డీలా పడితే గాండీవం జారిపోతుంది
ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియోటాల్‌స్టాయ్ అంటాడు ‘‘విశ్వాసమే భగవంతుడు’’ అని. ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది. నమ్మకం ఉన్నవాడికి గుడిలోని విగ్రహంలో ఆ సర్వాంతర్యామి కనిపిస్తాడు. నమ్మకం లేనివాడికి అదే గుడిలోని విగ్రహంలో ఒక రాయి మాత్రమే కనిపిస్తుంది. అందుకే ప్రహ్లాదుడికి స్తంభంలో ఆ శ్రీమన్నారాయణుడు కనబడితే, హిరణ్యకశిపుడికి రాయి మాత్రమే కనబడింది.
ఓ వ్యక్తి పెళ్లి భోజనం చేసిన తర్వాత, కడుపునొప్పితో బాధపడసాగాడు. ఆ పెళ్లికి వచ్చిన తనకు తెలిసిన వైద్యుడితో, ‘‘కడుపు నొప్పిగా ఉంది. మందివ్వండి’’ అని అడిగాడు. ‘‘ప్రస్తుతం నా దగ్గర మందులేవీ లేవు. అయితే, దీనిని మింగకుండా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ నా వెంట రా. హాస్పిటల్‌కు వెళ్లాక వేరే మందిస్తాను’’ అన్నాడు. అది మందు బిళ్ల అనుకుని నోట్లో పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఇద్దరూ హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత వైద్యుడు ‘‘వేరే మందు ఇవ్వనా’’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ‘‘కడుపునొప్పి తగ్గిపోయింది’’ అనగానే, నోట్లో బిళ్లను తీసి పారేయమన్నాడు వైద్యుడు. అలాగేనని చెప్పి తీసి పారేసేటప్పుడు చూస్తే అది మందు బిళ్లకాదు, చొక్కా గుండీ. ఇక్కడ బాధను తగ్గించింది మందు బిళ్ల కాదు, వైద్యునిపై ఉన్న విశ్వాసం.
ప్రతీ మనిషికీ ఉండి తీరవలసిన మరొక ముఖ్య అంశం ఆత్మవిశ్వాసం. మనలోని బలాలను, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. ఆ పని చేయడానికి తగిన ఆసక్తి ఉండాలి. మనలో ఆ శక్తి తగినంత ఉందని గ్రహించడమే విజయానికి తొలిమెట్టు. ‘‘మనుషులు తామెలా ఉన్నామని నమ్ముతారో, అలాగే పరిణమిస్తారు. నేనొక పని చేయలేనని నమ్మితే, నిజంగానే అది అసాధ్యమవుతుంది’’ అన్నారు మహాత్మాగాంధీ. అందుకే ఆత్మవిశ్వాసం అద్భుతమైన ప్రేరణనిస్తుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడమే మన ఆపజయాలెన్నింటికో ప్రధాన కారణం. యుద్ధంలో గెలవడానికి కావలసింది ఆయుధాలు కావు, ఆత్మబలం.
దీనితోపాటు ప్రతి మనిషికీ పరమ ఆవశ్యకమైనది పరమాత్మపై విశ్వాసం. నిన్ను నువ్వు నమ్మడం ఎంత అవసరమో, ఆ సర్వజ్ఞుడిని నమ్మడం అంతకన్నా ఎక్కువ అవసరం. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే దీనికి మూలకారణం ఆ సర్వశక్తిమంతుడు మాత్రమే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ‘‘యోగక్షేమం వహామ్యహం’’ అని చెప్పినట్లుగా మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎలాగైతే పిల్లలు అడగకపోయినా వారి బాగోగులను వారి తల్లిదండ్రులు చూసుకుంటారో, అలాగే మనం అడగకపోయినా మన బాగోగులను ఆ జగన్మాత, జగత్పితలు చూసుకుంటారు.
భారతంలో అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభించడానికి ముందు డీలాపడిపోయి గాండీవం జారవిడిచినపుడు, కృష్ణుడు అతనిలో ఆత్మవిశ్వాసం నింపడం వల్లనే యుద్ధం చేయగలిగాడు. అంతకుముందు, ‘‘సాయుధులైన పదివేలమంది సైన్యమంతా ఒక వైపు, నిరాయుధుడినైన నేనొక్కడినీ మరొకవైపు ఉంటాం’’ అని శ్రీకృష్ణ పరమాత్మ పలికినప్పుడు, పరమాత్మపై విశ్వాసంతో కృష్ణుడిని కోరుకున్నాడు అర్జునుడు. యుద్ధంలో ‘విజయు’డయ్యాడు. జీవితం సమస్యల ‘తోరణం’, సమస్యలతో ‘రణం’. కాబట్టి జీవితంలో అనునిత్యం అనేకానేక సమస్యలతో జరిగే యుద్ధంలో విజయులమవడానికి కావలసిన త్రిగుణాలు... నమ్మకం, ఆత్మవిశ్వాసం, పరమాత్మపై విశ్వాసం.
- గుజ్జుల వీరనాగిరెడ్డి