Water resources
-
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్‌ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
నీటి వనరుల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు?
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
అంతరించిపోయే దశలో నీటి వనరులు
సాక్షి, హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని అందులో వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం.. సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు ‘అక్రమంగా నాలాలను ఆక్రమించి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. చెరువులు, కుంటలు సహా నీటివనరుల ఆక్రమణను ఇలానే వదిలేస్తే భవిష్యత్‌లో తాగునీటికీ కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెరువులు, కుంటలనూ వదలని అక్రమార్కులు వాటిలోకి నీరు చేరకుండా పరీవాహక ప్రాంతాలనూ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలాప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ నీటివనరుల ఆక్రమణను ఇలా వదిలేస్తూ పోతే చెరువులు, నీటివనరులు, నాలాలు లేని నగరంగా హైదరాబాద్ త్వరలోనే మారుతుంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆక్రమణలు, భారీ విల్లాల నిర్మాణాల కారణంగా హైదరాబాద్‌లోని నీటివనరులు అంతరించిపోయే పరిస్థితి. ఇది పర్యావరణంలో తీవ్ర అసమతుల్యతకు దారితీస్తోంది. భారీ వర్షాలు వస్తే నీరు సాఫీగా పోయే మార్గాలు లేక ఒత్తిడి పెరిగి వరదలు జనావాసాలను ముంచెత్తుతాయి. ఆస్తులకే కాకుండా ప్రజల జీవితాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనాభా నిష్పత్తికి తగ్గట్టు చెట్లు కూడా లేక స్వచ్ఛమైన గాలి అందడం లేదు. పర్యావరణం దెబ్బతిని ఎల్‌నినో, లానినో లాంటివి సంభవిస్తున్నాయి. చెరువులు, నీటివనరులు, నాలాల పరిస్థితిపై రెడ్ అలర్ట్ ప్రకటించాలి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పలు శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలి’అని జస్టిస్ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, జిన్నారం, పటాన్చెరు, ఆర్సీ పురం, కంది, సంగారెడ్డి, హత్పూర మండలాల్లో 90కి పైగా చెరువుల ఆక్రమణను ఆయన సీజే దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
-
జలవనరుల నిర్వహణలో ఉత్తమ మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
-
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జలపథంలో... తొలి పదం
దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే. దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం. ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది. వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది. ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది. అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం. నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది. మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే. ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి. ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం. పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు. -
చెరువుల్లో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1,13,425 చెరువులుంటే.. అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నాయి. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్ బెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు వంటి జలసంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చిన్న నీటివనరుల కింద దేశంలో 14,75,29,626.21 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇందులో అత్యధిక ఆయకట్టు ఉన్న రాష్ట్రాల్లో 1,19,95,473 హెక్టార్ల ఆయకట్టుతో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో రాజస్థాన్(54,28,765.19 హెక్టార్లు), మూడో స్థానంలో తెలంగాణ (49,71,121.4 హెక్టార్లు) నిలవగా.. 13,37,841 హెక్టార్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరుల ఆరో గణనను కలిపి జలవనరుల గణన పేరుతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవల విడుదల చేసింది. అందులోని ప్రధానాంశాలివీ.. రాష్ట్రంలో 1,90,777 జలవనరులు.. ► దేశంలో 24,24,540 జలవనరులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 23,55,055 (97.1 శాతం) ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 69,485 (2.9 శాతం) ఉన్నాయి. ఇందులో 14,42,993 (59.5 శాతం) కుంటలు, 3,81,805 చెరువులు (15.7 శాతం), రిజర్వాయర్లు 2,92,280 (12.1 శాతం), ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు 2,26,217 (9.3 శాతం), సరస్సులు 22,361 (0.9 శాతం), 58,885 ఇతరాలు (2.5 శాతం) ఉన్నాయి. ► ఈ జలవనరులలో మానవ నిర్మితమైనవి 18,90,463 (78 శాతం). సహజసిద్ధంగా ఏర్పడినవి 5,34,077 (22 శాతం). ► 20,30,400 జలవనరులు (83.7 శాతం) వినియోగంలో ఉండగా.. 3,94,500 జలవనరులు (16.3 శాతం) ఎండిపోయాయి. ► 7,47,480 (30.8 శాతం) జలవనరులతో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో నిలిచింది. 2,45,087 (10.1 శాతం) జలవనరులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 1,90,777 (7.9 శాతం) జలవనరులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. 1,81,837 (7.5 శాతం) జలవనరులతో నాలుగో స్థానంలో ఒడిశా, 1,72,492 (7.1 శాతం) జలవనరులతో ఐదో స్థానంలో అస్సోం నిలిచాయి. ► జలవనరులను అత్యధికంగా చేపల పెంపకం, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఉపయోగంలో 1,49,279 జలవనరులు.. ► ఆంధ్రప్రదేశ్‌లో 14,132 కుంటలు.. 1,13,425 చెరువులు, 62 సరస్సులు, 703 రిజర్వాయర్లు, 57,492 ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు, 4,963 ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కుంటలు 8,475, చెరువులు 1,03,952, సరస్సులు 60, రిజర్వాయర్లు 667, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు 32,011, ఇతరాలు 4,114 వెరసి మొత్తం 1,49,279 ఉపయోగంలో ఉన్నాయి. ►రాష్ట్రంలో 37,257 జలవనరులను సాగునీటి కోసం ఉపయోగించుకుంటుండగా.. 680 వనరులు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగమవుతున్నాయి. చేపల పెంపకం కోసం అత్యధికంగా 69,510 జలవనరులను వినియోగించుకుంటుండగా. తాగునీరు, గృహావసరాల కోసం 1,945 వనరులను వాడుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 38,460 వనరులు దోహదపడుతున్నాయి. -
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
Ap Budget: నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల కేటాయింపులు
సాక్షి, అమరావతి: సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నీటి వనరుల అభివృద్ధికీ ప్రాధాన్యమిచ్చింది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దిశగా చేస్తున్న కృషిని వెల్లడించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి సీఎం జగన్ పెన్నా నదిపై పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ప్రజల చిర కాలస్వప్నం నెరవేరనున్నది. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట, కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ, పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం కింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అను సంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లమల సాగర్ నీరందించేందుకుగాను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశ, రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాంమని, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశను మార్చి 2025 నాటికి, రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన తెలిపారు. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022న కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేశాం. జూలై 31, 2022న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని మంత్రి అన్నారు. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
గ్రామాల్లో తాగునీటి వనరులకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ తాగునీటి వనరుల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీసత్యసాయి, అన్నమ య్య, చిత్తూరు, పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు వీలైనంత ఎక్కువ నిల్వ చేసేలా.. నీటి కొలనులు, మంచినీటి చెరువుల వంటి సంప్రదాయ తాగునీటి వనరుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టబోతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 8 రకాల పనులు చేపట్టను న్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల భాగస్వామ్యంతో ఆ ప్రాంతాల్లో భూమిలోని తేమ శాతం పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో ఆయా ప్రాంతాల్లోని ప్రభు త్వ భవనాల వద్ద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం తదితరాలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి 4 నుంచి దేశవ్యాప్తంగా.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల తరహాలోనే దేశవ్యాప్తంగా మార్చి 4 నుంచి నవంబర్ 30 వరకు ‘జలశక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్ 2023’ పేరుతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దేశం మొత్తం మీద నీటి ఇబ్బందులుండే జిల్లాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 4న దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి అన్ని రాష్ట్రాల అధికారులకు వివరించారు. కాగా, పట్టణ ప్రాంతాలో సైతం నీటి ఎద్ద డికి అవకాశమున్న ప్రాంతాల్లో.. వార్డు స్థాయిలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. -
అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ– జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ–నీటివనరుల సంస్థ(ఏఎస్సీఈ– ఈడబ్ల్యూఆర్ఐ) ఆహ్వా,నించింది. అమెరికా హెండర్సన్లో మే నెల 21 –25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఏఎస్సీఈ– ఈడబ్ల్యూఆర్ఐ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్తోపాటు సంస్థ అధ్యక్షుడు షిర్లీ క్లార్క్ నాయకత్వంలోని ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పరిధి– సామర్థ్యంతోపాటు నిర్మాణంలో చూపించిన వేగంపట్ల ఆ ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పలు నీటిపారుదల ప్రాజెక్టులతో తెలంగాణలో చోటుచేసుకున్న సామాజిక, ఆర్థిక ప్రగతిని ప్రశంసించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆ ప్రతినిధి బృందం అతితక్కువ సమయంలోనే నీటివనరుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించిన తీరుపట్ల అభినందనలు తెలిపింది. మెగా ప్రాజెక్టుల గురించి వివరించండి... కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడానికి రాష్ట్రప్రభుత్వం అవలంబించిన విధానాలతోపాటు తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని కేటీఆర్‌కు పంపిన ఆహ్వానలేఖలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ–నీటి వనరుల సంస్థ కోరింది. కాగా, 177 దేశాలకు చెందిన 1,50,000 కంటే ఎక్కువమంది సివిల్ ఇంజనీర్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్‌లో సభ్యులుగా ఉన్నారు. 1852లో స్థాపించబడిన ఈ సంస్థ అమెరికాలోనే పురాతన ఇంజనీరింగ్ సొసైటీ. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతోపాటు నీటివనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తోంది. కాగా, ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, నీటిసంరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. -
రింగ్‌కు అటూ ఇటూ హైదరాబాద్ సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్మించనున్న రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ ప్రకారం కొన్ని పట్టణాలు రింగురోడ్డు లోపల, మరికొన్ని పట్టణాలు దాని వెలుపల ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న జలవనరులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, ఇతర నీటి కాలువల ఆధారంగా ఈ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. యాదాద్రిని దాటిద్దామనుకున్నా.. యాదగిరిగుట్ట దేవాలయం ఈ రీజినల్ రింగు రోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం భావించినా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో దానికి నీటిని అందించే కాళేశ్వరం నీటి కాలువకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తాజా అలైన్మెంట్ ప్రకారం యాదాద్రికి దాదాపు 4 కి.మీ. దూరం నుంచే రోడ్డు నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి నుంచి యాదాద్రికి వెళ్లే రాయగిరి రోడ్డు మొదలయ్యే చోట, భువనగిరి పట్టణం బైపాస్ రోడ్డు ముగిసే ప్రాంతానికి చేరువగా ఆర్ఆర్ఆర్ క్రాస్ కానుంది. ఇది భువనగిరి పట్టణానికి చేరువగా ఉండనుంది. అంటే భువనగిరి పట్టణం రీజనల్ రింగురోడ్డు లోపలివైపు ఉండనుండగా యాదాద్రి టెంపుల్ టౌన్ మాత్రం దీనికి ఆవల ఉండనుంది. బస్వాపూర్ రిజర్వాయర్‌కు సమీపంలోని తుర్కపల్లి పట్టణం మాత్రం రింగురోడ్డు లోపలివైపే ఉండనుంది. తుర్కపల్లి నుంచి యాదాద్రికి నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు మధ్య భాగం నుంచి ఈ రోడ్డు క్రాస్ కానుంది. దీనికి ఇటు తుర్కపల్లి, అటు యాదాద్రి సమ దూరంలో ఉండనుంది. ఇక తుర్కపల్లికి సమీపంలోని జగదేవ్‌పూర్ పట్టణం రీజినల్ రింగురోడ్డుకు వెలుపలే ఉండనుంది. మరోవైపు గజ్వేల్ పట్టణం సైతం రింగురోడ్డు పరిధిలోకి రావడంలేదు. ఆ పట్టణానికి నిర్మిస్తున్న ప్రత్యేక రింగురోడ్డుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్ఆర్ఆర్ మార్గాన్ని కాస్త దూరంగానే నిర్మించనున్నారు. అలాగే తూప్రాన్ పట్టణం రింగురోడ్డు లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ రూపొందించారు. తర్వాత నర్సాపూర్, సంగారెడ్డి పట్టణాలు కూడా రింగురోడ్డు లోపలికే ఉండబోతున్నాయి. ఈ పట్టణాలు దాటాక ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇటు భువనగిరి దాటిన తర్వాత వచ్చే వలిగొండ ఆర్ఆర్ఆర్ వెలుపలికి పరిమితం కానుండగా చౌటుప్పల్ మాత్రం రింగురోడ్డు లోపలివైపు ఉండనుంది. 130 గ్రామాల వరకు గుర్తింపు? రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి 85 గ్రామాల్లో భూసమీకరణ జరగనుంది. వాటిని గుర్తిస్తూ గెజిట్ విడుదల కానుంది. అయితే ఈ గెజిట్‌లో మరో 45 గ్రామాలను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. నేరుగా ప్రభావితం అయ్యే గ్రామాలకు అతిచేరువగా ఉండి కనీసం ఎకరం స్థలం అయినా కోల్పోయే గ్రామాన్ని కూడా గెజిట్‌లో చేర్చాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భూసమీకరణ సమయంలో గ్రామ పంచాయతీల మధ్య తేడా వస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు మరో గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్ని నివారించేందుకు ముందుగానే ఆయా గ్రామాలకు అతిచేరువలో ఉన్న వాటిని కూడా గుర్తించనున్నారు. -
కేసీఆర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎందుకో అర్థం కావడం లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కైలాశ్‌కుమార్, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడుతూ, తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేసిన పొన్నాల, గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్ వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని అన్నారు. దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తోందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వచ్చాయని, పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినన తర్వాత ఒక్క మెగావాట్ కూడా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు. -
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నాం: మంత్రి అనిల్
సాక్షి, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని జల వనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో అదే తాము ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటిమట్టం రాక ముందే తెలంగాణ రాష్ట్ర అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ‘చంద్రబాబు మతిభ్రమించినట్లే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలకు మతి భ్రమించి ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తున్నారు. నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్ మీటింగ్‌లకు పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!
గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్ ఇంటర్‌ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. ముప్పు ముంచుకొస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్‌లో మార్పులు చేసి తాము ఫిల్టర్ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు. -
ఢిల్లీలో జలజీవన్ మిషన్ కార్యక్రమం
-
నీటి వనరులపై సర్వే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జల వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న తరహా సాగునీటి వనరుల సర్వే చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. బోర్లు, బావులు, ఉపరితల నీటి నిల్వలకు ఆధారమైన కొలనులు, కుంటలు, చెరువులు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు, ఊట కుంటల సంఖ్యను లెక్కిస్తారు. రెండు వేల హెక్టార్లలోపు భూములకు సాగు నీరందించే వనరుల సమగ్ర సమచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తారు. సదరు నీటి వనరు ఎప్పుడు ఏర్పాటైంది.. ఆ కాలంలో చేసిన ఖర్చు, నీటి సామర్థ్యం, దాని కింద ఖరీఫ్, రబీ సీజన్లలో సాగవుతున్న భూ విస్తీర్ణం, పండుతున్న పంటలు, ప్రస్తుత నీటి నిల్వలు, వినియోగంలో లేకుంటే అందుకు గల కారణాలు.. ఇలా సంపూర్ణ వివరాలు రాబడుతారు. ఈ సర్వే వారం రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. సర్వే ఉద్దేశం ఇదీ.. ప్రతి ఐదేళ్లకోసారి చిన్నతరహా సాగునీటి వనరుల సర్వేను కేంద్ర జల వనరుల శాఖ చేపడుతోంది. 1986–87లో తొలిసారి శ్రీకారం చుట్టగా.. ప్రస్తుతం జరిగేది ఆరో సర్వే. 2017–18 సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీకావడంతో దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ప్రతి ఐదేళ్ల వ్యవధిలో నీటి వనరుల పరిస్థితి ఎలా ఉంది? నీటి వినియోగం తగ్గిందా.. పెరిగిందా? పంటల సాగు విస్తీర్ణం ఎలా ఉంది? ఆయా పంటలకు వినియోగమవుతున్న నీటి పరిమాణం, గతానికి..ప్రస్తుతానికి నీటి నిల్వలు పెరిగాయా..తగ్గాయా? తదితర వివరాలను విశ్లేషిస్తారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరగడం లేదు. ఒక్కోసారి విస్తృతంగా వర్షాలు కురిసినా ఆశించిన స్థాయిలో నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. మరోపక్క భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నీటి వనరుల గణన ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉంటే అందుకు గల కారణాలను కూలంకషంగా విశ్లేషించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు. అంతేగాక భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశమూ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో గుర్తించిన ప్రతి నీటి వనరుని జియోట్యాగ్ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసంతోపాటు సర్వేలో పాదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. 18లోపు అధికారులకు శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి నీటి వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం ఉద్యోగులను రంగంలోకి దించుతోంది. పల్లెల్లో వీఆర్ఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. ఇక మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు లేదా వర్క్ ఇన్స్పెక్టర్లు సర్వేలో పాల్గొంటారు. ఈ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు వీరిని సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సర్వే ఎలా చేయాలన్న అంశంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. సర్వేపై అవగాహన కల్పించారు. ఈనెల 18లోపు మండల, మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగులకు సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి గణన చేపడతారు. ఈనెల 30వ లోపు సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
కృష్ణమ్మ రాకతో జలసిరి
సాక్షి, కోడేరు: వరుస కరువుతో కుదేలైన అన్నదాతల ఆశలు కృష్ణమ్మ పరవళ్లతో రెక్కలు విప్పుకున్నట్లయ్యింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబొగుడ రెండో లిప్టు నుంచి నీరురావడంతో కోడేరు మండలంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మండలంలోని అన్నదాతలు పంటలను పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా వరిసాగు మండలంలోని కోడేరు, పస్పుల, రాజాపూర్, ముత్తిరెడ్డిపల్లి, ఎత్తం, నాగులపల్లి, కొండ్రావుపల్లి, నర్సాయిపల్లి తదితర గ్రామాలకు కేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు రావడంతో ఆరుతడి పంటలు, వరిపంటలను సాగు చేసుకున్నారు. కొన్నేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడిన రైతులకు జొన్నలబొగుడ ద్వారా సాగునీరు వచ్చి చెరువులు, కుంటలు నిండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందన్నారు. రబీలో వేసిన పంటల ద్వారా తమ అప్పులను తీర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బోరుబావులు లేని రైతులు చెరువులు, కుంటల వద్ద మోటార్ల ద్వారా తమ పొలాలకు సాగునీరు అందించుకొని అధిక దిగుబడులు పొందుతున్నామని పేర్కొంటున్నారు. మత్స్యకారులు సైతం చేపలను పెంచుతూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పుంజుకోని వరి నాట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చెరువులు, బావులు, బోర్లలో నీటివనరులు అడుగంటడంతో నాట్లు పుంజుకోవడంలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 37,500 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది రబీలో వరి సాగు గణనీయంగా జరిగినా, ఈసారి పరిస్థితి దారుణంగా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదికను సర్కారుకు పంపించింది. ఆ నివేదిక ప్రకారం రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 8.20 లక్షల (25%) ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.80 లక్షల (44%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.70 లక్షల (87%) ఎకరాల్లో వేశారు. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.22 లక్షల (63%) ఎకరాల్లో సాగైంది. 18 జిల్లాల్లో వర్షాభావం... రాష్ట్రంలో రబీ సీజన్ మొదలైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కరువు ఛాయలు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. అక్టోబర్‌లో 83 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నవంబర్‌లో ఏకంగా 95 శాతం లోటు రికార్డు అయింది. ఇక డిసెంబర్లో ఇప్పటివరకు 81 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ దాడి అధికంగా ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇక ఖరీఫ్‌లో వరి కోతలు కొనసాగుతున్నాయి. కంది ఇప్పుడే కోత దశకు చేరింది. జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్లన్నీ చేతికొచ్చాయి. ఇక పత్తి తీత చివరి దశకు చేరుకుంది. మిరప రెండో తీత దశలో ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. -
సృజనాత్మకతతో అభివృద్ధి జరగాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి పరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సృజనాత్మక మార్గాలతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నాటికి స్పష్టమైన పురోగతి కనిపించేలా పనిచేయాలని 115 వెనుకబడిన జిల్లాల కలెక్టర్లు, ఇన్చార్జి అధికారులకు సూచించారు. శుక్రవారం ‘ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్’ అనే కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. అభివృద్ధి లక్ష్యాలు సాధించి శాశ్వత సంతృప్తి పొందే అవకాశం 115 జిల్లాల అధికారులకు ఉందని అన్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే సంబం ధిత అధికారులు సులువైన లక్ష్యాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని, ప్రజల్లో ఆశావహ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ‘ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి జరుపుకుంటున్నాం. వెనకబడిన జిల్లాల్లో సృజనాత్మక మార్గాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి ఈ మూడు నెలలు కష్టపడదాం. నవ భారత నిర్మాణానికి ఈ 115 జిల్లాలే నాంది పలకాలి. ప్రజలు వెనకబడి ఉన్నారంటే వారికి అన్యాయం జరిగినట్లే అవుతుంది’ అని అన్నారు. కార్యక్రమంలో కొందరు అధికారులు పోషణ, విద్య, మౌలిక వసతులు, వ్యవసాయం, జల వనరులు, మావోయిస్టుల సమస్య, నైపుణ్యాభివృద్ధి తదితరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. -
కాస్త తగ్గినా.. రబీ ఆశలు సజీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద సాగు విస్తీర్ణం గత ఏడాది రబీతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీలో గత ఏడాది చెరువుల కింద సాగు 7.25 లక్షల ఎకరాలు దాటగా, ఈ ఏడాది 5.16 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిషన్ కాకతీయ కింద మూడు విడతల్లో 22,895 చెరువులను పునరుద్ధరించినా, లోటు వర్షపాతం కారణంగా చెరువుల్లో నీరు చేరకపోవడం ఆయకట్టును ప్రభావితం చేయనుంది. పదేళ్లతో పోలిస్తే.. ఆశాజనకమే.. రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా, వాటి కింద 24,39,515 ఎకరాల మేర సాగు విస్తీర్ణం ఉంది. కృష్ణా, గోదావరిలో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షలకు మించి ఆయకట్టుకు నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 ఏడాది నుంచి ప్రస్తుతం వరకు ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా చూస్తే గరిష్టంగా 2013–14 ఖరీఫ్‌లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. గత సంవత్సరం కంటే ముందు 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్గో రబీ సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 2016–17లో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువుల పునరుద్ధరణ రబీ సాగుకు ఊపిరి పోసింది. దీంతో గత ఏడాది రబీలో గరిష్టంగా 7.25 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈ ఏడాది మొత్తం చెరువుల్లో 14,418 చెరువుల్లో 25శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువు ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి పెద్దగా నీరు చేరని కారణంగా కూడా చెరువులను నింపడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ మూడు విడతల్లో పునరుద్ధరించాలని తలపెట్టిన 22,895 చెరువుల్లో ప్రస్తుతం వరకు 15,649 చెరువుల పనులు పూర్తి కావడంతో వర్షాలు మెరుగ్గా ఉన్న చోట్ల నీటి లభ్యత కొంత పెరిగింది. దీంతో ఈ ఏడాది 5,16,097 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఆయకట్టు తగ్గినా.. పదేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రస్తుతం చెరువుల ద్వారా సాగయ్యే ఆయకట్టు గణనీయంగా ఉండటం ఆయకట్టు ఆశలను సజీవం చేస్తోంది. -
ఈ నెల గడిచేనా..?
► కోరుట్లకు మంచినీటి గండం ► నిండని పాలమాకుల చెరువు ► ఖాళీ అవుతున్న తాళ్ల చెరువు.. ► భూగర్భజలాలకూ దెబ్బ కోరుట్ల: వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోరుట్లకు మంచినీటి ముప్పు పొంచి ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. ఈ నెలాఖరులో నీటి గండం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. పెరిగిన అవసరాలు... ఈ మధ్యకాలంలో కోరుట్ల జనాభా సుమారు లక్షకు మించిపోయింది. పట్టణంలోని 31వ వార్డుల్లో కలిపి మొత్తం 22 వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేలకుపైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో మంచినీటి పైప్లైన్లు లేని ఏరియాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీరోజు పట్టణ జనాభా అవసరాలకు నల్లా కనెక్షన్ల ద్వారా సరాఫరా చేయడానికి సుమారు 4.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పట్టణ శివారులోని తాళ్ల చెరువు నుంచి నీటిని వాగులో ఉన్న బావుల్లో నింపి వాటర్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లాల నుంచి నీటిని సరాఫరా చేస్తున్నారు. ఇదంతా మంచినీటి పైప్‌లైన్ ఉన్న చోట మాత్రమే జరుగుతోంది. మంచినీటి పైప్లైన్లు పూర్తిస్థాయిలో లేని భీమునిదుబ్బ, రథాల పంపు, హాజీపురా, ఆనంద్‌నగర్, ఆల్లమయ్యగుట్ట ఏరియాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడంతో నల్లానీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీటి అవసరాలు మరింత పెరిగాయి. అవసరాలు పెరిగినా నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారడంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నెల గడిచేనా..? పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం వాడుతున్న తాళ్ల చెరువులో నీటి మట్టం దాదాపుగా డెడ్‌స్టోరేజీకి చేరింది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ముందుచూపుతో ఎస్సారెస్పీ నీటిని వదిలిన సమయంలో మరో నీటి వనరుగా ఉన్న పాలమాకుల చెరువును నింపే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఫలితంగా తాళ్ల చెరువు, పాలమాకుల చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులు మరో 20–25 రోజులకు మించి సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు లేని క్రమంలో భూగర్భ జలమట్టం సుమారు 900 ఫీట్లుకు పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు మున్సిపల్ నల్లా నీరు లేక..అటు బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది క్రితంలా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయాల్సిన దుస్థితి మళ్లీ వస్తుందా..? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. -
జలవనరులపై సర్వే చేయండి
♦ ఆయకట్టు, శిఖం వివరాలు సేకరించాలి ♦ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ♦ వీఆర్వో, తహసీల్దార్, ఎంఏవోలకు ఆదేశాలు ♦ కలెక్టరేట్లో మండల అధికారుల సమావేశం ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలోని జలవనరులు, వాటి ఆయకట్టు సామర్థ్యం తదితర వివరాలను సర్వే ద్వారా గుర్తిం చాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి మండల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వీఆర్వోలు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు ఉన్నాయని, ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ జలవనరులు ఉన్నాయో వీఆర్వోలు, తహసీల్దార్లు గుర్తించాలని సూచించారు. ఆయా ట్యాంకులకు ఎంత నీటి సామర్థ్యం ఉంది, దాని చుట్టూ ఎంత ఆయకట్టు ఉందో వివరాలు సర్వే చేసి తీసుకోవాలని పేర్కొన్నారు. చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు, వాగుల పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, అలాంటి వాటిపై దృష్టి సారించి సమగ్ర వివరాలు తెలపాలని వివరించారు. ఒక్కో చోట ఎన్ని నీళ్లున్నాయి.. చుట్టూ ఎన్ని మీటర్ల దూరంలో బోరు వేస్తే నీళ్లు పడతాయి. . ఆయకట్టు ఎప్పుడు, ఎంత నీటిని విడుదల చేయాలనే అంశాలు ఉండాలని అన్నారు. ఆ వివరాలన్ని ఉంటేనే జిల్లాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఆక్రమణల వల్ల వాగులు, కుంటలు, చెరువులు చెడిపోతున్నాయని, శిఖం భూములు లేకుండా పోతున్నాయని, ప్రభుత్వ భూములపై దృష్టి సారించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ ఈ సమావేశానికి హాజరుకాగా, ఇరిగేషన్‌పై వివిధ అంశాల్లో మండల అధికారులతో చర్చించామని తెలిపారు. త్వరగా సర్వే చేసి వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో బానోత్ శంకర్, తహసీల్దార్లు అతికొద్దీన్, రాంరెడ్డి, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.