Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Meeting With Ysrcp Local Body Representatives Updates1
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్‌సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్‌ జగన్‌ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్‌ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్‌సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Rajnath Singh dials US counterpart Pete Hegseth2
మీకు అండగా ఉంటాం: అమెరికా

ఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సేకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్ చేశారు. ఈ రోజు(గురువారం) హెగ్సే కు ఫోన్ చేసి మాట్లాడారు రాజ్‌నాథ్‌ సింగ్‌ .ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే చరిత్ర ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు తెలిపారు రాజ్ నాథ్. దీనిలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలను తాము మద్దతిస్తామన్నారు హెగ్సే. ఉగ్రవాదంపై భారత్ కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని హెగ్సే పేర్కొన్నారు. భారత్ కు అమెరికా అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.Secretary Hegseth said that the U.S.…— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025 పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు..కాగా, నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్‌వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్‌ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్‌ఓసీ వెంబడి పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్‌, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్‌ పోరుబందర్‌ వద్ద భారత్‌ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్‌ఓసీలో పాక్‌ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్‌ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. దీన్ని భారత్‌ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే భారత్‌ స్పష్టం చేసింది.

IPL 2025: CSK Call Urvil Patel For Mid Season Trials Says Report3
IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్‌కే..?

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌లో సీఎస్‌కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది.సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం సీఎస్‌కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్‌కు పిలిచినట్లు సమాచారం. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ గుజరాత్‌కు చెందిన ఉర్విల్‌ పటేల్‌ను మిడ్‌ సీజన్‌ ట్రయల్స్‌కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.ఉర్విల్‌ గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉంది. సాహిత్‌ గతేడాది సైప్రస్‌పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.26 ఏళ్ల ఉర్విల్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌. ఇతనికి దేశవాలీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు చేశాడు.ఉర్విల్‌ను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ తదుపరి సీజన్‌ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్‌లో రిటైర్‌ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.ఉర్విల్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్‌కేకు ఉర్విల్‌పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్‌ మాత్రే సీఎస్‌కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, సీఎస్‌కే నిన్న (ఏప్రిల్‌ 30) పంజాబ్‌ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే తొలుత భారీ స్కోర్‌ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్‌ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పంజాబ్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

Home Minister Amit Shah First reaction On Pahalgam incident4
ఇది మోదీ సర్కార్‌.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్‌ షా

న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్‌ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన.

People Narrowly Escaped From Arch Collapse Incident in Nellore5
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లా పర్యటనలో ప్రజలకు పెను ప్రమాదం తప్పింది. నారంపేటలోని ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలింది. అప్పటికే చంద్రబాబు, ప్రజలు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రజావేదిక వద్ద ఉదయమే ఏర్పాటు చేసిన ఆర్చి.. సాయంత్రం కల్లా కుప్పకూలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్చి కూలే సమయంలో అక్కడ ఎవరూ లేరని, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు.ఈరోజు(గురువారం) నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక పేరుతో జరిగిన సభకు సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఆర్చ్ కుప్పకూలింది. అది జనాలు ఎవరూ లేని సమయంలో కూలడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Delhi High Court Raps Baba Ramdev6
సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హమ్‌దార్డ్‌ సంస్థకి చెందిన రూ అఫ్జాపై మరో వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయకూడదని ఆదేశించినప్పటికీ.. అవమానకరమైన వ్యాఖ్యలతో రూ అఫ్జాపై రామ్‌దేవ్‌ మరో కొత్త వీడియోను రూపొందించారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.ఢిల్లీ: రాందేవ్‌ బాబా కొత్త వీడియో విషయాన్ని హమ్‌దార్డ్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ తీవ్రంగా స్పందిస్తూ.. రామ్‌దేవ్‌ ఎవరి నియంత్రణలో లేరని ఆయన చేష్టలు బట్టి అర్థమవుతోంది. ఆయన తన సొంత ప్రపంచంలో బతుకుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచవలసిన అవసరం లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించారనేది స్పష్టం అవుతోందని.. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తాజా వీడియోలను సోషల్‌ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారంల నుంచి తొలగిస్తామని బాబా రాందేవ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన వారంలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్‌ అమిత్‌ బన్సాల్‌ తెలిపారు. పతంజలికి చెందిన గులాబ్‌ షర్బత్‌ను ప్రచారం చేసే క్రమంలో.. హయ్‌దార్డ్‌ రూఅఫ్జాను తక్కువ చేస్తూ బాబా రామ్‌దేవ్‌ తీవ్ర చేష్టకు దిగారు. రూఅఫ్జా ద్వారా వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్‌దేవ్‌ ఆరోపించారు. షర్బత్‌ జీహాద్‌ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి టాయిలెట్‌ క్లీనర్‌లని, వాటి నుంచి ప్రజలను రక్షించడమే తమ ఉద్దేశమంటూ వ్యాఖ్యానించారు. అలాగే.. అదే ఈ గులాబ్‌ షర్బత్‌ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే.. గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిందిగా హమ్‌దార్డ్‌ కోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్‌ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా ఆన్‌లైన్‌ కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రామ్‌దేవ్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన మరో వీడియో విడుదల చేయడంతో కోర్టు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఇదిలా ఉంటే.. పతాంజలి ఉత్పత్తుల విషయంలో రామ్‌దేవ్‌ బాబా కోర్టు మెట్లెక్కడం ఇదేం కొత్త కాదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

Contractor Sensational Facts On Simhachalam Incident7
సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్‌

విశాఖ: సింహాచలం పుణ్యకేత్రంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిపై గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన నిజాలు బయటకు చెప్పారు. చందనోత్సవానికి సమయం చాలా తక్కువ సమయం ఉందని, తాను గోడ కట్టనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారన్నారు. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ విచారణ సందర్భంగా లక్ష్మణరావు వెల్లడించారు.ఆరు రోజుల వ్యవధిలో ఒక గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని, కేవలం నాలుగు రోజుల ముందే గోడ పనులు మొదలు పెట్టాననన్నారు. టెంపరరీ గోడ అని చెప్పడంతోనే గోడ కట్టానన్నారు లక్ష్మణరావు. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు..?గోడ కట్టే సమయంలో ఇంజినీర్‌ లేరని కాంట్రాక్టర్‌ లక్ష్మణరావు చెప్పగా, ఇంజినీర్‌ అక్కడే ఉన్నారని అధికారులు చెప్పారు. దాంతో కమిటీ సభ్యుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇంజినీర్‌ ఉన్నాడా.. లేడా అని నిలదీశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని కమిటీ ప్రశ్నించింది. కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.

WAVES Summit 2025 Alia Bhatt Maharashtrian Elegance In Nauvari Saree8
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తన సింపుల్‌, ట్రెడిషనల్‌ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్‌మెంట్‌ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 1న జరిగిన ఈవెంట్‌లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్‌ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

Indian Jawan Pakistani Wife gets Last Minute Relief at Border9
భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ పౌరుల వీసాలను భారత్‌ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్‌ ఇవ్వగా.. బార్డర్‌ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్‌ పంజాబ్‌కు చెందిన మినాల్‌ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్‌లైన్‌లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేం‍ద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్‌ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగిం‍ది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్‌పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్‌ ఖాన్‌ ఎపిసోడ్‌ సోషల్‌ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్‌ మహిళను, అదీ ఆన్‌లైన్‌లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్‌ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్‌ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్‌ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది.

HIT 3: The Third Case Movie Review And Rating In Telugu10
‘హిట్‌ 3’ మూవీ రివ్యూ

హాలీవుడ్‌, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్‌ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్‌’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్‌ 3’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్‌ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్‌) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్‌ సర్కార్‌ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్‌ టార్చర్‌ కిల్‌) డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్‌ వెబ్‌సైట్‌ రన్‌ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ సీటీకే గ్యాంగ్‌ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్‌ సర్కార్‌ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ (హిట్‌) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్‌’, హిట్‌ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్‌ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్‌లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్‌ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్‌ ఫ్రాంచైజీలలో క్రైమ్‌ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్‌ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్‌ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్‌ సీన్లు లిమిట్‌ దాటి ఉన్నాయి. యానిమల్‌, మార్కో, కిల్‌ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్‌ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: హిట్‌-4లో హీరో ఫైనల్‌.. ఏసీపీ వీర‌ప్ప‌న్‌గా ఎంట్రీ)కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్‌ ఎంట్రీతో యాక్షన్‌ థ్రిల్లర్‌.. కాస్త లవ్‌ ఎంటర్‌టైనర్‌లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్‌ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్‌ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్‌తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్‌ ఉందన్న విషయాన్ని అర్జున్‌ కనుక్కునే ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్‌ సర్కార్‌ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్‌ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్‌ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్‌ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇష్టపడే వాళ్లకు హిట్‌ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్‌ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్‌ చేసింది. ప్రతీక్‌ బబ్బర్‌ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్‌ సర్కార్‌ టీమ్‌ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement