అటవీ భూముల అన్యాక్రాంతంపై మీనమేషాలు
సర్వేల పేరిట అటవీ, రెవెన్యూ శాఖల కాలయాపన
ఇనుపరాతి గుట్టల చుట్టూ 3,952 ఎకరాలు... పలుచోట్ల ఆక్రమణలు
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే తీరు...
ఇప్పటికే తగ్గిన అటవీ విస్తీర్ణం.. దేశంలో మూడో స్థానంలో తెలంగాణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూములను గుర్తించడంలో అధికారుల కాలయాపన వల్ల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యానికి దోహదపడాల్సిన సామాజిక అడవుల పెంపకం ఆగిపోగా.. ఆ భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. రెవెన్యూ, అటవీశాఖల్లోని కొందరు అధికారుల ఉదాసీనత వల్ల అడవులు (Forest) పెరిగిన భూములు సైతం ఆక్రమణదారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగా.. వారు ‘రైతుబంధు’ను సైతం పొందుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల వివాదాలున్నాయి. చాలాచోట్ల కోర్టుల ద్వారా పరిష్కారమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు సుమారు ఆరు నెలల కిందట తీర్పు ఇచ్చింది.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇనుపరాతి గుట్టల చుట్టూ ఆక్రమణలకు గురైన అటవీ భూములపై రెవెన్యూ, అటవీశాఖలు ఎటూ తేల్చడం లేదు. సర్వేల పేరిట సాగదీత నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అటవీ భూములు స్వాదీనం చేసుకుంటారా? పరాదీనమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల సాయంతోనే యథేచ్ఛగా ఆక్రమణలు..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల శివార్లలోని ఇనుపరాతి గుట్టల చుట్టూ అటవీశాఖ లెక్కల ప్రకారం 3,952 ఎకరాలు ఉంది. నిజాంకాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కొత్తపల్లి బ్లాక్‌లో 594 ఎకరాలు, దామెరలో 560, ఎర్రబెల్లిలో 820, దేవనూరులో 1,095, ముప్పారం బ్లాక్‌లో 906 ఎకరాలుగా ఉంది.
కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీశాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంతో ఇంకా ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అందజేస్తున్నారు.
గతంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 30 ఎకరాల వరకు ధర్మారం మండలంలోని అటవీ శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పందిఅడుగుగుట్ట పరిధిలోని భూములు కొందరి కబ్జాలో ఉన్నాయి. ఏడాది క్రితం 102 ఎకరాలు కొందరికి పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఉన్నతాధికారులు చెక్ పెట్టారు.
అయినా 40 ఎకరాల వరకు పట్టా అయ్యిందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉండగా.. కొందరు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే వారి రంగప్రవేశం జరిగిందన్న చర్చ సాగుతోంది.
ఇదిలా వుండగా ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్డ్ చేయగా, వారికి సైతం రెవెన్యూ అధికారులు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం వల్ల పట్టాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.
తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం..
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్‌లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్‌లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్‌లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్‌లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.
ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులోని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ఉన్న భూములు, నోటిఫికేషన్‌లో లేని భూములు గుర్తించాం. ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటాం. దేవునూర్, ముప్పారం గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్ అధికారులకు– రైతులకు మధ్య జరుగుతున్న వివాదం పరిష్కారమయ్యేలా ఫారెస్ట్ భూములు, రైతుల పట్టా భూములు సర్వే చేశాం.
– బి.సదానందం, తహసీల్దార్, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా
సర్వే వివరాలు అందాల్సి ఉంది..
ఇనుపరాతి గుట్టలు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న సర్వే ఇంకా కొంతమేర మిగిలి ఉంది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవనూరు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల శివారులో ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ భూమి 3,750 ఎకరాలకుపైన ఉండాలి. ఈ భూమికి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు. జిల్లా ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment