తెలంగాణలో 64,056 జల వనరులు | 64,056 water bodies in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 64,056 జల వనరులు

Published Mon, Apr 24 2023 4:36 AM | Last Updated on Mon, Apr 24 2023 4:36 AM

64,056 water bodies in Telangana - Sakshi

తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్‌ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్‌ యాజమాన్యంలో ఉన్నాయి.

17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు.  – సాక్షి, న్యూఢిల్లీ


నిండిన స్థితిలో 43,695 జల వనరులు 
రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి.

గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్‌ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి.  

1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు  
రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్‌ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు.

ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement