
పాక్‌కు ఇక చుక్కలే
సింధూ, ఉపనదులపై నిర్మాణాలు
తక్షణం డ్యామ్‌ల సామర్థ్యం పెంపు
ఆ దిశగా మూడంచెల వ్యూహం
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి.
అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్‌లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పాక్‌కు సమాచారం
తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది.
కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.
కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే.
చుక్క కూడా వదిలేది లేదు
కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్
అతి త్వరలో సమగ్ర వ్యూహం
ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి
సింధూ ఒప్పందంపై సమీక్ష
అమిత్ షా తదితరుల హాజరు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్