కిటికిలో నుంచి చూస్తుండగా దూసుకొచ్చిన టిప్పర్
నంజనగూడు వద్ద దుర్ఘటన
మైసూరు: కిటికీలో తల, చేతులు బయటపెట్టరాదు అని బస్సుల్లో హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ కొందరు ఏదో కారణంతో తల బయటపెట్టి ప్రమాదాలకు గురవుతుంటారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ మధ్య నలిగి బస్సు ప్రయాణికురాలు దుర్మరణం చెందింది. శనివారం జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద జరిగింది.
వివరాలు.. గుండ్లుపేటె తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) మృతురాలు. ఆమె మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సింధువళ్లి గ్రామం వద్ద మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయట పెట్టింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ, బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయాయి.
ఆమె సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పీఎస్‌ఐ సిద్దరాజు, సిబ్బంది మహేంద్ర స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment