సాక్షి, ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలి నాల్గవ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలలో పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని ఆదేశించారు. నీతిఆయోగ్ అభివృధ్ది చేయాల్సిన 115 జిల్లాలను గుర్తించినట్లు, రాష్ట్రాలు కూడా ఇరవై బ్లాకులను గుర్తించేందుకు ప్రమాణాలు నిర్ధేశించుకోవచ్చునని ప్రధాని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాల్లో వీధి దీపాలకు, ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. నీటి పొదుపు, వ్యవసాయం, ఉపాధిహామీ పథకం అమలుపై సీఎంలు చేసిన ప్రతిపాదనలను మోదీ అభినందించారు.
పంట విత్తడానికి ముందు కోత తరువాత వరకు వ్యవసాయ, ఉపాధి హామీ అనుసంధానంపై సమన్వయ విధానాన్ని అనుసరించేందుకు సిఫారస్సులు చేయాలని ఆంధ్రప్రదేశ్, బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్ సీఎంలను మోదీ కోరారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, సామాజిక న్యాయం అనేది అత్యంత ప్రధానమైన పరిపాలన లక్ష్యమని అన్నారు. పరస్పరం సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమన్నారు. 115 జిల్లాలలో 45వేల గ్రామాలకు ఏడు కీలక పథకాలను 2018 ఆగస్టు 15 నాటికి చేరేలా ప్రభుత్వం ప్రణాళిలు రూపొందించిందని మోదీ పునరుద్ఘాటించారు. ఎటువంటి వివక్ష లేకుండా సమతుల్యతతో ప్రభుత్వ పథకాలను అందించడమే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యుత్, జన్‌ధన్ యోజన, ఉజ్వల యోజన, మిషన్ ఇంద్రధనుష్ వంటి పథకాల ద్వారా అందరికి మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పేదవారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు 100 శాతం అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రులను కోరారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 7.70 కోట్ల టాయిలెట్లు నిర్మాణం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతోందని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ 150 జయంతిలోపు పరిశుభ్రత సాధించాలని పిలుపునిచ్చారు. త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరబోతోందని ప్రకటించారు. రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహించుకోవడం సంతోకరమని, సులభతర వ్యాపారం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్‌ను ప్రధాని కోరారు.
వ్యవసాయరంగంలో కార్పొరేట్ల పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని, గోదాములు, రవాణా, పుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా రాష్ట్రాలు నూతన విధానం రూపొందించుకోవాలని సూచించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై చర్చ జరగాలని, తద్వారా ఆర్థిక వనరులు పొదుపు చేసుకుంటూ ఖర్చు తగ్గించుకుని వనరులను సమర్ధంగా వినియోగించుకోవాడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చి విలువైన సలహాలు, సూచనలు చేసిన ముఖ్యమంత్రులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment