలకు వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై దృష్టిసారిస్తే.. అనేక అవకతవకలు బయట పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చోద్యంచూస్తున్న అధికారులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఓ అధికారి.. సిబ్బందిపై పెత్తనం చేస్తూ సొంత అవసరాలకు వాడుకుంటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో ఫంక్షన్ జరగ్గా, ఆస్పత్రి క్యాంటీన్ నుంచి డిమాండ్ చేసి భోజనాలు తీసుకెళ్లారు. ఆదివారం సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించి మరీ భోజనాలు తీసుకురావాలని హుకుం జారీచేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రి ఉన్నతాధికారి అండగా, కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందిని సొంత అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా దృష్టికి రాలేదు ఆస్పత్రిలో నాల్గో తరగతి ఉద్యోగులు.. అధికారుల ఇళ్లలో పనులు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇక నుంచి జరగకుండా చూస్తాను. – డాక్టర్ జి.చక్రధర్, సూపరింటెండెంట్ -
అనుమానమే పెనుభూతమై..!
భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన తండ్రి కొత్తకోట: సంసారం సాఫీగా సాగుతుండగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఓ భర్త. కట్టుకున్న ఇల్లాలితో పాటు ఇద్దరు పిల్లలను అతిదారుణంగా చంపాడు. ఈ ఘటన రెండునెలల తరువాత ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెంలో ఆలస్యం గా వెలుగుచూసింది. మృతువుల బం ధువులు, స్థానికుల కథనం మేరకు.. పాలెం గ్రామానికి చెందిన ఆకుల కొండన్న, కృష్ణవేణి(27) భార్యాభర్తలు. వీరికి సాయిచరణ్(6),సాకేత్‌రామ్(5) కుమారులు. కృష్ణవేణి ప్రవర్తనపై భర్త కొండన్నకు అనుమానం కలిగింది. ఎలాగైనా భార్యాపిల్లలను చంపేయాలని పథకం రచించాడు. కాశీకి వెళ్తున్నామని గ్రామంలో చెప్పి సెప్టెంబర్ 6న పాలెం నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు తెలిపారు. బాలానగర్ సమీపంలోని గౌటాపూ ర్ వద్ద కృష్ణవేణిని హత్యచేసి చెక్‌డ్యాంలో వేశాడు. బాలానగర్ పోలీసులకు అదేనెల 8న మహిళ మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయి తే ఇద్దరు పిల్లలను వరంగల్ జిల్లా కాజీపేట వద్ద వడ్డేపల్లి చెరువులో వేసి హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఇద్ద రు పిల్లలను అనుమానాస్పదస్థితిలో మృతిచెందారని అ క్కడి పోలీసులు కేసు నమో దు చేశారు. అయితే కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని నెలరోజుల క్రితం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, ఇటీవల కొండన్న పలువురితో తన భార్యను తానే చంపానని కొందరు గ్రామస్తులతో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కొండన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. దీంతో ఆదివారం మృ తురాలి బంధువులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వాకబు చేయడంతో అసలు విషయం రెండు నెలల తరువాత వెలుగుచూసింది. -
మహానేతకు ఘన నివాళి
దాదర్, న్యూస్‌లైన్:కడదాకా ప్రజాసేవకే అంకితమై, కోట్లాది మంది తెలుగు హృదయాలలో చిరంజీవిగా నిలిచిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ముంబైలోని తెలుగు ప్రజలు ఆయనకు ఘననివాళులు అర్పించారు. గోరేగావ్‌లోని వై.ఎస్.జగన్ యువజనసంఘం ఆధ్వర్యంలో చంద్రమణి బుద్ధవిహార్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్‌పార్టీ మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు మిమిక్రీ రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెడ్డితోపాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు వై.ఎస్‌కు నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వైఎస్సార్ సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పల్లెపల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, అభివృద్ధిని స్మరించుకున్నారు. రాజన్న ప్రస్తుతం మన మధ్య లేకపోయినా, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొండారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అటువంటి జననేత మళ్లీ పుడతాడో లేదో అంటూ తన ఆవేదన వ్యక్తం జేశారు. అలాగే తండ్రిని మించిన తనయుడిగా ప్రజాభిమానం పొందిన జగన్మోహన్రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత స్థానిక గాయకుడు గాజుల నరసారెడ్డి మహానేతను స్మరిస్తూ పాడిన గేయం ‘పల్లెలన్నీ అడుగు ఉతున్నాయి.. మా రాజన్న ఏడనీ.. దిక్కులన్నీ.. వెదుకుతున్నాయి.. మా రాజన్న ఏడని’ అందరినీ కదిలించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. వ్యాఖ్యాతగా వచ్చేసిన మిమిక్రీ రమేష్.. ‘పెద్దాయనా! పెద్దాయనా! ఇది స్వార్ధపు లోకం.. పెద్దాయనా!’ అని పాడుతూ వైఎస్సార్ జీవిత విశేషాలను వివరించారు. ముంబై తెలుగు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్, ఆల్ ముంబై తెలుగు క్రిస్టియన్ చర్చెస్ అండ్ లీడర్స్ తరఫున రెవరెండ్ జంగిల బాబ్జీ రాజన్న స్మృతితో ప్రార్థన చేశారు. అలాగే జగన్ కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక తెలుగు ప్రముఖులు మర్రి జనార్దన్, సంగెవేని రవీంద్ర, మంతెన రమేష్, బి.వి.రెడ్డి, మన్మథరావు, బి.వి.రాజు, రాజ్ కుమార్, బి.జే.రావు, బద్దా బాలరాజు, మేకల హన్మంతు, డి.భాస్కర్ రావు, వి.వెంకటేశ్వర్‌రెడ్డి, వి.వి.రమణారెడ్డి, జి.సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మోరా తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, శ్రీనురెడ్డి, వై.ఎస్.జగన్ యువజన సంఘం సభ్యులు ఎం.రామకృష్ణ, ఎస్.సురేష్, కె.కుమార్, బి.విజయ్, ఎన్.ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాదిరెడ్డి కొండారెడ్డి స్కూలు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మిమిక్రీ రమేష్ మహానేతను ఉద్దేశించి ‘మీరు నడిస్తే మీ వెంటే నడిచాయి మేఘాలు- మీరు నవ్వితే మీ కోసమే నవ్వాయి పంటచేలు.. రాజశేఖరా.. మళ్లీ జన్మించవా.. మా కోసం’ వంటి పాటలతో సభా ప్రాంగణం మార్మోగింది.