Psychologists
-
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
మీరు చోద్యం చూస్తుంటారా?
ఒకప్పుడు నడిరోడ్డు మీద ఏదైనా అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నట్టుగా ఉండటం అనాగరికం. అమానవీయం. నేడు చోద్యం చూడటం సర్వసాధారణం. మొన్న ఢిల్లీలో ఒకమ్మాయిని ఒకబ్బాయి కత్తితో ΄పొడుస్తుంటే అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డారు. అదే కాదు, నేడు చాలా సందర్భాల్లో నేరం ఆపగలిగే శక్తి ఉన్నా ఆపడం లేదు. దీనిని సైకాలజిస్ట్‌లు ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ అంటున్నారు. మనం చోద్య శిఖామణులుగా ఉండల్సిందేనా? మొన్నటి ఆదివారం. సాయంత్రం. 20 ఏళ్ల సాహిల్ 16 ఏళ్ల అమ్మాయితో వాదనకు దిగాడు. చాలామంది ఆ దారిన పోతున్నారు. పట్టించుకోలేదు. సాహిల్ కత్తి తీశాడు. దారిన పోతున్నవారు చూశారు. పట్టించుకోలేదు. సాహిల్ ఆ అమ్మాయిని అనేకసార్లు ΄పొడిచారు. చచ్చిపోయింది. ఎవరూ అడ్డం రాలేదు. సాహిల్ ఆ తర్వాత ఒక బండ రాయి తెచ్చి ఆమె మీద పదే పదే విసిరాడు. దారిన పోతున్నవాళ్లు చూస్తున్నారు. పోతున్నారు. పట్టించుకోలేదు. వీరు మనుషులా అనే సందేహం రావచ్చు. మనుషులే. ఆ ఘటనను న్యూస్‌లో చూసి ఆ సమయంలో పట్టించుకోకుండా ఆ దారిన పోతున్నవారిని ‘మనుషులా?’ అని మనం అనుకోవచ్చు. కాని ‘మనం’ అక్కడ గనక ఉండుంటే మనం ‘కూడా’ అలానే బిహేవ్ చేస్తాం. అప్పుడు మనల్ని ఇంకెవరో ‘వీళ్లు మనుషులా’ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి తీవ్రమైన ఘటనలో కూడా మనుషులు ఎందుకు అలా ఉన్నారు అనంటే దానిని మానసిక శాస్త్రంలో ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ అంటారు. సింపుల్‌గా చె΄్పాలంటే ‘దారిన పోయే దానయ్య స్వభావం’ అనొచ్చు. బైస్టాండర్ ఎఫెక్ట్ అంటే? ‘నేను కాకుండా ఇంకెవరో సాయం చేస్తారులే’ అనుకోవడమే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటే. దీనినే ‘డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ థియరీ’ అని కూడా అంటారు. ఎక్కువమంది ఉన్న చోట ఈ ‘నాకెందుకులే... ఇంకెవరైనా చేస్తారులే’ అనే స్వభావం ఎక్కువ అవుతుందని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఒకతను ఇబ్బంది పెడుతుంటే, ఆ దారిన కేవలం ఇద్దరు వ్యక్తులు వస్తుంటే, వారిని చూసి సాయం కోసం కేకలు వేస్తే, ఆ ఇద్దరూ లేదా వారిలో ఒకరు స్పందించే అవకాశం ఎక్కువ. అదే వంద మంది మధ్యలో సాయం కోసం అరిస్తే ఎవరూ సాయానికి రాకపోయే అవకాశం ఎక్కువ. ఇదే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటే’ అని మానసిక శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరి మీదైనా ట్రోల్ జరుగుతుంటే చోద్యం చూడటం, పక్కింట్లో భార్యను భర్త చితకబాదుతుంటే చోద్యం చూడటం కూడా ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ కిందకే వస్తుంది. ఎందుకు సాయానికి రారు? ఒకటి... అందులో రిస్క్ ఉంటుంది... రెండు టైమ్ వేస్ట్.. మూడుప్రాణాలకు ముప్పు రావచ్చు... నాలుగు ఆ తర్వాత ఏదైనా లంపటం చుట్టుకోవచ్చు... అన్నింటి కంటే ముఖ్యం ఇంతమంది ఉన్నారు నేనే దొరికానా అనుకోవడం. ఇదే సమయంలో సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటా రంటే ‘ఆ ఎదురుగా దాడికో హత్యకో గురవుతున్నది మీ రక్తసంబంధీకులు అయితే ఇలాగే వ్యవహరిస్తారా?’ అని. ఎదుట ఉన్నది రక్తసంబంధీకులు అయినప్పుడుప్రాణాలకు తెగిస్తాం. కాని సంబంధం లేనివారైతే దూరం జరుగుతాం. బాధితుడు ఎవరైనా బాధితుడే కదా అని సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చేయొచ్చు ‘సరే... సాయానికి వెళితే లేనిపోని ముప్పు రావచ్చు అనుకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాయం చేసే వీలు ఉంటుంది.. అదన్నా చేయాలి’ అంటారు మానసికవేత్తలు. కనీసం పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేయడం, దాడి చేస్తున్నవాడిని అదిలించడం, ధ్యాస మరల్చడం, రాళ్లు విసిరి గోల చేయడం... ఇలా ఏవైనా చేయొచ్చు. వీటిని చేయడం వల్లప్రాణం పోదు. ఏదో ఒక స్పందన చూపాం అనే సంతృప్తి దొరుకుతుంది. ‘భయాన్ని దాటితే మనిషిగా పాటించాల్సిన విలువలను గుర్తు చేసుకుంటే సాయానికి దిగాలన్న తక్షణ స్పందన కలుగుతుంది’ అని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ‘ఏం చేసినా జనం పట్టించుకోరు’ నుంచి ‘జనం పట్టించుకుంటారు’ అనిపించే సామాజిక మార్పుకు జనమే ఉదాహరణగా నిలిస్తే ఈ స్థితి మారుతుంది. స్త్రీలు, యువతులు, బాలికలు నిత్యం బయటకు తిరగాల్సిన ఈ రోజుల్లో సమాజం వీలైనంత తొందరగా ఈ చోద్యం చూసే స్వభావాన్ని వదులుకుంటే సమాజానికి రక్షణ దొరుకుతుంది. ఒకరినే ఎంచుకోవాలి ‘మీ మీద దాడి జరుగుతోంది. చుట్టూ చాలామంది చోద్యం చూస్తున్నారు. మీరు సాయం కోసం అడుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. అప్పుడు గుంపులో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. వారి కళ్లల్లో కళ్లు కలిపి సాయం అడగాలి. మీరు పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తిని సాయం అడిగినప్పుడు ఆ వ్యక్తికి తాను స్పందించక తప్పని బాధ్యత వస్తుంది. స్పందిస్తాడు’ అని తెలియచేస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అంటే గుంపు నుంచి విడగొట్టి అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయాలన్న మాట. -
సై‘కాలేజీ’కి డిమాండ్!
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు అధికమయ్యారు. ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెబుతోందంటే ఏ స్థాయిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయో స్పష్టమ వుతోంది. అయితే, దీనికి తగ్గట్లు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, చికిత్స చేసేందుకు ఆ స్థాయిలో సైకాలజిస్టులు మాత్రం లేరు. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి ఏడుగురు మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. దీంతో వారి కొరత పెరిగింది. అయితే ప్రస్తుతం సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగింది. సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి. డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూని వర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది. బెంగళూరు జైన్ డీమ్డ్ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్ లక్నో, బెనారస్‌తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సిటీలు కూడా క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, కల్చరల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఎడ్యు కేషన్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. ► పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు. ► అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. ► కార్పొరేట్ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ► ముఖ్యంగా కోవిడ్–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి. రకరకాల కారణాలతో.. ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. – సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు -
కాలేజీల్లో కాలనాగులెన్నో
-
మీలోని శక్తి ఎంత?!
నలుగురితో కలిసి ఉన్నప్పుడు మనలోని బలం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొనే సమయంలో మానసికంగా మనంఎంతటి శక్తివంతులమో మనకే అర్ధమవుతుంది. ఈ సమయంలో భావోద్వేగాలలో మార్పులు తీవ్రంగా ఉంటే జీవన విధానంపై అవి చెడు ప్రభావం చూపుతాయి. ‘ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలివిడిగా ఉన్నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం శక్తిమంతులుగాఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటేవచ్చే సమస్యల అలలను సులువుగా ఎదుర్కోవచ్చు’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ‘సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ అనేది సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మందిలో గమనిస్తున్న విషయమేంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. నేను చెప్పిందే వినాలి’ అనే ధోరణి పెరగడం కూడా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది’ అంటున్నారు లైఫ్‌స్కిల్ ట్రెయినర్ జ్యోతిరాజ. ఎరుక అవసరం కొందరు తమచుట్టూ ఎవరికీ కనపడని ఒక వలయాన్ని సృష్టించుకుంటారు. పరిమితులను నిర్దేశించుకుని వాటిని దాటి బయటకు రారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా సృష్టించుకున్న వలయం ఎక్కడ ఛిన్నాభిన్నం అవుతుందో అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఫలితంగా భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులను నిందించడం, తమను తామే శిక్షించుకోవడం లేదా గాసిప్స్‌ని ఆశ్రయిస్తారు. ‘భావోద్వేగాల అదుపు కోల్పోతే ఏ బంధంలోనైనా బీటలు వస్తాయి. అందుకని వలయాలతో కాకుండా ఎరుకతో మెలిగితే మనలోని అంతర్గత శక్తి స్థాయిలు స్పష్టమవుతాయి’ అనేది నిపుణుల మాట. మౌనంగా ఉండటం మేలు అతిగా మాట్లాడటం, చేతల్లో మన పనిని చూపించకపోతే ఎదుటివారి ముందు మన శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భావోద్వేగాల్లోనూ మార్పు వస్తుంది. ఇది బంధుమిత్రుల మధ్య పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, పని ప్రదేశాలలో ఈ ‘శక్తి’ని బాగా గుర్తించవచ్చు. ఇబ్బందిని కలిగించే సంభాషణల్లో పా ల్గొనడం కన్నా, తక్కువ మాట్లాడం వల్ల శక్తిని, భావోద్వేగాల సమతుల్యతను కాపా డుకోవచ్చు. ఆ శక్తిని ఇతర సృజనాత్మక పనులకు బదిలిచేయవచ్చు. అవగాహనతో సరైన శక్తి అంతర్గత దిక్సూచిని భావోద్వేగ మేధస్సు అని కూడా అంటారు. ఇది సున్నితం–తీవ్రం రెండింటినీ సమాన స్థాయిలో ఉంచుతుంది. అంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా దూకుడుగా ప్రవర్తించబోతున్నాడో ముందే పసిగట్టి, నివారించే శక్తి వీరికుంటుంది. సరైన సమయంలో ఎలా స్పందించాలో తెలిస్తే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగల అంతర్గత శక్తి పెరుగుతుంది. పట్టు విడుపులు తెలుసుండాలి... ఏ అంశం వదిలేయాలి, దేనిని మన ఆధీనంలో ఉంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. అనవసరం అనిపించే సమస్య ఏదైనా వదిలేయడం కూడా తెలియాలి. పిల్లలైతే వారు చదువుల్లో ఆటపా టల్లో బిజీగా ఉంటారు. కాలేజీ స్థాయి యువతలో బిజీగా ఉంటారు. గృహిణుల్లో మాత్రం పిల్లలు పెద్దయ్యాక వారికి కొంత తీరిక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందునుంచే తమను తాము మలుచుకుంటూ ఉండాలి. తమలో ఉండే ఇష్టాయిష్టాలు, కలల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే సంతృప్తి వల్ల భావోద్వేగాల అదుపు, అంతర్గత శక్తి స్ఙాయిలు పెరుగుతాయి. ఈ ప్రా క్టీస్ ఇంట్లో పిల్లల చేత కూడా చేయిస్తే, వారిలోనూ కొత్త సమర్థతలు బయటకు వస్తాయి. భావోద్వేగాల అదుపుకు అంతర్గతశక్తిని మేల్కొల్పడమే సరైన ఆయుధం. – ఆచార్య జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రెయినర్ తట్టుకునే శక్తిని పెంచుకోవాలి.. సాధారణఃగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కంగారు పడిపోతాం. భయం ఆవరించేస్తుంది. ఈ ఒత్తిడి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. బ్యాక్‌పెయిన్, నెక్ పెయిన్, స్ట్రెస్.. వంటివి సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా ఆరోగ్యం, మానసిక స్థిరత్వానికి యోగ సాధన చేయడం ఒక భాగం చేసుకున్నాను. దీనితో పా టు ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన లేకుండా సమస్యలను తట్టుకుని, ముందడుగు వేసే శక్తినిచ్చే ఆయుధాలుగా వీటిని మలుచుకున్నాను. – కవిత ఎన్, సాఫ్ట్వేర్ ఉద్యోగిని -
‘స్మార్ట్’ వాదనలు స్మార్ట్ కాదు! లైఫ్ పార్ట్నర్తో ‘ఫెక్స్‌టింగ్’ చేస్తున్నారా?
భార్యాభర్తలు, జీవిత భాగస్వాముల మధ్య ఏదో అంశం మీద వాదోపవాదనలు, చిన్న చిన్న గొడవలు మామూలే. వాదన జరుగుతుండగా... ఆఫీసుకు వెళ్తూ తన పార్ట్నర్ నుంచి దూరంగా వెళ్తే గొడవ సద్దుమణగడం ఖాయం. కానీ మొబైల్ ఫోన్లో టెక్ట్స్ మెసేజీల రూపంలో అదే గొడవ అదే పనిగా కొనసాగితే...? ఇలా లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఫైటింగ్ కాస్తా టెక్ట్స్ మెసేజీల రూపంలో కొనసాగడాన్ని‘ఫెక్స్‌టింగ్’ అనే ధోరణిగా అభివర్ణిస్తున్నారు. మొబైల్స్ ఎన్నెన్నో కొత్త కొత్త రకాల ఫీచర్స్‌తో వస్తున్నాయి కాబట్టి వాటిని ‘స్మార్ట్’ఫోన్స్ అన్నారు. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అంత స్మార్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫెక్స్‌టింగ్’ అంటే కేవలం జీవిత భాగస్వాముల మధ్య ఫైటింగ్ అనే కాదు... పేరెంట్స్, ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చుకానీ... అత్యధికంగా ప్రభావం చూపేది భార్యాభర్తల మధ్యనే కావడంతో సాధారణంగా దాన్ని లైఫ్పార్ట్నర్స్కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రఖ్యాతమైన ఓ సెలబ్రిటీ కేస్‌స్టడీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ల దాంపత్యం వయసు 45 ఏళ్లు పైమాటే. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము వాదించుకునేందుకు టెక్ట్స్ మెసేజీలు వాడతామని చెప్పా రు. అందుకు ఓ వినోదాత్మక కారణం కూడా తెలిపారు. తమ ఘర్షణ, వాదోపవాదాలు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీకి తెలియకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటామని సరదాగా వెల్లడించారామె. అంటే అందరి గుట్టుమట్లు పసిగట్టే అత్యంత సమర్థమైన ఏజెన్సీనే బురిడీ కొట్టించడానికి ఆమె ‘ఫెక్స్‌టింగ్’ ను ఎంచుకున్నారన్న మాట. రెండు రకాల వాదనలు ఫెక్స్టింగ్లో పార్ట్నర్స్ ఎదురెదురుగా ఉండరు కాబట్టి... ముఖ కవళికలూ. అందులోని ఆవేశాలూ, ఉద్వేగాలూ కనిపించవు. వాదన తాలూకు తీవ్రత అక్షరాల్లో అంతగా ప్రభావ పూర్వకంగా కనిపించదు కాబట్టి అంత హానికరం కాదనీ అనేవాళ్లూ ఉంటారు. అంతేకాదు... ఆ వాదన కొనసాగడానికి ఇష్టపడని వారు... టెక్ట్స్‌కు బదులుగా క్రమంగా ‘స్మైల్’ లేదా షేక్‌హ్యాండ్ ఎమోజీల్లాంటివి ఉపయోగిస్తూ పోతే, ఎదుటివారి నుంచి తగినంత ప్రతిస్పందన లేకపోవడంతో క్రమంగా వాదన సన్నగిల్లిపోతుందనీ, ఎదురుబొదురు ఉన్నప్పటంత హాని జరగకపోవచ్చనీ కొందరు చెబుతుంటారు. సరిగ్గా దీనికి పూర్తి భిన్నంగా వాదించేవారూ ఉంటారు. మాటలు తడబడవచ్చు. ఏదో మాట సరిగా వ్యక్తం కాకపోవచ్చు. కానీ సరిగ్గా వ్యక్తీకరించగలిగేవాళ్లైతే రాతలోనే ప్రభావం ఎక్కువ అని చెప్పేవాళ్లూ ఉన్నారు. పాతగాయాలూ రేగే ప్రమాదం దంపతుల మధ్య సంభాషణల రూపంలో ఎదురుబొదురుగా ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఏదైనా మాటతూలినా గాలికి పోయే మాటల వల్ల ఆ తర్వాత ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ ‘రాత’ ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడో చదువుకున్నప్పుడూ పాత మాటలూ, పాత వాదనల ప్రభావాలు కెలికినట్లుగా అయి, అవి ఆ తర్వాతెప్పుడో కూడా ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. అంతుఉండకపోవచ్చు... ఆ అంశమే ప్రమాదం తేవచ్చు... పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన చెలరేగింది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూనే వాదనల్లో మునిగిపోయారు. ఆఫీసుకు బయల్దేరే సమయానికి ఘర్షణ పెద్దదైంది. కానీ ఆఫీసు సమయానికి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోవడంతో ఆ ‘వాదోపవాదాలు’ అక్కడితో ముగుస్తాయి. కానీ ‘ఫెక్స్‌టింగ్’ అలా కాదు. ఆఫీసుకు వెళ్లే దారిలో బస్సులోనో, ఆటోలోనో లేదా మెట్రోరైల్ లోనో అలాగే కొనసాగవచ్చు. అంతేకాదు... ఆఫీసుకు చేరి, సీట్లలో కూర్చున్నాక కూడా అదేపనిగా కొనసాగితే ప్రమాదమే. ఆ మాటకొస్తే కీలకమైన మీటింగుల్లోనూ ‘టెక్ట్స్ మెసేజు’లు కొనసాగుతూ... అసలు లక్ష్యానికి అడ్డంగా మారవచ్చు. టెక్ట్స్ వల్ల ఒనగూరే సౌలభ్యమల్లా వాదన మౌనంగా కొనసాగుతూ... అది మాటల ద్వారా బయటకు తెలియదంతే. కానీ పని ప్రదేశంలో... చేయాల్సిన పని వదిలేసి అదేపనిగా వాదులాడుకుంటూ పోతే... ఆఫీసులో పూర్తి చేయాల్సిన పనులు కొనసాగకపోగా / జరగకపోగా... అదే ఇబ్బంది తెచ్చిపెట్టే ప్రమాదమూ ఉందంటున్నారు కపుల్ కౌన్సెలింగ్ నిర్వాహకులు, మనస్తత్వ నిపుణులు. అంతేకాదు... అది పనితీరుతో పాటు, బంధాల విషయాల్లోనూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చునని హెచ్చరిస్తున్నారు. వస్తువులో కాదు... అంతా మన విచక్షణలోనే ఉంది... ‘‘ఏదైనా ప్రయోజనం అన్నది ఆ వస్తువును మనం ఉపయోగించే తీరులో లేదా మన విచక్షణను బట్టే ఉంటుందిగానీ... ఉపకరణంలో ఏమీ ఉండదు. ఇంగ్లిష్‌లో చెప్పా లంటే ‘ఆబ్జెక్ట్’లో కాకుండా ‘ఆబ్జెక్టివ్’లోనే అంతా ఉంది’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు మనస్తత్వ నిపుణులు. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదురుబొదురుగా ఉండి మాట్లాడుకోవడమే మంచిది. కొన్ని పదాలు, పంక్చువేషన్లు, ఎమోజీల వల్ల దురభిప్రాయాలు వచ్చే అవకాశమూ ఉంది. మాటల్లో చెప్పుకునే విషయాలను రాతలో పెట్టినప్పుడు అది మరింతగా హాని చేసే ప్రమాదం ఉంది. ‘మీ అభిప్రాయం తో ఏకీభవించకపోవచ్చు. కానీ మీ అభిప్రాయానికి విలువివ్వాల్సిందే’ అనే పరస్పర గౌరవ భావన, దృక్పథాల వల్లనే మంచి ఫలితాలు వస్తాయి. – డాక్టర్ సుజాత రాజమణి, మానసిక నిపుణులు -
సంతోషమే ‘పూర్తి’ బలం!
సాక్షి, హైదరాబాద్: ‘సంతోషమే సగం బలం’ అన్న సామెత ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత జీవన పరిస్థితులు, కొత్త అలవాట్లు, కెరీర్ సమస్యల నేపథ్యంలో మనిషికి ‘సంతోషమే పూర్తి బలం’ అన్నట్టుగా మారిపోయింది. సంతోషమనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సానుకూల భావన అని.. ఆనందంగా ఉండేవారు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంతోషంగా ఉండేవారు తక్కువగా ఒత్తిళ్లకు గురవుతారని.. ఇతరుల కంటే అధిక సృజనాత్మకత కలిగి ఉండటంతోపాటు ఇతరుల పట్ల దాతృత్వాన్ని, ఉదారతను ప్రదర్శిస్తారని వివరిస్తున్నారు. ఇలాంటి వారు తోటివారి నుంచి సామాజికంగా తోడు పొందుతూ.. మంచి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని చెప్తున్నారు. అసలు తాము సంతోషంగా ఉన్నామనే భావనే.. చాలా మందిని తమ జీవితంలో అనేక ప్రయత్నాలు, చొరవ వైపు నెట్టి, విజయం దిశగా నడిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. సమాజంలో లేదా కుటుంబంలో పెద్దల అంచనాలను చేరుకోలేకపోతే అసంతృప్తికి దారితీస్తుందని.. పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హ్యాపీనెస్‌కు ఓ ఇండెక్స్.. మన పరిస్థితి భిన్నం.. గ్లోబల్ హ్యాపీనెస్ కౌన్సిల్ మొదటగా ప్రపంచ దేశాలకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్‌ను రూపొందించింది. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు సంబంధించి పలు అంశాల ప్రాతిపదికన ఏటా ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ నివేదికను వెలువరిస్తోంది. తలసరి జీడీపీ, సాంఘిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్ధాయిలు, సేవాభావం, దాతృత్వం, ఆరోగ్యకర జీవన అంచనాలు, ఆనందానికి సంబంధించి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భారత స్కోర్, ర్యాంక్ ఏమంత గొప్పగా ఉండటం లేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్–2022లో మొత్తం 146 దేశాలకుగాను భారత్ 136 ర్యాంకు సాధించింది. ఆయా దేశాలకు, ఇండియాకు వర్తించే విషయాల్లో తేడాలు, సారూప్యతలు భిన్నంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు. అంతేగాకుండా మనదేశంలో సంతోషం–సంపద మధ్య బలహీనమైన సహ సంబంధం (కోరిలేషన్) కొరవడటమూ కారణమని ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి జయశ్రీ సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతల పెరుగుదల, ధనికులు తమ ఇళ్లలో ఆర్భాటంగా చేసే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి సామాన్య ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతాయని చెప్పారు. మితిమీరిన పట్టణీకరణ, నగరాలు ఇరుకుగా మారడం, ఆహారభద్రత, ధరల పెరుగుదల వంటివి కూడా దీనిని ప్రభావితం చేస్తాయన్నారు. సమష్టి ఆనందంతోనే ఉన్నత స్థాయికి.. ప్రపంచంలో ఎవరినైనా జీవితంలో ఏది ముఖ్యమని ప్రశ్నిస్తే.. సంతోషంగా ఉండటమేననే సమాధానం వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ సంతోషమైనా, ఆనందమైనా ఎలా వస్తుందనేది ముఖ్యం. వ్యక్తిగత స్థాయి కంటే కూడా సమూహ, సమష్టి ఆనందం ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి, ఆనందం అనేవాటిని మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా ఒక సార్థకత ఏర్పడుతుంది. అయితే అపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలు సరికాదు. జీవితం–చేస్తున్న పని మధ్య తగిన సమతూకం సాధించడమూ ముఖ్యమే. మనకు నచ్చిన ఆహారం తినడం నుంచి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకోవడం వరకు సంతోషానికి మార్గాలు ఎన్నో. ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం వంటివాటి ఆధారంగా ఈ మార్గాలు మారుతూ ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా హాస్పిటల్స్ శారీరక, సామాజిక అవసరాల నుంచి.. అమెరికాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ అబ్రహం మాస్లో 1970 దశకంలో చేసిన సిద్ధాంతీకరణల ప్రకారం.. ►మనషి జీవితం ప్రధానంగా ఆహారం, నీరు, శృంగారం, నిద్ర వంటి ప్రాథమిక శారీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సంతోషాన్ని ప్రభావితం చేస్తాయి. ►శారీరక భద్రత, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత, ప్రేమ, తమదనే భావన, లైంగికపరమైన దగ్గరితనం, ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం, స్వీయ వాస్తవికత, నైతికత ఆనందాన్ని కలిగిస్తాయి. ►సామాజికంగా తెలిసిన వారితో స్నేహానుబంధాలు, ప్రేమ, బంధుత్వాల సాధనతోనూ చాలా మంది సంతోషపడి సంతృప్తి చెందుతారు. -
జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి..
ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. ఆ తర్వాత... రకరకాల కారణాలతో డిప్రెషన్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందం’టున్నారు మనస్తత్వ నిపుణులు. ఉద్యోగం నుంచి దూరమైతే.. ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘రోజూ పనిలో అలసిపోయాం. ఒక్క రోజు సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుందామని ఆలోచనకు ఆడ–మగ తేడా ఏమీ ఉండదు. కానీ, ఉద్యోగం మానేశాక ‘రోజూ సెలవే కదా!’ అనే ఆలోచన నిస్పృహను కలిగిస్తుంది. ‘ఈ సంఖ్య స్త్రీలలో ఎక్కువ. ఎందుకంటే కుటుంబ అవసరాల దృష్ట్యా ఏ చిన్న అవసరం వచ్చినా మొదట ఆ భారం పడేది మహిళపైనే. అందుకే, బలి అవుతుంది కూడా మహిళే’ అంటారు మనస్తత్వ నిపుణులు. కొంతమందిలో కుటుంబ భవిష్యత్తుకు తమ సంపాదన ఎంత విలువైనదో తెలుసు కాబట్టి, ఒత్తిడితో కూడిన ఆందోళనతో జీవనం గడపాల్సి ఉంటుంది. తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడంలోనూ శ్రద్ధ తగ్గుతుంటుంది. ఇక ‘నేను ఏమీ చేయలేనా..’ అనే బాధ అంతర్లీనంగా ఉండిపోతుంది. ఇంట్లో ఉండడం వల్ల తీరిక సమయం లభించడంతో ప్రతికూల ఆలోచనలు తలెత్తుతుంటాయి. మరొకరి మీద ఆధారపడటమా..?! ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మిగతావారితో పోల్చితే నేను, నా వర్క్‌ప్లేస్, సొంత గుర్తింపు, ఆదాయం.. అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. దాని వల్ల మల్టిపుల్ పనులు చేసేంతగా తమను తాము తీర్చిదిద్దుకోగలరు. కానీ, ఒక్కసారిగా జాబ్ మానేసి, ఇంటి పనులు రొటీన్‌గా చేస్తూ ఉండటం, ప్రతి చిన్న అవసరానికి (డబ్బు కోసం) భర్త మీద ఆధారపడటం చాలా మందికి నచ్చదు. కొన్ని రోజులు సర్దుబాటు చేసుకున్నా.. ‘నాకంటూ ఓ జీవితం లేదా! ఎప్పుడూ ఇదే ఇంటి పనా’ అనే విసుగు పొందే భావన కలుగుతుంది. దీని వల్ల కుటుంబంలోనూ గొడవలు తలెత్తుతుంటాయి. ప్రతిఫలం ఆశించని పని.. ‘చాలా సంవత్సరాలుగా మన దేశంలో గృహ హింస కేసులను చూస్తున్నాం. సమాజంలోని వెనుకబాటుతనానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది. పని చేయడం వల్ల మహిళలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి, స్వతంత్రంగా ఉండటానికి, ప్రతిరోజూ ఆత్మవిశ్వాసంతో మెలిగేలా చేస్తుంది. సమాజం ఒక గృహిణి చేసే పనులను అది ఆమె కర్తవ్యంగా భావించి, వాటికి ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగానే చూస్తుంది. ఇంటి పనుల్లో ప్రతిఫలాన్ని ఆశించడాన్ని ఎవరూ హర్షించరు. అందుకే, తెలియని అసంతృప్తి, ఆందోళన కూడా ఉంటుంది. అదే ఉద్యోగం చేసే మహిళకు నిరాశ గురించి ఆలోచించే సమయం ఉండదు. చాలా వరకు మధ్య, దిగువ తరగతి ఇళ్లలో గృహిణులు వారి భాగస్వామి నుంచి అసహనాన్ని ఎదుర్కొంటుంటారు. అందుకు ఆర్థిక సమస్యల భారం ప్రధానమైదిగా కనిపిస్తుంది. గృహిణులలో మానసిక ఆరోగ్య సమస్యలకు డిప్రెషన్, ఆందోళన, వైవాహిక అసంతృప్తి, గృహ హింస, పితృ స్వామ్య భావజాలాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. నవతరం ఆలోచన.. ప్రశ్నించడమే! ‘గతకాలపు వారితో పోల్చితే ఈ తరం అమ్మాయిలు చాలా దూర దృష్టితో ఆలోచిస్తున్నారనే చెప్పాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ భారం మొత్తం ‘నా మీదే పడుతుందా?, భర్త ఏమైనా పంచుకుంటాడా?’ లాంటి ప్రశ్నలు ముందే అడిగి, కుటుంబసభ్యులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా ‘ముందు భార్యే ఆఫీస్‌కి సెలవు పెట్టాలి’ అనుకుంటారు. వరుస సెలవులు పెడితే ఆఫీసు రూల్స్ ఒప్పుకోవు. తప్పదనుకుంటే ఉద్యోగం మానేయ్! అంటారు. అందుకే, ఈ తరం అమ్మాయిలు పెళ్ళికి ముందే బోలెడన్ని రూల్స్ పెడుతున్నారు. లేదంటే పెళ్లి, పిల్లల్ని కనడం ప్లానింగ్‌లో వయసు పైబడినా ఫర్వాలేదు అనే ఆలోచనకూ వస్తున్నారు’ అంటున్నారు సైకాలజిస్ట్‌లు.ఉద్యోగం ఆమెలో ఆత్మవిశ్వాసంతో పాటు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఆమె తనలా పనిలో భాగస్వామ్యమైన వారితో పరిచయాలను, స్నేహితులను ఏర్పరుస్తుంది. ఈ విధానం జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. – నిర్మలారెడ్డి ఇతరత్రా అవకాశాలవైపు దృష్టి ►గతంలో కన్నా ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నవాళ్లు ఇంట్లో ఉండి ఆఫీసు పని చేసుకునేవారి అవకాశాన్ని ఎంచుకుంటున్నారు. కంపెనీలు కూడా అర్హులైనవారికి ఈ అవకాశాలను ఇస్తుంది కాబట్టి, వినిగియోంచుకోవచ్చు. ►కొందరు జాబ్ మానేసినా కొత్త ఆదాయ వనరులను పొందుతున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకొని, స్ఫూర్తి పొందవచ్చు. ►జాబ్ మానేయాల్సి వస్తే అది ఎంతకాలం అనేది ముందే కుటుంబసభ్యులతో చర్చించి, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. ►ఇంటి వద్ద ఉండాల్సి వచ్చినప్పుడు కెరియర్‌కు ఉపయోగపడే సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంచుకోవాలి. ►కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా పెంచుకునే సదుపాయం ఉంది. ►చాలామందిలో పెళ్లి తర్వాత పక్కన పెట్టేసిన హాబీస్ ఉంటాయి. వాటిలో గుర్తింపు, సంతృప్తినిచ్చే ఏదో ఒక హాబీని ఎంచుకొని దానిపైన దృష్టి పెట్టాలి. ►ఇంట్లోవారు(భాగస్వామి) కూడా జాబ్ మానేసి, తమ సంరక్షణకోసం పనిచేస్తున్న స్త్రీ సేవలను గుర్తించాలి, ప్రశంసించాలి. ►2–3 ఏళ్లు జాబ్‌కి గ్యాప్ వచ్చినా.. ప్రూవ్ చేసుకోవడానికి ‘మళ్లీ ప్రయత్నించు’ అని ప్రోత్సహించాలి కానీ, ‘ఇంకేం చేస్తావులే ..’ అని నిరుత్సాహపరచకూడదు. ఆమె సేవలను గుర్తించాలి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు జాబ్ మానేసేది మహిళనే. మొదట్లో కుటుంబం గురించే చేస్తున్నాం కదా అనుకుంటారు. జాబ్ మానేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ, రోజులు మారుతున్నకొద్దీ గత వర్కింగ్ స్టైల్‌కి, తర్వాత ఇంటి రొటీన్ పనులకు సర్దుబాటు అవ్వలేక ఫ్రస్టేషన్‌కు, డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఈ అసహనం కుటుంబ గొడవలకు దారితీస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో అన్నిరంగాల్లో పనిచేస్తున్నవారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగినులు ఎక్కువ ఉంటున్నారు. ఆమె త్యాగాన్ని, సేవలను కుటుంబం గుర్తించడం, ప్రోత్సహించడం సరైన పరిష్కారం. – ప్రొఫెసర్ పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రెయినర్ -
Parenting: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా? లేదా?.. ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే!
ఈ రోజుల్లో పిల్లల పెంపకం అంటే సాధారణమైన విషయం కాదు. పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల మనసులో చాలా కోరికలు ఉంటాయి. తమ పిల్లలు అన్ని విషయాల్లో ఉత్తమంగా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో అమ్మాయిలును అయితే ఒకలా.. అబ్బాయి అయితే... మరోలా చూస్తూ ఉంటారు. ఈ వ్యత్యాసం చూపించడాన్ని చాలామంది తల్లిదండ్రులు సమర్థించుకుంటారు. అయితే అది తప్పేనని, అలా తేడా చూపించడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం... చాలామంది ఇళ్లలో ఆడపిల్ల విషయంలో ఎక్కువగా ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు.. ఇది తప్పు, అది తప్పు... ఇతరుల నుంచి రక్షించుకోవాలి అలాంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇక అబ్బాయిలు ఉంటే... వంశాన్ని కాపాడాలి, తల్లిదండ్రులను పోషించాలి– లాంటి విషయాలు చెబుతూ ఉంటారు. అలా చెప్పడం తప్పని అనడం లేదు. అయితే అవే కాకుండా.. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. అవేంటో ఓసారి చూద్దాం... ►చాలా మంది మగ పిల్లలు.. తాము మగవారు అయినందుకు చాలా గొప్పగా ఫీలౌతూ ఉంటారు. ఇంట్లో వారి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అందుకు కారణం కావచ్చు. కాబట్టి.. పిల్లలకు మగ పిల్లలు మాత్రమే గొప్ప అని ఎప్పుడూ చెప్పకూడదు. ఇద్దరూ సమానమే... అయితే ఆడపిల్లలతో పోల్చితే మగపిల్లలు శారీరకంగా మాత్రం కాస్తంత బలంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. మీతో పాటు ఈ సమాజంలో ఆడపిల్లలు కూడా సమానమే అనే విషయాన్ని వారికి అర్థం అయేలా చెప్పాలి. ►మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం ఎలా తీసుకుంటామో.. ఎదుటివారికి అవసరమైనప్పుడు మనం కూడా అదేవిధంగా సహాయం చేయాలని పిల్లలకు నేర్పించాలి. వృద్ధులు, వికలాంగులు, మీకంటే చిన్నవాళ్లు ఎవరైనా రోడ్డు దాటడానికి సహాయం చేయడం లేదా సామాజిక కార్యకలాపంలో పాల్గొనడం వంటివి జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడతాయి అనే విషయాన్ని నేర్పించాలి. ►చిన్నా, పెద్ద, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న వయసు వారి నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి అనే విషయాన్ని మనం పిల్లలకు చెప్పాలి. ►కోపం అందరికీ వస్తుంది. అది సహజం. అయితే... ఆ కోపాన్ని అదుపు చేసుకున్నవారే గొప్పవారు అవుతారు. చూపించాల్సిన సమయంలోనే కోపం చూపించాలి. అందరిపై చూపించకూడదు. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాలని మనం పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే.. కోపం ఎక్కువగా ఉండేవారికి అందరూ దూరంగా ఉంటారు. ప్రశాంతంగా... నవ్వుతూ ఉండేవారినే అందరూ ఇష్టపడతారు. ►ఇతరులను ఎఫ్పుడూ తక్కువ చేయవద్దు. ఏ వ్యక్తిని కించపరిచే హక్కు మనకు లేదని, తోటి వాళ్లతో ఎప్పుడూ ప్రేమతో వ్యవహరించాలనీ చెప్పండి. అవతలి వారిలో ఏవిధమైన ప్రత్యేకత లేనప్పటికీ, మీరు వారి పట్ల గౌరవం చూపించాలి. ఎదుటివారు ఏ విషయంలోనూ మీకంటే తక్కువ అని మీరు పిల్లలకు చెప్పకూడదు. ►అదేవిధంగా మీ పిల్లలకు సారీ, థ్యాంక్స్, ప్లీజ్ వంటి పదాలు ఎప్పుడు, ఎక్కడ అవసరం అయినా చెప్పడం నేర్పించండి. పిరికిగా ఉండటం మంచిది కాదు. ధైర్యంగా ఉండాలి. అందరితోనూ స్నేహం గా ఉండాలి అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాలి. ఈ టిప్స్ పాటిస్తే పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా పెరుగుతారు. చదవండి: Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్ అణువుల వల్ల ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? -
Telangana: పరీక్షలంటే భయపడితే కాల్చేయండి!
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటేనే భయం. కరోనా ఆ భయాన్ని మరింత పెంచింది. ఆ భయాన్ని పోగొట్టేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందడుగు వేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ నేపథ్యంలో... మానసిక ఒత్తిడి, పరీక్షల భయం ఉన్న విద్యార్థులకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని అందించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆందోళనకు గురయ్యే విద్యార్థులు సైకాలజిస్టులకు ఫోన్ చేసి సహాయం పొందాలని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చే సైకాలజిస్టుల ప్యానల్లో వైద్యులు అనిత ఆరే (9154951704,), మేజర్ అలీ (9154951977), రజనీ తెనాలి (91549 51695), పి జవహర్లాల్ నెహ్రూ (91549 51699), యస్ శ్రీలత (9154951703), శైలజ పిశాపాటి (9154951706), అనుపమ (9154951687) ఉన్నారు. (చదవండి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్) పరీక్షలకు సహకరిస్తాం: టీపీజేఎంఏ ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు అన్ని విధా ల సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్‌తో చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. పెండింగ్‌లో ఉన్న కాలేజీల ఉపకారవేతనాలకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారని సతీశ్ తెలిపారు. (చదవండి: చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!) -
జ్ఞాపకశక్తిపైనా.. కరోనా పంజా
కోవిడ్ మహమ్మారి జ్ఞాపకశక్తి పైనా పంజా విసురుతోంది. దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రభావితం చేస్తూనే ఉంది. మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలు, మార్పులతో ఊహ తెలిశాక రోజువారీ జీవన విధానంలో కొన్నేళ్లుగా పాటిస్తున్న ఒక ‘టైం టేబుల్’కు భిన్నంగా వ్యవహరించాల్సి రావడం, కొత్త లక్షణాలు, భయాలతో వచ్చిన అంతుచిక్కని వ్యాధి మస్తిష్కాలను, ఆలోచనలను మార్చివేసింది. కోవిడ్ వస్తుందేమోనన్న భయాలు, ఆందోళనలు మెదళ్లను, ఆలోచన తీరును ఎంతగానో ప్రభావితం చేసినట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్లతో బంధువులు, మిత్రులు, సహోద్యోగులు, తదితరులను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడంతో మనుషుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినడం వంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఇదీ అధ్యయనం... సంఘ జీవిగా ఉన్న మనిషి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా సామాజిక సంబంధాలను కొనసాగించలేకపోవడం మెదడుపై, ఆలోచనల తీరు, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతున్నట్టు వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీ కాగ్నిటివ్ న్యూరోసైన్స్ ప్రొ.కేథరీన్ లవ్ డే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కేథరీన్ తన పరిశోధనలో.. ఎవరికైనా ఏదైనా చెబుదామనుకుని మరిచిపోయారా?, చదివిన పుస్తకాన్నే మళ్లీ చదువుతున్నారా? వంటి అంశాలతో ‘ప్రతిరోజు జ్ఞాపకశక్తి ప్రశ్నావళి’ ద్వారా వివిధ విషయాలపై పలువురి నుంచి సమాధానాలు రాబట్టారు. తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏదో ఒక ఘటన లేదా చేయాల్సిన పనిని మరిచిపోతున్నట్లు 55 శాతం మంది వెల్లడించారు. మహమ్మారి కారణంగా తలెత్తిన పరిణామాలతో మెదడు పనితీరు, ఆలోచనలు కూడా ఏదో ఒకరూపంలో ప్రభావితమైనట్లు 30 శాతం మంది పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల ప్రభావం మహిళలపై మరింత ఎక్కువగా పడినట్లు, పురుషులతో పోల్చితే వారి జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాగా, కోవిడ్ మహమ్మారి మనుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సైకాలజిస్ట్ విశేష్ పేర్కొన్నారు. ఆప్తులతో మనసారా మాట్లాడలేకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనల మార్పిడి లేకపోవడంతో వ్యక్తిత్వం, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై సుదీర్ఘకాలం పాటు ఉంటుందని వివరించారు. -
ఆత్మవిశ్వాసం నింపాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి, సుదీర్ఘ లాక్డౌన్ నేపథ్యంలో వివిధ వయసుల్లోని పిల్లలు, టీనేజర్లపట్ల తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలని సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాల గురించి శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని, పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెం పొందించే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. స్కూళ్లు మూతపడటం, బయట ఆడుకునేందుకు అవకాశం లేకపోవడం, స్నేహితులను కలుసుకోలేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పిల్లలు మానసిక కుంగుబాటుకు గురి కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే... ప్రేమ చూపాలి.. పిల్లలపై ముఖ్యంగా టీనేజర్లపై తల్లి దండ్రులు ప్రేమ చూపాలి. వారంటే తమకెంత ముఖ్యమో వివరిం చాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా వ్యవహరించాలి. తామెందుకు బయటకు వెళ్లి, ఆడుకోలేకపోతున్నామనే బాధలో ఉన్న పిల్లలకు ప్రస్తుత పరిస్థితులు వివరించాలి. జాగ్రత్తలు చెప్పాలి. పెద్దలు, పిల్లలు ఒక షెడ్యూల్‌ను నిర్ణయించుకొని ఉదయం నిద్రలేవడం మొదలు, కాలక్షేపం, టిఫిన్, భోజన సమయాలు వంటి వాటిని రూపొందించుకొని వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. కొందరు పిల్లల్లో గణితం లేదా సైన్స్ ఇతర సబ్జెక్టులంటే భయం ఉంటుంది. ఈ సమయంలో అటువంటి వాటి పట్ల భయం పొగొట్టేలా చర్యలు తీసుకోవాలి. టీనేజర్లకు వారి వ్యక్తిగత స్పేస్ దొరికేలా చూడాలి. పిల్లలతో శాంతంగా వ్యవహరిస్తూ సంభాషణ కొనసాగించాలి. భవిష్యత్తులో ఆర్థికపరంగా, విద్యాపరంగా ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి విపత్కర సమస్య వచ్చినా తగిన పరిష్కారాలుంటాయని వారికి వివరించాలి. గతంలో కూడా వివిధ మహమ్మారులు వచ్చినా ప్రపంచం, దేశం నిలదొక్కుకుందని, పిల్లలపై వాటి ప్రభావాలు పడలేదని, ఆ తర్వాత కూడా అందరూ ఆనందంగా ఉన్నారన్న అవగాహనను కల్పించాలి. – స్కూల్ సైకాలజిస్ట్ కళై అముధ అవగాహన కల్పించాలి... లాక్డౌన్ ఎత్తేశాక తలెత్తే పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లితండ్రులు పిల్లలకు వివరించాలి. ఈ పరిణామాల తర్వాత ఏర్పడబోయే జీవితాన్ని కొత్తగా చూసేలా అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. జీవితం నుంచి నేర్చుకొనే లర్నింగ్ ప్రాసెస్‌కు సిద్ధం చేయాలి. పరిస్థితులు చక్కబడిన అనంతరం ఉత్సాహంగా సమయాన్ని గడిపేలా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిం చాలి. ప్రస్తుతం పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలో తల్లితండ్రులకు సరైన అవగాహన లేక సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లి దండ్రులు మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలతోనే మొత్తం సమయం గడపకుండా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటా యించి అది అమలయ్యేలా చూడాలి. పిల్లలతో కూర్చొని ఆయా అంశాలపై చర్చించడంతోపాటు స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుం దన్న విషయమై అవగాహన కల్పించాలి. – సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ -
పరీక్షలంటే భయమా?
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటే భయపడుతున్నారా? మీ భయాన్ని పోగొట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సైకాలజిస్టులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సైకాలజిస్ట్ (7337225803 నంబర్)కు ఫోన్ చేసి తమ ఆందోళనను పోగొట్టుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో మొదట ఒక సైకాలజిస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తర్వాత మరో ఐదుగురిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వీరంతా ఇప్పటినుంచి పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన తర్వాత దాదాపు 2 నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా చిత్రా రాచంద్రన్ మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు సమస్య కారణంగా ఆమె చెప్పిన అంశాలను కూడా చిత్రారాంచంద్రన్ వివరించారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్.. విద్యార్థులు 8.45 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాలని పేర్కొన్నారు. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ప్రతి విద్యార్థి 9 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటల కల్లా పరీక్ష కేంద్రంలో ఉండేలా చూసుకోవాలని, 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ‘సెంటర్ లొకేటర్’యాప్ ఉపయోగించుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, వీలైనంత ముందుగా పరీక్షకు బయల్దేరాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమ స్యలు, హాల్టికెట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తితే విద్యార్థులు నివృత్తి చేసుకునేందుకు బోర్డు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 040–24600110, 040–24732369 ఫోన్ నంబర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంప్రదించవచ్చని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మెయిల్ ద్వారా కూడా (helpdesk_ie@telangana.gov.in) సంప్రదించొచ్చన్నారు. అయినా సమాధానం దొరక్కపోయినా, సంతృప్తి చెందకపోయినా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని, ఇందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం వెబ్‌సైట్‌ను (bigrs.telangana.gov.in) అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రత్యేకంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి వెబ్సైట్ (tsbie.cgg.gov.in) నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. హాల్‌టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షలకు హాజరు కావొచ్చని, చీఫ్ సూపరింటెండెంట్లు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. 2,500 మంది స్టూడెంట్ కౌన్సెలర్లు.. పరీక్షల విషయంలో ఆందోళన చెందొద్దని, ప్రతి కాలేజీలో స్టూడెంట్ కౌన్సెలర్లు (మొత్తం 2,500 మంది) ఉన్నారని, వారి సహకారం తీసుకోవాలన్నారు. హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఓఎంఆర్ షీట్‌లోని విద్యార్థుల వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలని, పొరపాటేమైనా ఉంటే ఎగ్జామినర్ దృష్టికి, చీఫ్‌సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లవద్దని, పరీక్ష విధుల్లో ఉన్న అధికారులు, ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు తీసుకెళ్లొద్దన్నారు. బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సీజీజీ సహకారం తీసుకున్నామని చెప్పారు. ప్రతి సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిల్ ఓపెన్ చేస్తారన్నారు. గతంలో జవాబు పత్రాల కరెక్షన్లో తప్పులు చేసిన వారికి జరిమానా విధించామని, ఈసారి వారికి డ్యూటీలు వేయలేదన్నారు. పరీక్షలకు హాజరయ్యే బాలికలను తనిఖీ చేసేందుకు మహిళా సిబ్బందిని నియమించామని, బురఖా ధరించే వారిని ప్రత్యేక గదిలో మహిళలే తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సీజీజీ డైరెక్టర్ రాజేంద్ర నిమ్జే మాట్లాడుతూ.. ఈసారి పరీక్షల్లో ఓఎంఆర్, ఐసీఆర్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. -
మాన'సెల్ఫీ'క రోగం
సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ.. ఈ మధ్య ఎక్కడ చూసినా సెల్ఫీల పిచ్చి పట్టుకుంది అందరికి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో పెట్టడం. చిన్నపెద్ద అనే తేడా లేదు.. సందర్భం ఏదైనా సెల్ఫీ తీసుకోవడం మాత్రం సర్వసాధారణామైంది. ఎప్పుడో ఒకసారి దిగితే ఫర్వాలేదు కానీ, కొంతమంది అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటారు. ఇలాంటి వారిని మానసిక రోగులుగా భావిస్తామంటున్నారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు మార్క్ డి గ్రిఫిత్స్, జనార్థనన్ బాలకృష్ణన్. అతిగా సెల్ఫీలు దిగే వారిని ‘సెల్ఫిటీస్’గా 2014లో ఓ వార్తా పత్రికా పేర్కొంది. ఆ పదంలో నిజాన్ని నిర్ధారించడానికి, అలాంటి స్వభావం ఉన్న వారిని గుర్తించడానికి 400 మంది భారతీయుల ప్రవర్తనను వీరు పరిశీలించారు. ‘సెల్ఫిటీస్ బిహేవియర్ స్కేల్’ ద్వారా మూడు రకాలుగా విభజించారు. మొదటి రకం వారు రోజులో 3 సెల్ఫీలు దిగుతారు. కానీ, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయరు. రెండో రకం వారు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. మూడో రకం దారుణం రోజులో ప్రతి చిన్న సందర్భానికి సెల్ఫీ దిగి అదే పనిగా పోస్ట్ చేస్తారు. ఒక రోజులో వీరు కనీసం 6 సెల్ఫీలు దిగి, పోస్ట్ చేస్తారు. ఇలా అతిగా సెల్ఫీలు దిగే వారు మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని సైక్రియాట్రిస్ట్లు అభిప్రాయపడుతున్నారు. వీరిలో కొంత మందిని ఈ విషయంపై ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తమకు తాము చాలా పాపులర్‌గా భావించుకుంటామన్నారు. సెల్ఫీ దిగకుండా, పోస్ట్ చేయకుండా ఉంటే తాము తమ తోటి వారితో సంబంధాలను కోల్పోయినట్లు భావిస్తామని మరికొంత మంది సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఈ పరిస్థితిలో ఉన్నవారు ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతుంటారు. వారి చుట్టుపక్కల ఉన్నవారితో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి వ్యసనంలా మారుతుంద’ని బాలకృష్ణన్ అన్నారు. -
సెల్ఫీ.. ఓ రోగమే!
లండన్: ‘సెల్ఫీ’.. ఇటీవల వైరల్‌లా మారిన ట్రెండ్. మితిమీరి సెల్ఫీలు దిగడం రోగమేనంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన చేసింది కూడా భారత్‌లోనే కావడం గమనార్హం. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలబారిన పడడం వంటి ఘటనలు భారత్‌లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నందునే ఇండియాను ఎంపిక చేసుకున్నామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఒక మానసిక రోగమే’ అంటూ 2014లో మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా యూకేకు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ, తమిళనాడులోని తియంగరాజర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం 400 మందిని ఎంపిక చేసుకొని, వారిని మూడు గ్రూపులుగా విభజించారు. రోజుకు కనీసం మూడు సెల్ఫీలు తీసుకునేవారిని మొదటి గ్రూపులో, అంతకంటే ఎక్కువగా దిగేవారిని రెండో గ్రూపులో, అదేపనిగా సెల్ఫీల్లో మునిగిపోయేవారిని మూడో గ్రూపులో చేర్చారు. సెల్ఫీ దిగని రోజు వారి మానసిక పరిస్థితిని పరిశీలించారు. మిగతా రోజులతో పోలిస్తే.. సెల్ఫీ దిగని రోజు వారు మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. -
ఖైదీలే సైకాలజిస్టులు!
- జైళ్లలోని స్టడీ సెంటర్లలో అందుబాటులోకి ఎంఏ సైకాలజీ - ఇప్పటివరకు డిగ్రీ కోర్సులకే పరిమితం - ఇక ముందు పీజీ కోర్సులు కూడా.. - జైళ్ల శాఖ, అంబేడ్కర్ వర్సిటీల మధ్య ఒప్పందం - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలు చేసినవారెం దరో జైళ్లలో ఏళ్లకేళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే కొంత మంది ఖైదీలు ఈ సమయాన్ని తమలో పరివర్తన కోసం, ఉన్నత చదువుల కోసం వినియోగించుకుంటున్నారు. అలా చాలా మంది డిగ్రీ పట్టాలు కూడా పొందారు. తాజాగా డిగ్రీయే కాదు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసేలా తోడ్పాటు అందించేందుకు జైళ్ల శాఖ సిద్ధమైంది. ఖైదీల్లో మానసిక అభివృద్ధి, కౌన్సెలింగ్ కోసం సైకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చాలా మంది ఖైదీలు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఆపై అంబేడ్కర్ యూనివర్సిటీ సహకారంతో డిగ్రీలు పూర్తిచేస్తున్నారు. కానీ పీజీ చేసే అవకాశాన్ని తాజాగా కల్పిస్తున్నారు. రెండు కారాగారాల్లో.. ఏటా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని జైళ్లలో 500 మంది వరకు ఖైదీలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. వారిలో సుమారు 150 మంది వరకు ఉత్తీర్ణులవుతున్నారు. ఇలాంటి ఖైదీలు పీజీ కోర్సులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉండడంతో.. వారిని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చర్య లు చేపట్టింది. దీనిపై అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి కేంద్ర కారాగారాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, కడప కేంద్ర కారాగారాలు సైతం ఇదే ప్రతిపాదన చేశాయి. పీజీ కోర్సుల్లో భాగంగా ఎంఏ సైకాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అన్ని జైళ్లలోని ఖైదీలకు మానసిక శిక్షణ, అభివృద్ధికి వారి సేవలు వినియోగించుకో వాలని భావిస్తున్నారు. నేర ప్రవృత్తి కారణంగా జైలుకు వచ్చిన ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నా రు. సీట్ల కేటాయింపుతో సంబంధం లేకుండా పీజీ కోర్సును ప్రవేశపెట్టి ఖైదీలనే.. జైళ్ల శాఖలో సైకాలజిస్టు లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎంఏ సైకాలజీ కోర్సు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉందని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. -
చదువు జీవితంలో ఒక భాగమే...
చదువే జీవితం కాదు. ఎవరి జీవితమూ పూలపాన్పు కాదు. జీవితంలో ఒడిదొడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కష్టసుఖాలు సహజం. కష్టాలకు పేద, ధనిక తేడా ఉండదు. ఈ మౌలిక సూత్రాన్ని విద్యార్థులు నిశితంగా గమనించాలి. కష్టాలు వచ్చాయని కుంగిపోయి, ఇక జీవితమే వ్యర్థమని బలవన్మరణాలకు పాల్పడొద్దు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. వారంలో ముగ్గురు విద్యార్థులు చిన్నచిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులుచదువే జీవితం కాదు.. నిలవాలి.. గెలవాలి - సాక్షి, సిటీబ్యూరో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి చదువు ఒత్తిడిలోనో.. పరీక్షల్లో ఫెయిలయ్యామనో.. ఆర్థిక ఇబ్బందులో.. మరే కారణలైనా విద్యార్థులు ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో అయినవారిని వదిలి వెళ్లిపోవడం అందరినీ కలవరపెడుతోంది. ‘చదువు బాటలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఇబ్బందులను విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. సమస్యలను ఆప్తులు, మిత్రులతో పంచుకోవాలి. నాలుగు గోడల మధ్య సమస్యను ఆలోచిస్తూ కుంగిపోతే జీవితంపై విరక్తి అనిపిస్తుంది. అదే మంచి స్నేహితుడితో సమస్యపై చర్చిస్తే ఓ చక్కటి ఆలోచన తప్పక పుడుతుంది. కొండంత సమస్యనైనా చిన్న ఆలోచనతో పరిష్కరించుకోవచ్చు’నని విశ్లేషకులు చెబుతున్నారు. విద్యార్థులారా.. ఆలోచించండి ఏ కష్టాన్ని రుచి చూడకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రపంచంలోనే లేరనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. విఫలమైన వాళ్లంతా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబితే... అందమైన ఈ లోకంలో ఎవరూ మిగలరు. గెలుపు అవకాశాలు ఏదో ఒక దశలో ఉంటాయి. కష్టాలకు ఎదురొడ్డి.. కన్నీళ్లను దిగమింగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాలను చదివితే మనోధైర్యం లభిస్తుంది. కష్టాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అనాలోచితంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులు, వారు మీపై పెట్టుకున్న కొండంత నమ్మకం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ప్రాణాలు తీసుకుంటే.. మీతోపాటే వారి ప్రాణాలూ తీసుకెళ్లినట్లేనని గుర్తుంచుకోండి. మీరే వారి ప్రాణాలు కదా! బీటెక్ విద్యార్థి ఆత్మహత్య బంజారాహిల్స్: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్‌రోడ్ నెం.44లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎ.సతీష్‌రెడ్డి సోదరుడు ఎ.సాయిప్రణీత్‌రెడ్డి(19) సీబీఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల కాగా సాయిప్రణీత్ ఏడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురైన అతను రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అరగంట తర్వాత అన్నం తినడానికి తల్లి పిలించింది. ఎంతకూ సమాధానం రాకపోవడంతో మారు తాళం చెవులతో తలుపులు తెరిచి చూడగా... సాయిప్రణీత్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆందోళనకు గురైన ఆమె డ్రైవర్‌ను పిలిచి అపోలో ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారంలో ముగ్గురు.. చదువులో రాణించలేకపోతున్నామనే ఆత్మన్యూనతతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మార్కులు తక్కువ వచ్చాయని మానసికంగా కుంగిపోయి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నెల 19న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి యశ్వాంత్రెడ్డి, మరుసటి రోజు నిజాంపేటలో నాగాలాండ్‌కు చెందిన విద్యార్థి తెట్సం, తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాయిప్రణీత్‌రెడ్డి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరీక్షా సమయం కీలకం మార్చి నుంచి విద్యార్థులకు పరీక్షల సమయం. ఈ సమయంలో విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. విద్యార్థులు అధిక సమయాన్ని చదువుకోవడానికే కేటాయించేలా చూడాలి. వారిని ఒంటరిగా ఉండనివ్వొద్దు. తగినంత నిద్రపోయేలా చూడాలి. పుస్తకాలు కళ్ల ఎదుట ఉన్నా, ఆలోచనలు ఇతర వ్యాపకాల పైకి వెళ్లొచ్చు. అందుకే అనుక్షణం గమనిస్తూ ఉండాలి. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న మార్పులు అందరినీ కలవరపెడుతున్నాయి. సమాజంతో సంబంధం లేకుండా విద్యార్థులు నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు మార్కులే ప్రధానంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు అందరూ కృషి చేయాలి. అవసరమైతే మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కిందపడ్డామని ప్రయత్నం ఆపితేచేసే పనిలో ఎన్నటికీ విజయం దక్కదు - అబ్దుల్ కలాం పరాజయాలను పట్టించుకోకండి..అవి సర్వసాధారణం.. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి.. ఓటములే లేని జీవితం ఉండదు - స్వామి వివేకానంద జీవితంలో ఓటమిని, విజయాన్ని ఒకేలా చూడాలి. అప్పుడే మనిషి ఎన్ని కష్టాలనైనాఎదుర్కోవచ్చు. ఎన్ని విజయాలనైనా ఆస్వాదించొచ్చు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలకు సమస్యలు తెలియకుండా పెంచొద్దు. వారితో సమస్యలపై చర్చించి, వాటిని ఎలా పరిష్కరించుకున్నారో చెప్పాలి. తద్వారా సమస్యలు ఎదుర్కొగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది. పిల్లలకు పనులు చెప్పాలి. వారి పనులు వారే చేసుకునేలా చూడాలి. కష్టాలనూ ఎదుర్కొనేలా మానసికంగా సిద్ధం చేయాలి. పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి తిట్టొద్దు. ‘వారి కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయ’ని ఏనాడూ మందలించొద్దు. పిల్లల్లో 18 ఏళ్ల తర్వాత మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈలోపే వారికి మంచి అలవాట్లు, విశాల దృక్పథంతో ఆలోచించే ధోరణిని నేర్పించాలి. స్నేహితులతో కలిస్తే చెడిపోతారని ఇంటికే పరిమితం చేయొద్దు. స్నేహితులతో కలిసి తిరిగినప్పుడే లోకం పోకడ అవగతమవుతుంది. అయితే చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలి. కౌన్సెలింగ్ అవసరం.. విద్యార్థులు చదువుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చదువే జీవితమని భావిస్తున్నారు. త ల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యాపరమైన పోటీ ఇందుకు కారణం. ఇతర దేశాల్లో చదువుతో పాటు ఆటలు, కళలు.. ఇలా అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. మనదగ్గర ఇందుకు భిన్న పరిస్థితులున్నాయి. విద్యార్థులను బలవంతంగా చదివిస్తుండడంతో ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిది. - డాక్టర్ అనిత, మానసిక వైద్య నిపుణులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం -
మోసగాళ్లు బాబోయ్..!
కోట్లు వస్తాయని ఒకరు.. లంకెబిందెలు దొరుకుతాయని మరొకరు ఆశపడితే అంతే సంగతులు.. జిల్లాలో కొనసాగుతున్న మోసాలు గోరంత దీపం.. చీకట్లను పారదోలుతుంది. చిగురంత ఆశ మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. అయితే ఆ ఆశ దురాశగా మారితేనే కష్టాలు మొదలవుతాయి. కష్టపడకుండా జల్సాలకు డబ్బులు వస్తాయంటే కొంత మంది వెనుకాముందు ఆలోచించకుండా ముందుకు దూకుతున్నారు. ఇలాంటి వారిని ఆసరాగా చేసుకునే మోసాలు కొనసాగుతున్నాయి. పట్టణాల్లోనే కాదు.. చిన్నచిన్న గ్రామాలకు కూడా ఈ వ్యవహారాలు పాకడంతో మోసాలకు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గుంటూరు ఈస్ట్/ చిలకలూరిపేట : సమాజంలో నేరాలు, మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మనుషుల్లోని బలహీనతలను సొమ్ము చేసుకోవాలనే కేటుగాళ్లు పెరిగిపోయారు. ఆశ మంచిదేకానీ.. అత్యాశకు పోయి మోసగాళ్ల చేతుల్లో పడి ఉన్న ఆస్తులు పోగొట్టుకోవద్దని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగం నుంచి రియల్ ఎస్టేట్ తదితర రంగాలతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను నిలువునా ముంచుతున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి మోసపోయినవారు క్యూ కడుతున్నారు. ఇటీవల గుంటూరుకు చెందిన రాజస్థాన్‌లో పనిచేస్తున్న ఓ సైనికుడు పరిచయస్తుడిని నమ్మి సైనికుల కోటాలో స్థలం ఇప్పించమని రూ.5 లక్షలు సమర్పించాడు. చివరకు ఆ కేటుగాడు ఇదే విధంగా గతంలో ఎందరినో మోసం చేశాడని తెలిసి, బాధితుడు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. బంగారానికి మెరుగు పెడతామని ఇళ్ల వెంట వచ్చి తమ వద్ద దొంగ బంగారం తక్కువ ధరకే వస్తుందని మోసం చేసే సంఘటనలు నగరంలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇటీవల కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వ్యక్తి కొందరికి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఆధ్యాత్మిక రంగంలో.. టీవీల్లో ప్రచారాలు.. వారి ఏజెంట్ల మాటలు నమ్మి.. కష్టాల్లో నుంచి బయట పడాలనే ఆశతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న యంత్రాలు, పూజా సామగ్రి చేతికందిన తరువాత బోగస్ అని తెలుసుకుని బావురుమంటున్నారు. దైవ ప్రతినిధులమని చెప్పేవారి వద్దకు వెళ్లి నగల నుంచి ఇళ్ల స్థలాలు కూడా సమర్పించి చివరకు పచ్చి మోసమని ఎస్పీ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మొదట జాతకం తెలుసుకుందామని వెళ్లి అనంతరం వాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షలు వదిలించుకుంటున్న వాళ్లు కోకొల్లలు. లంకె బిందెల కోసం పూజలు.. చిలకలూరిపేటకు చెందిన నలుగురు యువకులు లంకె బిందెలు, గుప్తనిధుల మోజులో పడి గత ఏడాది పల్నాడుప్రాంతంలోని ఓ గ్రామంలో పాత ఇంట్లో తవ్వకాలు కొనసాగిస్తుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గతంలో గుప్త నిధులు, పూజల పేరుతో డబ్బు పోగొట్టుకున్న వారే ఇదే మార్గంలో మరికొంత మందిని మోసగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడం విస్మయం కలిగించే అంశం. రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్ మోసాలకు అంతే లేకుండాపోయింది. కొరిటెపాడు రామన్నపేటలో ఇంటి యజమాని అమెరికాలో ఉంటూ నమ్మకస్తుడికి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అతను ఆ ఇల్లు తనదేనని నమ్మించి ఇంకొకరికి అమ్మేశాడు. ఇప్పుడు కొన్నవారు.. అసలు యజమాని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మహా మోసగాళ్లు తిరుగుతున్నారు ఒకరి వద్ద బ్లాక్ మనీ ఉంది వైట్ చేసి పెట్టాలి ఎవరైనా ఉన్నారా అంటూ కొందరు.. అద్భుతాలు సృష్టించే ఫలానా మెటల్ ఉంది క్యాష్ చేసి పెడితే కోటి రూపాయలు అని తిరిగే మోసగాళ్లు ఎక్కువయ్యారు. వీరంతా ఖద్దరు చొక్కాలు వేసుకుని ఏదో ఒక ప్రజాప్రతినిధి కార్యాలయం చుట్టూ బిజీబిజీగా తిరుగుతుండటంతో అత్యాసకుపోయే వారు వీరి వలలో పడుతున్నారు. చేతులెత్తేస్తున్న పోలీసులు.. పోలీసు ఉన్నతాధికారులు బాధితుల ఫిర్యాదులు తీసుకుని సంబంధిత స్టేషన్ సిబ్బందికి తగిన ఆదేశాలిస్తున్నారు. చివరకు వెయ్యి ఫిర్యాదుల్లో పది మందికే న్యాయం జరుగుతోంది. విచారణ అనంతరం సివిల్ మ్యాటర్ మేమేమీ చేయలేమనో, ఆధారాలు ఏమీలేవనో పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా సగటు జీవి అత్యాశకు పోకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తేనే మనఃశాంతితో జీవిస్తారని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
అధికారం తలకెక్కుతుందట!
పరిపరి శోధన అధికారం కిక్కు తలకెక్కితే, అది ఒక పట్టాన దిగదట. అధికారంలో ఉన్నా, లేకున్నా స్థిమితంగా ప్రవర్తించడం స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది. సామాన్యుల పరిస్థితి అలా కాదు కదా! అధికారం దక్కాక ఎంతో కొంత దర్పాన్ని ప్రదర్శించడం మామూలే. అయితే, కొందరు అతిగా దర్ప ప్రదర్శన చేస్తుంటారట. వారి సంభాషణలు సాధారణంగా వన్‌వే ట్రాఫిక్‌లాగే ఉంటాయని, ఎదుటి వారి మాటలు వినిపించుకోకుండా, తాము చెప్పదలచుకున్నదే చెబుతూ పోతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వారికి అధికారంతో పాటే ఆధిక్యతా భావం పెరుగుతుందని, దాంతో ఇతరులను చులకనగా చూస్తారని తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. -
పిల్లలకూ ఉండాలోయ్ ‘ప్రపంచం’
సాక్షి, హైదరాబాద్: పిల్లల రూమ్ ఇలాగే ఉండాలంటూ రూల్స్ ఏమీలేవు. వారి ఆసక్తులు, అభిరుచులు, లింగ భేదం.. దృష్టిలో ఉంచుకుంటే చాలు. దీనికి తోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ఉత్సాహాన్నిచ్చేలా కొంచెం సృజనాత్మకతను జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. రంగులే కీలకం: పిల్లల గదిని రూపొందించడంలో రంగులదీ ప్రధాన పాత్ర. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గతపరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగజేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు. -
పేరెంట్స్ కాదు... ఫ్రెండ్స్ అనిపించుకోండి!
టీన్స్ కేర్ పిల్లలు చెడు తోవ పట్టడానికి మూలం టీనేజేనంటారు మానసిక శాస్త్రవేత్తలు. అందుకే పిల్లలు తప్పు దారి పట్టి పాడయిపోయారని బాధపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అర్థం చేసుకోండి: ఎప్పటిలా కాకుండా మీ పిల్లలు వింతగా ప్రవర్తిస్తే, దానికి గల కారణాలపై దృష్టి పెట్టండి. వారు అలా ఉండటానికి కారణం తెలుసుకోండి. దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని జీవితంలో వారు సాధించాల్సిన విజయాలను, చేరాల్సిన గమ్యాలను గుర్తు చేయండి. తప్పొప్పులపై వారికి ఓ క్లారిటీ ఇవ్వండి. సీరియస్‌గా తీసుకోకండి: పిల్లలు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. వాదనకు దిగుతుంటారు. తమ ఫ్రెండ్స్ పేరంట్స్లా మీరు తమని ప్రేమించట్లేదని, అడిగింది ఇవ్వడం లేదని సాధిస్తుంటారు. వారిపై సీరియస్ అవకండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. {పేమతో చెబితే వింటారు: ఈ వయసులో పిల్లలు తాము చేసేదే కరెక్ట్ అని అనుకుంటారు. అదే టీనేజ్. ఆ మనస్తత్వం శాశ్వతం కాదు కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వారిపై అరవడం మానండి, కోపంతో కాకుండా ప్రేమతో చెప్పండి. వారిలో మార్పు తప్పకుండా వస్తుంది. ‘నో’ కి ‘నో’ చెప్పండి: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు స్మార్ట్‌ఫోన్ అడిగినా, సినిమాకు వెళ్తామన్నా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తామన్నా ‘నో’ చెప్పేస్తుంటారు. అలా కాకుండా వారు అడిగిన వాటిలో కొన్నింటికైనా ఒప్పుకుంటే వారికి మీతో క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు. మీపై నమ్మకం కలిగేలా ప్రవర్తించండి: టీనేజ్ పిల్లలు మిమ్మల్ని నమ్మితేనే మీతో అన్నీ షేర్ చేసుకుంటారు. మీ అబ్బాయి ‘‘మమ్మీ, నేనొకసారి ఫ్రెండ్స్‌తో కలిసి స్మోక్ చేశాను. తర్వాత మానేశాను’’ అని చెబితే నమ్మండి. అలాగే మీ అమ్మాయి విషయంలోనూ ప్రతిదానికి అనుమానించకండి. మీరు పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, వారు మీకంత దగ్గరవుతారు. అప్పుడే మీరు చెప్పే మంచీ చెడులను మనసుకు ఎక్కించుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్‌గా మారండి: ప్రేమ వ్యవహారం, ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు మొదలైన వాటి గురించి పిల్లలు పేరెంట్స్‌తో చెప్పలేరు. ఫ్రెండ్స్‌తో మాత్రమే చెప్పుకుంటారు. అందుకే మీరే వారి బెస్ట్ ఫ్రెండ్‌గా మారితే ఇబ్బంది లేకుండా మీతో అన్నీ చెప్పుకోగలుగుతారు. పర్సనల్ స్పేస్ ఇవ్వండి: మీ లైఫ్‌ను మీకెంత పర్సనలో, మీ పిల్లలకు కూడా అంతే పర్సనల్ కదా... మితిమీరిన అనుమానం వారిని మరిన్ని తప్పులు చేసేలా చేస్తుంది. వారికి ఎంత వరకు స్వేచ్ఛ అవసరమో గ్రహించి ఆ స్పేస్‌ను ఇవ్వండి. ఒకవేళ ఏదైనా పొరపాటు మీ నుంచి జరిగితే సారీ చెప్పండి. వారికి మీపై గౌరవం కలుగుతుంది. -
పక్కింటి కుర్రాడు!
వీడికి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి... ఆపిల్ ల్యాప్‌టాప్ చూపించుకోవాలి. రాడో రిస్ట్‌వాచ్ ఉండాలి... కాస్ట్లీ బైక్ మీద షికార్లు కొట్టాలి. పబ్‌లో పార్టీ ఇవ్వాలి... లేదా గోవాలో రేవ్ పార్టీకి వెళ్లాలి. మరి ఇవన్నీ కావాలంటే బిగ్ మనీ కావాలి. అబద్ధాలు... మోసాలు... దొంగతనాలు... కిడ్నాప్‌లు... డ్రగ్స్... డ్రగ్ ట్రాఫికింగ్... ఏదైనా చేయాలి. వీడు ఎవడో కాకపోవచ్చు... మీవాడి ఫ్రెండు, లేదా... స్టూడెంట్స్ అనగానే మార్కులు గుర్తుకు రావాలి. కాని ఇవాళ నేరాలు గుర్తుకొస్తున్నాయి.గతంలో పుస్తకాలు లేవనో పెన్నులు లేవనో బాధ పడేవారు. ఇవాళ పర్సుల్లో పెద్ద పెద్ద అమౌంట్లు లేవని ఫీలై, డబ్బు కోసం నేరాలకు పాల్పడుతు న్నారు. ఇటీవలే ఢిల్లీలో మాస్ కమ్యూని కేషన్స్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు చేసిన నేరం... పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేయడం. ఎందుకు చేశారు అనడిగితే జవాబు: అవసరాల కోసం. కాని ఇవి అవసరాలు కావు... విలాసాలు. ఈ జాడ్యం ఢిల్లీ, ముంబై వంటి పాత మెట్రోలకే కాక హైదరాబాద్ వంటి కొత్త మెట్రోలకు కూడా వ్యాపిస్తోంది. ఇటీవలే ఐదుగురు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఓ కొత్త ఇన్నోవా కారు దొంగలించి, పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యతేజ (పేరుమార్చాం) అనే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వేరొకరి డెబిట్ కార్డ్ దొంగిలించి రూ.15 వేల రూపాయలకు పైగా బ్రాండెడ్ దుస్తులు కొనుగోలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న యువతిని బెదిరించి ఆమె వద్ద డబ్బులు, నగలు లాక్కొని పారిపోయిన యువకుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. 24 గంటల్లో పట్టుబడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ నేరాల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలు చూడటానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడ ట్లేదు. వాళ్లను కాపాడటానికి ప్రయత్నించడం లేదు. కష్టపడి డబ్బు సంపాదించి చదువుకోవడానికి పంపిస్తే తమ సంతానం చేస్తున్న పని ఇదా అని వాళ్లు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. తలిదండ్రులకు తలవంపులు తెచ్చే ఇలాంటి పనులు పిల్లలు ఎందుకు ఎంచుకుంటున్నట్టు?! దొంగతనం చేస్తే దొరికిపోతాం అని భయం లేదా? భవిష్యత్తు గురించి ఆందోళన లేదా? కొత్త కొత్త గ్యాడ్జెట్స్, బైక్స్, పబ్స్, బ్రాండెడ్ దుస్తులు... అవి ఇవి అని లేకుండా సహజంగానే యుక్తవయసులో కలిగే ఎన్నో రకాల ఆకర్షణలను నేటి యువత తప్పించుకోలేకపోతోందా?! ఈ వయసులో కలిగే ‘టెంప్టేషన్స్’ను యూత్ ఎలా డీల్ చేయాలి?! పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ చదువుకుని గొప్ప సైంటిస్ట్ ఆ తర్వాత రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలామ్ ఒక ఉదాహరణ గా ఉన్నారు. పదహారేళ్ల వయసులో డెహరాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చి తల్లిదండ్రుల పాకెట్ మనీని కూడా నిరాకరించి మొదట మోడల్‌గా ఇవాళ జాతీయ ఉత్తమనటిగా ఎదిగిన కంగనా రనౌత్ వంటి ఈతరం విజేతలు ఉన్నారు. అలాంటివారి గురించి తెలుసుకునే అవకాశం, వారి మార్గంలో పయనించాలనే సంకల్పం నేటి యువతకు లేకుండా పోతోంది. కొండలనైనా పిండిచేయగల సత్తువ యువతకు మాత్రమే ఉందని చెప్పిన స్వామి వివేకానంద వీరికి కేవలం నాలుగు రోడ్ల కూడళ్లలో కనిపించే విగ్రహం మాత్రమే. షార్ట్కట్స్పై మోజు... ఈ ధోరణికి కారణం ఏమిటనే దానికి మానసిక నిపుణులు ఇలా చెబుతున్నారు: ‘కోరికలు కలిగినప్పుడు కొందరు కన్స్ట్రక్టివ్, మరికొందరు డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళతారు. కన్స్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు ఏదో ఒక పని చేసి సంపాదిస్తారు. తమ బర్త్‌డేకి అమ్మానాన్నలు చేసే ఖర్చు తగ్గించి, దాంట్లో నుంచి కావల్సినవి కొనుక్కోవాలనుకుంటారు. డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు అడ్డదారులు ఎంచుకుంటారు. ముఖ్యంగా దొంగతనాలు చేస్తారు. ఈ ప్రవృత్తి హైస్కూల్ నుంచి మొదలై, అలవాటుగా మారి తప్పు చేయడం తప్పు కాదు అనే దశకు చేరిపోతుంది’... కుళ్లిన మామిడిపండు... మామిడిపండ్లలో ఒక కుళ్లిన మామిడిపండు ఉంటే మిగతా పండ్లు కూడా త్వరగా కుళ్లిపోతాయి. యువతలో కొంతమందికి రోజూ కొత్తగా ఉండాలి. కొత్త వస్తువుల వాడకంలోనే కాదు ‘కిక్’ ఇచ్చే అంశాల్లోనూ తలదూర్చుతారు. ‘రిస్క్’ ఉందని తెలిసినా దొంగతనం చేయడంలో మజా అనుభవిద్దాం అని కూడా ఆలోచిస్తారు. గ్రూప్‌లో ఒకరి ఈ ‘కిక్’ మిగతా వారినీ నేరస్తులుగా మార్చుతుంది. కనుక ఈ వయసులో స్నేహితుల ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్తవహించాలి. ఆకర్షణలను మేనేజ్ చేయడం సాధ్యమే... ♦ ఏదైనా కావాలనే ‘కోరిక’ కలగగానే ‘భవిష్యత్తులో తీసుకుంటాను’ అని వాయిదా వేస్తూ మనసుకు నచ్చచెప్పాలి. అవి.. ఫోన్, బైక్, ప్రేమలు.. ఏవైనా సరే! ♦ ‘కోరిక’ అనేది పెద్ద గీత అనుకుంటే దాని పక్కనే ‘కాంప్రమైజ్’ అనే మరో పెద్ద గీతను గీసుకోగలిగితే ఆకర్షణ శక్తి సన్నగిల్లుతుంది. ♦ ‘హాబీస్’ వైపు దృష్టి పెడితే ఆకర్షణల శాతం తగ్గుతుంది. వివేకం అనే పడవ మన దగ్గర ఉంటే ఆకర్షణల సముద్రం ఎంత పెద్దదైనా సులువుగా ఒడ్డును చేరగలం. విజేతలుగా నిలవగలం. - నిర్మలారెడ్డి ఇలాంటి పక్కింటి కుర్రాడైతే భేష్! ఇంట్లో ట్యూబ్ లైట్ వెలుతురు కూడా కరువే. చిన్న బల్బులోనే చదువుకోవాలి. అలాంటి పేదరికంలో పుట్టిన నారు వెంకటరామిరెడ్డి ఐసెట్‌లో 153 మార్కులతో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ వ్యవసాయపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి పెరాలసిస్‌తో పదేళ్లుగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. రూ.350ల అద్దె చెల్లిస్తూ ప్రొద్దుటూరు సమీపాన కొర్రపాడు గ్రామంలో నివసిస్తున్న ఈ ఐసెట్ ర్యాంకర్ కూడా ఎన్నో ఆకర్షణల నడుమనే ఉన్నాడు. ఆకర్షణలకు ఆకర్షితుడవకుండా చదువులో రాణిస్తూ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ‘అలా మనమెందుకు కాలేకపోతున్నాం...’ అనే ప్రశ్న ప్రతి విద్యార్థి తమకు తాము వేసుకోవాలి. దృష్టి మళ్లించుకుంటాను మాది వ్యవసాయ కుటుంబం. ఇంటి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. అందుకే పెద్ద కోరికల జాబితా పెట్టుకోను. మా స్నేహితులకు మంచి మంచి ఫోన్లు, బైక్స్ ఉన్నా.. అవి నాకు లేవే అని బాధపడను. అలాగని వాటికి మరీ దూరంగా ఉండను. ఫోన్లో ఖరీదు తక్కువ ఉన్నది చూసి ఇంట్లో చెబుతాను. నా అవసరాన్ని బట్టి కొనిస్తారు. బైక్ మాత్రం ఇప్పుడే అడగను. ఇంకో ఏడాదిలో చదువు పూర్తయితే, ఉద్యోగం చేసి కొనుక్కుంటాను. ఎంతైనా నా సంపాదనతో కొనుక్కున్న బైక్ అంటే ఆ మజాయే వేరు కదా! - శ్రీనివాస్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పునాది స్కూల్లోనే! 7వ తరగతిలోనే స్మార్ట్ ఫోన్లు, 10వ తరగతిలోనే బైక్‌లు... ఏ వస్తువు ఏ వయసులో ఉపయోగించాలి అనేదానికి ఈ రోజుల్లో ఒక రూల్ లేదు. పెద్దలు కూడా పిల్లలకు కావల్సినవి కొనివ్వడమే ‘పేరెంటింగ్’ అని అనుకుంటున్నారు. వందలో పదిశాతం మంది పిల్లలు కొత్త వస్తువులను ఉపయోగిస్తూ ఆనందించడం స్కూల్లో మిగతా పిల్లలందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఈ ఆలోచనే అడ్డదారిలో ఆనందాలను వెతుక్కునేలా ప్రేరేపిస్తుంది. - బండారు విశ్వరూపిణి ఇంగ్లిష్ టీచర్, విశాఖపట్టణం నల్లకుక్క-తెల్లకుక్క ప్రతి మనిషిలోనూ ఒక నల్లకుక్క, ఒక తెల్లకుక్క ఉంటాయి. ఒకటి చెడు. ఒకటి మంచి. మనం దేనికి తిండి పెడితే అదే గెలుస్తుంది. ఏదైనా ‘కావాలి’ అనే కోరిక కలిగినప్పుడు ‘ఇంకొన్నాళ్లు’ అని మనసుకు చెబుతూ వాయిదా వేసుకోవాలి. షార్ట్ కట్స్ వల్ల నష్టాలే ఎక్కువ అని సమాజంలో జరుగుతున్న కేస్‌స్టడీస్ చూసి తెలుసుకోవాలి. కష్టపడి సాధించుకున్న వాటిని పొందినప్పుడు కలిగే ఆనందం షార్ట్‌కట్‌లో సాధించినదానికంటే ఎక్కువని తెలుసుకోవాలి. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ క్రీడలు టెంప్టేషన్స్‌ను తగ్గిస్తాయి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వాటిమీదే ఎక్కువ దృష్టి పెడతాను. స్పోర్ట్స్ వల్లే ఇంటర్నెట్, ఫోన్లలో గేమ్స్ ఆడాలనీ అనిపించదు. ఫోన్ కావాలనీ ఉండదు. ఇంట్లో టీవీ కూడా ఎవరమూ చూడం. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌కి వెళ్లిపోతాను. మధ్యలో చదువు. తమ్ముడితో ఆడుకోవడం.. అస్సలు టైమే ఉండదు. ఎప్పుడైనా సినిమాలు కూడా స్ఫూర్తిదాయకమైనవి అయితేనే చూస్తాను. అమ్మానాన్నా మా ఎదుగుదల కోసం ఎంతో కష్టపడుతున్నారు. అందుకే ఇంకాస్త కష్టపడి వారిని ఇంకా ఆనందపరచాలని ఉంటుంది. - నైనా జైస్వాల్, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పెద్ద లక్ష్యం అవసరం... ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నప్పుడు ఏ అట్రాక్షన్ ఏమీ చేయదు. నేను ఉన్నది సినీరంగంలో. ఎంతోమంది పెద్దవాళ్లను కలుస్తుంటాను. నేనూ వారంత ఎదగాలి... అని నా గోల్. చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా చాలా పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవడానికి బాధ్యతగా కూడా నడుచుకుంటాం. మన ఎదుగుదల పదిమందికి ఆదర్శంగా ఉంటూ, అందరూ కీర్తిస్తుంటే అన్ని ఆనందాలు అందులోనే పొందుతాం. అందుకే, నా చుట్టూ ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటికి లొంగిపోను. - నాగశౌర్య,సినీ నటుడు -
80 20 రూల్!
మానసికం భార్యాభర్తల సంబంధాలు కూడా ఆర్థికశాస్త్రంలోని ‘80-20’ రూల్లాంటివేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరెటో ప్రిన్సిపల్ ప్రకారం 80 శాతం కంపెనీ సేల్స్, 20 శాతం ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. అలాగే 80 శాతం కంపెనీ లాభాలు 20 శాతం కస్టమర్ల మీద ఆధారపడి ఉంటాయి. కంపెనీకి వచ్చే 80 శాతం ఫిర్యాదులు 20 శాతం కస్టమర్ల నుంచి వస్తాయి. వైవాహిక బంధంలో కూడా ఇది వర్తిస్తుంది. వైవాహిక బంధంలోని 80 శాతం కోపతాపాలు, అసంతృప్తులు 20 శాతం సమస్యల వల్లే వస్తున్నాయి. ఆ 20 శాతం సమస్యల మూలాలేమిటో తెలుసుకుంటే... సంసారరథం హ్యాపీగా సాగిపోతుంది. -
కూల్‌గా...దూసుకెళ్లండి!
మన దేశంలో టాప్ స్పోర్ట్స్‌మెన్‌కు ప్రత్యేకంగా మెంటల్ కోచెస్ ఉంటారు. వారి సలహాలు ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. అయితే ఆ సలహాలను ఆటకు మాత్రమే కాదు...మన నిజజీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. జీవితం అనేది నాటకమే కాదు... ఆట కూడా. మానసిక నిపుణులు తరచుగా ఆటగాళ్లకు చెప్పే విషయాలు, వాటిని మనకు ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం... విజువలైజేషన్... విజువలైజేషన్ గురించి ఆటగాళ్లకు తరచుగా చెబుతుంటారు. జరగబోయే ఆటను విజువలైజ్ చేసుకోవడం వల్ల ఆట గురించి ఒక స్పష్టమైన చిత్రం మెదడులో రూపుదిద్దుకుంటుంది. ఎక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ మన బలప్రదర్శనకు అవకాశం ఉంది...మొదలైన విషయాల్లో స్పష్టతకు రావచ్చు. ఇప్పుడు మన విషయానికి వద్దాం... ఉన్నట్టుండి ఆఫీసులో పెద్ద ప్రాజెక్ట్ బాధ్యతలు మీకు అప్పగించారు. ఆ ప్రాజెక్ట్‌ను మీరు విజయవంతం చేయాలంటే విజువలైజ్ చేసుకోవడం అవసరం. 1.పని ఇలా ఉండబోతోంది. 2.నా బలహీనతలు ఇవి. బలాలు ఇవి. 3.ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయంలో ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఇలా అధిగమించాలి. 4. ముందుగా అనుకున్న దారిలో వెళుతున్నప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోతే ‘ప్లాన్ బి’ సిద్ధంగా ఉంచుకోవాలి. స్థూలంగా చెప్పేదేమిటంటే, ‘మెంటల్ ఇమేజరీ’ అనేది మన ఆలోచనలను పదును పెడుతుంది. ఎన్నో పరిష్కారాలను శ్రమ లేకుండా అందిస్తుంది. ధ్యానం చేస్తే జయం మనదే.... రాహుల్ ద్రావిడ్ రిటైరైనప్పుడు ఆయన భార్య విజేత మీడియాకు ఒక విషయం చెప్పారు... ‘‘ఆటకు ఒక రోజు ముందు రాహుల్ తన గదిలోకి వెళ్లి మెడిటేషన్, విజువలైజేషన్ ఎక్సర్సైజులు చేసేవారు’’ అని. పరాజయానికి ఆప్తమిత్రులు...ఒత్తిడి, గందరగోళం. పని చేసే సామర్థ్యం మనలో ఉన్నప్పటికీ ఈ రెండు లక్షణాల వల్ల ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. అందుకే మనసును తేటగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని చిత్తడి చేయడానికి ధ్యానం చేయడం అవసరం. మనసు బలంగా ఉండడానికి ఇది ఎంతో అనివార్యం. పాజిటివ్ సెల్ఫ్‌టాక్... ఎవరైనా తమలో తాము మాట్లాడుకుంటుంటే వింతగా చూస్తాం. నిజానికి ఇలా మాట్లాడుకోవడం అనేది గొప్ప లక్షణం అంటుంది స్పోర్ట్స్ సైకాలజీ. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లందరికీ ఈ అలవాటు ఉంది! భయం, సందేహం, సంక్లిష్టం...ఇలా అనేక విషయాలకు పరిష్కారాలను మనలో మనం మాట్లాడుకోవడం ద్వారా పొందవచ్చు. మనలో మనం మాట్లాడుకునే సమయంలో మనమే ప్రశ్న అవుతాం. సమాధానం మనమే అవుతాం. మనలో మనం మాట్లాడుకునేదంతా మంచిదే అని కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పాజిటివ్ సెల్ఫ్టాక్కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని పాజిటివ్ సెల్ఫ్-ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. కాన్స్టంట్ లెర్నర్... క్రీడారంగంలో ‘కాన్స్టంట్ పెర్ఫార్మెన్స్’ అనేది భ్రమ అని చెబుతుంటారు. అయితే జీవితమనే ఆటకు ఈ సూత్రం వర్తించకపోవచ్చు. నిరంతరం నేర్చుకోవడం అనేది నిరంతర విజయాలకు కారణమవుతుంది. ‘‘నువ్వు ఆడిన ప్రతి చెత్త ఆట నుంచి కనీసం పది విషయాలు నేర్చుకోవచ్చు’’ అని చెబుతోంది స్పోర్ట్స్ సైకాలజీ. ఇక మన విషయానికి వస్తే ప్రతి పొరపాటు నుంచి పది పాఠాలు నేర్చుకోవచ్చు. కాన్స్టెంట్ పెర్ఫార్మర్గా మనల్ని మనం నిరంతరం రుజువు చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి... ఆటగాళ్లకు ఇలా చెబుతుంటారు: ‘మీ పాత్రను అర్థం చేసుకోండి. పర్సనల్‌ను, ప్రొఫెషనల్న వేరు చేయండి.’ ఒక పని చేయడానికి ముందు...మనం ఏదైనా కావచ్చు. పని చేపట్టి తరువాత మాత్రం ‘నేను ఇది’ ‘నేను ఇలా మాత్రమే ఉంటాను’ ‘నేను ఇలా మాత్రమే చేయగలుగుతాను’....ఇలాంటి ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టండి. పనిలో మీ పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోండి. విజయానికి సాధన చేయండి. శుభం