కొత్త చట్టం అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు.. మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు
ఫిబ్రవరి మూడో వారానికల్లా పూర్తికానున్న ప్రక్రియ.. మార్చిలో చట్టం అమల్లోకి వచ్చే అవకాశం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు దిశగా రెవెన్యూ శాఖ వడివడిగా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం అమలులో భాగంగా అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. చట్టంలోని సెక్షన్లు, సబ్ సెక్షన్లవారీగా మార్గదర్శకాలను రూపొందించే పనిలోపడ్డారు. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య పక్షాలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్క్‌షాప్‌లో మార్గదర్శకాలు ఎలా ఉండాలనే విషయమై స్పష్టత రానుంది.
మార్గదర్శకాల రూపకల్పన వచ్చే నెల మూడో వారానికల్లా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయ్యాక వాటిని మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అయితే వచ్చే నెలలో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
మాతో చర్చించి నిర్ణయం తీసుకోండి: వీఆర్వోల జేఏసీ
గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేసిన తమను షరతుల్లేకుండా మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలు పెట్టకుండా సర్వీస్‌కు భద్రత కల్పిస్తూ నియమించాలని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్‌రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్‌చైర్మన్లు చింతల మురళి, ప్రతిభలు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. హైకోర్టులో ఉన్న కేసులను పరిష్కరించకుండా, తమతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని వారు ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment