కూల్‌గా...దూసుకెళ్లండి!
మన దేశంలో టాప్ స్పోర్ట్స్‌మెన్‌కు ప్రత్యేకంగా మెంటల్ కోచెస్ ఉంటారు. వారి సలహాలు ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. అయితే ఆ సలహాలను ఆటకు మాత్రమే కాదు...మన నిజజీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. జీవితం అనేది నాటకమే కాదు... ఆట కూడా. మానసిక నిపుణులు తరచుగా ఆటగాళ్లకు చెప్పే విషయాలు, వాటిని మనకు ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం...
విజువలైజేషన్...
విజువలైజేషన్ గురించి ఆటగాళ్లకు తరచుగా చెబుతుంటారు. జరగబోయే ఆటను విజువలైజ్ చేసుకోవడం వల్ల ఆట గురించి ఒక స్పష్టమైన చిత్రం మెదడులో రూపుదిద్దుకుంటుంది. ఎక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ మన బలప్రదర్శనకు అవకాశం ఉంది...మొదలైన విషయాల్లో స్పష్టతకు రావచ్చు.
ఇప్పుడు మన విషయానికి వద్దాం...
ఉన్నట్టుండి ఆఫీసులో పెద్ద ప్రాజెక్ట్ బాధ్యతలు మీకు అప్పగించారు. ఆ ప్రాజెక్ట్‌ను మీరు విజయవంతం చేయాలంటే విజువలైజ్ చేసుకోవడం అవసరం.
1.పని ఇలా ఉండబోతోంది.
2.నా బలహీనతలు ఇవి. బలాలు ఇవి.
3.ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయంలో ఇలాంటి సమస్యలు వస్తాయి. వాటిని ఇలా అధిగమించాలి.
4. ముందుగా అనుకున్న దారిలో వెళుతున్నప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోతే ‘ప్లాన్ బి’ సిద్ధంగా ఉంచుకోవాలి.
స్థూలంగా చెప్పేదేమిటంటే, ‘మెంటల్ ఇమేజరీ’ అనేది మన ఆలోచనలను పదును పెడుతుంది. ఎన్నో పరిష్కారాలను శ్రమ లేకుండా అందిస్తుంది.
ధ్యానం చేస్తే జయం మనదే....
రాహుల్ ద్రావిడ్ రిటైరైనప్పుడు ఆయన భార్య విజేత మీడియాకు ఒక విషయం చెప్పారు...
‘‘ఆటకు ఒక రోజు ముందు రాహుల్ తన గదిలోకి వెళ్లి మెడిటేషన్, విజువలైజేషన్ ఎక్సర్‌సైజులు చేసేవారు’’ అని.
పరాజయానికి ఆప్తమిత్రులు...ఒత్తిడి, గందరగోళం. పని చేసే సామర్థ్యం మనలో ఉన్నప్పటికీ ఈ రెండు లక్షణాల వల్ల ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. అందుకే మనసును తేటగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని చిత్తడి చేయడానికి ధ్యానం చేయడం అవసరం. మనసు బలంగా ఉండడానికి ఇది ఎంతో అనివార్యం.
పాజిటివ్ సెల్ఫ్‌టాక్...
ఎవరైనా తమలో తాము మాట్లాడుకుంటుంటే వింతగా చూస్తాం. నిజానికి ఇలా మాట్లాడుకోవడం అనేది గొప్ప లక్షణం అంటుంది స్పోర్ట్స్ సైకాలజీ. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లందరికీ ఈ అలవాటు ఉంది!
భయం, సందేహం, సంక్లిష్టం...ఇలా అనేక విషయాలకు పరిష్కారాలను మనలో మనం మాట్లాడుకోవడం ద్వారా పొందవచ్చు. మనలో మనం మాట్లాడుకునే సమయంలో మనమే ప్రశ్న అవుతాం. సమాధానం మనమే అవుతాం. మనలో మనం మాట్లాడుకునేదంతా మంచిదే అని కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పాజిటివ్ సెల్ఫ్‌టాక్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని పాజిటివ్ సెల్ఫ్-ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు.
కాన్‌స్టంట్ లెర్నర్...
క్రీడారంగంలో ‘కాన్‌స్టంట్ పెర్‌ఫార్‌మెన్స్’ అనేది భ్రమ అని చెబుతుంటారు. అయితే జీవితమనే ఆటకు ఈ సూత్రం వర్తించకపోవచ్చు. నిరంతరం నేర్చుకోవడం అనేది నిరంతర విజయాలకు కారణమవుతుంది.
‘‘నువ్వు ఆడిన ప్రతి చెత్త ఆట నుంచి కనీసం పది విషయాలు నేర్చుకోవచ్చు’’ అని చెబుతోంది స్పోర్ట్స్ సైకాలజీ.
ఇక మన విషయానికి వస్తే ప్రతి పొరపాటు నుంచి పది పాఠాలు నేర్చుకోవచ్చు. కాన్‌స్టెంట్ పెర్‌ఫార్మర్‌గా మనల్ని మనం నిరంతరం రుజువు చేసుకోవచ్చు.
అర్థం చేసుకోండి...
ఆటగాళ్లకు ఇలా చెబుతుంటారు:
‘మీ పాత్రను అర్థం చేసుకోండి. పర్సనల్‌ను, ప్రొఫెషనల్‌న వేరు చేయండి.’
ఒక పని చేయడానికి ముందు...మనం ఏదైనా కావచ్చు. పని చేపట్టి తరువాత మాత్రం ‘నేను ఇది’ ‘నేను ఇలా మాత్రమే ఉంటాను’ ‘నేను ఇలా మాత్రమే చేయగలుగుతాను’....ఇలాంటి ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టండి. పనిలో మీ పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోండి. విజయానికి సాధన చేయండి.
శుభం