
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం.
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే..
ఝుమైర్ నృత్యం అంటే..
ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు.
చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు.
ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం.
అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.
(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..)