
2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్‌లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.
ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.
ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.
తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.
రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.
తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్‌లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది.