
న్యూఢిల్లీ: సింధు జలాలను ఆపితే అందులో పారిదే రక్తమే అంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ భుట్టో స్టేట్ మెంట్ విన్నాను. ఒకసారి సింధు జలాల్లో దూకి చూడు. నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుంది’’ అంటూ హర్ దీప్ సింగ్ బదులిచ్చారు. ఒక విషయం పబ్లిక్ లో మాట్లాడేముందు ముందు వెనుక చూసుకుని మాట్లాడితే మంచిదని చురకలంటించారు. భుట్టో వ్యాఖ్యల్లో ఎటువంటి గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.
‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది. మన పొరుగు దేశంగా ఉన్న పాకిస్తాన్ సహకారంతో అది జరిగింది. దానికి ఆ దేశం పూర్తి బాధ్యత వహించాలి. అంతేగానీ దీన్ని ఇంకా పెద్దది చేసుకుని ఏవో ప్రయోజనం వస్తుందని భావించకండి. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలనే చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంతకుముందు పాకిస్తాన్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రదాడులతో మానవ హక్కుల్ని కాల రాస్తారా?, దీనికి యావత్ ప్రపంచం ఎంతమాత్రం ఒప్పుకోదు. ;పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశమే కాదు.. క్షీణదశకు వచ్చేసిన దేశం’ అంటూ కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు.
సుక్కర్ సింధ్ ప్రొవిన్స్ లో భుట్టో జర్దారీ బహిరంగం ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ సింధు జలాలు మావి. అవి ఎప్పటికైనా మావే. ఒకవేళ అందులో నీళ్లు పారకపోతే.. వారి రక్తం పారుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.