పక్కింటి కుర్రాడు! | Woman robbed in ATM at gunpoint boy | Sakshi
Sakshi News home page

పక్కింటి కుర్రాడు!

Published Fri, Jun 5 2015 11:21 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

పక్కింటి కుర్రాడు! - Sakshi

పక్కింటి కుర్రాడు!

వీడికి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి... ఆపిల్ ల్యాప్‌టాప్ చూపించుకోవాలి.
రాడో రిస్ట్‌వాచ్ ఉండాలి... కాస్ట్‌లీ బైక్ మీద షికార్లు కొట్టాలి.
పబ్‌లో పార్టీ ఇవ్వాలి... లేదా గోవాలో రేవ్ పార్టీకి వెళ్లాలి.
మరి ఇవన్నీ కావాలంటే బిగ్ మనీ కావాలి.
అబద్ధాలు... మోసాలు... దొంగతనాలు... కిడ్నాప్‌లు... డ్రగ్స్... డ్రగ్ ట్రాఫికింగ్... ఏదైనా చేయాలి. వీడు ఎవడో కాకపోవచ్చు... మీవాడి ఫ్రెండు, లేదా...


స్టూడెంట్స్ అనగానే మార్కులు గుర్తుకు రావాలి. కాని ఇవాళ నేరాలు గుర్తుకొస్తున్నాయి.గతంలో పుస్తకాలు లేవనో పెన్నులు లేవనో బాధ పడేవారు. ఇవాళ పర్సుల్లో పెద్ద పెద్ద అమౌంట్లు లేవని ఫీలై, డబ్బు కోసం నేరాలకు పాల్పడుతు న్నారు. ఇటీవలే ఢిల్లీలో మాస్ కమ్యూని కేషన్స్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు చేసిన నేరం... పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేయడం. ఎందుకు చేశారు అనడిగితే జవాబు: అవసరాల కోసం.  కాని ఇవి అవసరాలు కావు... విలాసాలు.
 
ఈ జాడ్యం ఢిల్లీ, ముంబై వంటి పాత మెట్రోలకే కాక హైదరాబాద్ వంటి కొత్త మెట్రోలకు కూడా వ్యాపిస్తోంది. ఇటీవలే ఐదుగురు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఓ కొత్త ఇన్నోవా కారు దొంగలించి, పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యతేజ (పేరుమార్చాం) అనే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వేరొకరి డెబిట్ కార్డ్ దొంగిలించి రూ.15 వేల రూపాయలకు పైగా బ్రాండెడ్ దుస్తులు కొనుగోలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న యువతిని బెదిరించి ఆమె వద్ద డబ్బులు, నగలు లాక్కొని పారిపోయిన యువకుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. 24 గంటల్లో పట్టుబడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
 
ఈ నేరాల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలు చూడటానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడ ట్లేదు. వాళ్లను కాపాడటానికి ప్రయత్నించడం లేదు. కష్టపడి డబ్బు సంపాదించి చదువుకోవడానికి పంపిస్తే తమ సంతానం చేస్తున్న పని ఇదా అని వాళ్లు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు.
      
తలిదండ్రులకు తలవంపులు తెచ్చే ఇలాంటి పనులు పిల్లలు ఎందుకు ఎంచుకుంటున్నట్టు?! దొంగతనం చేస్తే దొరికిపోతాం అని భయం లేదా? భవిష్యత్తు గురించి ఆందోళన లేదా? కొత్త కొత్త గ్యాడ్జెట్స్, బైక్స్, పబ్స్, బ్రాండెడ్ దుస్తులు... అవి ఇవి అని లేకుండా సహజంగానే యుక్తవయసులో కలిగే ఎన్నో రకాల ఆకర్షణలను నేటి యువత తప్పించుకోలేకపోతోందా?! ఈ వయసులో కలిగే ‘టెంప్టేషన్స్’ను యూత్ ఎలా డీల్ చేయాలి?!
 
పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ చదువుకుని గొప్ప సైంటిస్ట్ ఆ తర్వాత రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలామ్ ఒక ఉదాహరణ గా ఉన్నారు. పదహారేళ్ల వయసులో డెహరాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చి తల్లిదండ్రుల పాకెట్ మనీని కూడా నిరాకరించి మొదట మోడల్‌గా ఇవాళ జాతీయ ఉత్తమనటిగా ఎదిగిన కంగనా రనౌత్ వంటి ఈతరం విజేతలు ఉన్నారు. అలాంటివారి గురించి తెలుసుకునే అవకాశం, వారి మార్గంలో పయనించాలనే సంకల్పం నేటి యువతకు లేకుండా పోతోంది. కొండలనైనా పిండిచేయగల సత్తువ యువతకు మాత్రమే ఉందని చెప్పిన స్వామి వివేకానంద వీరికి కేవలం నాలుగు రోడ్ల కూడళ్లలో కనిపించే విగ్రహం మాత్రమే.
 
షార్ట్‌కట్స్‌పై మోజు...
ఈ ధోరణికి కారణం ఏమిటనే దానికి మానసిక నిపుణులు ఇలా చెబుతున్నారు: ‘కోరికలు కలిగినప్పుడు కొందరు కన్‌స్ట్రక్టివ్, మరికొందరు డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళతారు. కన్‌స్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు ఏదో ఒక పని చేసి సంపాదిస్తారు. తమ బర్త్‌డేకి అమ్మానాన్నలు చేసే ఖర్చు తగ్గించి, దాంట్లో నుంచి కావల్సినవి కొనుక్కోవాలనుకుంటారు. డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు అడ్డదారులు ఎంచుకుంటారు. ముఖ్యంగా దొంగతనాలు చేస్తారు. ఈ ప్రవృత్తి హైస్కూల్ నుంచి మొదలై, అలవాటుగా మారి తప్పు చేయడం తప్పు కాదు అనే దశకు చేరిపోతుంది’...
 
కుళ్లిన మామిడిపండు...
మామిడిపండ్లలో ఒక కుళ్లిన మామిడిపండు ఉంటే మిగతా పండ్లు కూడా త్వరగా కుళ్లిపోతాయి. యువతలో కొంతమందికి రోజూ కొత్తగా ఉండాలి. కొత్త వస్తువుల వాడకంలోనే కాదు ‘కిక్’ ఇచ్చే అంశాల్లోనూ తలదూర్చుతారు. ‘రిస్క్’ ఉందని తెలిసినా దొంగతనం చేయడంలో మజా అనుభవిద్దాం అని కూడా ఆలోచిస్తారు. గ్రూప్‌లో ఒకరి ఈ ‘కిక్’ మిగతా వారినీ నేరస్తులుగా మార్చుతుంది. కనుక ఈ వయసులో స్నేహితుల ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్తవహించాలి.
 
ఆకర్షణలను మేనేజ్ చేయడం సాధ్యమే...
ఏదైనా కావాలనే ‘కోరిక’ కలగగానే ‘భవిష్యత్తులో తీసుకుంటాను’ అని వాయిదా వేస్తూ మనసుకు నచ్చచెప్పాలి. అవి.. ఫోన్, బైక్, ప్రేమలు.. ఏవైనా సరే!
‘కోరిక’ అనేది పెద్ద గీత అనుకుంటే దాని పక్కనే ‘కాంప్రమైజ్’ అనే మరో పెద్ద గీతను గీసుకోగలిగితే ఆకర్షణ శక్తి సన్నగిల్లుతుంది.
‘హాబీస్’ వైపు దృష్టి పెడితే ఆకర్షణల శాతం తగ్గుతుంది. వివేకం అనే పడవ మన దగ్గర ఉంటే ఆకర్షణల సముద్రం ఎంత పెద్దదైనా సులువుగా ఒడ్డును చేరగలం. విజేతలుగా నిలవగలం.
 - నిర్మలారెడ్డి
 
ఇలాంటి పక్కింటి కుర్రాడైతే భేష్!
ఇంట్లో ట్యూబ్ లైట్ వెలుతురు కూడా కరువే. చిన్న బల్బులోనే చదువుకోవాలి. అలాంటి పేదరికంలో పుట్టిన నారు వెంకటరామిరెడ్డి ఐసెట్‌లో 153 మార్కులతో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ వ్యవసాయపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి పెరాలసిస్‌తో పదేళ్లుగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. రూ.350ల అద్దె చెల్లిస్తూ ప్రొద్దుటూరు సమీపాన కొర్రపాడు గ్రామంలో నివసిస్తున్న ఈ ఐసెట్ ర్యాంకర్ కూడా ఎన్నో ఆకర్షణల నడుమనే ఉన్నాడు. ఆకర్షణలకు ఆకర్షితుడవకుండా చదువులో రాణిస్తూ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ‘అలా మనమెందుకు కాలేకపోతున్నాం...’ అనే ప్రశ్న ప్రతి విద్యార్థి తమకు తాము వేసుకోవాలి.
 
దృష్టి మళ్లించుకుంటాను
మాది వ్యవసాయ కుటుంబం. ఇంటి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. అందుకే పెద్ద కోరికల జాబితా పెట్టుకోను. మా స్నేహితులకు మంచి మంచి ఫోన్లు, బైక్స్ ఉన్నా.. అవి నాకు లేవే అని బాధపడను. అలాగని వాటికి మరీ దూరంగా ఉండను. ఫోన్‌లో ఖరీదు తక్కువ ఉన్నది చూసి ఇంట్లో చెబుతాను. నా అవసరాన్ని బట్టి కొనిస్తారు. బైక్ మాత్రం ఇప్పుడే అడగను. ఇంకో ఏడాదిలో చదువు పూర్తయితే, ఉద్యోగం చేసి కొనుక్కుంటాను. ఎంతైనా నా సంపాదనతో కొనుక్కున్న బైక్ అంటే ఆ మజాయే వేరు కదా!
- శ్రీనివాస్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్
 
పునాది స్కూల్లోనే!
7వ తరగతిలోనే స్మార్ట్ ఫోన్లు, 10వ తరగతిలోనే బైక్‌లు... ఏ వస్తువు ఏ వయసులో ఉపయోగించాలి అనేదానికి ఈ రోజుల్లో ఒక రూల్ లేదు. పెద్దలు కూడా పిల్లలకు కావల్సినవి కొనివ్వడమే ‘పేరెంటింగ్’ అని అనుకుంటున్నారు. వందలో పదిశాతం మంది పిల్లలు కొత్త వస్తువులను ఉపయోగిస్తూ ఆనందించడం స్కూల్లో మిగతా పిల్లలందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఈ ఆలోచనే అడ్డదారిలో ఆనందాలను వెతుక్కునేలా ప్రేరేపిస్తుంది.
- బండారు విశ్వరూపిణి ఇంగ్లిష్ టీచర్, విశాఖపట్టణం
 
నల్లకుక్క-తెల్లకుక్క
ప్రతి మనిషిలోనూ ఒక నల్లకుక్క, ఒక తెల్లకుక్క ఉంటాయి. ఒకటి చెడు. ఒకటి మంచి. మనం దేనికి తిండి పెడితే అదే గెలుస్తుంది. ఏదైనా ‘కావాలి’ అనే కోరిక కలిగినప్పుడు ‘ఇంకొన్నాళ్లు’ అని మనసుకు చెబుతూ వాయిదా వేసుకోవాలి. షార్ట్ కట్స్ వల్ల నష్టాలే ఎక్కువ అని సమాజంలో జరుగుతున్న కేస్‌స్టడీస్ చూసి తెలుసుకోవాలి. కష్టపడి సాధించుకున్న వాటిని పొందినప్పుడు కలిగే ఆనందం షార్ట్‌కట్‌లో సాధించినదానికంటే ఎక్కువని తెలుసుకోవాలి.     
- డా. గీతా చల్లా, సైకాలజిస్ట్
 
క్రీడలు టెంప్టేషన్స్‌ను తగ్గిస్తాయి
నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వాటిమీదే ఎక్కువ దృష్టి పెడతాను. స్పోర్ట్స్ వల్లే ఇంటర్నెట్, ఫోన్‌లలో గేమ్స్ ఆడాలనీ అనిపించదు. ఫోన్ కావాలనీ ఉండదు. ఇంట్లో టీవీ కూడా ఎవరమూ చూడం. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌కి వెళ్లిపోతాను. మధ్యలో చదువు. తమ్ముడితో ఆడుకోవడం.. అస్సలు టైమే ఉండదు. ఎప్పుడైనా సినిమాలు కూడా స్ఫూర్తిదాయకమైనవి అయితేనే చూస్తాను. అమ్మానాన్నా మా ఎదుగుదల కోసం ఎంతో కష్టపడుతున్నారు. అందుకే  ఇంకాస్త కష్టపడి వారిని ఇంకా ఆనందపరచాలని ఉంటుంది.
- నైనా జైస్వాల్, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్
 
పెద్ద లక్ష్యం అవసరం...
ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నప్పుడు ఏ అట్రాక్షన్ ఏమీ చేయదు. నేను ఉన్నది సినీరంగంలో. ఎంతోమంది పెద్దవాళ్లను కలుస్తుంటాను. నేనూ వారంత ఎదగాలి... అని నా గోల్. చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా చాలా పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవడానికి బాధ్యతగా కూడా నడుచుకుంటాం. మన ఎదుగుదల పదిమందికి ఆదర్శంగా ఉంటూ, అందరూ కీర్తిస్తుంటే అన్ని ఆనందాలు అందులోనే పొందుతాం. అందుకే, నా చుట్టూ ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటికి లొంగిపోను.
- నాగశౌర్య,సినీ నటుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement