ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్‌ను త్యాగం చేసేస్తుంది. ఆ తర్వాత... రకరకాల కారణాలతో డిప్రెషన్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందం’టున్నారు మనస్తత్వ నిపుణులు.
ఉద్యోగం నుంచి దూరమైతే..
ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘రోజూ పనిలో అలసిపోయాం. ఒక్క రోజు సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుందామని ఆలోచనకు ఆడ–మగ తేడా ఏమీ ఉండదు. కానీ, ఉద్యోగం మానేశాక ‘రోజూ సెలవే కదా!’ అనే ఆలోచన నిస్పృహను కలిగిస్తుంది. ‘ఈ సంఖ్య స్త్రీలలో ఎక్కువ. ఎందుకంటే కుటుంబ అవసరాల దృష్ట్యా ఏ చిన్న అవసరం వచ్చినా మొదట ఆ భారం పడేది మహిళపైనే. అందుకే, బలి అవుతుంది కూడా మహిళే’ అంటారు మనస్తత్వ నిపుణులు.
కొంతమందిలో కుటుంబ భవిష్యత్తుకు తమ సంపాదన ఎంత విలువైనదో తెలుసు కాబట్టి, ఒత్తిడితో కూడిన ఆందోళనతో జీవనం గడపాల్సి ఉంటుంది. తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడంలోనూ శ్రద్ధ తగ్గుతుంటుంది. ఇక ‘నేను ఏమీ చేయలేనా..’ అనే బాధ అంతర్లీనంగా ఉండిపోతుంది. ఇంట్లో ఉండడం వల్ల తీరిక సమయం లభించడంతో ప్రతికూల ఆలోచనలు తలెత్తుతుంటాయి.
మరొకరి మీద ఆధారపడటమా..?!
ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మిగతావారితో పోల్చితే నేను, నా వర్క్‌ప్లేస్, సొంత గుర్తింపు, ఆదాయం.. అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. దాని వల్ల మల్టిపుల్ పనులు చేసేంతగా తమను తాము తీర్చిదిద్దుకోగలరు. కానీ, ఒక్కసారిగా జాబ్ మానేసి, ఇంటి పనులు రొటీన్‌గా చేస్తూ ఉండటం, ప్రతి చిన్న అవసరానికి (డబ్బు కోసం) భర్త మీద ఆధారపడటం చాలా మందికి నచ్చదు. కొన్ని రోజులు సర్దుబాటు చేసుకున్నా.. ‘నాకంటూ ఓ జీవితం లేదా! ఎప్పుడూ ఇదే ఇంటి పనా’ అనే విసుగు పొందే భావన కలుగుతుంది. దీని వల్ల కుటుంబంలోనూ గొడవలు తలెత్తుతుంటాయి.
ప్రతిఫలం ఆశించని పని..
‘చాలా సంవత్సరాలుగా మన దేశంలో గృహ హింస కేసులను చూస్తున్నాం. సమాజంలోని వెనుకబాటుతనానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది. పని చేయడం వల్ల మహిళలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి, స్వతంత్రంగా ఉండటానికి, ప్రతిరోజూ ఆత్మవిశ్వాసంతో మెలిగేలా చేస్తుంది. సమాజం ఒక గృహిణి చేసే పనులను అది ఆమె కర్తవ్యంగా భావించి, వాటికి ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగానే చూస్తుంది. ఇంటి పనుల్లో ప్రతిఫలాన్ని ఆశించడాన్ని ఎవరూ హర్షించరు. అందుకే, తెలియని అసంతృప్తి, ఆందోళన కూడా ఉంటుంది.
అదే ఉద్యోగం చేసే మహిళకు నిరాశ గురించి ఆలోచించే సమయం ఉండదు. చాలా వరకు మధ్య, దిగువ తరగతి ఇళ్లలో గృహిణులు వారి భాగస్వామి నుంచి అసహనాన్ని ఎదుర్కొంటుంటారు. అందుకు ఆర్థిక సమస్యల భారం ప్రధానమైదిగా కనిపిస్తుంది. గృహిణులలో మానసిక ఆరోగ్య సమస్యలకు డిప్రెషన్, ఆందోళన, వైవాహిక అసంతృప్తి, గృహ హింస, పితృ స్వామ్య భావజాలాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.
నవతరం ఆలోచన.. ప్రశ్నించడమే!
‘గతకాలపు వారితో పోల్చితే ఈ తరం అమ్మాయిలు చాలా దూర దృష్టితో ఆలోచిస్తున్నారనే చెప్పాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ భారం మొత్తం ‘నా మీదే పడుతుందా?, భర్త ఏమైనా పంచుకుంటాడా?’ లాంటి ప్రశ్నలు ముందే అడిగి, కుటుంబసభ్యులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా ‘ముందు భార్యే ఆఫీస్‌కి సెలవు పెట్టాలి’ అనుకుంటారు.
వరుస సెలవులు పెడితే ఆఫీసు రూల్స్ ఒప్పుకోవు. తప్పదనుకుంటే ఉద్యోగం మానేయ్! అంటారు. అందుకే, ఈ తరం అమ్మాయిలు పెళ్ళికి ముందే బోలెడన్ని రూల్స్ పెడుతున్నారు. లేదంటే పెళ్లి, పిల్లల్ని కనడం ప్లానింగ్‌లో వయసు పైబడినా ఫర్వాలేదు అనే ఆలోచనకూ వస్తున్నారు’ అంటున్నారు సైకాలజిస్ట్‌లు.ఉద్యోగం ఆమెలో ఆత్మవిశ్వాసంతో పాటు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఆమె తనలా పనిలో భాగస్వామ్యమైన వారితో పరిచయాలను, స్నేహితులను ఏర్పరుస్తుంది. ఈ విధానం జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
– నిర్మలారెడ్డి
ఇతరత్రా అవకాశాలవైపు దృష్టి
►గతంలో కన్నా ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నవాళ్లు ఇంట్లో ఉండి ఆఫీసు పని చేసుకునేవారి అవకాశాన్ని ఎంచుకుంటున్నారు. కంపెనీలు కూడా అర్హులైనవారికి ఈ అవకాశాలను ఇస్తుంది కాబట్టి, వినిగియోంచుకోవచ్చు.
►కొందరు జాబ్ మానేసినా కొత్త ఆదాయ వనరులను పొందుతున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకొని, స్ఫూర్తి పొందవచ్చు.
►జాబ్ మానేయాల్సి వస్తే అది ఎంతకాలం అనేది ముందే కుటుంబసభ్యులతో చర్చించి, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి.
►ఇంటి వద్ద ఉండాల్సి వచ్చినప్పుడు కెరియర్‌కు ఉపయోగపడే సెల్ఫ్ డెవలప్‌మెంట్ వర్క్స్ ఎంచుకోవాలి.
►కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కూడా పెంచుకునే సదుపాయం ఉంది.
►చాలామందిలో పెళ్లి తర్వాత పక్కన పెట్టేసిన హాబీస్ ఉంటాయి. వాటిలో గుర్తింపు, సంతృప్తినిచ్చే ఏదో ఒక హాబీని ఎంచుకొని దానిపైన దృష్టి పెట్టాలి.
►ఇంట్లోవారు(భాగస్వామి) కూడా జాబ్ మానేసి, తమ సంరక్షణకోసం పనిచేస్తున్న స్త్రీ సేవలను గుర్తించాలి, ప్రశంసించాలి.
►2–3 ఏళ్లు జాబ్‌కి గ్యాప్ వచ్చినా.. ప్రూవ్ చేసుకోవడానికి ‘మళ్లీ ప్రయత్నించు’ అని ప్రోత్సహించాలి కానీ, ‘ఇంకేం చేస్తావులే ..’ అని నిరుత్సాహపరచకూడదు.
ఆమె సేవలను గుర్తించాలి
ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు జాబ్ మానేసేది మహిళనే. మొదట్లో కుటుంబం గురించే చేస్తున్నాం కదా అనుకుంటారు. జాబ్ మానేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ, రోజులు మారుతున్నకొద్దీ గత వర్కింగ్ స్టైల్‌కి, తర్వాత ఇంటి రొటీన్ పనులకు సర్దుబాటు అవ్వలేక ఫ్రస్టేషన్‌కు, డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఈ అసహనం కుటుంబ గొడవలకు దారితీస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో అన్నిరంగాల్లో పనిచేస్తున్నవారు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు ఎక్కువ ఉంటున్నారు. ఆమె త్యాగాన్ని, సేవలను కుటుంబం గుర్తించడం, ప్రోత్సహించడం సరైన పరిష్కారం.
– ప్రొఫెసర్ పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రెయినర్
Comments
Please login to add a commentAdd a comment