
ఇతర అవసరాలకు నీటి సరఫరా నియంత్రించాలంటున్న ప్రభుత్వ వర్గాలు
అప్రమత్తమైన సర్కారు.. కృష్ణా, గోదావరి బేసిన్‌ల కనీస నీటిమట్టం నుంచి తాగునీరు తీసుకోవాలని ఆదేశం
మొత్తంగా 58.72 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు ముదరక ముందే పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొన్ని రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ చివరి వరకే తాగునీటికి సరిపోతాయని పేర్కొన్నాయి. ప్రధానంగా గోదావరి బేసిన్ కింద ఉన్న మంచినీటిని సరఫరా చేయడానికి ఉన్న నీటివనరుల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని రిజర్వాయర్లలో కనీస నీటిమట్టం నుంచి తాగునీరు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బేసిన్ నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్ కింద 35.28 టీఎంసీలను కలిపి మొత్తంగా 58.72 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు మిషన్ భగిరథ పథకం కింద ఈ నీటి కేటాయింపులు చేసింది.
తాగునీటి అవసరాలపై అధికారుల లెక్కలు ఇలా..
» ప్రస్తుతం జూరాలకు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి చివరి నాటికి ఇన్‌ఫ్లోలు ఆగిపోతాయని, ప్రస్తుతం ఉన్న అవుట్‌ఫ్లో కొనసాగినా ఏప్రిల్ వరకే నీరు అందించడానికి వీలవుతుందని... అప్పుడు సంగంబండ నుంచి నీటి సరఫరా చేస్తే తప్ప తాగునీరు సరఫరా చేయని పరిస్థితులు తలెత్తుతాయని స్పష్టం చేశారు.
» ఎల్లంపల్లిలో రోజుకు 0.20 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. అలా చేస్తే మార్చి నెలాఖరు వరకే నీరు సరిపోతుంది. అందుకని ఇతర అవసరాలకు ఎల్లంపల్లి నీటి వినియోగాన్ని ఆపేయాలి. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ వరకు 7 టీఎంసీల నీరు నిల్వలు ఉండేలా చూడాలి.
» మిడ్‌మానేరు నుంచి రోజుకు 0.20 టీఎంసీల నీరు వినియోగిస్తున్నారు. ఇలా కొనసాగిస్తే ఏప్రిల్ వరకు మాత్రమే నీరు రిజర్వాయర్‌లో ఉంటాయి. ఆ తరువాత ఇక్కట్లు తలెత్తుతాయి. మిడ్‌మానేరు నీరు కలుíÙతం కాకుండా ఉండాలంటే కనీసం ఆరు టీఎంసీల నిల్వ ఉంచాలి. ఇతర అవసరాలకు వినియోగాన్ని తగ్గించాలి.
» లోయర్ మానేరు నుంచి రోజుకు 0.13 టీఎంసీలు నీరు వాడుతున్నారు. అలా వాడితే ఏప్రిల్ వరకే నీరు అందుబాటులో ఉంటుంది. అందుకని ఇతర వినియోగాన్ని తగ్గించాలి.
» రామన్‌పాడు, వనపర్తి నుంచి 46 హ్యాబిటేషన్లు, రెండు మునిసిపాలిటీలకు ఏప్రిల్ చివరి వరకు నీటి సరఫరా చేయాలంటే 0.20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి.
» పాలేరు–ఖమ్మం రిజర్వాయర్‌లోకి ఏప్రిల్ నెలాఖరు వరకు 1.90 టీఎంసీ నీటి నిల్వ ఇన్‌ఫ్లో కొనసాగించి అవుట్‌ఫ్లో నిలిపివేయాలి.
» నల్లగొండ జిల్లాలోని ఏకేబీఆర్ రిజర్వాయర్ నుంచి 999 ఆవాసాలు, 5 మునిసిలిటీలకు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీరు కేవలం 22 రోజులకు మాత్రమే సరిపోతుంది. దీనికి ఎన్‌ఎస్‌పీ నుంచి నీటి సరఫరా చేయాలి. అలాగే పెండ్లిపాకల నుంచి 67 హ్యాబిటేషన్లకు నీటి సరఫరా 38 రోజులకు సరిపడా మాత్రమే ఉంది. దీనికి కూడా ఎన్‌ఎస్‌పీ నుంచి నీటి సరఫరా చేయాలి.
» ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిజామాబాద్ నుంచి రోజుకు 0.46 టీఎంసీల నీరు అన్ని అవసరాలకు వాడుతున్నారు. మిగిలిన అవసరాలకు నీటిని తగ్గించాలి. ఏప్రిల్ చివరి నాటికి 6 టీఎంసీలు నిల్వ ఉండేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment