
సిమ్లా: 1972లో సిమ్లా ఒప్పందం జరిగిన చారిత్రక టేబుల్‌పైని పాకిస్తాన్ జెండా అనుమానాస్పద రీతిలో శుక్రవారం ఉదయం మాయమైంది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించడం తెల్సిందే. పహల్గాం దారుణానికి నిరసనగా భారత్ పలు తీవ్ర చర్యలు ప్రకటించడం బదులుగా పాక్ కూడా సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకుంది.
కాగా, 1972 జూలై 2వ తేదీ అర్ధరాత్రి దాటాక హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాం«దీ, పాక్ అధ్యక్షుడు జు ల్ఫీకర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ సమయంలో రాజ్‌భవన్‌లోని కీర్తి హాల్‌లోని వేదికపైని టేబుల్‌పై రెండు దేశాల జెండాలను ఏర్పాటు చేశారు.
అక్కడుంచిన ఫలకంపై సిమ్లా ఒప్పందంపై 3–7–1972న ఇక్కడే సంతకాలు జరిగాయి’అని ఉంటుంది. అక్కడే సంతకం చేస్తున్నట్లు భుట్టో, పక్కన ఇందిర కూర్చున్న ఫొటో ఉంటుంది. అయితే, టేబుల్‌పైనున్న పాక్ జెండా మాత్రం ఆకస్మికంగా కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు శుక్రవారం ఉదయం ధ్రువీకరించారు.