
గ్రామ పాలనాధికారుల నియామకాలకు విధివిధానాలు విడుదల
జీవో నం.129 జారీ చేసిన రెవెన్యూ శాఖ
రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చినవారే అర్హులు
స్క్రీనింగ్ టెస్టు తర్వాతే ఎంపిక
గతంలో రెవెన్యూలో ఉన్న సీనియారిటీ ఇవ్వడం కుదరదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలనాధికారుల (జీపీవో) పోస్టుల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను గ్రామ స్థాయిలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ శనివారం జీవో నం: 129 విడుదల చేశారు.
ఈ జీవో ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారిలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
పరీక్ష వద్దని, తమను నేరుగా మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా పరీక్ష నిర్వహణ వైపే మొగ్గు చూపింది. అలాగే మళ్లీ రెవెన్యూలోకి వస్తున్నంత మాత్రాన గతంలో రెవెన్యూ శాఖల్లో పనిచేసిన కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీసు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభం కావాల్సిందేనని జీవోలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్‌ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఎవరెవరు అర్హులు?
జీవో నం.129 ప్రకారం ఈ గ్రామ పాలనాధికారుల పోస్టులను గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారితో మాత్రమే భర్తీ చేస్తారు. గతంలో వీఆర్వోలుగా పనిచేసి ఇతర శాఖల్లో విలీనమైన వారు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖల్లో రికార్డ్/ జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారిని వారి అర్హతల ఆధారంగా ఈ పోస్టుల్లో నియమిస్తారు.
అర్హతలేమిటి?
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండి మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఈ పోస్టుకు అర్హులు. అదే విధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే వీఆర్వోలుగా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. లేదంటే వీఆర్‌ఏతో పాటు ఇతర శాఖల్లో నియమితులై ఐదేళ్లు పూర్తయి ఉండాలి.
ఉద్యోగ బాధ్యతలివే
గ్రామ పద్దుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీకి తగిన విధంగా విచారణ జరపడం, ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర నీటి వనరుల ఆక్రమణలపై విచారించడం, భూసంబంధిత వివాదాల దర్యాప్తు, భూముల సర్వేలో సర్వేయర్లకు సహకారమందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో పనిచేయడం, అత్యవసర సర్వీసులందించడం, ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లబ్దిదారులను గుర్తించడం, ఎన్నికల సంబంధిత విధులు, ప్రొటోకాల్ సహకారం, ఇతర ప్రభుత్వ శాఖలతో గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో అంతర్గత సహకారం, ప్రభుత్వం లేదా సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు నిర్దేశించే ఇతర పనులు.
ఎంపిక ఎలా?
దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. రెవెన్యూ వ్యవస్థపై దరఖాస్తుదారులకు ఉన్న అవగాహన, పట్టును అంచనా వేసే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. ఈ గ్రామపాలనాధికారులను ఎంపిక చేసి వారిని వివిధ జిల్లాల్లో నియమించే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లేదా సీసీఎల్‌ఏ నియమించే అధికారికి ఉంటుంది. జిల్లాలకు పంపిన వారిని కలెక్టర్లు అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన సర్వీసు నిబంధనలను త్వరలోనే రూపొందిస్తారు.
తప్పుల తడక జీవోను అంగీకరించం: తెలంగాణ వీఆర్వోల జేఏసీ
‘ఈ జీవో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చినట్టుగా లేదు. ఇంకా బీఆర్‌ఎస్ ఆనవాళ్లు ఉన్న వారి వారసులు కొందరు ఇచ్చినట్టుగా ఉంది. సీనియార్టీ కలపబోమని, పరీక్ష రాసిన తర్వాతే మళ్లీ రెవెన్యూ శాఖలోకి రావాలని ఈ జీవో ద్వారా చెబుతున్నారు. మళ్లీ పరీక్ష అంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. సీనియార్టీ ఇవ్వడం లేదంటే మా శ్రమకు గుర్తింపు ఇవ్వనట్టే. అసలు జీవోలోనే ఎన్నో తప్పులున్నాయి.
తప్పులతడక జీవోను మేం అంగీకరించబోం. కామన్ సీనియార్టీ ఇచ్చి ఎలాంటి పరీక్ష లేకుండా పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలను మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమ బాట తప్పదు..’అని వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, నేతలు హరాలే సుధాకర్‌రావు, పల్లెపాటి నరేశ్, కాందారి భిక్షపతి, ఎస్.కె.మౌలానా, సర్వేశ్వర్, ప్రతిభ, చింతల మురళి, వెంకట్‌రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.