గొంతు తడవని గిరి‘జనం’
గొంతు తడవని గిరి‘జనం’
Published Thu, May 25 2017 5:10 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల గోస
- ఎండిన బావులు, బోర్లు, పనిచేయని ట్యాంకులు
- 2008లో ప్రారంభమై మూలకు పడ్డ నీటిశుద్ధి కేంద్రాలు
- మోక్షం కలగని రివర్స్ ఆస్మాసిస్ పథకం
- కుమ్రం భీం ప్రాజెక్టును పూర్తి చేయని పాలకులు
సాక్షి, మంచిర్యాల
► ఉట్నూరు మండలంలోని చాందూరి పంచాయతీ పరిధిలో గల కెస్లాగూడ జనాభా 50. తాగునీటి బావిలో నీరు అడుగంటడంతో తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
► చింతలమానెపల్లి మండంలోని డబ్బా గ్రామపంచాయతీలో వెనుకబడిన గ్రామం ధరంపల్లిలో నివసిస్తున్న రెండు వేల జనాభాకు ఏడు చేతిపంపులు, నాలుగు బావులు ఉన్నా నీరు లేదు. కిలోమీటరు దూరంలోని వాగులోని చెలిమెలే దిక్కయ్యాయి.
► తిర్యాణి మండలంలోని గడలపల్లిలో 70 కుటుంబాలకు రెండు చేతి పంపులే దిక్కు. రోజంతా పది బిందెల నీరు కూడా రావడం లేదు. అదీ మురికినీరు.
► ఇంద్రవెల్లి మండలంలోని గట్టెపల్లి, సాలెగూడ, కెరమెరిలోని కొప్పగూడ, ఉట్నూరులోని లెండిగూడ, తానూరు మండలంలోని హిప్పెల్లిగూడ, నర్సాపూర్(జె), చెన్నూరు మండలంలోని సుందరసాల, భీమిని మండలంలోని మామిడిగూడ, నర్సాపూర్(జి) మండలంలోని కుస్లి, జన్నారం మండలంలోని కొలాంగూడ గ్రామాల్లో తాగునీటి కోసం తండ్లాడుతున్నారు.
► ఆదిలాబాద్ మండలం ఖండాల పంచా యతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు.
వట్టిపోయిన గట్టి పథకాలు
2008 సంవత్సరంలో ఐటీడీఏ, వాటర్ హెల్త్ ఇండియా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు కోటి వ్యయంతో ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఏర్పాటైన నీటిశుద్ధి కేంద్రాలు మూలకు పడ్డాయి. ఇక 2010–11లో రివర్ అస్మాసిస్ పేరుతో ఏజెన్సీలో దాదాపు 18 ప్రాంతాల్లో సురక్షిత నీటి కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మండలాలకు కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
విద్యుత్ కోతతో అవస్థలు...
మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూర్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో నీళ్లు లేక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి పైప్‌లైన్ ద్వారా నీళ్లు పొందుతున్నారు. అయితే త్రీఫేజ్ కరెంట్ సమస్య కారణంగా అర్ధరాత్రి తాగునీరు పట్టుకునేందుకు గ్రామాల్లో బారులు తీరుతున్నారు. కుభీర్ మండలంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది.
జాడలేని మిషన్ భగీరథ
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పథకం ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో ఇంకా ఇంటెక్ వెల్‌ల నిర్మాణం వరకు కూడా రాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆఫీసుల్లో కూర్చొని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, ప్రత్యామ్నాయ నీటివనరుల వృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అడుగంటిన నీటి వనరులు
గిరిజనులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాలు, గ్రామాల్లో తాగునీటి వనరులు అడుగంటాయి. నీటి అవసరాలను తీర్చే వాగులు, వంకలు, వ్యవసాయ బావులు కూడా ఎండిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు సతమతమవుతున్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల దూరం నుంచి మహిళలు బిందెలు మోస్తూ వస్తున్న దృశ్యాలే. రక్షిత మంచినీటి సరఫరా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల కాలంగా చేస్తున్న ‘భగీరథ’ప్రయత్నాలేవీ సాకారం కాకపోవడమే ఈ దుస్థితికి కారణం.
Advertisement
Advertisement