
రాయబోయే పరీక్షపైనే దృష్టి పెట్టాలి
ప్రతి ప్రశ్నను సమీక్షించుకుంటే సున్నిత కణజాలంపై ఒత్తిడి
లండన్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్తల పరిశోధన వెల్లడి
మంచి మార్కులు వస్తాయనుకున్న ప్రశ్నలను మననం చేసుకుంటే మేలు
సానుకూల దృక్పథంతో సన్నద్ధత ముఖ్యం
పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం తొలిరోజు పరీక్ష ముగిసింది. సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గురువారం తొలి పరీక్ష ముగుస్తుంది. మధ్యలో విరామం తర్వాత తదుపరి పరీక్షలు కొనసాగుతాయి. అయితే తొలిరోజు పరీక్ష అనుభవం మిగతా పరీక్షలకు మార్గదర్శకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరీక్ష ఎలా రాశాం? సన్నద్ధత సరిపోయిందా? అనేది ఒక్కసారి పైపైన సరి చూసుకోవాలే గానీ..దాని గురించి పెద్దగా ఆలోచించ కూడదని స్పష్టం చేస్తున్నారు.
ప్రతి ప్రశ్న లోతుల్లోకి వెళ్ళొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మెదడులోకి జ్ఞాపక శక్తిని ప్రేరేపించే సున్నితమైన కణజాలం ఒత్తిడికి గురవుతుందని లండన్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్తల పరిశోధన పేర్కొంటోంది. పరీక్షల సమయంలో ఒత్తిడి కల్గించే కణజాలంపై వారు ప్రత్యేక పరిశోధన చేశారు.
ఈ పరిశోధనతో పాటు ప్రస్తుత కీలక సమయంలో విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎలాంటి మానసిక ధోరణిని అలవాటు చేసుకోవాలి? అనే అంశాలపై మరికొన్ని ఇతర పరిశోధనలు, నిపుణుల సూచనలు, అధ్యాపకుల అనుభవాలను ‘సాక్షి’క్రోడీకరించింది.
పాజిటివ్ థింకింగ్ కొనసాగించాలి
రాసిన పరీక్ష ఎలా ఉన్నా చెయ్యగలిగిందేమీ లేదు. కాబట్టి విద్యార్థులు బాగా రాశాం అన్న పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలి. ఇది పరీక్షలు పూర్తయ్యే వరకూ కొనసాగించాలి. రాసిన పరీక్షలో బాగా మార్కులు వస్తాయనుకున్న ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సంధ్య తెలిపారు. ఇది మెదడులోని కణాలకు సానుకూల సంకేతాలను పంపుతుందని ఆమె చెప్పారు.
మున్ముందు రాసే పరీక్ష స్వభావం తేలికగా ఉంటుందనే భావన విద్యార్థిని ఉత్తేజపరుస్తుందని లండన్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ జాన్ ఉల్లేకర్ వివిధ పరిశోధనల పరిశీలన అనంతరం తెలిపారు. ముఖ్యంగా రాసిన పరీక్ష గురించి స్నేహితులతో పదేపదే సంభాషించకూడదు. దీనికి బదులు రాయబోయే పరీక్ష గురించి చర్చించుకోవడం మంచిది.
అలాగే జరిగిన పరీక్షకు సంబంధించి అధ్యాపకుడితో ఎక్కువసేపు చర్చించే కన్నా.. జరగాల్సిన పరీక్షకు సంబంధించి సంభాషించడం వల్ల సానుకూల దృక్పథం పెరుగుతుందని ముంబైకి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు నీలమ్ ద్వివేది ఇటీవల ఐఐటీ ముంబై విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు.
నిన్నటి అంశాలను మరిచిపోవాలి
కొన్ని రంగులు కలిస్తే మరో కొత్త రంగు ఏర్పడుతుంది. అదే విధంగా గత పరీక్షకు సీరియస్‌గా అయిన ప్రిపరేషన్.. తర్వాత పరీక్షకు సన్నద్ధతలో జ్ఞప్తికి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రిపరేషన్‌కు కొన్ని నిమిషాలు విరామం ఇవ్వాలని, అప్పుడే మంచి సన్నద్ధత అలవడుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త అనిల్ పాండే తెలిపారు.
రాసిన పరీక్షలో చివరి ప్రశ్నలు.. వాటి సమాధానాల తీరు మెదడులో నిక్షిప్తమై జ్ఞప్తికి వస్తుంటుంది. కాబట్టి తదుపరి పరీక్షకు పూర్తి వ్యతిరేక కోణంలో స్టడీ చేయాలని ఆయన సూచించారు. అంటే నిన్నటి పరీక్షకు చిన్నచిన్న ప్రశ్నలతో సన్నద్ధత మొదలుపెడితే.. రేపటి పరీక్షకు పెద్ద ప్రశ్నలతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.
రాయడం, వినడం, చదవడం, గ్రూప్ డిస్కషన్ లాంటివన్నీ ముందు రోజుకన్నా భిన్నంగా ఉండాలి. నిన్నటి అంశాలను పూర్తిగా మరిచిపోవడానికి కొంతసేపు రేపటి పరీక్ష సబ్జెక్టును, కాలేజీలో బోధకుడు చెప్పిన అంశాలతో పాటు సరదాగా సాగిన గతాన్ని చర్చించుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్‌కు పూర్తి స్థాయి ప్రణాళికను అనుసరించే వీలుంటుందని కెనడాలో పరీక్షలపై జరిగిన పరిశోధన సారాంశం తెలియజేస్తోంది.
సందేహాలు నివృత్తి చేసుకోవాలి..
టెన్షన్ వద్దు ఇంటర్‌లో రెండోరోజు రాసే పరీక్ష ఇంగ్లిష్. ఆర్టికల్స్, పాసివ్ వాయిస్, ప్యాసేజ్ క్వశ్చన్స్, మిస్సింగ్ లెటర్స్.. ఇలాంటివి బట్టీ పడితే రావు. వివిధ మార్గాల్లో ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు టెన్సెస్ (కాలాలు..భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) గురించి ప్రిపేర్ అవ్వాలంటే అనేక సందేహాలొస్తాయి. వాటికి కచ్చితమైన సమాధానాలు పుస్తకాల్లో ఉండవు.
ఇలాంటి సందర్భాల్లో మెదడును అధికంగా ఒత్తిడికి గురిచేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఏ టెన్స్‌ను ఏ సందర్భంలో ఉపయోగించాలనే సందేహం ఉంటే అధ్యాపకుడిని ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ప్యాసేజ్, పొయిట్రీ విషయంలో చేసే ప్రిపరేషన్ సరైందనే భావనతో ఉండాలి. క్రాస్ చెక్ పేరుతో సమయం వృథా చేయకూడదు. అనవసర భయాన్ని మెదడులోకి తీసుకెళ్ళొద్దు.
జస్ట్ ప్రాక్టీస్.. అంతే
ఇంటర్ ద్వితీయ పరీక్ష ఇంగ్లిష్. విద్యార్థులు తర్వాత రాసేది ఇదే. సాధారణంగా గ్రామర్ విషయంలోనే కొంత తికమక ఉంటుంది. మిస్సింగ్ లెటర్స్, ఆర్టికల్స్, ప్యాసేజీ వంటివి జడ్జి చేయడం ఇబ్బందే. అందువల్ల ఆఖరి నిమిషంలో కొంతమేర వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. గ్రామర్ పాయింట్స్‌కు పాఠ్య పుస్తకాలు ఫాలో అవ్వాలి. దీనివల్ల ఆఖరి నిమిషంలో కీలకమైన అంశాలు గుర్తించే వీలుంది. ఇది పాజిటివ్ మైండ్ సెట్‌కు దోహద పడుతుంది. – దాసరి సైదులు (ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆంగ్ల అధ్యాపకుడు, అమ్రాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment