డబ్బు సంపాదించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో కష్టపడితేనే తగిన ఆదాయం వచ్చి, జీవితం సజావుగా సాగుతుంది. అయితే దీనికి భిన్నమైన సిద్దాంతాన్ని అనుసరిస్తున్న ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ పేరు అలిస్ఎవర్డీన్(32). అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటోంది.
అలిస్ గతంలో ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఆమె వారానికి 50 నుండి 60 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి విసిగిపోయిన ఆమె ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఒక స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి, దానిని తన ఇంటిలా మలచుకుంది. ప్రస్తుతం ఆమె ఆ స్కూలు వ్యానులో దేశమంతా తిరుగుతోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్న ఆలిస్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తోంది. ఆలిస్ ఫ్రీలాన్సర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది.
గతంలో ఆఫీసుకు వెళ్లి సంపాదించిన దానికంటే ఇప్పుడు రెట్టింపు సంపాదిస్తున్నానని అలిస్ తెలిపింది. ఆలిస్ వాయిస్ ఓవర్ వర్క్‌తో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యూజీసీ)కి సంబంధించిన వీడియోలను కూడా రూపొందిస్తుంటుంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్‌లలోనూ పనిచేస్తుంది. ఫలితంగా ఆమెకు అత్యధిక ఆదాయం వస్తోంది.
టెక్సాస్‌లో నివసించడం చాలా ఖరీదైనదని, పాఠశాల బస్సులో నివసించడం ఎంతో చౌక అని అలిస్ తెలిపింది. పార్కింగ్, ఆహారం కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందని ఆమె పేర్కొంది. పార్కింగ్‌కు నెలకు ఆరు వేలు, పెట్రోలుకు రూ.80 వేలు, ఆహార ఖర్చులకు 20 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ మొత్తం టెక్సాస్‌లో నివసించడం కంటే చౌకైనదని ఆమె వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment