
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీ వరకు థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. ప్రాంతీయ సహకారానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ‘మహాసాగర్ విధానం’అమలే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. మొదటగా ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ 3, 4 తేదీల్లో జరిగే బిమ్‌స్టెక్ ఆరో శిఖరాగ్రంలో పాల్గొంటారు.
3న థాయ్ ప్రధానితో భేటీ అవుతారు. అనంతరం శ్రీలంకకు వెళతారని తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకేతో చర్చలు జరుపుతారంది. మారిషస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ‘మహాసాగర్’ను ప్రకటించినట్లు విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత్‌తోపాటు బంగాళాఖాత తీరప్రాంత దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్‌లతో ఏర్పాటైనదే బిమ్‌స్టెక్ కూటమి.