
బ్యాంకాక్ సదస్సులో మోదీ
సభ్యదేశాలతో యూపీఐ అనుసంధానం
స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు
ఏటా 300 మందికి భారత్‌లో శిక్షణ
బ్యాంకాక్ విజన్–2030కు ఆమోదం
బ్యాంకాక్: భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్‌టెక్ సభ్యదేశాల చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా వ్యాపారం, వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ‘బిమ్స్‌టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ మేరకు 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన తెరపైకి తెచ్చారు.
శుక్రవారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం(బిమ్స్‌టెక్) సదస్సులో మోదీ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అన్నారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, అనుబంధం బలపడాలి. ఇందుకు 21 సూత్రాల ప్రణాళికను అమలు చేద్దాం. అందులో భాగంగా బిమ్స్‌టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ (బోధి) ఏర్పాటు చేద్దాం.
దీనికింద ఏటా సభ్యదేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్‌లో శిక్షణ ఇస్తాం. సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా మన కూటమికి ఉంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ ఎదుగుదాం. డిజిటల్ ప్రజా సదుపాయాల (డీపీఐ) విషయంలో అనుభవాలు పంచుకుందాం.
ఐటీ రంగ శక్తిసామర్థ్యాల సాయంతో బిమ్స్‌టెన్‌ను సాంకేతికంగా బలోపేతం చేసుకుందాం. బిమ్స్‌టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏటా వ్యాపార సదస్సులు నిర్వహిద్దాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. సదస్సులో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. బంగాళాఖాతంలో శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరతే లక్ష్యంగా ‘బ్యాంకాక్ విజన్–2030’ను ఆమోదించారు.
బిమ్స్‌టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ఇటీవలి భూకంపంలో మయన్మార్, థాయ్‌లాండ్ ల్లో వేలాది మంది మరణించడం పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘విపత్తుల నిర్వహణ విషయంలో అంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత్‌లో బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సస్టెయినబుల్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్టు సెంటర్ నెలకొల్పుదాం.
బిమ్స్‌టెక్ దేశాలకు మానవ వనరుల శిక్షణ నిమిత్తం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేద్దాం. ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు నలందా యూనివర్సిటీలో బిమ్స్‌టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్íÙప్‌లు ఇస్తాం. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్ పనులను వేగవంతం చేద్దాం. ఈ ఏడాది బిమ్స్‌టెక్ యూత్ లీడర్ల సదస్సు నిర్వహించనున్నాం. 2027లో తొలి బిమ్స్‌టెక్ క్రీడలు నిర్వహిద్దాం’’ అని సూచించారు.
నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యం
నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఓలీతో ఫలవంతమైన చర్చ జరిగిందని మోదీ వెల్లడించారు. నేపాల్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ ఆంగ్ లైంగ్‌తో మోదీ భేటీ అయ్యారు. భూకంపం నుంచి కోలుకోవడానికి సాయమందిస్తామని చెప్పారు.
మయన్మార్‌లో సంఘర్షణలకు తెరపడాలంటే ప్రజాస్వామిక విధానంలో సజావుగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. థాయ్‌లాండ్ రాజు మహా వాజిరాలాంగ్‌కాన్ దంపతులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకోవడంపై చర్చించారు. సారనాథ్ బౌద్ధ స్థూపం నమూనాను థాయ్‌లాండ్ రాజుకు మోదీ అందజేశారు.
మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభం
థాయ్‌లాండ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మూడు రోజులపాటు పర్యటిస్తారు. అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకేతో సమావేశమవుతారు. మోదీ చివరిసారిగా 2019లో శ్రీలంకలో పర్యటించారు. 2015 తర్వాత ఆయన శ్రీలంకలో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి.
వాట్ ఫో ఆలయాన్ని దర్శించుకున్న మోదీ
ప్రధాని మోదీ బ్యాంకాక్‌లో వాట్ ఫో బౌద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు. 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్ర సైతం ఉన్నారు. అశోక స్తంభం నమూనాను మోదీ వాట్ ఫో ఆలయానికి బహూకరించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.