ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ | PM Modi Meets Bangladesh Muhammad Yunus Details Here | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ

Published Fri, Apr 4 2025 12:18 PM | Last Updated on Fri, Apr 4 2025 3:30 PM

PM Modi Meets Bangladesh Muhammad Yunus Details Here

బ్యాంకాక్‌: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది.  ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.

ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్‌ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. 

వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్‌ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా అక్కడే ఉన్నారు.

ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్‌ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్‌ యూనస్‌ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు.

.. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్‌. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు.  దీంతో బిమ్‌స్టెక్‌లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.  

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్‌ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశవ్యాప్త ఆందోళనలతో షేక్‌ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్‌ నొక్కి చెప్పింది. 



మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement