చెరిగిపోతున్న అధీన రేఖ!
జాతిహితం
1989 కశ్మీర్ తిరుగుబాటును వాడుకుని పాక్ సిమ్లా ఒప్పందాన్ని చెత్తబుట్టలో పడేస్తే, భారత్ అదే పనిని ఇప్పుడు చేసింది. ఆ ఒప్పందం తర్వాత నాలుగు దశాబ్దాలకు పాక్ కశ్మీర్‌ను అసంపూర్తి వ్యవహారమంటుంటే.. భారత్ ఆ ఒప్పందాన్నే అసంపూర్తి వ్యవహార మని ఎందుకు పిలవకూడదు? అని మోదీ భావన. ఆయన ప్రభుత్వం యథాతథ స్థితిని భగ్నం చేయడంలోనే వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనం ఉన్నదని భావిస్తోంది. అందువల్ల భారతమెరుపు దాడులు వాస్తవాధీన రేఖ అనుల్లంఘనీయతను ప్రశ్నార్థకంగా మార్చాయి.
ఆగ్రా శిఖరాగ్ర సమావేశం కోసం జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ భారత్‌లో జరిపిన పర్యటనకు సంబంధించిన ఆణిముత్యాల లాంటి స్మృతులలో ఒక దాన్ని ఎల్కే అద్వానీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆగ్రా సమావేశం వెలుపల ముషర్రాఫ్ ఆయనను మహా ఆర్భాటంగా మన సంబంధాలలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలంటే ఏం చేయాలని అడి గారు. మాతో నేర స్తుల అప్పగింత ఒప్పందంపై సంతకం చేసి, దావూద్ ఇబ్రహీంను వెనక్కు పంపండని అద్వానీ బదులిచ్చారు. స్వాతిశయంతో తనను తానొక మహా మేధావిగా భావించే వాచాలుడు ముషర్రాఫ్‌కు... ఒక వృద్ధ ‘పౌరుడు’ తనను ఇలా చిత్తు చేయడం నచ్చలేదు. ‘‘అద్వానీగారూ! మీరు ప్రయోగిస్తున్నది ఏమిటో తెలుసా, మేం దాన్ని సైన్యంలో చిన్న ఎత్తుగడ అంటాం’’ అన్నాడు బడాయిగా. పెద్ద, రాజకీయ, వ్యూహాత్మక సమస్యలను చర్చిద్దామని ఆయన అర్థం.
కనీసం భారత్ దృష్టి నుంచే అయినా ఆయన అనుకున్నది తప్పు. కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి/అవతల జరిగిన దాడుల తదుపరి భారత-పాకిస్తాన్ సంబంధాలు తిరిగిన ఈ తాజా మలుపునకు ఈ పరీక్షను అన్వయించి చూద్దాం. సెప్టెంబర్ 28-29 మధ్య రాత్రి కచ్చితంగా జరిగిందే మిటి, భారత కమాండోలు అధీనరేఖ నుంచి ఎంత లోపలికి చొచ్చుకుపో యారు, శత్రువుకు మరణాలు, ఆస్తుల ధ్వంసం రూపేణా కలిగించిన నష్టం ఎంత లేదా పాకిస్తానీల్లా ప్రశ్నిస్తే అసలు మనవాళ్లు ‘‘లోపలికి’’ వెళ్లారా, ‘‘చిన్న ఆయుధాలు’’ ప్రయోగించి ఇద్దరు పాక్ సైనికులను మాత్రమే కాల్చి చంపారా... ఇవన్నీ చిన్నవి, ఎత్తుగడలపరమైన విషయాలు. అయితే భారత్ ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ముఖ్యమైనది, వ్యూహాత్మకమై నది. అదే ఇక నుంచి భారత్-పాక్ సంబంధాలను పునర్నిర్వచిస్తుంది. భారత్ వైపు నుంచి యథాతథస్థితి కొనసాగింపునకు ముగింపును సంకేతిస్తుంది.
ఎల్ఓసీ అంతర్జాతీయ సరిహద్దా?
1989లో కశ్మీర్ లోయలో సమస్య తిరిగి తలెత్తడం, 1993 ముంబై వరుస బాంబుదాడులు, ఉగ్రవాదం భారత ప్రధాన భూభాగంపై మొదటిసారిగా ప్రత్యక్షం కావడం వల్ల కొన్ని సూత్రాలు పుట్టుకొచ్చాయి. అవే ఏళ్ల తరబడి భారత ప్రతిస్పందనలను నిర్వచిస్తున్నాయి, నియంత్రిస్తున్నాయి. కశ్మీర్ సమ స్యను పాక్ ‘‘అంతర్జాతీయం’’ చేయాలని చేసే ఏ ప్రయత్నం పట్లయినా భారత్... మానసిక వైకల్యమనిపించేంతటి ఏహ్య భావాన్ని ప్రదర్శించడం, ‘‘ద్వైపాక్షికమైన’’ కశ్మీర్ సమస్య పాతదనీ అది 1972 సిమ్లా ఒప్పందంలో వేళ్లూనుకుని ఉన్నదని అనడం అందులో కొన్ని. దీనితో ముడిపడి ఉన్నదే సిమ్లా ఒప్పందం. అది, పాత కాల్పుల విరమణ రేఖ (సీఎఫ్ఎల్)ను వాస్తవా దీన రేఖ(ఎల్ఓసీ)గా పునర్నిర్వచించి, దానికి ఆచరణలో సరిహద్దు హోదాను ఇచ్చింది. దాని వెంబడే కశ్మీర్ విభజనను ధృవీకరించింది. ఇరుదేశాలు మరింత అనువైన సమయంలో దాన్ని లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది. ఇరు పక్షాలూ 1989 వరకు చాలా నిజాయితీగానే దీన్ని గౌరవించాయి.
1984 వసంత కాలంలో భారత సేనలు సియాచిన్ గ్లేసియర్ (మంచు కొండలు) పైకి పోవడాన్ని కూడా వాస్తవాధీన రేఖ విభజించని భూభాగంలో మన ఉనికిని నెలకొల్పడంగానే మనం సమంజసమైనదన్నాం. అయితే పాక్ ఆ విషయాన్ని తీవ్రంగా సవాలు చేసింది, భారత్‌ను అక్కడి నుంచి తరిమే యాలని ఎన్నో సాహసోపేతమైన దాడులు చేసింది, భారీ నష్టాలకు గురై మరీ విఫలమైంది. వాస్తవాధీన రేఖ ఆచరణలో సరిహద్దు రేఖ అనేదే కార్గిల్ విష యంలో సైతం భారత్ ప్రతిస్పందనలో కేంద్ర అంశంగా ఉన్నది. మొత్తం ప్రపంచమే వాస్తవాధీన రేఖను అనుల్లంఘనీయమైనదిగా గుర్తించడానికి, భారత్‌కు వ్యూహాత్మక విజయంగా చూడటానికి అది కారణమైంది.
మన పాక్ విధానంలో మౌలిక మలుపు
అందువల్లనే చాలా సందర్భాలలో వివిధ సెక్టార్లలో ఎత్తుగడల కారణాల రీత్యానో లేదా సమస్యాత్మకమైన ఏ పాకిస్తానీ స్థావరాన్ని నిర్మూలించడానికో లేదా అర్థం చేసుకోదగినవే అయిన ఖండనలను అడ్డుపెట్టుకుని బుద్ధి చెప్పి రావడానికో కూడా భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటాయి. 2013 జనవరిలో మన ఇద్దరు భారత సైనికుల తలలను నరికినందుకు సైన్యం ‘‘ప్రతీకారాన్ని తీర్చుకున్నద’’ని ఒక విశ్రాంత సైనికాధికారి (జనరల్ బిక్రమ్ సింగ్) చెప్పారు. ఆ వివరాలను మాత్రం తెలుపలేదు. కార్గిల్ తదుపరి ఎంతో కాలం కాకముందే సమస్యాత్మకమైన ఒక పాకిస్తానీ స్థావరాన్ని నిర్మూలించడా నికి నాలుగు మిరేజ్-2000 యుద్ధవిమానాలు శివాలిక్ పర్వత శ్రేణుల లోలో తులుకు చొచ్చుకుపోయి మరీ లేజర్ గెడైడ్ ప్రిసిషన్ బాంబు దాడులను సాగించాయి. ఆ విషయాన్ని సైతం రహస్యంగానే ఉంచారు. పాకిస్తానీలు కూడా ఈ దాడుల గురించి కిమ్మనకుండా ఉండటం విశేషం. బహుశా వాళ్లు తమకు అనువైన సమయం, స్థలం ఎన్నుకుని ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసమే అలా చేసి ఉండొచ్చు. తాజా మలుపు దాన్నంతటినీ మార్చేసింది.
వాస్తవాధీన రేఖను అదేదో అంతర్జాతీయ సరిహద్దు అన్నట్టు దాని అనుల్లంఘనీయతను నొక్కిచెప్పడానికి బదులుగా భారత్ ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తోంది. ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్డీఏ ప్రభుత్వం నియమించినది ఒక జూనియర్ మంత్రినే కావచ్చు. కానీ, కశ్మీర్ మొత్తం మా భూభాగమే కాబట్టి, అక్కడ ఎక్కడికి వెళ్లినా అది సరిహద్దు ఉల్లంఘన ఎలా అవుతుంది? అని రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అనడానికి ప్రాధాన్యం ఉన్నది. ప్రత్యేకించి ప్రధాని పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలిస్థాన్లను ప్రస్తావించడంతో కలిపి అర్థం చేసుకుంటే దీని ప్రాధాన్యం అర్థమౌతుంది. కశ్మీర్ సమస్యకు సమంజసమైన అంతిమ పరిష్కారం ఇంతవరకు సరిహద్దు విషయంలో వాస్తవాధీన రేఖ పట్ల ఆమోదం చుట్టూనే తిరుగుతోంది. అదే సిమ్లా ఒప్పందం స్ఫూర్తి. వాజ్‌పేయి ఆ తదుపరి నవాజ్ షరీఫ్, ముషర్రాఫ్లతో జరిపిన సంభాషణల స్ఫూర్తి కూడా అదే. దానినే చివరకు ముషర్రాఫ్, మన్మోహన్‌సింగ్‌లు చర్చించి సూత్రీ కరించారు. అదంతా ఇప్పుడు చరిత్రే. 1989 కశ్మీర్ తిరుగుబాటును వాడుకుని పాక్ సిమ్లా ఒప్పందాన్ని చెత్తబుట్టలో పడేస్తే, భారత్ అదే పనిని ఇప్పుడు చేసింది.
సిమ్లా ఒప్పందం ద్వారా పాక్ తనకు లభించిన దాన్ని తీసేసుకుంటూ, మరింత ఎక్కువ కోసం పోరాడే అవకాశాన్ని ఉంచుకుంటున్నదనేది నరేంద్ర మోదీ ప్రాపంచిక దృక్పథం. ఆయన తన రాజకీయ, వ్యూహాత్మక, ఎత్తుగడలపరమైన చర్యల ద్వారా పాక్‌కు ఉన్న ఆ ధీమాను దెబ్బతీశారు. సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని పాక్ ఆమోదించాలనడానికి బదులు ఆ పాత ఒప్పందాన్ని తలకిందులుగా నిలబెట్టారు. సిమ్లా ఒప్పందం తర్వాత నాలుగు దశాబ్దాలకు పాక్ కశ్మీర్‌ను అసంపూర్తి వ్యవహారంగా పిలవగలుగుతుంటే... భారత్ ఆ సిమ్లా ఒప్పందాన్నే అసంపూర్తి వ్యవహారంగా ఎందుకు పిలవకూ డదు? బాగా కటువుగా వినిపిస్తుందా? భారత్‌లోని మొట్టమొదటి నిజమైన మితవాద ప్రభుత్వం ఆలోచన అదే. అది యథాతథస్థితిని... అది ఎంత అను కూలమైనదే అయినాగానీ కాపాడాలని కోరుకోవడం లేదు. దాన్ని భగ్నం చేయడంలో వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనాన్ని అది చూస్తోంది.
బ్లాక్‌మెయిలింగ్‌లు ఇక చెల్లవు
ఈ సరికొత్త మూలస్తంభం కేంద్రంగా ఒక నూతన విధానమే మొత్తంగా నిర్మితమవుతోంది. అణ్వస్త్రాల ముంగిటికి చేర్చే హద్దును ‘‘దాటి ఘర్షణను విస్తరించనీయరాదు’’ అనే భావనను మోదీ ప్రభుత్వం తిరస్కరించాలని కోరుకుంటోంది. అణ్వస్త్రాలు ఏకపక్ష నిరోధకంగా పనిచేస్తున్నాయని అది విశ్వసిస్తోంది లేదా భారత్‌ను నెత్తురోడేలా చేసే విధంగా అల్పస్థాయి సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి ఉపయోగపడే ఛత్రంగా వాడుకుంటోం దని భావిస్తోంది. ఈ ప్రమాదకర క్రీడతో ఉన్న ముప్పేమిటో పాకిస్తానీలు తమకు తామే గ్రహించాలి. భారత్ ఎప్పటికీ పాక్‌కు పక్కనే బతకాల్సి ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా దాన్ని అణు బ్లాక్‌మెయిలింగ్ చేయజాలమని గుర్తించాలి. మౌలిక విధానపరమైన ఈ మార్పుల వల్ల కలిగే ఊహించదగిన పర్యవసానం... వ్యూహాత్మక సంయమనాన్ని విడనాడటమే. అయితే పూర్తిగా తోసి పారేయలేదు. భారత్‌కు ప్రతీకార చర్యను చేపట్టడానికి మరింత ఎక్కువ వెసులుబాటును అందించడంపైకి కేంద్రీకరణ మళ్లింది.
పది సెకండ్ల సౌండ్ బైట్‌ను లేదా 140 అక్షరాల ట్వీట్‌ను విశ్లేషణ, అభిప్రాయాలు రెండింటి ప్యాకేజీగా ఇచ్చే ఈరోజుల్లో... కొద్దిగా సంక్లిష్టమై నది ఏదైనా రాయడం ఒక సవాలే. సూక్ష్మ బేధాల వివరణకు ఓపిక వహిం చాలని కోరాలన్నా అంతే. సెప్టెంబర్ 18 ఉదయాన్నే ఉడీ దాడి గురించి వెల్లడైన వెంటనే నేను.. భారత్ దీన్ని కూడా చూస్తూ ఊరుకొంటుందని భావిస్తే పాకిస్తానీలు తప్పు చేస్తున్నారని అన్నాను. మనం ఇప్పుడు పాత వ్యూహాత్మక సంయమనం నుంచి దూరంగా జరిగాం. అయితే వ్యూహాత్మక సంయమనం భారత్‌కు ఉపయోగపడింది కాబట్టి నేను దాన్ని కొనసాగించా లనే కోరాను. కొందరు ఇందులో వైరుధ్యాన్ని చూశారు. ఈ క్షణభంగురతకు పట్టంగట్టే ఈరోజుల్లో వస్తుగతమైన ఒక క్షేత్రస్థాయి వాస్తవాన్ని విశ్లేషించడా నికి, సూచనాత్మకమైన అభిప్రాయానికి మధ్య తేడాను, ఇవి పరస్పరం ఎలా విరుద్ధమైనవి కాగలవో వివరించడం దాదాపు అసాధ్యం. సరికొత్త అభిప్రాయానికి, విశ్లేషణలకు నూతన వస్తుగత వాస్తవికతే ప్రాతిపదికై తీరాలి.
ఇది వివేకవంతమైనదేనా? లేక నిర్లక్ష్యపూరితమైనదా? తప్పా, ఒప్పా? అని వాదించాల్సింది మరో సందర్భంలో. ముందుగా తప్పని సరిగా ఇది అంగీకరించి తీరాలి: ఇది మొట్టమొదటి నిజమైన మితవాద భారత ప్రభుత్వం, ఇది పాత రాజీవాద వైఖరికి తగు సమయాన్ని ఇచ్చి చూసింది, వాస్తవాధీన రేఖ అనుల్లంఘనీయత, వ్యూహాత్మక సంయమనం, పాత అణు హద్దుల నుంచి దూరంగా జరిగింది.
మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఈ నూతన వాస్తవికతపై స్పందించాల్సిందే. అంతేగానీ, ఎంత విచారకర మైనదే అయినా నేడు లేని దాని కోసం సంతాపం పాటించడం కాదు చేయాల్సింది. భారత విశ్లేషకులు ఇది గ్రహించడం ముఖ్యం. పాకిస్తానీ విధా నకర్తలు గుర్తించడం అంతకంటే ముఖ్యం.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta