చదువు జీవితంలో ఒక భాగమే... | Read a part in the life | Sakshi
Sakshi News home page

చదువు జీవితంలో ఒక భాగమే...

Published Fri, Feb 26 2016 1:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

చదువు జీవితంలో ఒక భాగమే... - Sakshi

చదువు జీవితంలో ఒక భాగమే...

చదువే జీవితం కాదు. ఎవరి జీవితమూ పూలపాన్పు కాదు. జీవితంలో ఒడిదొడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కష్టసుఖాలు సహజం. కష్టాలకు పేద, ధనిక తేడా ఉండదు. ఈ మౌలిక సూత్రాన్ని విద్యార్థులు నిశితంగా గమనించాలి. కష్టాలు వచ్చాయని కుంగిపోయి, ఇక జీవితమే వ్యర్థమని బలవన్మరణాలకు పాల్పడొద్దు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. వారంలో ముగ్గురు విద్యార్థులు చిన్నచిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులుచదువే జీవితం కాదు.. నిలవాలి.. గెలవాలి  - సాక్షి, సిటీబ్యూరో
 
 
ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి
చదువు ఒత్తిడిలోనో.. పరీక్షల్లో ఫెయిలయ్యామనో.. ఆర్థిక ఇబ్బందులో.. మరే కారణలైనా విద్యార్థులు ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో అయినవారిని వదిలి వెళ్లిపోవడం అందరినీ కలవరపెడుతోంది. ‘చదువు బాటలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఇబ్బందులను విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. సమస్యలను ఆప్తులు, మిత్రులతో పంచుకోవాలి. నాలుగు గోడల మధ్య సమస్యను ఆలోచిస్తూ కుంగిపోతే జీవితంపై విరక్తి అనిపిస్తుంది. అదే మంచి స్నేహితుడితో సమస్యపై చర్చిస్తే ఓ చక్కటి ఆలోచన తప్పక పుడుతుంది. కొండంత సమస్యనైనా చిన్న ఆలోచనతో పరిష్కరించుకోవచ్చు’నని విశ్లేషకులు చెబుతున్నారు.
 
విద్యార్థులారా.. ఆలోచించండి
ఏ కష్టాన్ని రుచి చూడకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రపంచంలోనే లేరనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. విఫలమైన వాళ్లంతా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబితే... అందమైన ఈ లోకంలో ఎవరూ మిగలరు. గెలుపు అవకాశాలు ఏదో ఒక దశలో ఉంటాయి. కష్టాలకు ఎదురొడ్డి.. కన్నీళ్లను దిగమింగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాలను చదివితే మనోధైర్యం లభిస్తుంది. కష్టాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అనాలోచితంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులు, వారు మీపై పెట్టుకున్న కొండంత నమ్మకం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ప్రాణాలు తీసుకుంటే.. మీతోపాటే వారి ప్రాణాలూ తీసుకెళ్లినట్లేనని గుర్తుంచుకోండి. మీరే వారి ప్రాణాలు కదా!
 
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బంజారాహిల్స్: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్‌రోడ్ నెం.44లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎ.సతీష్‌రెడ్డి సోదరుడు ఎ.సాయిప్రణీత్‌రెడ్డి(19) సీబీఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల కాగా సాయిప్రణీత్ ఏడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురైన అతను రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అరగంట తర్వాత అన్నం తినడానికి తల్లి పిలించింది.  ఎంతకూ సమాధానం రాకపోవడంతో మారు తాళం చెవులతో తలుపులు తెరిచి చూడగా... సాయిప్రణీత్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆందోళనకు గురైన ఆమె డ్రైవర్‌ను పిలిచి అపోలో ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వారంలో ముగ్గురు..

చదువులో రాణించలేకపోతున్నామనే ఆత్మన్యూనతతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మార్కులు తక్కువ వచ్చాయని మానసికంగా కుంగిపోయి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నెల 19న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి యశ్వాంత్‌రెడ్డి, మరుసటి రోజు నిజాంపేటలో నాగాలాండ్‌కు చెందిన విద్యార్థి తెట్సం, తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాయిప్రణీత్‌రెడ్డి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 
పరీక్షా సమయం కీలకం
మార్చి నుంచి విద్యార్థులకు పరీక్షల సమయం. ఈ సమయంలో విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. విద్యార్థులు అధిక సమయాన్ని చదువుకోవడానికే కేటాయించేలా చూడాలి. వారిని ఒంటరిగా ఉండనివ్వొద్దు. తగినంత నిద్రపోయేలా చూడాలి. పుస్తకాలు కళ్ల ఎదుట ఉన్నా, ఆలోచనలు ఇతర వ్యాపకాల పైకి వెళ్లొచ్చు. అందుకే అనుక్షణం గమనిస్తూ ఉండాలి.
 
విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి
ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న మార్పులు అందరినీ కలవరపెడుతున్నాయి. సమాజంతో సంబంధం లేకుండా విద్యార్థులు నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు మార్కులే ప్రధానంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు అందరూ కృషి చేయాలి. అవసరమైతే మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.
 
కిందపడ్డామని ప్రయత్నం ఆపితేచేసే పనిలో ఎన్నటికీ విజయం దక్కదు
 - అబ్దుల్ కలాం
 
పరాజయాలను పట్టించుకోకండి..అవి సర్వసాధారణం.. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి.. ఓటములే లేని జీవితం ఉండదు  - స్వామి వివేకానంద జీవితంలో ఓటమిని, విజయాన్ని ఒకేలా చూడాలి. అప్పుడే మనిషి ఎన్ని కష్టాలనైనాఎదుర్కోవచ్చు. ఎన్ని విజయాలనైనా ఆస్వాదించొచ్చు.
 
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలకు సమస్యలు తెలియకుండా పెంచొద్దు. వారితో సమస్యలపై చర్చించి, వాటిని ఎలా పరిష్కరించుకున్నారో చెప్పాలి. తద్వారా సమస్యలు ఎదుర్కొగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది. పిల్లలకు పనులు చెప్పాలి. వారి పనులు వారే చేసుకునేలా చూడాలి. కష్టాలనూ ఎదుర్కొనేలా మానసికంగా సిద్ధం చేయాలి.  పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి తిట్టొద్దు. ‘వారి కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయ’ని ఏనాడూ మందలించొద్దు.

పిల్లల్లో 18 ఏళ్ల తర్వాత మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈలోపే వారికి మంచి అలవాట్లు, విశాల దృక్పథంతో ఆలోచించే ధోరణిని నేర్పించాలి.  స్నేహితులతో కలిస్తే చెడిపోతారని ఇంటికే పరిమితం చేయొద్దు. స్నేహితులతో కలిసి తిరిగినప్పుడే లోకం పోకడ అవగతమవుతుంది. అయితే చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలి.
 
కౌన్సెలింగ్ అవసరం..
విద్యార్థులు చదువుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చదువే జీవితమని భావిస్తున్నారు. త ల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యాపరమైన పోటీ ఇందుకు కారణం. ఇతర దేశాల్లో చదువుతో పాటు ఆటలు, కళలు.. ఇలా అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. మనదగ్గర ఇందుకు భిన్న పరిస్థితులున్నాయి. విద్యార్థులను బలవంతంగా చదివిస్తుండడంతో ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిది.
 - డాక్టర్ అనిత, మానసిక వైద్య నిపుణులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement