
రాహుల్‌గాంధీకి సుప్రీం మందలింపు
మీ నానమ్మ కూడా సావర్కర్‌ను ప్రశంసించారు
స్వాతంత్య్రం తెచ్చిన వారిపై అవేం అనుచిత వ్యాఖ్యలు?
పునరావృతమైతే తీవ్ర చర్యలు సుమోటోగా స్వీకరిస్తాం: ధర్మాసనం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది.
‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు.
ఎందుకంటే వైస్రాయ్‌ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.