Aplomb
-
చదువు జీవితంలో ఒక భాగమే...
చదువే జీవితం కాదు. ఎవరి జీవితమూ పూలపాన్పు కాదు. జీవితంలో ఒడిదొడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కష్టసుఖాలు సహజం. కష్టాలకు పేద, ధనిక తేడా ఉండదు. ఈ మౌలిక సూత్రాన్ని విద్యార్థులు నిశితంగా గమనించాలి. కష్టాలు వచ్చాయని కుంగిపోయి, ఇక జీవితమే వ్యర్థమని బలవన్మరణాలకు పాల్పడొద్దు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. వారంలో ముగ్గురు విద్యార్థులు చిన్నచిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులుచదువే జీవితం కాదు.. నిలవాలి.. గెలవాలి - సాక్షి, సిటీబ్యూరో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి చదువు ఒత్తిడిలోనో.. పరీక్షల్లో ఫెయిలయ్యామనో.. ఆర్థిక ఇబ్బందులో.. మరే కారణలైనా విద్యార్థులు ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో అయినవారిని వదిలి వెళ్లిపోవడం అందరినీ కలవరపెడుతోంది. ‘చదువు బాటలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఇబ్బందులను విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. సమస్యలను ఆప్తులు, మిత్రులతో పంచుకోవాలి. నాలుగు గోడల మధ్య సమస్యను ఆలోచిస్తూ కుంగిపోతే జీవితంపై విరక్తి అనిపిస్తుంది. అదే మంచి స్నేహితుడితో సమస్యపై చర్చిస్తే ఓ చక్కటి ఆలోచన తప్పక పుడుతుంది. కొండంత సమస్యనైనా చిన్న ఆలోచనతో పరిష్కరించుకోవచ్చు’నని విశ్లేషకులు చెబుతున్నారు. విద్యార్థులారా.. ఆలోచించండి ఏ కష్టాన్ని రుచి చూడకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రపంచంలోనే లేరనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. విఫలమైన వాళ్లంతా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబితే... అందమైన ఈ లోకంలో ఎవరూ మిగలరు. గెలుపు అవకాశాలు ఏదో ఒక దశలో ఉంటాయి. కష్టాలకు ఎదురొడ్డి.. కన్నీళ్లను దిగమింగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాలను చదివితే మనోధైర్యం లభిస్తుంది. కష్టాలు, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. అనాలోచితంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులు, వారు మీపై పెట్టుకున్న కొండంత నమ్మకం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ప్రాణాలు తీసుకుంటే.. మీతోపాటే వారి ప్రాణాలూ తీసుకెళ్లినట్లేనని గుర్తుంచుకోండి. మీరే వారి ప్రాణాలు కదా! బీటెక్ విద్యార్థి ఆత్మహత్య బంజారాహిల్స్: పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జూబ్లీహిల్స్‌రోడ్ నెం.44లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎ.సతీష్‌రెడ్డి సోదరుడు ఎ.సాయిప్రణీత్‌రెడ్డి(19) సీబీఐటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల కాగా సాయిప్రణీత్ ఏడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. తీవ్ర మనోవేదనకు గురైన అతను రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అరగంట తర్వాత అన్నం తినడానికి తల్లి పిలించింది. ఎంతకూ సమాధానం రాకపోవడంతో మారు తాళం చెవులతో తలుపులు తెరిచి చూడగా... సాయిప్రణీత్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆందోళనకు గురైన ఆమె డ్రైవర్‌ను పిలిచి అపోలో ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారంలో ముగ్గురు.. చదువులో రాణించలేకపోతున్నామనే ఆత్మన్యూనతతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మార్కులు తక్కువ వచ్చాయని మానసికంగా కుంగిపోయి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నెల 19న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి యశ్వాంత్రెడ్డి, మరుసటి రోజు నిజాంపేటలో నాగాలాండ్‌కు చెందిన విద్యార్థి తెట్సం, తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాయిప్రణీత్‌రెడ్డి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరీక్షా సమయం కీలకం మార్చి నుంచి విద్యార్థులకు పరీక్షల సమయం. ఈ సమయంలో విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. విద్యార్థులు అధిక సమయాన్ని చదువుకోవడానికే కేటాయించేలా చూడాలి. వారిని ఒంటరిగా ఉండనివ్వొద్దు. తగినంత నిద్రపోయేలా చూడాలి. పుస్తకాలు కళ్ల ఎదుట ఉన్నా, ఆలోచనలు ఇతర వ్యాపకాల పైకి వెళ్లొచ్చు. అందుకే అనుక్షణం గమనిస్తూ ఉండాలి. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న మార్పులు అందరినీ కలవరపెడుతున్నాయి. సమాజంతో సంబంధం లేకుండా విద్యార్థులు నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు మార్కులే ప్రధానంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు అందరూ కృషి చేయాలి. అవసరమైతే మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కిందపడ్డామని ప్రయత్నం ఆపితేచేసే పనిలో ఎన్నటికీ విజయం దక్కదు - అబ్దుల్ కలాం పరాజయాలను పట్టించుకోకండి..అవి సర్వసాధారణం.. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి.. ఓటములే లేని జీవితం ఉండదు - స్వామి వివేకానంద జీవితంలో ఓటమిని, విజయాన్ని ఒకేలా చూడాలి. అప్పుడే మనిషి ఎన్ని కష్టాలనైనాఎదుర్కోవచ్చు. ఎన్ని విజయాలనైనా ఆస్వాదించొచ్చు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలకు సమస్యలు తెలియకుండా పెంచొద్దు. వారితో సమస్యలపై చర్చించి, వాటిని ఎలా పరిష్కరించుకున్నారో చెప్పాలి. తద్వారా సమస్యలు ఎదుర్కొగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది. పిల్లలకు పనులు చెప్పాలి. వారి పనులు వారే చేసుకునేలా చూడాలి. కష్టాలనూ ఎదుర్కొనేలా మానసికంగా సిద్ధం చేయాలి. పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి తిట్టొద్దు. ‘వారి కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయ’ని ఏనాడూ మందలించొద్దు. పిల్లల్లో 18 ఏళ్ల తర్వాత మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈలోపే వారికి మంచి అలవాట్లు, విశాల దృక్పథంతో ఆలోచించే ధోరణిని నేర్పించాలి. స్నేహితులతో కలిస్తే చెడిపోతారని ఇంటికే పరిమితం చేయొద్దు. స్నేహితులతో కలిసి తిరిగినప్పుడే లోకం పోకడ అవగతమవుతుంది. అయితే చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలి. కౌన్సెలింగ్ అవసరం.. విద్యార్థులు చదువుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చదువే జీవితమని భావిస్తున్నారు. త ల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యాపరమైన పోటీ ఇందుకు కారణం. ఇతర దేశాల్లో చదువుతో పాటు ఆటలు, కళలు.. ఇలా అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. మనదగ్గర ఇందుకు భిన్న పరిస్థితులున్నాయి. విద్యార్థులను బలవంతంగా చదివిస్తుండడంతో ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిది. - డాక్టర్ అనిత, మానసిక వైద్య నిపుణులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం -
లక్ష్యానికి పది సూత్రాలు :సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల... ఈ పేరు తాజాగా ప్రపంచమే స్మరిస్తోంది. కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకుని తన జీవన మార్గాన్ని సుసంపన్నం చేసుకున్నారాయన. లక్షలాది యువతకు దిక్సూచిలా నిలిచారు. ఆ.. ఇంజినీరింగే కదా... అని తేలికగా తీసుకుంటున్న సమయంలో అబ్బో.. ఇంజినీరింగా అనే స్థారుుకి తీసుకువెళ్లారు. ఏడాదికి 112 కోట్ల వేతనంతో అగ్రగామిగా నిలిచారు. మనజిల్లాలో 18 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో నుంచి ఏటా 10 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. ఈ అకడమిక్ సంవత్సరంలో 40 వేల మంది ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల జీవితాన్ని ఓ పాఠంగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే విద్యార్థుల కోసం పది సూత్రాలు.. - ఒంగోలు లక్ష్యం దాదాపు 22ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల ఏదో గాలివాటంలా వెళ్లి ఆ సంస్థలో చేరిపోలేదు. అది ఆయన కల. చదువు పూర్తయిన తరువాత ప్రముఖ సంస్థ ‘సన్ మైక్రో సిస్టమ్స్’లో చేరినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీనే ఆయన లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకున్నారు. పాఠం : నేటి ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో చాలామంది ఏదో ఉద్యోగం లేదా క్యాంపస్ ఇంటర్య్వూలో ఓ కొలువు దొరికితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటే మనలోనూ ఎందరో సత్య నాదెళ్లలు ఎదుగుతారు. ప్రజాభిమానం సైబర్ ప్రపంచంలో సత్య నాదెళ్ల పేరు మార్మోగిపోతోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయనను ప్రకటించగానే 50కోట్ల మంది నెటిజన్లు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. ఇక గూగుల్ సెర్చ్‌లో సత్య నాదెళ్ల పేరు టైప్ చేయగానే అర సెకనులో దాదాపు 44 కోట్ల వెబ్ పేజీలు అందబాటులోకి వచ్చాయి. సెర్చ్ రికార్డుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (65కోట్లు), బిల్‌గేట్స్ (48కోట్లు), తరువాత మూడో వ్యక్తిగా సత్య నిలిచారు. పాఠం : ఉన్నత భవిష్యత్తే ప్రాతిపదికగా చేసుకుంటే ఎంతోమంది నెటిజన్ల కళ్లు మీ కోసం వెదుకుతాయి. శక్తిసామర్థ్యం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికవడం భారతీయ విద్యార్థుల సత్తాకు నిదర్శనం. అమెరికా, చైనాతో సమానంగా కొందరు భారతీయ విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు. లేదంటే 47 ఏళ్ల సత్యకు మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ సారథ్యం ఎలా లభిస్తుంది. పాఠం: ఆకాశమా నీవెక్కడ... అంటూ ముందే చతికిలపడిపోకూడదు. ఆకాశమే హద్దు అంటూ ఎదిగితే అవకాశం మీదే అని ఆచరణలో చాటి చెప్పారు నాదెళ్ల. ఏటా బయటకు వస్తున్న ఇంజినీర్లను చూసి అమెరికానే నోరెళ్ల పెడుతోంది. ఆత్మస్థైర్యం ‘ప్రపంచమంతా సాఫ్ట్వేర్ శక్తితో మున్ముందుకు దూసుకువెళ్తోంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలను అందుకోవడం ద్వారా నవకల్పనలతో నాదైన ముద్రను వేయడానికి వీలవుతుందనే నేను ఈ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు ముందుకొచ్చా. అయితే, ఈ అవకాశం వచ్చేముందు ఎందుకు సీఈవో కావాలనుకుంటున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నా. 1.3 లక్షల మంది మానవ మేధస్సులతో నిండిన మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ కంపెనీకి సారథ్యం వహించడం ద్వారా మనమేంటో ప్రపంచానికి చాటి చెప్పగల అద్భుత అవకాశం లభించినట్టే. ఇదే నా అంతరాత్మ నాకు చెప్పింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా సంసిద్ధతను వ్యక్తం చేశా.’ అని సత్య పేర్కొన్నారు. పాఠం : పెద్ద అవకాశాలు కళ్లముందున్నా... ఆ బాధ్యతకు నేను తగను. ఆ స్థాయి నాది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ సత్యం అలా అనుకోలేదు. ఆ పదవికి నేనే అర్హుడిని అనే ఆత్మస్థైర్యాన్ని స్వీకరించారు. ఆ ధైర్యం అందరూ అలవరుచుకోవాలి. నాయకత్వం ‘ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ఇంజినీరింగ్ నేపథ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సత్యకు బాగా తెలుసు.’ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. పాఠం: ఎంత అదృష్టం. సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి కనిపించలేదంటూ సంస్థ అధినేతే ప్రశంస. ఏ సంస్థలో.. ఏ రంగంలో పనిచేసినా అధినేతల మెప్పును పొందాలంటే ఎంత కృషి... కఠోర శ్రమ కావాలి. ఆ స్ఫూర్తిని ఆయన్నుంచే తీసుకుంటే... విజయాలే మన వెంట. నైపుణ్యం సత్య అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలరు. సత్య నాదెళ్ల గొప్ప సీఈవో అవుతారన్న నమ్మకం నాకుంది. - స్టీవ్ బామర్, వైదొలుగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో పాఠం : సహజంగా ఆ స్థానాన్ని ఎవరైనా అధిరోహిస్తే అప్పటివరకు ఆ సీట్లో ఉన్నవాళ్లలో అసూయ ఆవహిస్తుంది. కానీ మాజీ సీఈవో బామర్ అలా అనుకోలేదు. ఆ సామర్థ్యం నాదెళ్లకే ఉందంటూ స్వాగ తించడం గొప్ప స్ఫూర్తిమంత్రం. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సిన మంచి సూత్రం. నమ్మకం రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం కానుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్, సాఫ్ట్వేర్ ప్రాణం పోసుకుని మనం చేస్తున్న అనేక పనుల్లోకి, వ్యాపారాల్లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకి చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. - సత్య నాదెళ్ల పాఠం : ముందు చూపును చెబుతోంది ఈ సూత్రం. ఏ రంగం ఎంచుకున్నా ముందు తరాల్లోకి ఎలా దూసుకుపోతుందో ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం అని చెబుతోంది. పట్టుదల ‘మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అనుమానాన్ని దరిదాపుల్లోకి రానీయకూడదు. అప్పుడే చేయాల్సిన పనిపై స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతిభ పునాదిపై నవలోకాన్ని నిర్మిద్దాం.’ - సత్య నాదెళ్ల పాఠం: ఆదిలోనే హంసపాదులు ఎంచే వాళ్లు చాలామంది మనలో ఉన్నారు. చేసేది మంచి పని అయినప్పుడు అనుమానాల్సి దరిచేరనీయవ ద్దని చెబుతోంది ఈ సూత్రం. భయం ఉదయించినపుడే అపజయం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నేటి తరానికి. స్ఫూర్తి హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఓసారి క్రికెట్ మ్యాచ్‌లో నేను మామూలుగా బౌలింగ్ చేస్తున్నాను. వికెట్లు పడడం లేదు. ఆ క్షణంలో మా కెప్టెన్ తనే బాల్‌ను తీసుకుని వికెట్లు తీసి ఆ తరువాత మళ్లీ నాకు బౌలింగ్ ఇలా చేయ్ అంటూ బాల్‌ను చేతికిచ్చారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇదేనా నాయకత్వం లక్షణం. - సత్య నాదెళ్ల పాఠం: ఆటలోనూ సందేశం అందిపుచ్చుకున్నారీయన. అలా కాదు ఇలా అని చెప్పేవాళ్లు మనకూ తారసపడతుంటారు. కానీ అక్కడితో అది మరిచిపోతుంటాం. అందులోంచి స్ఫూర్తి తీసుకోవాలంటున్నారు నాదెళ్ల. విజయం ఏడాదికి రూ.112 కోట్లు, పాత సీఈవో మూల వేతనం కన్నా ఆయనకు 70 శాతం ఎక్కువే. కంపెనీ అందించే మరిన్ని సౌకర్యాలు అదనం. పాఠం : నాదెళ్లవైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తోంది. ఆ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తే అంతకాకపోయినా అందులో సగం దూరమైనా వెళ్లొచ్చు. యువతా.. బెస్ట్ ఆఫ్ లక్.. -
సమస్యలను భూతద్దంలో చూడకండి...
మంచి మాట హృతిక్ రోషన్, హీరో - విషాదం మూర్తీభవించిన వ్యక్తి, ప్రతి విషయం లోనూ ప్రతికూల ఫలితాలనే ఊహించే వ్యక్తి... తాను సుఖంగా ఉండలేడు. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెట్టలేడు. - ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతమాత్రాన అదే పనిగా ఆందోళన చెందనవసరం లేదు. దుఃఖించాల్సిన పని అంతకంటే లేదు. బాధ పడుతూ కూర్చో వడం వల్ల... సమస్య ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. - ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామనేది పెద్దవిషయం కాదు... వాటి నుంచి ఎంత ఆత్మస్థైర్యంతో బయటపడుతున్నామనేది ముఖ్యం. - బలహీన సందర్భాలు ఎదురైనప్పుడు, అప జయాలు చుట్టుముట్టినప్పుడు... జీవితాన్ని ఆశావహదృక్పథం నుంచి చూడడం మొదలు పెడతాను. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది. - ప్రతి మనిషిలోనూ సమస్యలపై పోరాడే మహత్తర శక్తి ఉంటుంది. కొందరు ఆ శక్తిని గుర్తిస్తారు. మరికొందరు గుర్తించరు. అంతేతేడా! - మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే, మనం ప్రపంచాన్ని చూసే పద్ధతి ఆధారపడి ఉంటుంది. - కండలు పెంచి, బిల్డింగ్‌ల మీద నుంచి దూకేవారు సూపర్ హీరోలు కాదు. విలువలతో జీవించేవారే సూపర్ హీరోలు! - నిత్యజీవితంలో సంతోషం అనేది... ఒక పుస్తకం చదవడం ద్వారా లభించవచ్చు. ఒక పాత పాట వినడం ద్వారా లభించవచ్చు. చివరికి ఒక జోక్ ద్వారా కూడా దొరకవచ్చు! -
డీలా పడితే గాండీవం జారిపోతుంది
ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియోటాల్‌స్టాయ్ అంటాడు ‘‘విశ్వాసమే భగవంతుడు’’ అని. ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. నమ్మకం ఉన్నవాడికి గుడిలోని విగ్రహంలో ఆ సర్వాంతర్యామి కనిపిస్తాడు. నమ్మకం లేనివాడికి అదే గుడిలోని విగ్రహంలో ఒక రాయి మాత్రమే కనిపిస్తుంది. అందుకే ప్రహ్లాదుడికి స్తంభంలో ఆ శ్రీమన్నారాయణుడు కనబడితే, హిరణ్యకశిపుడికి రాయి మాత్రమే కనబడింది. ఓ వ్యక్తి పెళ్లి భోజనం చేసిన తర్వాత, కడుపునొప్పితో బాధపడసాగాడు. ఆ పెళ్లికి వచ్చిన తనకు తెలిసిన వైద్యుడితో, ‘‘కడుపు నొప్పిగా ఉంది. మందివ్వండి’’ అని అడిగాడు. ‘‘ప్రస్తుతం నా దగ్గర మందులేవీ లేవు. అయితే, దీనిని మింగకుండా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ నా వెంట రా. హాస్పిటల్‌కు వెళ్లాక వేరే మందిస్తాను’’ అన్నాడు. అది మందు బిళ్ల అనుకుని నోట్లో పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఇద్దరూ హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత వైద్యుడు ‘‘వేరే మందు ఇవ్వనా’’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ‘‘కడుపునొప్పి తగ్గిపోయింది’’ అనగానే, నోట్లో బిళ్లను తీసి పారేయమన్నాడు వైద్యుడు. అలాగేనని చెప్పి తీసి పారేసేటప్పుడు చూస్తే అది మందు బిళ్లకాదు, చొక్కా గుండీ. ఇక్కడ బాధను తగ్గించింది మందు బిళ్ల కాదు, వైద్యునిపై ఉన్న విశ్వాసం. ప్రతీ మనిషికీ ఉండి తీరవలసిన మరొక ముఖ్య అంశం ఆత్మవిశ్వాసం. మనలోని బలాలను, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. ఆ పని చేయడానికి తగిన ఆసక్తి ఉండాలి. మనలో ఆ శక్తి తగినంత ఉందని గ్రహించడమే విజయానికి తొలిమెట్టు. ‘‘మనుషులు తామెలా ఉన్నామని నమ్ముతారో, అలాగే పరిణమిస్తారు. నేనొక పని చేయలేనని నమ్మితే, నిజంగానే అది అసాధ్యమవుతుంది’’ అన్నారు మహాత్మాగాంధీ. అందుకే ఆత్మవిశ్వాసం అద్భుతమైన ప్రేరణనిస్తుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడమే మన ఆపజయాలెన్నింటికో ప్రధాన కారణం. యుద్ధంలో గెలవడానికి కావలసింది ఆయుధాలు కావు, ఆత్మబలం. దీనితోపాటు ప్రతి మనిషికీ పరమ ఆవశ్యకమైనది పరమాత్మపై విశ్వాసం. నిన్ను నువ్వు నమ్మడం ఎంత అవసరమో, ఆ సర్వజ్ఞుడిని నమ్మడం అంతకన్నా ఎక్కువ అవసరం. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే దీనికి మూలకారణం ఆ సర్వశక్తిమంతుడు మాత్రమే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘‘యోగక్షేమం వహామ్యహం’’ అని చెప్పినట్లుగా మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎలాగైతే పిల్లలు అడగకపోయినా వారి బాగోగులను వారి తల్లిదండ్రులు చూసుకుంటారో, అలాగే మనం అడగకపోయినా మన బాగోగులను ఆ జగన్మాత, జగత్పితలు చూసుకుంటారు. భారతంలో అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభించడానికి ముందు డీలాపడిపోయి గాండీవం జారవిడిచినపుడు, కృష్ణుడు అతనిలో ఆత్మవిశ్వాసం నింపడం వల్లనే యుద్ధం చేయగలిగాడు. అంతకుముందు, ‘‘సాయుధులైన పదివేలమంది సైన్యమంతా ఒక వైపు, నిరాయుధుడినైన నేనొక్కడినీ మరొకవైపు ఉంటాం’’ అని శ్రీకృష్ణ పరమాత్మ పలికినప్పుడు, పరమాత్మపై విశ్వాసంతో కృష్ణుడిని కోరుకున్నాడు అర్జునుడు. యుద్ధంలో ‘విజయు’డయ్యాడు. జీవితం సమస్యల ‘తోరణం’, సమస్యలతో ‘రణం’. కాబట్టి జీవితంలో అనునిత్యం అనేకానేక సమస్యలతో జరిగే యుద్ధంలో విజయులమవడానికి కావలసిన త్రిగుణాలు... నమ్మకం, ఆత్మవిశ్వాసం, పరమాత్మపై విశ్వాసం. - గుజ్జుల వీరనాగిరెడ్డి